PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 22 MAY 2020 6:49PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్‌-19 నయమైనవారు 48,553మంది; మొత్తం 1,18,447మంది రోగుల్లో కోలుకున్నవారి శాతం 40.98
 • దేశవ్యాప్తంగా నిన్నటినుంచి నమోదైన కేసుల సంఖ్య 6,088.
 • మా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయండి: రాష్ట్రాలకు దేశీయాంగ శాఖ సూచన
 • ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరో 9 అదనపు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ; వడ్డీ రేట్లలో కోత
 • దేశంలోని 16.8 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు 2020 ఏప్రిల్‌ 1 నుంచి మే 21దాకా రూ.26,242 కోట్లు వాపసు చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు
 • రైలు ప్రయాణ టికెట్ల రిజర్వేషన్‌ కోసం దశలవారీగా కౌంటర్లు తెరవనున్న రైల్వేశాఖ
 • పైప్‌లైన్‌ ప్రాజెక్టులలో స్వయం సమృద్ధ భారతం పునాదికావాలి: పెట్రోలియం శాఖ మంత్రి

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునేవారి శాతం మెరుగుపడి 40.98కి చేరిక

దేశంలో నిన్నటినుంచి నమోదైన కోవిడ్‌-19 కొత్త కేసుల సంఖ్య 6,088; దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,447కు చేరగా ప్రస్తుతం వీరిలో 66,330మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇక ఇప్పటిదాకా 48,533 మందికి వ్యాధి నయమైంది. వీరిలో గడచిన 24గంటల్లో  కోలుకున్నవారు 3,234మంది కాగా, కోలుకుంటున్నవారి శాతం 40.98కి పెరిగింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625794

దేశవ్యాప్తంగా పలుచోట్ల దేశీయాంగ శాఖ మార్గదర్శకాల ఉల్లంఘనపై సమాచారం

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలనూ కఠినంగా అమలుచేయడం తప్పనిసరి. కానీ, దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ (MHA) జారీచేసిన మార్గదర్శకాలను దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉల్లంఘించినట్లు సమాచారం అందింది. దీంతో తామిచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ దేశీయాంగ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలకు లేఖ రాసింది. అలాగే ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధికార సంస్థలు కూడా వీటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625917

కోవిడ్‌-19 సంబంధిత వీసా, ప్రయాణ ఆంక్షలను సడలించిన దేశీయాంగ శాఖ; విదేశాల్లో చిక్కుకున్న కొన్నివర్గాల ఓసీఐ కార్డుదారులు స్వదేశం రాకకు అనుమతి

కోవిడ్‌-19 నేపథ్యంలో విధించిన వీసా, ప్రయాణ ఆంక్షలను దేశీయాంగ శాఖ సడలించింది. దీంతో విదేశాల్లో చిక్కుకున్న కొన్నివర్గాల విదేశాల్లోని భారత పౌరులు (OCI) కార్డుదారుల స్వదేశీ ఆగమనానికి వెసులుబాటు లభించింది. ఈ మేరకు- భారతీయ పౌరులకు జన్మించి, ఓసీఐ కార్డులున్న చిన్నపిల్లలు, కుటుంబంలో మరణం వంటి అత్యవసర పరిస్థితుల కారణంగా స్వదేశం రాదలచిన ఓసీఐ కార్డుదారులు; జీవిత భాగస్వాములలో ఒకరు ఓసీఐ కార్డుదారులై ఉండి, మరొకరు భారతీయులై స్వదేశంలో స్థిరనివాసంగల జంట; భారతీయ పౌరులైన తల్లిదండ్రులు స్వదేశంలో ఉండి, విశ్వవిద్యాలయ విద్యార్థులైన ఓసీఐ కార్డుదారులు (చట్టపరంగా మైనర్‌ కానివారు) స్వదేశం వచ్చే వీలుంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625917

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అదనంగా మరో 9 చర్యలు ప్రకటించిన రిజర్వుబ్యాంకు; వడ్డీ రేట్ల తగ్గింపు

కోవిడ్‌-19 మహమ్మారి ఫలితంగా అనిశ్చితి, అలజడి తలెత్తిన సమయంలో దేశ ఆర్థిక సుస్థిరత పరిరక్షణ, సరళ ద్రవ్య ప్రవాహం దిశగా భారత రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో 9 అదనపు చర్యలను ప్రకటించారు. ఇందులో రెపోరేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు; సిడ్బికి మరో 90 రోజుల పునఃరుణ సదుపాయ విస్తరణ; స్వచ్ఛంద నిర్వహణ మార్గంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు నిబంధన సడలింపు; ఎగుమతిదారులు మరింత వ్యవధిదాకా బ్యాంకు రుణాలు వినియోగించుకునే అవకాశం; ఎగ్జిమ్‌ బ్యాంకు రుణ సౌకర్యం; దిగుమతులపై చెల్లింపుల కోసం దిగుమతిదారులకు మరింత వ్యవధి; నియంత్రణ చర్యలు మరో 3 నెలలు పొడిగింపు; నిర్వహణ మూలధనంపై వడ్డీని కాలవ్యవధి వడ్డీ రుణంగా మార్చుకునే సదుపాయం; కార్పొరేట్లకు ద్రవ్యలభ్యత దిశగా గ్రూప్‌ ఎక్స్‌పోజర్‌ పరిమితి పెంపు; రుణ విమోచన నిధినుంచి రాష్ట్రాలు మరింత రుణం పొందడానికి అనుమతివంటివి ఉన్నాయి. కాగా, 2020-21 రెండో అర్ధభాగం (H2)నుంచి వృద్ధి ప్రేరకాలలో కొంత వేగంతో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి ప్రతికూలతవైపే ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626254

పన్ను చెల్లింపుదారులకు 2020 ఏప్రిల్‌ 1 నుంచి రూ.26,242 కోట్లు వాపసు

దేశంలోని 16,84,298 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2020 ఏప్రిల్‌ 1నుంచి మే21దాకా రూ.26,242 కోట్లమేర పన్ను వాపసు చేసింది. ఇందులో 15,81,906 మంది చెల్లింపుదారులకు రూ.14,632 కోట్లు, కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదారులు 1,02,392 మందికి రూ.11,610 కోట్లు వంతున వాపసులు చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626254

రైలు ప్రయాణానికి స్టేషన్లలోని కౌంటర్లు, ఉమ్మడి సేవా కేంద్రాలు/ఏజెంట్ల ద్వారా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునేందుకు పచ్చజెండా ఊపిన రైల్వేశాఖ

రైలు ప్రయాణ టికెట్ల రిజర్వేషన్‌ కోసం బుకింగ్‌ కౌంటర్లను దశలవారీగా తెరవాలని భారత రైల్వేశాఖ నిర్ణయించింది. ఆ మేరకు స్థానిక పరిస్థితులకు తగురీతిలో రిజర్వేషన్‌ కౌంటర్లను తెరవడంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా జోనల్‌ రైల్వేలను ఆదేశించింది. తదనుగుణంగా స్థానిక పరిస్థితులు/అవసరాలకు తగినట్లుగా ఏయే ప్రాంతాల్లో, ఏయే సమయాల్లో ఇవి పనిచేసేదీ ప్రకటించడమేగాకా రేపటినుంచి దశలవారీగా కౌంటర్లు పునఃప్రారంభించనున్నారు. అదేవిధంగా ఉమ్మడి సేవా కేంద్రాలు/ఏజెంట్లద్వారా కూడా టికెట్ల రిజర్వేషన్‌కు రైల్వేశాఖ అనుమతించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625974

దేశవ్యాప్తంగా దళారుల కార్యకలాపాలను పసిగట్టేందుకు అప్రమత్తమైన ఆర్పీఎఫ్‌

రైల్వేశాఖ 2020 మే 12 నుంచి 15 జతల ఏసీ ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. దీంతోపాటు 2020 జూన్‌ 1 నుంచి 100 జతల అదనపు రైళ్లను కూడా నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దళారులు కొందరు బహుళ వ్యక్తిగత గుర్తింపుతో ఈ-టికెట్లను బుక్‌చేసి, ఈ రైళ్లలో బెర్తులను చేజిక్కించుకుంటున్నట్లు ఫిర్యాదులు జోరందుకున్నాయి. ఈ 100 జతల ప్రత్యేక రైళ్లకు నిన్నటినుంచే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రారంభమైనందువల్ల దళారుల కారణంగా సామాన్య ప్రయాణికులకు నిర్ధారిత టికెట్లు లభించని దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల దళారుల పని పట్టేందుకు రైల్వే రక్షక దళం (RPF) దేశవ్యాప్తంగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రయాణిక రిజర్వేషన్‌ వ్యవస్థ (PRS) గణాంకాలను PRABAL మాడ్యూల్‌సహా క్షేత్రస్థాయి నిఘా ద్వారా దళారులను గుర్తించి కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది.

మరిన్ని వివరాలకు... http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625915

పైప్‌లైన్‌ ప్రాజెక్టులకు స్వయం సమృద్ధ భారతం పునాదికావాలి: పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌

దేశవ్యాప్తంగా దాదాపు రూ.8000 కోట్లతో చమురు-గ్యాస్‌ కంపెనీలు చేపట్టిన వివిధ పైప్‌లైన్‌ నిర్మాణ పథకాల పనుల పురోగతిని కేంద్ర పెట్రోలియం-సహజవాయువు/ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం సమీక్షించారు. స్వయం సమృద్ధ భారతం లక్ష్యసాధన దిశగా ఈ పనులను పూర్తిస్థాయిలో స్వదేశీయం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626073

అంఫాన్‌ తుపాను నేపథ్యంలో స్థితిగతులపై ప్రధానమంత్రి ప్రసంగం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626042

జీవవైవిధ్య పరిరక్షణలో మిగిలిన ప్రపంచంతో కలసి ఉత్తమాచరణలను, అనుభవాలను భారత్‌ పంచుకుంటుంది: కేంద్ర పర్యావరణశాఖ మంత్రి

అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ దినోత్సవం-2020 నేపథ్యంలో జీవవైవిధ్య పరిరక్షణ దిశగా కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ శాఖల మంత్రి శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌ ఐదు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఏడాది ఇతివృత్తం “మన పరిష్కారాలు ప్రకృతిలో భాగం” గురించి ఈ సందర్భంగా శ్రీ జావడేకర్‌ నొక్కిచెప్పారు. ఆ మేరకు మన చుట్టూగల ప్రకృతిని రక్షించుకోవడం చాలా ముఖ్యమన్నారు. ప్రత్యేకించి ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో ఈ పెనువిపత్తు నుంచి పశుసంబంధ వ్యాధుల నుంచి రక్షించేది ప్రకృతేనని ఆయన స్పష్టం చేశారు. మన వినియోగాన్ని పరిమితం చేసుకుంటూ సుస్థిర జీవనశైలిని అలవరచుకోవాల్సిన అవసరాన్ని పర్యావరణ శాఖ మంత్రి నొక్కిచెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626124

రాష్ట్రాలన్నీ లబ్ధిదారులకు ఆహారధాన్యాల పంపిణీ సాగేలా చూడాలి; ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదు: శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌

కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆహార-ప్రజా పంపిణీ శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదల్లో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా అందరికీ ఆహారధాన్యాలు అందేవిధంగా చూడాలని శ్రీ పాశ్వాన్‌ సూచించారు. ‘అంఫాన్‌’ తుఫానుతో ప్రభావితమైన పశ్చిమబెంగాల్‌, ఒడిసావంటి రాష్ట్రాలు తుఫాను బాధిత ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో ఆహారధాన్యాలు, పప్పుదినుసుల సరఫరాద్వారా భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ దేశానికి జీవదాతగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆహారధాన్యాలు, పప్పుదినుసుల పంపిణీపై మంత్రి సమీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626109

ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు అధ్యక్షుడుగా డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఎన్నిక

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ 2020-21 సంవత్సరానికిగాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన ఎన్నిక నేపథ్యంలో డాక్టర్‌ హర్షవర్ధన్‌ మాట్లాడుతూ- ప్రపంచమంతటా కోవిడ్‌-19తో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళి అర్పించారు. అలాగే కోవిడ్‌-19పై ముందువరుసన నిలిచి పోరాడుతున్న యోధుల దీక్ష, అంకితభావాలకు కరతాళధ్వనులతో కృతజ్ఞతలు తెలపాల్సిందిగా సమావేశానికి హాజరైన ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాలకు... http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626229

ఉన్నత విద్యాసంస్థలకు ఆర్థిక స్వావలంబన కీలకం: శ్రీ నితిన్‌ గడ్కరీ

దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఆర్థిక స్వావలంబన కీలకమని శ్రీ నితిన్‌ గడ్కరీ అన్నారు. అయితే, ఈ సంస్థలు నాణ్యతతో రాజీపడకుండా నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలో ఉన్నతవిద్య భవితపై ఎంఐటీ-ఏడీటీ (MIT-ADT) విశ్వవిద్యాలయ ప్రతినిధులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో భాగంగా వారినుద్దేశించి ఆయన ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల ఉన్నతీకరణ అవసరమని, దాంతోపాటు విలువలతో కూడిన విద్య సమాజాన్ని శక్తిమంతం చేస్తుందని పేర్కొన్నారు. యువతరం తమ బలాబలాలను, తమకు ఎదురయ్యే సమస్యలను అవగతం చేసుకుని వాటిని అవకాశాలుగా మలచుకునేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత దశలో యువతరం సామర్థ్య వికాసం దేశానికి ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625921

జమ్ముకశ్మీర్‌లో కరోనా నమూనాల పరీక్ష ప్రక్రియను వేగిరంచేసే చర్యలపై కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చర్చ

జమ్ముకశ్మీర్‌లో కరోనా నమూనాల పరీక్షల ప్రక్రియను వేగిరపరచే చర్యలపై ఆరోగ్యశాఖ సీనియర్‌ అధికారులు, ప్రభుత్వ వైద్య కళాశాలల/స్కిమ్స్‌(SKIMS)లోని వివిధ విభాగాల అధిపతులు, సభ్యులతో కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ గంటన్నరపాటు చర్చించారు. కరోనా నమూనాల పరీక్షలు నిర్ణీత వ్యవధిలో పూర్తికావాలన్న ప్రజల డిమాండ్‌మేరకు స్పందించాలని ఈ సందర్భంగా వారిని కోరారు. నమూనాలపై పరీక్ష ఫలితాలు ప్రకటించడంలో అనవసర జాప్యం, అసౌకర్యానికి తావుండరాదని నొక్కిచెప్పారు. అలాగే తమ పేరు, మొబైల్‌ నంబరు వగైరా వివరాలను నింపడంలో ప్రజలు కూడా కచ్చితమైన వివరాలు పొందుపరచేలా చూడాలని సూచించారు. తద్వారా వివరాలు సరిపోలని కారణంగా నివేదికలు ఆలస్యమయ్యే పరిస్థితి తప్పుతుందని మంత్రి వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625921

భారత ఔషధ, వైద్యపరికరాల పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్‌ కంపెనీలకు ఆహ్వానం

కోవిడ్‌-19 అనంతర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌-జపాన్‌ల మధ్య వ్యాపార-వాణిజ్య సమ్మేళనం లక్ష్యంగా “చాలెంజెస్‌ అండ్‌ ఎమర్జింగ్‌ ఆపర్చునిటీస్‌” ఇతివృత్తంగా ‘వైద్య పరికరాలు-ఏపీఐ రంగం’పై 2020 మే 22న ఒక వెబినార్‌ నిర్వహించబడింది. కేంద్ర ఔషధాలు-రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖ సహకారంతో టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ఈ వెబినార్‌ను నిర్వహించింది.

మరిన్ని వివరాలకు... http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626234

కోవిడ్‌-19 వైరస్‌ను కనుగొనేందుకు రూపొందించిన ఆర్‌ఎన్‌ఏ సేకరణ కిట్‌ ‘అగప్పే చిత్ర మాగ్నా’ వాణిజ్యీకరణ ప్రారంభం

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంతోపాటు వ్యాధిపీడితులకు సముచిత వైద్య సహాయం అందించడంలో కరోనా వైరస్‌ను త్వరగా, కచ్చితంగా గుర్తించగల చవకైన ప్రక్రియ కీలకమన్నది వాస్తవం. ఆ మేరకు SCTIMSTలోని సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్ అనూప్‌ కుమార్‌ తెక్కువీట్టిల్‌ నేతృత్వంలో పరిశోధకుల బృందం వినూత్న ‘చిత్రా మాగ్నా RNA సేకరణ కిట్‌’ను రూపొందించింది. ఈ పరిజ్ఞానాన్ని 2020 ఏప్రిల్‌లోనే ‘అగప్పే డయాగ్నాస్టిక్స్’ సంస్థకు బదిలీచేసిన నేపథ్యంలో ప్రస్తుతం ‘అగప్పే చిత్ర మాగ్నా ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్‌ కిట్‌’ పేరిట ఇది వాణిజ్యసరళిలో మార్కెట్‌ ప్రవేశం చేసింది. కోవిడ్‌-19 ఆర్‌ఎన్‌ఏను వేరుపరచేందుకు ఉద్దేశించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఈ ఉత్పత్తిని స్వయంగా పరీక్షించి ధ్రువీకరణ పత్రం జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625978

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • మహారాష్ట్ర: రాష్ట్రంలో 2,345 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 41,642కు చేరింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 28,454 యాక్టివ్‌ కేసులు ఉండగా 11,726మంది కోలుకున్నారు. కొత్త కేసులలో హాట్ స్పాట్ ముంబైకి చెందినవే 1382 ఉన్నాయి. దీంతో నగరంలోని మొత్తం కేసులు 25,500కు చేరాయి. కాగా, రాష్ట్రంలోని ప్రైవేటు, ధార్మిక సంస్థల ఆసుపత్రులలో కోవిడ్‌-19 చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం మూడు స్లాబ్‌లను నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో 80 శాతం పడకల రేట్లను నియంత్రించాలని నిర్ణయించింది. ప్రైవేటు, ధార్మిక సంస్థల ఆసుపత్రులలో ఐసోలేషన్, నాన్-ఐసోలేషన్ పడకలకు ఈ ఫీజు నియంత్రణ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలలో స్పష్టం చేసింది.
 • గుజరాత్: రాష్ట్రంలో 371 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 12,910కి, మరోవైపు మరణాల సంఖ్య 773కు పెరిగాయి. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 9,449గా ఉంది. దీంతో జాతీయ స్థాయిలో ఈ నగరం ముంబై తర్వాత రెండోస్థానంలో నిలిచింది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 2 గంటలవేళకు 150 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 6,377కు చేరింది. మొత్తం 3562మంది కోలుకోగా, వారిలో 3187 మంది రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులనుంచి ఇళ్లకు వెళ్లారు. ఇక రాష్ట్రంలో రెండు నెలల తర్వాత ఎంపిక చేసిన 55 మార్గాల్లో రాజస్థాన్ రోడ్‌వేస్‌ బస్సులు రేపటినుంచి నడవనున్నాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కొత్త కేసులు 248; మొత్తం కేసుల సంఖ్య 5,981; ఈ కొత్త కేసుల్లో 59 హాట్‌స్పాట్ నగరం ఇండోర్‌లో నమోదైనవి కాగా, 61 ఉజ్జయినిలో నమోదయ్యాయి. కాగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్ 1నుంచి 35.45 లక్షలకుపైగా కార్మికులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించగా వారిలో 42.2 శాతం మహిళలున్నారు.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 17 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 132కు చేరింది. దిగ్బంధం నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు ప్రస్తుతం రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. వీరందరూ వివిధ జిల్లాల పరిధిలోని పంచాయతీలలో ఏర్పాటు చేసిన నిర్బంధవైద్య కేంద్రాల్లో 14 పర్యవేక్షణలో ఉండాలి.
 • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని నియంత్రణ జోన్లలోగల ప్రజలకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల నిరుపేదలు, అనాథలు, అన్నార్తులకు 69,088 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. ఇక నగరంలోని 2,94,592 మంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు.
 • పంజాబ్: కరోనా వైరస్‌పై పోరులో తదుపరి దశకు సిద్ధమవుతున్న పంజాబ్ ప్రభుత్వం దాదాపు 22000మంది ఉద్యోగులను ‘ఐగోట్’ వేదికపై నిర్దిష్ట కర్తవ్య శిక్షణ విభాగాలతో అనుసంధానించారు. ఈ ఆన్‌లైన్ శిక్షణ మాడ్యూల్‌లో నమోదు, కోర్సుల లభ్యతపై వివరాలుసహా సంబంధిత సూచనలను రాష్ట్రంలోని అన్ని విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు- బోర్డులుసహా కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లకు ప్రభుత్వం పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన https://igot.gov.in/igot/వేదికద్వారా ‘నిర్దిష్ట కర్తవ్య శిక్షణ’ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆదేశాలు ఉన్నాయి.
 • హర్యానా: రాష్ట్రంలోని 82 బాల సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 2,375 మంది పిల్లలకు కోవిడ్‌-19 మహమ్మారిపై అవగాహన కల్పించి, వారిని నిర్మాణాత్మక కార్యకలాపాల్లో నిమగ్నం చేయాలని రాష్ట్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా “సేఫ్ రహోనా-ఫైట్ కరోనా పేరిట వివిధ ఆన్‌లైన్ పోటీలు నిర్వహించనుంది. మరోవైపు కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం దిశగా సామాజిక దూరం నిబంధనల అనుసరణ, మాస్కు ధరించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో తరచూ శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి చర్యలను స్వయంగా పాటించడంతోపాటు ఇవన్నీ పాటించేలా పిల్లలను ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్ని జిల్లాల బాలల సంరక్షణ కేంద్రాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 • కేరళ: కోవిడ్‌ బాధిత రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారికి వ్యాధి నిర్ధారణ అవుతుండటంతో కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో కోవిడ్-19 పరిశీలనలో ఉన్నవారికి సంబంధించి పర్యవేక్షణ వ్యవస్థలను కఠినం చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. అలాగే దేశీయ విమానాలలో వచ్చేవారిని కూడా 14 రోజులపాటు నిర్బంధవైద్య కేంద్రాల్లో ఉంచుతామని ప్రకటించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గృహనిర్బంధం, సామాజిక దూరం నిబంధనల ఉల్లంఘన విస్తృతంగా చోటుచేసుకోవడంతో పోలీసులు కఠినచర్యలకు సిద్ధమయ్యారు. కాయంకుళం వాసి ఒకరు హైదరాబాద్‌లో మరణించిన నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరై తిరిగివచ్చినవారికి ఐదుగురు కేరళీయులకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, గల్ఫ్ నుంచి ఇవాళ 3 విమానాలు రానున్నాయి. నిన్న రాష్ట్రంలో ఒక మరణం సంభవించగా, 24 కొత్త కేసులు నమోదయ్యాయి.
 • తమిళనాడు-పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మరో ఇద్దరు మహిళలకు వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 19కి పెరిగాయి. ఇక చెన్నైతోపాటు నియంత్రణ జోన్లు మినహా రాష్ట్రమంతటా మే 23 నుంచి ఆటో-రిక్షాలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ మహమ్మరి ప్రభావంతో ప్రభుత్వ రాబడి భారీగా పతనమైన నేపథ్యంలో ప్రభుత్వం భారీస్థాయిలో పొదుపు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 776 కొత్త కేసులతో నిన్న మొత్తం కేసుల సంఖ్య 13,967కు చేరింది. వీటిలో యాక్టివ్: 7588, మరణాలు: 94, డిశ్చార్జ్: 6282, చెన్నైలో యాక్టివ్ కేసుల సంఖ్య 5681గా ఉంది.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 105 కొత్త కేసుల నమోదుతోపాటు 17మంది  కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1710కి పెరిగిన నేపథ్యంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1080గా ఉండగా,  కోలుకున్న వారి సంఖ్య 588కి చేరింది. మరోవైపు ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 41గా నమోదంది. ఇక 2020 జూన్ 25నుంచి 10వ తరగతి (ఎస్‌ఎస్‌ఎల్‌సి) పరీక్షలు ప్రారంభం కానుండగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి- అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 • ఆంధ్రప్రదేశ్: వందే భారత్ మిషన్ కింద కువైట్ నుంచి ఒక శిశువుసహా 148మంది ఇవాళ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. జూన్ 1నుంచి రైళ్లు పునరుద్ధరించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో టికెట్ల జారీకోసం 44 ఆన్‌లైన్ రిజర్వేషన్ కేంద్రాలను దక్షణిమధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఎంఎంస్‌ఎంఈల పునఃప్రారంభ ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిశ్రమలకు రూ.1110 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 62 కొత్త కేసులతోపాటు ఒక మరణం నమోదుకాగా,  51 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకుర వెళ్లారు. మొత్తం కేసులు: 2514. యాక్టివ్: 728, రికవరీ: 1731, మరణాలు: 55. ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వచ్చినవారిలో 153 మందికి పాజిటివ్ ఫలితం రాగా, 128 యాక్టివ్‌ కేసులున్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలోని వరంగల్ నగర సమీపంలోని ఒక బావిలో 8మంది వలసదారులుసహా 9 మృతదేహాల శుక్రవారం లభ్యమయ్యాయి. మృతులలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కుటుంబంలోని ఆరుగురు సభ్యులు, బీహార్‌వాసులైన ఇద్దరు కార్మికులతోపాటు స్థానికుడొకరు కూడా ఉన్నారు. కాగా, తమను సొంత రాష్ట్రాలకు పంపాలని కోరుతూ 3 లక్షల మందికిపైగా వలస కార్మికులు తెలంగాణ పోలీసులకు, సంబంధిత ఇతర అధికారులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఇక రాష్ట్రంలో మే 22నాటికి మొత్తం కేసులు 1699 కాగా, నిన్నటివరకూ రోగ నిర్ధారణ అయిన వలసదారుల సంఖ్య 99కి చేరింది.
 • అరుణాచల్ ప్రదేశ్; రాష్ట్రంలో 2020 ఏప్రిల్ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తం 44209 ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేసింది. కాగా, రాష్ట్రానికి తిరిగివస్తున్నవారిని నిర్దేశిత తనిఖీ కేంద్రాల నుంచి నిర్బంధవైద్య కేంద్రాలకు తరలిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను కోవిడ్‌ ముందువరుస యోధులుగా పరిగణిస్తున్నట్లు అరుణాచల్‌ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది.
 • అసోం: రాష్ట్రంలోని తేజ్‌పూర్ నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రంలోగల ఆరుగురికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 222కి పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
 • మణిపూర్: ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగివచ్చినవారిలో మరొక వ్యక్తికి ఇవాళ కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 24కు చేరింది. కాగా, పరీక్షల ప్రక్రియను వేగవంతం చేసేదిశగా నిర్బంధవైద్య కేంద్రాల్లోగల వారినుంచి నమూనాల సేకరణను ప్రారంభించింది. తద్వారా జిల్లా ఆసుపత్రిలోగల ఏకైక నమూనా సేకరణ కియోస్క్‌పై ఆధారపడకుండా మణిపూర్ రాష్ట్ర ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంది.
 • మిజోరం: రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యతిరేక పోరాటం కోసం వివిధ వస్తుసామగ్రి, ఇతర పరికరాలు ఇవాళ ఐజాల్‌లోని లెంగ్‌పుయి విమానాశ్రయానికి విమానంలో వచ్చాయి.
 • నాగాలాండ్: దిగ్బంధంవల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న నాగాలాండ్‌వాసులలో 100మంది రాష్ట్రానికి తిరిగివచ్చారు; వీరందర్నీ నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలకు తరలించారు. కాగా, తిరిగివచ్చిన రాష్ట్రవాసులకు హృదయపూర్వక స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్ర ప్రణాళికశాఖ మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో వారిని అడ్డుకుంటే శిక్షార్హ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించారు.
 • సిక్కిం: కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు (సీబీఎస్‌ఈ) 2020 జూలై 1 నుంచి మిగిలిన 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రం వెలుపల చదువుతున్న విద్యార్థుల కోసం సిక్కింలోనే పరీక్షలు నిర్వహించడంపై రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న 3000 మంది సిక్కింవాసులు మరో 3 లేదా 4 రోజుల్లో రాష్ట్రానికి వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో వారికోసం ఆరోగ్య తనిఖీ, నిర్బంధవైద్య పర్యవేక్షణ సౌకర్యాలను రాష్ట్ర అధికారులు తగురీతిలో పెంచారు.

 

PIB FACTCHECK

 

********(Release ID: 1626263) Visitor Counter : 49