శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19ను గుర్తించేందుకు ఆర్.ఎన్.ఎను వెలికితీసే , అగప్పె చిత్ర మాగ్నా కిట్ వాణిజ్యపరంగా ఆవిష్కరణ
అగప్పె చిత్ర మాగ్నా అనేది కోవిడ్ పరీక్షల సమయంలో ఉపయోగించే మాగ్నటిక్ నానో పార్టికల్ ఆధారిత ఆర్.ఎన్.ఎను వెలికితీసే కిట్
Posted On:
21 MAY 2020 7:59PM by PIB Hyderabad
కోవిడ్ -19 వైరస్‌ను గుర్తించేందుకు జరిపే పరీక్షల సమయంలో ఉపయోగపడే మాగ్నటిక్ నానో పార్టికల్ ఆధారిత ఆర్.ఎన్.ఎ వెలికితీసే కిట్- అగప్పే చిత్ర మాగ్నాను ఈరోజు వాణిజ్యపరంగా ఆవిష్కరిస్తున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు, శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ (ఎస్‌సిటిఐఎంఎస్‌టి) బోర్డు అధ్యక్షుడు డాక్టర్ వి.కె.సారస్వత్ ప్రకటించారు. డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, ఎస్‌సిటిఐఎంఎస్‌టి డైరక్టర్ డాక్టర్ ఆశా కిశోర్, ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బయోమెడికల్ టెక్నాలజీ అధిపతి డాక్టర్ హెచ్.కె. వర్మ, ఇన్‌స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు హాజరైన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో దీనిని ఆవిష్కరిస్తున్నట్టు డాక్టర్ వి.కె.సారస్వత్ ప్రకటించారు.
ఆర్.ఎన్.ఎను వెలికితీసే కిట్‌ను డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి (డిఎస్‌టి) చెందిన త్రివేండ్రంలోని జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ (ఎస్‌సిటిఐఎంఎస్‌టి) సంస్థ ,కొచ్చిన్ లోని ఇన్‌విట్రో డయాగ్నస్టిక్ తయారీ కంపెనీ అగప్పే డయాగ్నస్టిక్స్ లిమిటెడ్ తో కలిసి అభివృద్ధి చేసింది.
“ ఈ కిట్‌ను వాణిజ్యపరంగా ఆవిష్కరించడం అంటే కోవిడ్ -19ను గుర్తించడంలో భారతదేశం స్వావలంబన సాధించే దిశగా గొప్పముందడుగుగా భావించవచ్చు. ఇది టెస్టింగ్ రేటును పెంచడానికి ఉపకరించడంతోపాటు పరీక్షల ఖర్చు బాగా తగ్గిస్తుంది. ఇది కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సత్వరం వాణిజ్యపరంగా వినియోగం లోకితేవడం, దానిఅమలుకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆ దిశగా ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది” అని కిట్ ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ సారస్వత్ అన్నారు.
“పరిశోధన, అభివృద్ది అనేది కేవలం జ్ఞానసృష్టిగా కాక విలువను పెంచేదిశగా పరివర్తన చెందడం వల్ల అది పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు , బలమైన సాధికారత కలిగిన పరిశోధన , అభివృద్దికి దోహదపడుతోంది. అధ్యయన సంస్థలు,జాతీయ ప్రయోగశాలలు , పరిశ్రమల కృషిని సమన్వయం చేయడం ప్రస్తుత పరిస్థితులలో అత్యంత అవసరం. ఈ సమన్వయం సంపూర్ణంగా ప్రతిఫలించినప్పుడు సాంకేతికంగా, ఆర్థికంగా బలమైన దేశంగా భారతదేశం అవతరిస్తుంది” అని సారస్వత్ అన్నారు
ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ,“ ఒక అత్యవసర అవసరాన్ని తీర్చేందుకు, పరిశ్రమ వర్గాలు, శాస్త్రవేత్తలు సాగించిన సమష్టి కృషికి ఇదొక ఉదాహరణ గా నిలుస్తుంది. ఆర్ ఎన్ ఎ ను అయస్కాంత నానోపార్టికల్స్‌తో కలపడం , అయస్కాంత క్షేత్రాన్ని వర్తింపజేయడం ద్వారా ఒకే చోట వాటిని కేంద్రీకరింపచేసేలా చేయడం ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇది ఎస్‌సిటిఐఎం ఎస్‌టి నుంచి ఆర్‌టి-ల్యాంప్ పరీక్ష కచ్చితత్వాన్ని పెంచింది. మొదటి నుంచీ, వివిధ విభాగాల విస్తృత ఆలొచనలు, పరిశ్రమ వర్గాల చేయూత కారణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్ళడానికి వీలుపడింది. ఈ ఉత్పత్తి ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా ఎంతో ఉపయోగపడుతుంది.” అని ఆయన అన్నారు
ప్రస్తుతం దేశ అవసరానికి అనుగుణంగా ఒక అద్భుత పరిష్కారంతో ముందుకు వచ్చిన శ్రీ చిత్ర,అగప్పె డయాగ్నస్టిక్స్ సంస్థల మొత్తం బృందాన్ని డాక్టర్ సారస్వత్, ప్రొఫెసర్ శర్మ లు అభినందించారు.
ఎస్‌సిటిఐఎంఎస్‌టి డైరక్టర్ డాక్టర్ ఆశా కిషోర్ మాట్లాడుతూ, “ దేశీయ వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన ఆశయం. దీనితోపాటు ఇన్ విట్రో డయాగ్నస్టిక్స్, పాయింట్ ఆఫ్ కేర్, వైద్య పరికరాల అభివృద్ధి వంటివి ఇటీవల మేం అడుగుపెట్టిన రంగాలు. మాలిక్యులార్ మెడిసిన్ డివిజన్ అధిపతి,సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అనూప్ కుమార్ ఇలాంటి డయాగ్నస్టిక్ ప్లాట్‌ఫారమ్‌లపై కృషి చేస్తున్నారు. ఫలితంగా మాగ్నటిక్ నానో టెక్నాలజీ ఆధారిత ఆర్ ఎన్ ఎ వెలికితీసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇది దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అలాగే చౌకగా కోవిడ్ -19 ను గుర్తించే పరీక్షలు నిర్వహించడానికి ఉపకరిస్తుంది ” అని ఆయన అన్నారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎస్‌సిటిఐఎంఎస్‌టి , అగప్పె డయాగ్నస్టిక్స్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌సిటిఐఎం ఎస్‌టి బయోమెడికల్ టెక్నాలజీ విభాగం వద్ద ఏర్పాటు చేసింది.ఆ వెంటనే తొలి ప్రాడక్ట్ ను అగప్పే డయాగ్నస్టిక్స్ మేనేజింగ్ డైరక్టర్ థామస్ జాన్ , కోచిలోని అమృతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు విక్రయించారు.
కోవిడ్ -19 వైరస్‌ను గుర్తించడానికి తక్కువ ఖర్చుతో , మరింత ఖచ్చితత్వంతో , సత్వర పరీక్షలు నిర్వహించడం అనేది కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో , వైరస్ బారిన పడిన వారికి అవసరమైన సహాయం అందించడంలో ఎంతో కీలకమైనది. ఆర్.ఎన్.ఎ ను వెలికితీసే వినూత్న కిట్ అయిన చిత్ర మాగ్నాను ఎస్‌సిటిఐఎం ఎస్‌టి సంస్జ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అనూప్ కుమార్ తెక్కువీత్తిల్ నాయకత్వంలో రూపొందించింది .దీనిని అగప్పే డయాగ్నస్టిక్స్‌కు 2020 ఏప్రిల్ న బదిలీ చేసింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో అగప్పె చిత్ర మాగ్నా ఆర్.ఎన్.ఎ ఐసొలేషన్ కిట్‌గా లభ్యమౌతున్నది.
ఈ ఉత్పత్తిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ, కోవిడ్ -19 ఆర్.ఎన్.ఏ ఐసొలేషన్ కు పరీక్షించి నిర్ధారించింది. ఈ కిట్ ను వాణిజ్యపరంగా వాడేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) తన అనుమతి మంజూరు చేసింది. ఈ కిట్‌ను సార్స్-సిఒవి2 ను గుర్తించేందుకు ఆర్‌టి-ల్యాంప్, ఆరటి-క్యుపిసిఆర్, ఆర్‌టి-పిసిఆర్ ఇతర ఐసోథర్మల్, పిసిఆర్ ఆధారిత ప్రోటోకాల్స్ కోసం ఆర్ ఎన్ ఎను వెలికితీయడానికి ఉపయోగించవచ్చు.
ఇది పేషెంట్ నుంచి సేకరించే నమూనాల నుంచి ఆర్ ఎన్ ఎను సేకరించి దానిని వేరు చేయడానికి, మాగ్నటిక్ నానో పార్టికల్స్‌ను ను వాడే వినూత్న ప్రక్రియను అనుసరిస్తుంది. మాగ్నటిక్ నానో పార్టికల్ బీడ్‌లు వైరల్ ఆర్ ఎన్ ఎను బంధిస్తాయి. ఇవి అయస్కాంత క్షేత్ర ప్రభావానికి గురైనపుడు, బాగా శుద్ధి పరచబడిన , ఎక్కువ సాంద్రత కలిగిన ఆర్.ఎన్.ఎను ఇస్తాయి. కోవిడ్ -19 ను గుర్తించే పద్ధతిలో కచ్చితత్వం సాధించడమనేది వైరల్ ఆర్ ఎన్ ఎ ను తగినంత పరిమాణంలో పొందడంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ కిట్ ఆవిష్కణ కోవిడ్ పాజిటివ్ కేసులను సత్వరం గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
రాగల ఆరునెలల్లో మన దేశానికి నెలకు 8 లక్షల ఆర్.ఎన్.ఎను వెలికితీసే కిట్లు అవసరమౌతాయని అంచనా. అగప్పే చిత్ర మాగ్నా ఆర్ ఎన్ ఎ ఐసొలేషన్ కిట్ ఒక్కొక్కదాని ధర సుమారు 150 రూపాయలు గా ఉండనుంది . దీనితో ఈ కిట్ కోవిడ్ పరీక్షల ధరను గణనీయంగా తగ్గించనుండడంతోపాటు దేశం దిగుమతులపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దిగుమతి చేసుకునే కిట్ ధర సుమారు 300 రూపాయల వరకు ఉంటుంది. అగప్పే డయాగ్నస్టిక్స్ సంస్థకు నెలకు 3 లక్షల కిట్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
(మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి శ్రీమతి స్వప్న వామదేవన్, పి.ఆర్.ఒ, ఎస్‌సిటిఐఎంఎస్‌టి, మెబైల్. 9656815943 Email: pro@sctimst.ac.in).
***
(Release ID: 1625978)
Visitor Counter : 270