ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 తాజా సమాచారం

సమర్థ ఏకాంత గృహవాసం దిశగా మార్గదర్శకాలు
అనుసరించాలని రాష్ట్రాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం లేఖ

Posted On: 19 JUN 2020 9:28PM by PIB Hyderabad

కాంత గృహవాసంపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2020 మే 10వ తేదీన సవరించిన మార్గదర్శకాలను జారీచేసింది. ఈ కింది వెబ్‌ చిరునామాలో వీటిని చూడవచ్చు. https://www.mohfw.gov.in/pdf/RevisedguidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases10May2020.pdf

సదరు మార్గదర్శకాలు నేటికీ అమలులోనే ఉన్నాయి. వీటి ప్రకారం... అత్యంత స్వల్ప, లక్షణాలు కనిపించకముందు అనుమానిత కోవిడ్‌-19 పీడితులు ఏకాంత గృహవాసం ఎంచుకోవచ్చు. అయితే, సదరు ఇంట్లో టాయిలెట్‌ సదుపాయంగల ప్రత్యేక గదితోపాటు సహాయకులు లేదా సంరక్షణ బాధ్యత చూసుకోగల వ్యక్తి వారికి అందుబాటులో ఉండటం తప్పనిసరి. అంతేకాకుండా తన ఆరోగ్యంపై పర్యవేక్షణకు అంగీకరించడంతోపాటు నిఘా బృందాల తదుపరి అనుసరన నిమిత్తం స్వీయ ఆరోగ్య స్థితిని క్రమం తప్పకుండా జిల్లా నిఘా అధికారికి తెలియజేసేందుకు సమ్మతించాలి.

   ఈ సవరించిన మార్గదర్శకాలలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. దీని ప్రకారం... ఏకాంత గృహవాసానికి రోగిని అనుమతించే ముందు వారికి చికిత్స చేసే వైద్యుడు అతడు/ఆమె వైద్యపరమైన పరిస్థితిసహా సముచిత నివాస వసతిపై తగురీతిలో అంచనావేసి సంతృప్తి చెంది ఉండాలి. అంతేకాకుండా స్వీయ ఏకాంత గృహవాసంపై రోగి అంగీకార పత్రం ఇవ్వడంతోపాటు గృహనిర్బంధ వైద్య పర్యవేక్షణ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలి. అలాగే అటువంటి ఏకాంత గృహవాసం కేసులను తగిన పరిజ్ఞానంగల వైద్యులతో కూడిన బృందాలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. తదనంతరం వారిని విడుదల చేసేందుకు సంబంధిత మార్గదర్శకాలను కూడా పాటిస్తూ నిబంధనల మేరకు నివేదించాలి.

   ఈ అంశానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో సవరించిన మార్గదర్శకాలలోని నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యతను పట్టించుకోకుండా ఏకాంత గృహవాసానికి అనుమతి ఇస్తున్నట్లు సమాచారం అందింది. దీనివల్ల ప్రత్యేకించి జనసమ్మర్దం అధికంగా ఉండే, ఇరుకిరుకు నివాసాల వంటి పట్టణ పరిస్థితుల్లో సదరు రోగి కుటుంబసభ్యులతోపాటు ఇరుగుపొరుగుకు వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి సమర్థ నిరోధానికి ఏకాంత గృహవాసంపై మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది.

*****


(Release ID: 1632783) Visitor Counter : 187