ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత దేశంలో కోవిడ్-19 మద్దతు కోసం భారత ప్రభుత్వం మరియు ఏ.ఐ.ఐ.బి. లు కలిసి 750 మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి
Posted On:
19 JUN 2020 6:20PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏ.ఐ.ఐ.బి) కలిసి కోవిడ్-19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న పేదలు మరియు బలహీన వర్గాల కుటుంబాలకు భారతదేశం అందిస్తున్న సహాయాన్ని మరింత పటిష్టపరిచేందుకు వీలుగా 750 మిలియన్ డాలర్లతో చేపట్టే “కోవిడ్-19 ప్రతిస్పందన మరియు వ్యయ మద్దతు కార్యక్రమం” పై ఈ రోజు ఇక్కడ సంతకాలు చేశాయి. ఏ.ఐ.ఐ.బి. నుండి భారతదేశానికి అందిస్తున్న మొట్టమొదటి బడ్జెట్ మద్దతు కార్యక్రమం ఇది.
ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ ఖరే మరియు ఎ.ఐ.ఐ.బి. తరపున డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్న శ్రీ రజత్ మిశ్రా సంతకం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ ఖరే మాట్లాడుతూ, “కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, మహిళలతో సహా బలహీన వర్గాలకు సంభవించిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసే విధంగా సామాజిక సహాయం అందించడానికీ, వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత రంగాలలోని బాధిత కార్మికుల కోసం చేపడుతున్న సామాజిక భద్రతా చర్యలు పెంపొందించడానికీ, వెంటనే తోడ్పాటు నందించడం కోసం ముందుకు వచ్చిన ఏ.ఐ.ఐ.బి. కి మా కృతజ్ఞతలు" అని చెప్పారు. ఏ.ఐ.ఐ.బి. సకాలంలో అందజేస్తున్న ఈ ఆర్థిక సహాయం వల్ల ప్రభుత్వం చేపట్టిన కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వీలు కలుగుతుంది.
కోవిడ్-19 యొక్క తీవ్రమైన ప్రతికూల సామాజిక మరియు ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమం భారత ప్రభుత్వానికి బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది. కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య విధాన సంసిద్ధత ప్రాజెక్ట్ కోసం ఇంతకుముందు ఆమోదించబడిన 500 మిలియన్ల డాలర్ల ఋణం కాకుండా, ప్రస్తుత రుణం ఏ.ఐ.ఐ.బి. నుండి దాని కోవిడ్-19 సంక్షోభ రికవరీ సౌకర్యం కింద భారతదేశానికి అందుతున్న రెండవ ఋణం.
ఈ ప్రాథమిక కార్యక్రమం కింద ప్రయోజనం పొందే లబ్ధిదారుల్లో, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, రైతులు, ఆరోగ్య కార్యకర్తలు, మహిళలు, మహిళల స్వయం సహాయక బృందాలు, వితంతువులు, దివ్యాంగులు, వయోవృద్దులు, తక్కువ వేతనాలు సంపాదించేవారు, నిర్మాణ కార్మికులు మరియు ఇతర బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారు.
ఏ.ఐ.ఐ.బి. ఉపాధ్యక్షుడు (ఇన్వెస్టుమెంట్ ఆపరేషన్స్) శ్రీ డి.జె. పాండియన్ మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క మానవ వనరుల మూలధనంతో సహా ఉత్పాదక సామర్థ్యానికి సంభవించే దీర్ఘకాలిక నష్టాన్ని నివారించి, ఆర్థిక స్థిరత్వాన్ని పటిష్ట పరచాలనే ఉద్దేశ్యంతో ఏ.ఐ.ఐ.బి భారతదేశానికి మద్దతునిస్తోందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం 2.250 బిలియన్ డాలర్లను ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఎ.ఐ.ఐ.బి) మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి) నిధులు సమకూరుస్తున్నాయి. వీటిలో 750 మిలియన్ డాలర్లు ఎ.ఐ.ఐ.బి. మరియు 1.5 బిలియన్ డాలర్లు ఎ.డి.బి. సమకూరుస్తాయి. ఈ ప్రాజెక్టును ఆర్ధిక మంత్రిత్వ శాఖ లోని, ఆర్థిక వ్యవహారాల విభాగం, సంబంధిత వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమలు చేస్తుంది.
ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏ.ఐ.ఐ.బి) అనేది ఆసియాలో సామాజిక, ఆర్ధిక ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు. ఈ బ్యాంకు 2016 జనవరి నెలలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు ఏ.ఐ.ఐ.బి. ప్రపంచవ్యాప్తంగా 102 మంది ఆమోదం పొందిన సభ్యుల స్థాయికి పెరిగింది.
****
(Release ID: 1632809)
Visitor Counter : 379
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam