రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వే టిక్కెట్ల బ్లాక్‌ మార్కెట్‌ వ్యవహారాలను గుర్తించి చర్యలు తీసుకునే డ్రైవ్‌ ప్రారంభం

దేశవ్యాప్తంగా 20.05.2020న డ్రైవ్‌ ప్రారంభించిన ఆర్‌పీఎఫ్‌
8 మంది ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు సహా 14 మంది దళారుల అరెస్టు
రూ.6,36,727 విలువైన రైల్వే టిక్కెట్లు స్వాధీనం

Posted On: 21 MAY 2020 7:38PM by PIB Hyderabad

    మే 12, 2020న భారతీయ రైల్వే 30 ఏసీ స్పెషల్‌ రైలు సర్వీసులను ప్రారంభించింది. మరో 200 సర్వీసులను జూన్‌ 1, 2020 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్లలో దళారుల ఆగడాలపై రైల్వే శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భారీ సంఖ్యలో వ్యక్తిగత ఐడీలను ఉపయోగించి ఈ రైళ్లలో బెర్తులను బ్లాక్‌ చేస్తున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే శాఖ జూన్‌ 1 నుంచి ప్రారంభిస్తామన్న 200 రైలు సర్వీసులకు సంబంధించి 21 మే 2020 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ రైళ్లలోనూ రిజర్వేషన్‌ బెర్తులను దళారులు సామాన్యులకు అందకుండా చేస్తున్నారని కూడా తేలింది.

    దీనిని దృష్టిలో పెట్టుకుని, రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) రంగంలోకి దిగింది. టిక్కెట్ల బ్లాక్‌ మార్కెట్‌, దళారులను గుర్తించి చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. క్షేత్రస్థాయి నిఘా సమాచారంతో కలిపి ప్రబల్‌ మాడ్యూల్‌ ద్వారా వచ్చిన పీఆర్‌ఎస్‌ డేటా విశ్లేషణను వినియోగించుకుంటూ, దళారులను గుర్తించి కేసులు నమోదు చేస్తోంది.

    దేశ తూర్పు ప్రాంతంలో అంఫన్‌ పెను తుపాను ప్రభావం చూపిస్తున్నా, 20.05.2020న ఆర్‌పీఎఫ్‌ తన డ్రైవ్‌ను ప్రారంభించింది. 8 మంది ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు సహా 14 మంది దళారుల అరెస్టు చేసి, ఇంకా ప్రయాణం ప్రారంభం కాని రూ.6,36,727 విలువైన టిక్కెట్లను స్వాధీనం చేసుకుంది.

    ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు వివిధ వ్యక్తిగత ఐడీలు ఉపయోగించి టిక్కెట్లను బ్లాక్‌ చేసి, తర్వాత వాటిని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టే చర్యలు ప్రారంభమయ్యాయి. దొరికిన దళారుల్లో ఓ వ్యక్తి 'సూపర్‌ తత్కాల్‌ ప్రో' అనే సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నాడు. దీని ద్వారా టిక్కెట్లు రిజర్వ్‌ చేసే సమయంలో ప్రయాణీకుల వివరాలను ఆ సాఫ్ట్‌వేర్‌ క్షణాల్లో ఆటోమేటిక్‌గా నింపేస్తుంది. దీనిద్వారా సెకన్ల వ్యవధిలోనే పెద్దమొత్తంలో టిక్కెట్లు బుక్‌ చేసి బ్లాక్‌ చేస్తున్నాడు. 



(Release ID: 1625915) Visitor Counter : 224