PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
20 JUN 2020 7:00PM by PIB Hyderabad
(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- గడచిన 24 గంటల్లో కోవిడ్-19 నయమైనవారి సంఖ్య 9,120; దీంతో కోలుకున్నవారి సంఖ్య 2,13,830కి చేరగా; కోలుకునేవారి శాతం 54.13గా నమోదు.
- కోవిడ్-19 నేపథ్యంలో గ్రామాలకు తిరిగివచ్చే వలస కార్మికులకు ఉపాధి, జీవనోపాధి అవకాశాలు పెంచే దిశగా “గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్”ను ప్రారంభించిన ప్రధానమంత్రి.
- ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఇప్పటిదాకా 42 కోట్ల మందికిపైగా పేదలకు రూ.65,454 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ.
- ఏకాంత గృహవాసం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ.
- కోవిడ్-19 వల్ల తలెత్తిన తీవ్ర సామాజిక-ఆర్థిక ప్రతికూలతల ఉపశమనం కోసం భారత్‌కు 750 మిలియన్ డాలర్ల సాయం అందించనున్న ఏఐఐబీ.
- (కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటుపీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
-
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: వ్యాధి నయమైన వారి సంఖ్య 2,13,830; కోలుకున్నవారి శాతం 54.13కు మెరుగు
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్-19 నుంచి 9,120 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,13,830కి చేరి, కోలుకునేవారి శాతం 54.13కు పెరిగింది. ప్రస్తుతం 1,68,269 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఇక రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వ రంగంలో 715, ప్రైవేటు రంగంలో 259 (మొత్తం 974) ప్రయోగశాలలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,89,869 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 66,16,496గా నమోదైంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632917
కోవిడ్-19 నేపథ్యంలో గ్రామాలకు తిరిగివచ్చే వలస కార్మికులకు ఉపాధి, జీవనోపాధి పెంపు దిశగా “గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్”ను ప్రారంభించిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉపాధి కల్పన-గ్రామీణ ప్రజాపనులకు ఉద్దేశించిన అత్యంత భారీ కార్యక్రమం “గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్”ను ప్రారంభించారు. కోవిడ్-19 ప్రభావిత వలస కార్మికులు పెద్ద సంఖ్యలో గ్రామాలకు తిరిగివస్తున్న నేపథ్యంలో వారి ఆవాస ప్రాంతాలు/గ్రామాల్లో ఉపాధి, జీవనోపాధి అవకాశాలు పెంచి, సాధికారత కల్పించడం ఈ బృహత్ కార్యక్రమ లక్ష్యం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “ఈ కార్యక్రమం మన కార్మిక సోదరీసోదరులతోపాటు గ్రామాల్లో నివసించే యువత, ఆడబిడ్డలకు అంకితం. ఈ కార్యక్రమంద్వారా కార్మికులకు, గ్రామీణులకు వారి నివసించే ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించడానికి మేం కృషి చేస్తాం” అని ప్రకటించారు. “గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్” కింద నాణ్యమైన గ్రామీణ మౌలిక వసతుల నిర్మాణం కోసం రూ.50,000 కోట్లు వెచ్చిస్తామని ప్రధానమంత్రి వెల్లడించారు. తదనుగుణంగా గ్రామాల్లో ఉపాధి కల్పనకు, వివిధ అభివృద్ధి పనుల కోసం 25 ఉపాధి కల్పన రంగాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ 25 ప్రాజెక్టులు పథకాలు గ్రామీణ ప్రజానీకం అవసరాలకు తగినవిధంగా ఉంటాయని తెలిపారు. ఆ మేరకు పేదల కోసం గ్రామీణ గృహనిర్మాణం, మొక్కలు నాటడం, ‘జల్‌జీవన్ మిషన్’ద్వారా తాగునీటి సరఫరా, పంచాయతీ భవనాల నిర్మాణం, సామాజిక మరుగుదొడ్లు, గ్రామీణ మండీలు, రోడ్లు నిర్మాణంసహా పశువుల షెడ్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వంటి ఇతర మౌలిక వసతుల కల్పన తదితరాలను ఈ నిధులతో చేపడతామని వివరించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆధునిక సదుపాయాలు సమకూర్చనున్నట్లు చెప్పారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633002
‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తిపాఠం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632864
స్వగ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పనకు ఉద్యమ తరహాలో ప్రభుత్వ కార్యాచరణ: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్ మాత్రమేగాక ప్రపంచం మొత్తం తీవ్ర ఇక్కట్లు పడుతోందని కేంద్ర పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. దేశంలో దిగ్బంధం ప్రకటించినప్పటినుంచీ ప్రధాన స్రవంతి రంగాల్లోని గ్రామీణులు, పేదలు, రైతులు, కార్మికులకు ఎదురయ్యే సమస్యలపైనే ప్రధానమంత్రి దృష్టి సారించారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోని 6 రాష్ట్రాల్లోగల 116 జిల్లాల్లో ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 11 కేంద్ర మంత్రిత్వశాఖల సమన్వయంతో ఇది క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చగలదని చెప్పారు. ఎంపికచేసిన 25రకాల పనులను 125రోజుల్లో పూర్తి చేయడం లక్ష్యమన్నారు. దీనివల్ల ఉపాధి కల్పన వేగవంతం అవుతుందని చెప్పారు. ఉద్యమ తరహాలో ప్రజలకు ఉపాధి కల్పనలో ఇదొక ముఖ్యమైన ముందడుగని శ్రీ తోమర్ అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633005
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ; ఇప్పటిదాకా సాధించిన ప్రగతి
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఇప్పటిదాకా 42 కోట్ల మందికిపైగా పేదలకు రూ.65,454 కోట్లమేర ఆర్థిక సహాయం అందింది. దీంతోపాటు పీఎం-కిసాన్ కింద 8.94 కోట్ల మంది లబ్ధిదారులకు తొలివిడత చెల్లింపుల కోసం రూ.17,891 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ముందస్తుగానే విడుదల చేసింది. అలాగే 20.65 కోట్లమంది (100 శాతం) మహిళల జన్‌ధన్ ఖాతాలలో తొలివిడతగా రూ.10,325 కోట్లు, రెండో విడత కింద 20.62 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10,315 కోట్లు, మూడోవిడత కింద 20.62 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10,312 కోట్లవంతున జమచేయబడింది. ఇక వృద్ధాప్య/ వితంతు/దివ్యాంగ పెన్షన్ల కింద రెండు విడతలలో 2.81 కోట్లమందికి రూ.2,814.5 కోట్లు పంపిణీ చేయబడింది. అలాగే భవనాలు/నిర్మాణ రంగంలోని 2.3 కోట్లమంది కార్మికులు రూ.4,312.82 కోట్ల మేర ఆర్థిక సాయం అందుకున్నారు. పేదలకు పీఎంయూవై కింద 2020 ఏప్రిల్, మే నెలల్లో 8.52 కోట్ల సిలిండర్లు పంపిణీ చేయగా, 2020 జూన్‌లో 2.1 కోట్ల సిలిండర్ల కోసం అభ్యర్థనలు పంపారు. మరోవైపు 20.22 లక్షలమంది ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌వో) చందాదారులు తమ ఖాతాలనుంచి తిరిగి చెల్లించే అవసరంలేని ముందస్తు ఉపసంహరణ కింద రూ.5,767 కోట్లు తీసుకున్నారు. ఇక ఇప్పటిదాకా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 113 లక్షలకోట్ల ఆహారధాన్యాలను తీసుకెళ్లాయి. ఇందులో 2020 ఏప్రిల్ నెలకుగాను 74.03 కోట్లమంది లబ్ధిదారులకు 37.01 లక్షల టన్నులు పంపిణీ చేశాయి. అలాగే 2020 మే నెలలో 72.83 కోట్లమంది లబ్ధిదారులకు 36.42 లక్షల టన్నులు, 2020 జూన్ నెలకుగాను 27.18 కోట్లమంది లబ్ధిదారులకు 13.59 లక్షల టన్నుల వంతున పంపిణీ చేశాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633063
ఏకాంత గృహవాసం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఏకాంత గృహవాసంపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2020 మే 10వ
తేదీన సవరించిన మార్గదర్శకాలను జారీచేసింది. వీటి ప్రకారం... అత్యంత స్వల్ప లక్షణాలున్న/లక్షణాలు కనిపించని అనుమానిత కోవిడ్-19 పీడితులు ఏకాంత గృహవాసం ఎంచుకోవచ్చు. అయితే, సదరు ఇంట్లో టాయిలెట్ సదుపాయంగల ప్రత్యేక గదితోపాటు సహాయకులు లేదా సంరక్షణ బాధ్యత చూసుకోగల వ్యక్తి వారికి అందుబాటులో ఉండటం తప్పనిసరి. అంతేకాకుండా తన ఆరోగ్యంపై పర్యవేక్షణకు అంగీకరించడంతోపాటు నిఘా బృందాల తదుపరి అనుసరణ నిమిత్తం స్వీయ ఆరోగ్య స్థితిని క్రమం తప్పకుండా జిల్లా నిఘా అధికారికి తెలియజేసేందుకు సమ్మతించాలి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమర్థ నిరోధానికి ఏకాంత గృహవాసంపై మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632783
రెపోరేటులో కోతను బ్యాంకింగ్ రంగం ఖాతాదారులకు బదలాయింపుతోపాటు సంపద సృష్టికి భారత వృద్ధి చోదకుల కృషిపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది: ఆర్థికశాఖ మంత్రి
దేశంలో సంపద సృష్టికర్తలకుగల ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం సదా గుర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉపాధి అవకాశాల సృష్టితోపాటు దేశంలో సామాజిక-ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించేలా వారు వనరులను గరిష్ఠంగా వాడుకుంటారని పేర్కొన్నారు. మరోవైపు వాణిజ్యం-పరిశ్రమలను వెంటాడే కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి వాటికి ఉపశమనం దిశగా హామీలేని, స్వయంచలిత రుణ వితరణ కోసం కేటాయించిన రూ.3 లక్షల కోట్లమేర రుణాల మంజూరు సంబంధిత పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632810
కోవిడ్-19 నేపథ్యంలో భారత్‌కు 750 మిలియన్ డాలర్ల సాయంపై కేంద్ర ప్రభుత్వం-ఏఐఐబీ మధ్య ఒప్పందం
“కోవిడ్-19పై క్రియాశీల ప్రతిస్పందన-వ్యయాలకు మద్దతు కార్యక్రమం” కింద భారత్‌కు 750 మిలియన్ డాలర్ల సాయం అందించడంపై కేంద్ర ప్రభుత్వం-‘ఆసియా మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు’ (AIIB) మధ్య ఒప్పందం కుదిరింది. దేశంలోని పేద, దుర్బలవర్గాలకు చెందిన కుటుంబాలపై కోవిడ్-19 మహమ్మారి ప్రతికూల ప్రభావాన్ని ఉపశమింపజేయడంలో ప్రభుత్వ ప్రతిస్పందనను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏఐఐబీ ఈ సాయం అందించనుంది. ఈ నిధులతో కోవిడ్-19వల్ల సామాజికంగా-ఆర్థికంగా తలెత్తిన దుష్ప్రభావాలను ఉపశమింపజేయడంలో భారత ప్రభుత్వానికి బడ్జెట్‌పరమైన మద్దతు లభిస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలతోపాటు రైతులు, ఆరోగ్య కార్యకర్తలు, మహిళలు, మహిళా స్వయం సహాయ సంఘాలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధపౌరులు, స్వల్పవేతన జీవులు, నిర్మాణ కార్మికులు వంటి దుర్బల వర్గాలకు లబ్ధి చేకూరనుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632809
ఐడీవై 2020కి పలువురు బాలీవుడ్ ప్రముఖుల మద్దతు
రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం-2020ని ప్రపంచమంతటా నిర్వహించనున్నారు. అయితే, ప్రస్తుతం జన సమీకరణకు అవకాశం లేనందువల్ల “ఇంట్లో యోగా-కుటుంబంతో యోగా” పేరిట ఎవరికివారు ఇళ్లలో 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లక్షలాది ప్రజలు ఇందులో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో యోగాభ్యాసం ద్వారా ప్రజల్లో సామరస్యం ప్రోదిచేయడాన్ని ఆయుష్ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా అనేకమంది ప్రముఖులు, ప్రజాకర్షణ గలవారు ఉత్తేజపూరిత సందేశాలు, ఆలోచనలను పంచుకుంటూ 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు అక్షయ్‌కుమార్, అనుష్క శర్మ, మిలింద్ సోమన్, శిల్పాశెట్టి కుంద్రా వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633009
దేశంలోని ప్రైవేటు వైద్యుల నుంచి కోవిడ్ సంబంధిత సమాచారం స్వీకరించిన డాక్టర్ జితేంద్ర సింగ్
దేశంలోని వివిధ నగరాలకు చెందిన ప్రముఖ వైద్యులు, ప్రత్యేకవైద్య నిపుణులు కోవిడ్ మహమ్మారి సంబంధిత విస్తృత సమాచారాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో పంచుకున్నారు. ఈ మేరకు మంత్రి అధ్యక్షతన నిర్వహించిన వెబినార్‌లో చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, కోట, ఈరోడ్ వగైరా నగరాల నుంచి వైద్యులు పాల్గొన్నారు. కరోనాపై పోరులో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ విజయవంతంగా కర్తవ్యం నెరవేర్చినందుకు దేశంలోని వైద్యుల సమాజాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశంలోని వైద్య సమాజంతోపాటు ఆరోగ్య మౌలిక సదుపాయాలు తమ అంతర్గత సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించాయన్నారు. ఆ మేరకు స్వల్ప వ్యవధిలో పరిస్థితులకు తగినట్లు తమనుతాము మలచుకుంటూ సమాజం పట్ల తమ బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చినట్లు పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632837
“కోవిడ్-19.. ప్రపంచ మహమ్మారి పరిస్థితులలో అంతర్జాతీయ సివిల్ సర్వెంట్ల కోసం సుపరిపాలన పద్ధతులు” అంశంపై ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో-ఆపరేషన్ (ఐటీఈసీ) – నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల కార్యశాలలో డీఏఆర్‌పీజీ కార్యదర్శి డాక్టర్ కె.శివాజీ ముగింపు ప్రసంగం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632839
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో నమోదైన 32 తాజా కేసులలో 13 రాజధాని ప్రాంతం నుంచి, 10 చాంగ్లాంగ్ నుంచి, 8 వెస్ట్ కామెంగ్ నుంచి ఒక కేసు లోహిత్ జిల్లానుంచి నమోదయ్యాయి.
-
· మణిపూర్: రాష్ట్రంలో నమోదైన కొత్త కేసులలో అత్యధికంగా ఉఖ్రుల్ నుంచి 30, తమెంగ్‌లాంగ్ 29 వంతున ఉన్నాయి. కాగా, జిల్లాలవారీగా మొత్తం కేసులరీత్యా చురాచంద్‌పూర్ జిల్లాలో 94 కేసులున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినవారే.
· మిజోరం: రాష్ట్రంలో మొత్తం 140 కేసులుండగా వీటిలో 131 యాక్టివ్ కేసులున్నాయి. మరో 184 నమూనాల ఫలితాలు అందాల్సి ఉంది.
· నాగాలాండ్: రాష్ట్రంలోకి ప్రవేశించేవారికి నాగాలాండ్ ప్రభుత్వం 'ప్రత్యేక కేటగిరీ' ప్రామాణిక ప్రక్రియ విధానాన్ని జారీచేసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, నైపుణ్యంగల కార్మికులు, మరమ్మతు నిపుణులు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఈ కొత్త విధానం వర్తిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 8174 నమూనాలను ఇప్పటివరకు పరీక్షించగా, 6989 ఫలితాలు అందాయి. మరో 1185 నమూనాల నివేదికలు రావాల్సి ఉంది.
· సిక్కిం: అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు సందేశమిచ్చారు. ఆరోగ్యకరమైన, సుసంపన్న-సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి దారితీసే విధంగా జీవనశైలిలో సానుకూల మార్పుల కోసం యోగాభ్యాసం చేయాలని అందులో సూచించారు.
· చండీగఢ్: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్ డైరెక్టరేట్, రాష్ట్ర ఆరోగ్య శాఖలు ప్రభుత్వ యోగావిద్య-ఆరోగ్య కళాశాల సహకారంతో 2020 జూన్ 21న ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నాయి. కోవిడ్-19 మహమ్మారివల్ల ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇళ్లకే పరిమితమవుతోంది. ఆ మేరకు ఈసారి భారీ సామూహిక ఉత్సవాలేవీ ఉండవు. దీంతో ఇళ్లవద్దనే, కుటుంబమంతా యోగా దినోత్సవాన్ని పాటించాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
· పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు సమర్థ చికిత్స, వైద్య సిబ్బందికి ఆధునిక పద్ధతుల మద్దతు దిశగా ప్రభుత్వం తన కృషిని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పిజిఐతో రాష్ట్ర వైద్య విద్య-పరిశోధన విభాగం సమన్వయం చేసుకుంటోంది. తద్వారా రోగులకు చికిత్సలో స్టెరాయిడ్ మందులు, ప్లాస్మా చికిత్స పాత్రపై బహుళ కేంద్రీకృత అధ్యయనం చేపట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక నిపుణుల బృందం- రోగుల నిర్వహణలోగల వైద్య నిపుణులతో ఫోన్-వీడియో మాధ్యమాలద్వారా నిరంతరం చర్చిస్తోంది. ఈ నిపుణుల బృందంలో PGIMER, AIIMSలకు చెందినవారితోపాటు అమెరికా, యూకే, కెనడా, డీఎంసీ-లూధియానాసహా పంజాబ్‌లోని మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల వైద్యులు సభ్యులుగా ఉన్నారు.
· హర్యానా: ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ‘ఇంటివద్ద యోగా-కుటుంబంతో యోగా’ సాధన చేయాలని హర్యానా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. “కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ముప్పు ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై యోగా దినోత్సవం పాటించాలి. యోగాభ్యాసమేమీ కొత్త విషయం కాదు... అది మన సంస్కృతిలో అంతర్భాగం. ఆ మేరకు అందరూ ప్రాచీన భారతీయ క్రమశిక్షణను జీవితాంతం పాటించాలి” అని సూచించారు.
· కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 సోకినా, సదరు సంక్రమణకు మూలం తెలియని రోగుల సంఖ్య 60 దాటింది. వీరిలో మళప్పురం వాసులు 8 మంది మరణించగా, వారి వ్యాధి సంక్రమణ మూలాలు తెలియకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. నిన్న రాష్ట్ర రాజధానిలో ఒక ఆటో డ్రైవర్, అతని కుటుంబసభ్యులు ఇద్దరికి ప్రయాణ చరిత్రగానీ, వ్యాధిగ్రస్థులతో పరిచయంగానీ లేకపోయినా వ్యాధి బారినపడ్డారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోచ్చిలోని ఒక పోలీసు అధికారికి వ్యాధి నిర్ధారణ కావడంతో ఆయనతో సంపర్కంగలవారి జాబితాలోని హైకోర్టు న్యాయమూర్తి ఒకరు స్వీయ ఏకాంత నిర్బంధంలోకి వెళ్లారు. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా 118 కొత్త కేసులతోపాటు 96 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,380 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,32,569 మంది పరిశీలనలో ఉన్నారు.
· తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని మాస్కుల తయారీ సంస్థలో 16 మంది సిబ్బందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 338కి చేరింది. మరోవైపు జిప్మెర్ పరీక్ష విద్యార్థులను ఇరకాటంలో పెడుతోంది. జూన్ 21న చెన్నైలో పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఇతర జిల్లాల విద్యార్థులు కోవిడ్ సోకే ముప్పుందని భయపడుతుండటంతో ఇ-పాస్ వినియోగించుకోవడం కష్టంగా అనిపిస్తోంది. ఇక తమిళనాడు హోటళ్లలో భోజనానికి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించింది. ఆ మేరకు కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా 30వ తేదీవరకూ ఇళ్లకు తీసుకెళ్లడాన్ని మాత్రమే అనుమతిస్తుంది. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులందరకూ పై తరగతికి వెళ్తారని డీజీఈ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కులు తారుమారు కారాదని పాఠశాల విద్యాశాఖ మంత్రి పాఠశాలలను హెచ్చరించారు. రాష్ట్రంలో నిన్న 2115 కొత్త కేసులు నమోదవగా, 1630 మంది కోలుకున్నారు; 41 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 54449, యాక్టివ్ కేసులు: 23509, మరణాలు: 666, చెన్నైలో యాక్టివ్ కేసులు: 16699గా ఉన్నాయి.
· కర్ణాటక: రాష్ట్రంలోని కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో వ్యాధి లక్షణాలు లేని రోగులను చేర్చుకోవడానికి సంబంధించిన వైద్య అంచనాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 8,281 మంది రోగులకుగాను కేవలం 36 మందికి మాత్రమే వెంటిలేటర్ అవసరం. కాగా, మార్చి 24 నుంచి కర్ణాటకలో 1.2 లక్షల దిగ్బంధం ఉల్లంఘన సంఘటనలు చోటుచేసుకున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. వరదల నుంచి రక్షణ సన్నద్ధత దిశగా ముప్పుగల అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు 8,281కి పెరిగిన నేపథ్యంలో బెంగళూరు నుంచి అధికశాతం కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న 337 కొత్త కేసులు నమోదవగా, 230 మంది డిశ్చార్జి అయ్యారు; 10 మరణాలు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు: 2943, మరణాలు: 124, డిశ్చార్జి అయినవారి సంఖ్య: 5210గా ఉంది.
· ఆంధ్రప్రదేశ్: చక్కటి ఆరోగ్యం, అలౌకిక ఆనందం కోసం యోగాభ్యాసం చేయాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించే ‘వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం’ రెండోదశ అమలు కోసం ముఖ్యమంత్రి నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద ప్రతి నేత కార్మికుడి కుటుంబానికీ ఏటా రూ.24 వేల వంతున సహాయం లభిస్తుంది. రాష్ట్రంలో నిన్న 376 కొత్త కేసులు నమోదు కాగా, 82 మంది డిశ్చార్జి అయ్యారు. నాలుగు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 6230, యాక్టివ్: 3069, రికవరీ: 3065, మరణాలు: 96గా ఉన్నాయి.
· తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షలను పెంచాలన్న తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్ణయానికి ఓ మోస్తరు స్పందన లభిస్తోంది. ఆశించిన మేరకు నమూనాలు ఇవ్వడానికి ప్రజలు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే 3 జిల్లాలుసహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 50,000 పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కాగా, జూన్ 19 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 6526కు చేరగా, యాక్టివ్ కేసులు: 2976, మరణాలు 198, కోలుకున్నవారి సంఖ్య 3352గా ఉంది.
· మహారాష్ట్ర: రాష్ట్రంలో శుక్రవారంనాటి తాజా సమాచారం ప్రకారం 3,827 కొత్త కేసులు నమోదవంతో ప్రస్తుతం మొత్తం రోగుల సంఖ్య 1,24,331కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 55,651గా ఉంది. కాగా, ముంబైలో 1,269 కేసులు, 114 మరణాలు నమోదయ్యాయి. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బైకుల్లాలోని రిచర్డ్సన్-క్రుదాస్ ప్రాంగణంలో 1000 పడకలతో (వీటిలో 300 ఐసీయూ పడకలు) ప్రత్యేక కోవిడ్-19 ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ఈ నెల చివరికల్లా ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది.
· గుజరాత్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 540 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 26,198కి చేరాయి. తాజా సమాచారం మేరకు 27 మంది మరణించగా, కోవిడ్-19కు బలైనవారి సంఖ్య 1619కి చేరింది.
· రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ ఉదయం 158 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 14,314కు చేరింది. వీటిలో 2860 యాక్టివ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 11,121 మంది కోలుకోగా, 333 మంది మరణించారు. కొత్త కేసుల్లో అధికశాతం ధోల్‌పూర్ జిల్లాలో నమోదవగా, జైపూర్, భరత్‌పూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
· మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 156 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 11,582కు చేరింది. మరోవైపు 9 మంది మృతితో మరణాల సంఖ్య 495కు పెరిగింది. ఇండోర్, భోపాల్ నగరాల్లో చెరో 55 కొత్త కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లో వారాంతపు దిగ్బంధం అమలు చేస్తున్నారు. ఈ మేరకు కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూసివేస్తున్నారు.
· ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో శుక్రవారం నమోదైన 70 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2018కి పెరిగింది. వీటిలో 703 యాక్టివ్ కేసులున్నాయి.
- గోవా: గోవాలో 20 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 725కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 607 యీక్టివ్ కేసులున్నాయి.
(Release ID: 1633065)
|