హోం మంత్రిత్వ శాఖ

అన్ లాక్ 2 కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన హోం శాఖ

అన్ లాక్ 2 సందర్భంగా కట్టడి జోన్ల వెలుపల మరిన్ని కార్యకలాపాలకు అనుమతి


కట్టడి జోన్లలో కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలు

Posted On: 29 JUN 2020 9:28PM by PIB Hyderabad

 

దేశంలో కట్టడి జోన్లకు వెలుపల మరిన్ని కార్యకలాపాలకు అనుమతించే అన్ లాక్ 2కి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) జారీ చేసింది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. ఈ లాక్ డౌన్ 2తో దశలవారీగా మరిన్ని రంగాలను రోజువారీ కార్యకలాపాలకు అనుమతిస్తారు. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన అభిప్రాయాలు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపులతో సోమవారం ఈ మార్గదర్శకాలు జారీ చేశారు.

2020 మే 30వ తేదీన అన్ లాక్ 1 ఆర్డర్, మార్గదర్శకాల కింద మత, ప్రార్థనా స్థలాలుహోటళ్లు, రెస్టారెంట్లు ఇతర ఆతిథ్య రంగ సేవలుషాపింగ్ మాల్స్ వంటివి ఇప్పటికే తెరిచారు. జూన్ 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. విభిన్న సంస్థలు కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రామాణిక నిర్వహణా విధివిధానాలు (ఎస్ఓపి) కూడా జారీ చేశారు.

 

అన్ లాక్ 2 కొత్త మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు

 • విమాన సర్వీసులు, ప్రయాణికుల రైళ్లు పరిమితంగా నడపడానికి ఇప్పటికే అనుమతించారు. ఇక ముందు వాటి రాకపోకలను దశలవారీగా మరింత పెంచుతారు.

 • రాత్రి కర్ఫ్యూ వేళలను మరింత సడలించారు. తాజాగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి కర్ఫ్యూ మరింత సడలించడం వల్ల  పారిశ్రామిక యూనిట్లు బహుళ షిఫ్ట్ లలో నిరంతరాయంగా పని చేసేందుకు; జాతీయ, రాష్ట్ర రహదారులపై  మరింతగా రాకపోకలు సాగించేందుకు; బస్సులు, రైళ్లు, విమానాల్లో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వారిని, వస్తువులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అవకాశం ఏర్పడింది.

 • దుకాణాలు ప్రాంతాన్ని బట్టి ఒకే సారి 5 మందికి పైగా కస్టమర్లను అనుమతించవచ్చు. అయితే వారు సామాజిక దూరం పాటించేలా చూడాలి.

 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శిక్షణ సంస్థలు జూలై 15 నుంచి పని చేసేందుకు అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ఎస్ఓపిలను కేంద్రప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం జారీ చేస్తుంది.

 • రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విస్తృతంగా చర్చించిన అనంతరం పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను జూలై 31 వరకు మూసి ఉంచాలని నిర్ణయించారు.

 • వందే భారత్ కార్యక్రమం కింద అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఇప్పటికే పరిమితంగా అనుమతించారు. దశలవారీగా ప్రయాణాలను మరింతగా విస్తరిస్తారు.

 • కట్టడి జోన్లకు వెలుపల ఈ దిగువ కార్యకలాపాలు మినహా ఇతర కార్యకలాపాలన్నింటినీ అనుమతిస్తారు.

i. మెట్రో రైలు

ii. సినిమా హాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలో, సమావేశ మందిరాలు, ఇదే తరహా ఇతర ప్రదేశాలు

iii. భారీ సంఖ్యలో జనం గుమిగూడే సామాజిక/  రాజకీయ/  క్రీడా/  వినోద/  సాంస్కృతిక/  మత ప్రదేశాలు

పైన పేర్కొన్న ప్రదేశాలన్నీ ఎప్పటి నుంచి తెరవవచ్చు అన్నది పరిస్థితిని మదింపు చేసుకున్న అనంతరం వేరుగా ప్రకటిస్తారు.

 • కట్టడిజోన్లలో 2020 జూలై 31 వరకు లాక్ డౌన్ అమలు కొనసాగుతుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యు) మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటూ కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడం కోసం రాష్ట్ర/  కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కట్టడి జోన్లను అత్యంత జాగ్రత్తగా నిర్ణయించాల్సి ఉంటుంది. కట్టడి జోన్లకు సంబంధించి కట్టుదిట్టంగా చుట్టుకొలత కంట్రోల్ ను పాటించాలి. కేవలం నిత్యాసరాలు మాత్రమే అనుమతించాలి.

 • ఈ కట్టడి జోన్లు ఏవి అన్నది ఆయా జిల్లా కలెక్టర్లు, రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాల వెబ్ సైట్లలో నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యుకు కూడా అందించాల్సి ఉంటుంది.

 • రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు కట్టడి జోన్లలోని కార్యకలాపాలను పటిష్ఠంగా పర్యవేక్షిస్తూ ఉండాలి. కట్టడి చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా కట్టుదిట్టంగా అమలుపరచాలి.

 • కట్టడి జోన్లు ఎలా ఉంటున్నాయన్న అంశంతో పాటు కట్టడి చర్యలు ఎలా అమలుజరుగుతున్నది  ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యు పర్యవేక్షిస్తూ ఉంటుంది.

కట్టడి జోన్ల వెలుపల కార్యకలాపాల అనుమతిని రాష్ర్టాలే నిర్ణయించుకోవాలి

 • తాజా పరిస్థితిపై మదింపు, అవగాహనను బట్టి కట్టడి జోన్లకు వెలుపల ఏయే కార్యకలాపాలను నిషేధించాలి లేదా  ఏయే కార్యకలాపాలపై పరిమితులు అమలు చేయాలన్నది రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి.

 • రాష్ర్టాల లోపల, వెలుపలి ప్రాంతాలకు ప్రజలు, వస్తువుల రవాణాపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఇలాంటి కదలికల కోసం ప్రత్యేకంగా పర్మిషన్లు/ అనుమతులు/  ఇ-పర్మిట్ల వంటివి అవసరం లేదు.

రాత్రి కర్ఫ్యూ 

 • అన్ లాక్ 2లో ఇచ్చిన సడలింపులు, అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన కార్యకలాపాలన్నింటి పైన రాత్రి కర్ఫ్యూ ప్రతీ రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కఠినంగా అమలులో ఉంటుంది.

 

కోవిడ్-19 విధివిధానాలపై జాతీయ నిర్దేశకాలు

 • సామాజిక దూరాన్ని పాటించి తీరాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్-19కి సంబంధించిన విధివిధానాలపై జాతీయ స్థాయిలో ప్రకటించిన నిర్దేశకాలన్నీ యథాతథంగా అమలులో ఉంటాయి. దుకాణాలన్నీ కస్టమర్ల మధ్య భౌతిక దూరం తుచ తప్పకుండా పాటించాలి. జాతీయ నిర్దేశకాలు ఎలా అమలుజరుగుతున్నాయనేది ఎంహెచ్ఏ పర్యవేక్షిస్తూ ఉంటుంది.

 

ముప్పు అధికంగా ఉన్న వారికి భద్రత 

 • వ్యాధి సంక్రమణ ముప్పు అధికంగా ఉన్న 65 సంవత్సరాల పైబడిన వయసు గల వృద్ధులు, ఒకటికి మించి మొండి వ్యాధులున్న వారు, గర్భిణీ మహిళలు, 10 సంవత్సరాల లోపు వయస్కులైన పిల్లలు అత్యవసరాలు, ఆరోగ్య అవసరాల కోసం తప్పితే ఇళ్లు దాటి బయటకు వెళ్లకూడదు.

 

ఆరోగ్య సేతు వినియోగం

 • ప్రజలు ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ వినియోగించడాన్ని యథాతథంగా ప్రోత్సహించడం జరుగుతుంది.

 

మార్గదర్శకాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

***(Release ID: 1635259) Visitor Counter : 96