PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 28 MAY 2020 6:39PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 •  దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 67,692గా నమోదైంది. కోలుకునేవారి శాతం మెరుగుపడి 42.75కి చేరింది.
 • దేశంలో కోవిడ్‌-19 తీవ్ర ప్రభావిత 13 నగరాలపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి సమీక్ష.
 • 3543 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లలో 48 లక్షల మంది ప్రయాణికుల చేరవేత.
 • దిగ్బంధ కాలంలో పీఎం-కిసాన్‌ పథకం కింద 9.67 కోట్ల మంది రైతులకు లబ్ధి.
 • స్వయం సమృద్ధ భారతం అంటే ఆత్మవిశ్వాసం, స్వావలంబన సంరక్షణగల దేశం: శ్రీ పీయూష్‌గోయల్‌ స్పష్టీకరణ 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలోగల కోవిడ్‌-19 కేసుల సంఖ్య 86,110 కాగా, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 67,691గా ఉంది. గడచిన 24 గంటల్లో 3,266 మందికి వ్యాధి నయం కావడంతో కోలుకున్నవారి శాతం మెరుగుపడి 42.75కు చేరింది.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627261

దేశంలో కోవిడ్‌-19 తీవ్ర ప్రభావిత 13 నగరాలపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి సమీక్ష

దేశంలో కోవిడ్‌-19 తీవ్ర ప్రభావిత 13 నగరాల్లో సంబంధిత పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, పురపాలక కమిషనర్లతో కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసులకుగాను ఈ 13 నగరాలు అత్యంత తీవ్రంగా కరోనా వైరస్‌తో ప్రభావితమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ జాబితాలో ముంబై, చెన్నై, ఢిల్లీ/న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌, థానె, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతా/హౌరా, ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), జైపూర్‌, జోధ్‌పూర్‌, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌ (తమిళనాడు) నగరాలున్నాయి. ఈ నేపథ్యంలో సదరు 13 నగరాల్లో కోవిడ్‌-19 కేసుల నిర్వహణ దిశగా అధికారులు, సిబ్బంది తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో మంత్రిమండలి కార్యదర్శి సమీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627460

ఆర్థిక సుస్థిరత-అభివృద్ధి మండలి 22వ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీమతి నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ‘ఆర్థిక సుస్థిరత-అభివృద్ధి మండలి 22వ సమావేశానికి అధ్యక్షత వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులపై ఈ సమావేశం సమీక్షించింది. అలాగే ఆర్థిక సుస్థిరత, బలహీనపరిచే అంశాలు, బ్యాంకులు-ఇతర ఆర్థిక సంస్థలకు ఎదురుకాగల ప్రధాన సమస్యలు... వాటిపై నియంత్రణ, విధానపరమైన ప్రతిస్పందనలు, బ్యాంకింగేతర/గృహరుణ/సూక్ష్మరుణ సంస్థలకు ద్రవ్యలభ్యత/పరపతి శక్తి తదితర సంబంధిత సమస్యలన్నిటిపైనా ఈ సమావేశం లోతుగా చర్చించింది. అంతేకాకుండా మార్కెట్‌ ఒడుదొడుకులు, దేశీయ వనరుల సమీకరణ, మూలధన ప్రవాహ సమస్యలపైనా మండలి చర్చించింది. ఈ సంక్షోభ ప్రభావం, కోలుకునే సమయంపై ప్రస్తుత అనిశ్చితి నడుమ కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని మండలి అభిప్రాయపడింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627530

నవ్య అభివృద్ధి బ్యాంకు పాలకమండలి ప్రత్యేక సమావేశంలో దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా పాల్గొన్న శ్రీమతి నిర్మలా సీతారామన్‌

మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో నవ్య అభివృద్ధి బ్యాంకు (NDB) పాత్ర ప్ర‌శంసార్హ‌మని, తద్వారా భార‌త్‌స‌హా సభ్య‌దేశాల‌లో ప్ర‌గ‌తి ప్రణాళిక‌ల‌పై బ్యాంకు సానుకూల ప్ర‌భావం స్పష్టమైందని ఆర్థిక‌శాఖ మంత్రి కొనియాడారు. సభ్య దేశాల్లో 1660 కోట్ల డాల‌ర్ల విలువైన 55 ప‌థ‌కాలను స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఆమోదించడం ఒక మైలురాయిగా నిలిచింద‌ని ప్ర‌శంసించారు. ప్ర‌పంచంలో త‌న‌కంటూ స‌ముచిత స్థానం ఏర్ప‌ర‌చుకోవ‌డంతోపాటు  బ‌హుపాక్షిక ప్ర‌గ‌తి బ్యాంకు (MDB)ల‌తో స‌త్సంబంధాలు నెర‌ప‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని శ్రీమతి సీతారామన్ అన్నారు. ఎన్డీబీ అధ్య‌క్షుడిగా స‌మ‌ర్థ నాయ‌క‌త్వం అందించి ప‌ద‌వీకాలం పూర్తి చేసుకున్న కె.వి.కామ‌త్- బ్రిక్స్ నాయ‌కులు 2014లో నిర్దేశించిన దార్శ‌నిక‌త‌కు స‌త్వ‌ర రూప‌క‌ల్ప‌నలో అద్వితీయ పాత్ర పోషించార‌ని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి కొనియాడారు. అలాగే “కోవిడ్-19 అత్యవసర రుణవిత‌ర‌ణ కార్య‌క్ర‌మం” ప్రారంభించడంద్వారా ప్ర‌పంచ మ‌హ‌మ్మారి వ్యాప్తిపై ఆయన స‌త్వ‌రం స్పందించిన తీరు స‌భ్య‌దేశాల‌కు స‌దా స్మ‌ర‌ణీయమని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627269

దేశవ్యాప్తంగా 2020 మే 27 (ఉదయం 10:00)దాకా 3,543 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లద్వారా 26 రోజుల్లో 48 లక్షలమందిని సొంత రాష్ట్రాలకు చేరవేసిన రైల్వేశాఖ

భారత రైల్వేశాఖ వివిధ రాష్ట్రాలనుంచి 2020 మే 27నాటికి 3,543 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లు నడిపింది. కాగా, 26.05.2020 ఒక్కరోజునే పలు రాష్ట్రాల నుంచి 255 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు బయల్దేరాయి. ఈ రైళ్లద్వారా 26 రోజుల్లో సుమారు 48 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేరవేసింది. ఇలా నడిపిన 3,543 రైళ్లలో గుజరాత్‌ (946), మహారాష్ట్ర (677), పంజాబ్‌ (377), ఉత్తరప్రదేశ్‌ (243), బీహార్‌ (215) రాష్ట్రాలనుంచి అత్యధిక సంఖ్యలో బయల్దేరాయి. ఇక దేశం మొత్తంమీద అత్యధిక సంఖ్యలో శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు చేరుకున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ (1,392), బీహార్‌ (1,123), ఝార్ఖండ్‌ (156), మధ్యప్రదేశ్‌ (119), ఒడిషా (123) ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627346

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధానమంత్రి గౌరవనీయ మహింద రాజపక్ష మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- శ్రీలంక ప్రధానమంత్రి గౌరవనీయ మహింద రాజపక్షతో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. శ్రీలంక పార్లమెంటు సభ్యుడుగా రాజపక్ష తొలిసారి పాదం మోపి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం కోవిడ్‌-19 సృష్టించిన ఆరోగ్య, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో తమ దేశాల్లో అనుసరించిన విధానాలపై దేశాధినేతలిద్దరూ చర్చించుకున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో శ్రీలంకకు అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గౌరవనీయ రాజపక్షకు హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627338

పీఎం-జీకేవై కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 13.4 కోట్లమంది లబ్ధిదారులకు 1.78 లక్షల టన్నుల పప్పుదినుసుల పంపిణీ

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (PM-GKY) కింద దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 4.57 లక్షల టన్నుల పప్పుదినుసులను కేంద్ర ప్రభుత్వం పంపింది. ఇందులో ఇప్పటిదాకా 1.78 లక్షల టన్నుల మేర ఆయా రాష్ట్రాల్లోని 1,340.61 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-KISAN) పథకం కింద దిగ్బంధం సమయంలో 24.03.2020 నుంచి ఇప్పటిదాకా 9.67 కోట్ల మంది రైతులకు రూ.19,350.84 కోట్ల మేర లబ్ధి చేకూరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627341

మరింత పోటీతత్వంతో ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి: ఎగుమతిదారులకు శ్రీ పీయూష్‌ గోయల్‌ పిలుపు

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల, రైల్వేశాఖల మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఎగుమతులపై నిర్వహించిన డిజిటల్‌ సదస్సులో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం ప్రస్తుతం బలంగా ఉన్న అంశాలను సంఘటితం చేసుకోవడంతోపాటు ఎగుమతుల వైవిధ్యీకరణపై దృష్టి సారించడం అవసరమని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు మన బలం, పోటీతత్వంతో ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని శ్రీ గోయల్‌ చెప్పారు. ప్రపంచ విపణిలో... ప్రత్యేకించి ప్రస్తుత అంతర్జాతీయ సరఫరా శృంఖలం పునర్నిర్మాణ జరుగుతున్న పరిస్థితుల్లో భారతదేశాన్ని ఆధారపడదగిన భాగస్వామిగా, విశ్వసనీయ మిత్రుడుగా పరిగణన పొందేలా రూపొందాలని ఆయన చెప్పారు.  

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627526

పారిశ్రామిక-వాణిజ్య సంఘాలతో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ సమావేశం; స్వయం సమృద్ధ భారతం అంటే ఆత్మవిశ్వాసం, స్వావలంబన సంరక్షణ నిండిన దేశమని, స్వార్థపర భారతం కాదని స్పష్టీకరణ

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ పారిశ్రామిక-వాణిజ్య సంఘాలవారితో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశం నిర్వహించారు. “స్వయం సమృద్ధ భారతం’ అంటే- స్వార్థ, సంకుచిత, విదేశీ వ్యతిరేక దేశం కాదని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ భావన వెనుక... ఆత్మవిశ్వాసం, స్వావలంబన, సమాజంలోని అన్ని వర్గాల సంరక్షణసహా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రగతికి ప్రాముఖ్యం ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలోని 130 కోట్లమంది భారతీయులలో మనమంతా ఒక్కటేనన్న స్ఫూర్తిని స్వయం సమృద్ధ భారతం పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627345

భారత ఆహార సంస్థద్వారా ఆహారధాన్యాల పంపిణీ, సేకరణపై శ్రీ పాశ్వాన్‌ సమీక్ష

దేశవ్యాప్త దిగ్బంధం సమయంలో భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ పోషించిన పాత్రను శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల నడుమ కూడా ఆహారధాన్యాల చేరవేత ఎన్నడూ లేనంత అధికస్థాయిలో సాగిందని కొనియాడారు. ప్రపంచ మహమ్మారి కమ్ముకున్నవేళ ఎఫ్‌సీఐ సిబ్బంది ఆహార యోధులుగా ఆవిర్భవించారని, ఈ సవాలును వారు ఒక అవకాశంగా మలచుకున్నారని పేర్కొన్నారు. మొత్తంమీద దిగ్బంధం సమయంలో ఆహారధాన్యాల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, రవాణాలో ఎఫ్‌సీఐ కొత్త రికార్డులు నెలకొల్పింది. మరోవైపు ఆహారధాన్యాల సేకరణ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది. ఈ క్రమంలో నిరుటి గణాంకాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ సంస్థలద్వారా గోధుమ కొనుగోళ్లు కొత్త మైలురాయిని చేరుకున్నాయి. కాగా, వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహారధాన్యాల పంపిణీపైనా మంత్రి సమీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627463

ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ కార్యక్రమాన్ని వినూత్న మార్గాల్లో ముందుకు తీసుకెళ్లాలి

దేశంలో ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ను వినూత్న మార్గాల్లో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ కార్యక్రమ పరిధిలోని మంత్రిత్వశాఖల కార్యదర్శులు నిర్వహించిన దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627461

ట్విట్టర్‌ ఖాతా @LabourDGని ప్రారంభించిన శ్రీ సంతోష్‌ గంగ్వార్‌; ఈ ఖాతాద్వారా కార్మిక సంక్షేమంపై తాజా గణాంకాలు అందుబాటు

దేశంలో కార్మిక సంక్షేమానికి సంబంధించి తాజా గణాంకాలను అందుబాటులో ఉంచేదిశగా లేబర్‌ బ్యూరో కోసం కేంద్ర కార్మిక-ఉపాధిశాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ ట్విట్టర్‌ ఖాతా ‘@LabourDG’ని నిన్న ప్రారంభించారు. ఇది భారత కార్మిక విపణికి సంబంధించి నిరంతర-తాజా తక్షణ వనరు కాగలదని ఈ సందర్భంగా మంత్రి ట్వీట్‌ చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627528

కోవిడ్‌-19పై పోరుకు పరిష్కారాల అన్వేషణలో శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలు

కోవిడ్‌-19పై పోరులో భాగంగా టీకాలు, ఔషధాల రూపకల్పన, రోగ నిర్ధారణ-పరీక్షలు తదితర రంగాల్లో శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి కార్యకలాపాలను నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వినోద్‌పాల్‌, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర-సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్‌ కె.విజయ రాఘవన్ ఇవాళ విలేకరుల సమావేశంలో వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627464

కోవిడ్‌-19పై పోరాటంలో కర్నాల్‌ స్మార్ట్‌ సిటీ వినూత్న చర్యలు

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627531

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: నగరంలోని సెక్టార్ 38లో 27/05/2020 నుంచి, సెక్టార్ 52లో 28/05/2020 నుంచి నియంత్రణ కార్యకలాపాల నిలిపివేతకు నగర పాలనాధికారి ఆమోదం తెలిపారు. అయితే, పరీక్షలు, నిఘా, నివాసితుల ఆరోగ్యం విషయాల్లో కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ఈ ప్రాంతంలో క్రమం తప్పకుండా పరిశుభ్రత చర్యలతోపాటు ఐఈసీ ప్రచారాన్ని నగరపాలక అధికారులు చేపట్టనున్నారు. తాజా అనుమానిత కేసుల యాదృచ్ఛిక నమూనాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని సేకరించి, అధికార యంత్రాంగానికి నివేదిస్తారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాంతంలో సామాజిక కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతాయి. దీంతోపాటు సామాజిక దూరం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటింపు నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తారు.
 • పంజాబ్: రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నడుమ, కోవిడ్‌ మహమ్మారి ఫలితంగా దీర్ఘకాలిక దిగ్బంధంతో తలెత్తిన ఆర్థిక సంక్షోభంనుంచి బయటపడటం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.51,102కోట్ల ఆర్థిక ఉద్దీపన సాయం కోరాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో దిగ్బంధంపై మే 30న పంజాబ్ ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనుంది. ఈ మేరకు మే 30న రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితులపై సంబంధిత విభాగాలతో ముఖ్యమంత్రి తన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత దిగ్బంధం పొడిగింపు/ముగింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
 • హర్యానా: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తొలి 7రోజులు తప్పనిసరిగా సంస్థాగత నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉండాలని, అలాగైతేనే మిగిలిన 7 రోజులు గృహ నిర్బంధవైద్య పర్యవేక్షణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్లందర్నీ హర్యానా ప్రభుత్వం ఆదేశించింది, గృహ నిర్బంధవైద్య పర్యవేక్షణ సదుపాయం లేనిపక్షంలో సంబంధిత డిప్యూటీ కమిషనర్ తమ జిల్లా ప్రధాన వైద్యాధికారితో సంప్రదించి సదరు ప్రయాణికులను నిర్దేశిత సంస్థాగత దిగ్బంధవైద్య కేంద్రంలో మిగిలిన ఏడు రోజులు ఉంచేలా చూడాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించింది.
 • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని సంస్థాగత నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు  డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, ముఖ్య వైద్యాధికారులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం సందర్భంగా నొక్కిచెప్పారు. తగిన సదుపాయాలు ఉన్నపుడు ప్రజలకు ఆయా కేంద్రాల్లో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. రెడ్ జోన్లనుంచి వచ్చేవారందరినీ సంస్థాగత నిర్బంధంలో ఉంచాలని, ఆ తర్వాత కోవిడ్‌-19 పరీక్షల్లో వ్యాధి సోకలేదని తేలితేనే గృహ నిర్బంధవైద్య పర్యవేక్షణకు పంపాలని స్పష్టం చేశారు. ఇతర దేశాలనుంచి వచ్చే హిమాచల్‌ వాసుల విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కోవిడ్‌-19 నిర్ధారిత రోగులకుగల అన్ని పరిచయాలనూ గుర్తించి, పరీక్షలు నిర్వహించి, వారిని సకాలంలో చికిత్సకు తరలించడంద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. అలాగే దిగ్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాల్లోగల వ్యక్తుల కదలికలను సమర్థంగా పర్యవేక్షించే దిశగా వారందరూ తమ ఫోన్లలో ‘కరోనా ముక్త్‌’ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
 • కేరళ: వలస కార్మికుల దుస్థితిపై సర్వోన్నత న్యాయస్థానం తనంతటతానుగా విచారణ చేపట్టిన నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సమాచారాన్ని కోర్టుకు నివేదించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి 70,137 మంది వలస కార్మికులను 55 రైళ్లలో వారి స్వస్థలాలకు పంపినట్లు తెలియజేసింది. అలాగే 4,34,280మంది వలస కార్మికులకు 21,556 శిబిరాల్లో ఆశ్రయం కల్పించి ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు సమకూర్చినట్లు పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి మద్యం దుకాణాలను తెరిచారు. మరోవైపు మద్యం అమ్మకం కోసం రూపొందించిన వర్చువల్ క్యూ నిర్వహణ యాప్ ‘బెవ్-క్యూ’పై విస్తృతంగా ఫిర్యాదులు వచ్చాయి. ఇక గృహనిర్బంధ వైద్య పర్యవేక్షణ ఉల్లంఘనను అరికట్టేందుకు పోలీసులు ఆకస్మిక తనిఖీ ప్రారంభించి ఉల్లంఘించేవారిని ప్రభుత్వ నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. కాగా, తొలి కోవిడ్-19 కేసు నమోదయ్యాక 119వ రోజున రాష్ట్రంలో నిర్ధారిత కేసుల సంఖ్య నిన్న 1,004 స్థాయికి చేరింది. ఇందులో గడచిన 14 రోజుల్లో కొత్తగా చేరిన దాదాపు 45 శాతం (445) కేసులుకూడా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు దేశవిదేశాల నుంచి తిరిగి వచ్చేందుకు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకున్న 6 లక్షల మంది కేరళ వాసులకుగాను మే 27నాటికి 1.05 లక్షల మంది రాష్ట్రానికి చేరుకున్నారు.
 • తమిళనాడు: దక్షిణమధ్య రైల్వే సిబ్బందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో చెన్నైలోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేయగా, మొత్తం ప్రాంగణంలో రోగకారకాలను నాశనం చేసేందుకు చర్యలు తీసుకున్న తర్వాత తిరిగి సోమవారం తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఇవాళ విమానంలో బెంగళూరు నుంచి మదురై చేరుకున్న ఒక వ్యక్తితోపాటు ఢిల్లీనుంచి వచ్చిన మరో ఇద్దరికి కోవిడ్‌-19 సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మిడుతల దాడి ముప్పుపై ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. తమిళనాడు ఈ ముప్పు లేనప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రైతులకు సూచనలు జారీచేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా నిన్న 817 కొత్త కేసుల నమోదుతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,545కు చేరింది. వీటిలో యాక్టివ్: 8500, మరణాలు: 133, డిశ్చార్జ్: 9909. చెన్నైలో యాక్టివ్ కేసులు 6307గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 75 కొత్త కేసులు నమోదవగా, 28 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు... ఒకరు మరణించారు. నేటి కొత్త కేసులలో ఉడిపి 27, హసన్ 13, బెంగళూరు నగరం 7, యాదగిరి 7, చిత్రదుర్గ 6, దక్షిణ కన్నడ 6, కల్బుర్గి-చిక్కమగళూరులలో మూడేసి; విజయపురలో 2; రాయచూర్‌లో 1 వంతున ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 2,493కు పెరగ్గా; వీటిలో యాక్టివ్‌:1,635, కోలుకున్నవి:809, మరణాలు: 47గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పాఠశాలలు-కళాశాలలపై పర్యవేక్షణ కోసం www.apsermc.ap.gov.in పేరిట విద్యా వెబ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పరుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 9858 నమూనాలను పరీక్షించిన తర్వాత 54 కొత్త కేసులు నమోదవగా గత 24 గంటల్లో 45మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక మరణం సంభవించింది. ప్రస్తుతం మొత్తం కేసులు: 2841. యాక్టివ్: 824, రికవరీ: 1958, మరణాలు: 59గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారిలో 293 మందికి కోవిడ్‌ నిర్ధారణ కాగా, వీటిలో యాక్టివ్‌ కేసులు 126గా నమోదయ్యాయి. విదేశాలనుంచి వచ్చినవారిలో కేసులు 111గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో దిగ్బంధం పొడిగింపుతోపాటు కార్మికులకు, నిధులకు కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం వరి, మొక్కజొన్న, శనగపప్పు, పొద్దుతిరుగుడు, జొన్నసహా రైతులనుంచి 12,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. డ్రగ్స్ అండ్‌ కాస్మెటిక్స్ చట్టం, ఫార్మసీ చట్టం నిబంధనల అమలుతీరుపై సమాచారం ఇవ్వాలని కేంద్రంతోపాటు తెలంగాణ ప్రభుత్వాలను, ఔషధ నియంత్రణ, పరిపాలన విభాగాలను రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో మే 28వ తేదీ నాటికి మొత్తం కేసుల సంఖ్య 2,098 కాగా, ఇప్పటివరకూ 173 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన/సౌదీ అరేబియా వెనక్కు పంపిన 124 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 మహమ్మారి పర్యవసానాలవల్ల ఏర్పడిన ఆర్థిక పరిస్థితిపై సమీక్ష నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక పునరుద్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది.
 • అసోం: రాష్ట్రంలో 33 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 831కి చేరింది. వీటిలో యాక్టివ్‌ 737, కోలుకున్నవి 87, మరణాలు 4గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
 • మణిపూర్: రాష్ట్రంలో పశ్చిమ ఇంఫాల్‌లోని మీత్రామ్‌లోగల ‘యునాకో’ పాఠశాల వద్ద కోవిడ్ రోగుల చికిత్స కోసం 100 పడకల తాత్కాలిక కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై ఆరోగ్య శాఖ, హెల్త్ మిషన్ అధికారులతోపాటు సంబంధిత పాఠశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.
 • మిజోరం: గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చిక్కుకున్న మిజోరం కార్మికులతో రాష్ట్రానికి వస్తున్న రైలు ఇవాళ గువహటి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
 • నాగాలాండ్: రాష్ట్రంలో మరిన్ని జీవభద్రత స్థాయి ప్రయోగశాలల అవసరం ఉందని, రోగులతో సంబంధాల అన్వేషణను మరింత ముమ్మరం చేయాలని, గవర్నర్ ఆర్.ఎన్.రవి నొక్కిచెప్పారు. కాగా, దిమాపూర్‌లో దిగ్బంధం మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 109 వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేసి, రూ.15,400 జరిమానా కింద వసూలు చేశారు.
 • సిక్కిం: రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు నమోదు చేసుకున్న 8766 మంది పౌరులలో ఇప్పటివరకూ 4415 మంది చేరుకున్నారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 7 ప్రత్యేక రైళ్లలో 2063 మందిని తరలించారు. వ్యవసాయోత్పత్తుల సంస్థలకు, సహకార సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలని, రైతుల కోసం రుణ శిబిరాలు నిర్వహించాలని, కిసాన్‌ క్రెడిట్ కార్డులు జారీచేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ మంత్రి గ్యాంగ్‌టక్‌లోని ఆర్బీఐ శాఖను కోరారు.

PIB FACT CHECK

 

 

 

******(Release ID: 1627540) Visitor Counter : 37


Read this release in: English , Urdu , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam