రైల్వే మంత్రిత్వ శాఖ
2020 మే 27వ తేదీ (ఉదయం 10 గంటలు) వరకు దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలు 3543 “శ్రామిక్ ప్రత్యేక” రైళ్ళను నడిపాయి. 26 రోజుల్లో “శ్రామిక్ ప్రత్యేక” రైళ్ళ ద్వారా 48 లక్షలకు పైగా ప్రయాణికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు.
ఈ రైళ్ళలో ప్రయాణించే వలసదారులకు 78 లక్షలకు పైగా ఉచిత భోజనాలతో పాటు ఒక కోటి 10 లక్షలకు పైగా మంచి నీళ్ల సీసాలను అందజేశారు.
2020 మే నెల 26వ తేదీన 255 శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు బయలుదేరాయి.
శ్రామిక్ ప్రత్యేక రైళ్ళతో పాటు, మే 12వ తేదీ నుండి న్యూఢిల్లీని కలుపుతూ 15 జతల ప్రత్యేక రైళ్ళను రైల్వేశాఖ నడుపుతోంది. జూన్ 1వ తేదీ నుండి టైం టేబుల్ లో పేర్కొన్న మరో 200 రైళ్ళను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
Posted On:
27 MAY 2020 7:30PM by PIB Hyderabad
వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతర వ్యక్తులను ప్రత్యేక రైళ్ళ ద్వారా వారి స్వస్థలాలకు పంపించాలని దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా, భారతీయ రైల్వేలు 2020 మే నెల 1వ తేదీ నుండి "శ్రామిక్ ప్రత్యేక" రైళ్ళ ను నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 2020 మే 27వ తేదీ వరకు 3543 “శ్రామిక్ ప్రత్యేక” రైళ్ళను నడపడం జరిగింది. 2020 మే నెల 26వ తేదీన 255 శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు బయలుదేరాయి. గత 26 రోజుల్లో ఈ “శ్రామిక్ ప్రత్యేక” రైళ్ళ ద్వారా ఇంతవరకు సుమారు 48 లక్షల మంది ప్రయాణికులు వారి సొంత రాష్ట్రాలకు చేరారు.
ఈ 3543 రైళ్ళు వివిధ రాష్ట్రాల నుండి బయలుదేరాయి. ఎక్కువ సంఖ్యలో రైళ్ళు బయలుదేరిన మొదటి ఐదు రాష్ట్రాలు / కేంద్రపాలిత రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ (946 రైళ్ళు), మహారాష్ట్ర (677 రైళ్ళు), పంజాబ్ (377 రైళ్ళు), ఉత్తరప్రదేశ్ (243 రైళ్ళు) మరియు బీహార్ (215 రైళ్ళు) .
ఈ "శ్రామిక్ ప్రత్యేక" రైళ్ళు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఎక్కువ సంఖ్యలో రైళ్ళు చేరుకున్న మొదటి ఐదు రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ (1392 రైళ్ళు), బీహార్ (1123 రైళ్ళు), ఝార్ఖండ్ (156 రైళ్ళు), మధ్యప్రదేశ్ (119 రైళ్ళు), ఒడిశా (123 రైళ్ళు).
ఈ రైళ్లలో ప్రయాణించే వలసదారులకు ఐ.ఆర్.సి.టి.సి. 78 లక్షలకు పైగా ఉచిత భోజనాలతో పాటు ఒకకోటీ పది లక్షలకు పైగా మంచి నీళ్ల సీసాలను పంపిణీ చేసింది.
ఈ రోజు నడుస్తున్న రైళ్లు ఎలాంటి రద్దీని ఎదుర్కోవటం లేదని తెలిసింది.
శ్రామిక్ ప్రత్యేక రైళ్ళతో పాటు, మే 12వ తేదీ నుండి న్యూఢిల్లీని కలుపుతూ 15 జతల ప్రత్యేక రైళ్ళను రైల్వేశాఖ నడుపుతోంది. జూన్ 1వ తేదీ నుండి టైం టేబుల్ లో పేర్కొన్న మరో 200 రైళ్ళను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
***
(Release ID: 1627346)
Visitor Counter : 285