వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మరింత పోటీగా ఉండాలనీ, ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనీ ఎగుమతిదారులకు పిలుపునిచ్చిన - శ్రీ పీయూష్ గోయల్.
విస్తరణ, ప్రస్తుతం పటిష్టంగా ఉన్న ప్రాంతాల ఏకీకరణ, నూతన మార్కెట్ల అన్వేషణ లను విజయానికి మంత్రంగా మలచుకోవాలి.

Posted On: 28 MAY 2020 4:40PM by PIB Hyderabad

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ.) ఎగుమతులపై ఈ రోజు నిర్వహించిన డిజిటల్ సదస్సులో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వేల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పాల్గొన్నారు.  ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సదస్సుకు సంస్థాగత భాగస్వామిగా వ్యవహరించింది. 

ఈ సమావేశంలో శ్రీ గోయల్ మాట్లాడుతూ,  పరిశ్రమ మరియు ప్రైవేటు రంగాలతోనే భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉందనీ, ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర చాలా తక్కువగా ఉంటుందనీ పేర్కొన్నారు.  భారతదేశం యొక్క ఎగుమతులను పెంపొందించడానికి మంత్రి మూడు ముఖ్యమైన మార్గాలను గుర్తించారు. వాటిని - తయారీని పునరుద్ధరించడం, ఎగుమతులను వైవిధ్యపరచడం మరియు నూతన మరియు మరింత అనుకూలమైన మార్కెట్లను అన్వేషించడంగా  ఆయన పేర్కొన్నారు.   మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి,  ప్రస్తుతం పటిష్టంగా ఉన్న ప్రాంతాల ఏకీకరణతో పాటు, ఎగుమతులను విస్తరించవలసిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.  ఆటో కాంపోనెంట్ సెక్టార్, ఫర్నిచర్, ఎయిర్ కండీషనర్లు మరియు ఇతరుల వస్తువుల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారతదేశానికి భారీ అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ఎమ్.ఈ.ఐ.టి.-వై. ప్రోత్సహిస్తోందనీ, ఫార్మాలో మనం ఏ.పి.ఐ. తయారీని ప్రోత్సహిస్తున్నామనీ, వ్యవసాయ ఎగుమతి రంగంలో అవకాశాలు భారీగా ఉన్నాయనీ ఆయన చెప్పారు.  ఐటి సంబంధిత సేవలో, భారతీయ నైపుణ్యం మరియు ప్రావీణ్యాన్ని ప్రపంచం గుర్తించిందనీ, అందువల్ల వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో 500 మిలియన్ డాలర్ల ఎగుమతిని లక్ష్యంగా చేసుకోవాలని నాస్కామ్ ‌ను కోరినట్లు ఆయన చెప్పారు. 

ఆత్మ నిర్భర్ భారత్, కేవలం అధిక స్వావలంబన గురించి మాత్రమే కాదు, బలం ఉన్న ప్రదేశం నుండి ప్రపంచంతో నిమగ్నమవడం గురించి కూడా  అని గుర్తించాలని ఆయన అన్నారు.    ప్రపంచ మార్కెట్లో భారతదేశాన్ని నమ్మదగిన భాగస్వామిగా మరియు నమ్మదగిన స్నేహితుడిగా చూడాలని (ముఖ్యంగా ప్రపంచ సప్లై చైన్ పునర్వ్యూహంలో ఉన్నప్పుడు)  ఆయన అన్నారు. భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చాలన్న ప్రధానమంత్రి అభిమతం గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, "మనం బలంగా ఉన్న స్థానం నుండి మాట్లాడాలి, పోటీగా ఉండాలి మరియు ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి" - అని పేర్కొన్నారు.  విజయవంతం కావడానికి మనలో దృఢమైన కోరిక, సవాళ్లను స్వీకరించే సుముఖత ఉంటే, మన పురోగతిని ఏ సంక్షోభం నిలువరించలేదు. 

125 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు, గ్లోబల్ వాల్యూ చైన్స్ (జి.వి.సి.లు) తో అనుసంధానం చేయడం ద్వారా ఎగుమతులను పెంపొందించడం కోసం టాస్క్‌ఫోర్స్ ప్రారంభించినందుకు  శ్రీ గోయల్ సి.ఐ.ఐ. ని అభినందించారు.  టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పనిచేయడానికి మరియు పరిశ్రమ, మరియు దేశం యొక్క ప్రయోజనం కోసం అవసరమైన చోట చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఎగుమతులు చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి ఉన్నాయని మరియు భాగస్వామ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన హామీ ఇచ్చారు.  దేశంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా ప్రయోగశాలలు వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఉన్నాయని, భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేద్దామని ఆయన అన్నారు.

సి.ఐ.ఐ. డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, ఎగుమతులను సరిదిద్దడానికి అవసరమైన అన్ని సంస్కరణలను తప్పక చేపట్టాలనీ, వాటిని రూపొందించడానికి ఇది సరైన సమయమనీ, చెప్పారు. వాణిజ్య వస్తువుల రవాణా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, జి.వి.సి.ల పనితీరు, మరియు ఎఫ్.టి.ఎ. ల ను ప్రభావితం చేయడానికి బలమైన వ్యూహం కీలకం అని ఆయన అన్నారు.

*****(Release ID: 1627526) Visitor Counter : 34