సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్ము కశ్మీర్‌లో కరోనా నమూనా పరీక్షా విధానాన్ని వేగవంతం చేసే చర్యలపై చర్చించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


కోవిడ్ నిర్వహణలో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉన్న జమ్ము కశ్మీర్ : డాక్టర్ సింగ్

Posted On: 21 MAY 2020 7:04PM by PIB Hyderabad

కరోనా నమూనా పరీక్ష నిర్దిష్ట సమయంలో పూర్తి కావాలన్న ప్రజా డిమాండ్‌కు స్పందించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ఆలస్యం, అసౌకర్యం ఉండదనే భరోసా ను  ప్రజలకు ఇవ్వవలసిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు. జమ్ము కశ్మీర్ వైద్య శాఖ సీనియర్ అధికారులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, స్కిమ్స్ విభాగాధిపతులు, అధ్యాపకులతో దాదాపు గంటన్నర సేపు కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ప్రజలు కూడా పేరు, మొబైల్ నెంబర్, ఇతర కచ్చితమైన వివరాలు తమకిచ్చే పత్రాల్లో నింపాలని పిలుపు ఇచ్చారు. సమాచార లోపం వల్ల రిపోర్టులు జాప్యం జరగకూడదని డాక్టర్ జితేంద్ర సింగ్  స్పష్టం చేశారు. 

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, ఫైనాన్షియల్ కమిషనర్ (హెల్త్) అటల్ దుల్లూ గుర్థించిన పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న అనేక పరీక్షల ప్రస్తుత స్థితి గురించి చెబుతూ రాబోయే రోజుల్లో పరీక్షల సంఖ్య అంచనాలను వివరించారు. రోజుకు సుమారు 100 నమూనాలతో ప్రారంభమై, ఇప్పుడు నమూనాల సంఖ్య రోజుకు అనేక వేలకు చేరుకుందని ఆయన చెప్పారు.
నిన్నటి నుండి ఐసిఎంఆర్ యాప్ ప్రవేశపెట్టడంతో, నమూనా పరీక్ష నివేదికను స్వీకరించడానికి సుమారు మూడు రోజుల కాలపరిమితిని కొనసాగించవచ్చని అటల్ దుల్లూ తెలియజేశారు. కేంద్రం  క్రియాశీల మద్దతుతో, ఇప్పుడు పిపిఇ కిట్లు, ఎన్ -95 ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లకు కొరత లేదని ఆయన అన్నారు.

 

 

డాక్టర్ జితేంద్ర సింగ్ క్వారంటైన్ గురించి సమీక్షిస్తూ ఈ సందర్బంగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా స్థానిక అధికారులు చూడాలని సూచించారు. క్వారంటైన్, కరోనా నిర్వహణకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజలతో తరచూ సంభాషించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆరోగ్య అధికారులను, వైద్య సిబ్బందిని అభినందిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము కశ్మీర్ అనేక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పనిచేస్తుందని, గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు.  స్కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అయ్యంగార్, ప్రభుత్వ వైద్య కళాశాల శ్రీనగర్  ప్రిన్సిపాల్  డాక్టర్ సమియా, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్‌సి డింగ్రా, ఆరోగ్య శాఖ డైరెక్టర్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

                                                               <><><><>



(Release ID: 1625921) Visitor Counter : 167