PIB Headquarters

ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 9 అదనపు చర్యలు ప్రకటించిన రిజర్వు బ్యాంకు

వడ్డీ రేట్లు తగ్గింపు, మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు

ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులకు ద్రవ్య లభ్యత పెంపు

2020-21 ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ఆర్ధిక వ్యవస్థ కుంచించుకుపోయి మరల ద్వితీయార్ధంలో క్రమంగా పుంజుకుంటుంది: ఆర్ బి ఐ గవర్నర్

Posted On: 22 MAY 2020 3:36PM by PIB Hyderabad

"దిగంతం అంతటా  చీకట్లు ఆవహించి ఉండటమే  కాక మానవ హేతువు, జ్ఞానం అట్టడుగు స్థాయికి చేరినప్పుడు మనలో ఉన్న విశ్వాసం పెల్లుబుకి మనను కాపాడుతుంది"  

జాతిపిత మహాత్మా గాంధీ 1929లో చేసిన ప్రవచనం నుంచి ఆశను, స్ఫూర్తిని పొందిన ఆర్ బి ఐ గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ కోవిడ్ -19  మహమ్మారి వల్ల తలెత్తిన అనిశ్చిత, సంక్షోభ సమయంలో దేశ ఆర్హిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు మరో 9 చర్యలను ప్రకటించారు.   ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ద్రవ్య లభ్యతకు ఎలాంటి ఆటంకం లేకుండా చేయడంతో పాటు ఆర్ధిక వ్యవస్థ సుస్థిరతకు కూడా దోహదం చేయడం  ఈ చర్యల ఉద్దేశం.  ఆర్ బి ఐ ఇంతకుముందు 2020 ఏప్రిల్ 17న  మరియు 2020 మార్చి 30న   ప్రకటించిన చర్యలకు ఇవి అదనం.  

ఆన్ లైన్ లో ప్రసంగం ద్వారా ఈ ప్రకటనలు చేసిన గవర్నర్,  అన్ని అవరోధాలను  అధిగమించి తిరిగి పుంజుకోగల సామర్ధ్యం ఇండియాకు కలదనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని  అన్నారు,  ప్రస్తుత సంక్షోభాన్నిఎదుర్కొని నిలిచి మనం విజయాన్ని సాధించగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.  ప్రస్తుత సంక్లిష్ట సమయంలో దృఢవిశ్వాసంతో వ్యవహరించిన గవర్నర్   "రిజర్వు బ్యాంకు తన  వృత్తి ధర్మాన్ని గుర్తెరిగి ముందు నిలిచి ఆర్ధిక వ్యవస్థ పరిరక్షణకు నడుం బిగించాల్సిన పరిస్థితి ఇదని"  ఉద్ఘాటించారు.  
రేపో రేటు 40 పాయింట్లు తగ్గింపు  

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక  వ్యవస్థ పునరుద్ధరణతో పాటు  కోవిడ్ -19 ప్రభావాన్ని తగ్గించడానికి గవర్నర్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించారు.   రేపో రేటును 40 పాయింట్లు తగ్గించి 4.4% నుంచి 4.0%కి తగ్గించారు.   మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు మరియు బ్యాంకు రేటు లను కూడా 4.65% నుంచి  4.25%కి తగ్గించారు.   రివర్స్ రేపో రేటును  3.75% నుంచి  3.35%కి తగ్గించారు.  

విశ్వాసాన్ని పాదుకొలిపి ఆర్ధిక స్థితిగతులు మెరుగుపరచడానికి  తగిన నిర్ణయాలు చేయవలసిన అవసరం ఉంది.  ఈ చర్యల వల్ల ద్రవ్య లభ్యత పెరిగి పెట్టుబడులు పెట్టేందుకు ప్రేరణ కలుగుతుందని గవర్నర్ అన్నారు.   ఆ దృష్టితోనే ద్రవ్య విధాన కమిటీ రేపో రేటును 40 పాయింట్లు తగ్గించాలని నిర్ణయించిందని గవర్నర్ తెలిపారు.  

ఈ సందర్బంగా శ్రీ దాస్  అనేక నియంత్రణ మరియు అభివృద్ధి చర్యలనుఁ ప్రకటించారు.  వడ్డీ రేట్ల తగ్గింపునకు తోడుగా ఈ చర్యలు తీసుకోవడం వల్ల పరస్పరం బలోపేతం కాగలవని అన్నారు.  

ఈ చర్యల ఉద్దేశం  .....
ఆర్ధిక వ్యవస్థ మరియు విత్త మార్కెట్లు దృఢంగా,  ద్రవ్య లభ్యతకు ఆటంకం లేకుండా సాఫీగా పనిచేయడం
అందరికీ, ముఖ్యంగా విత్త మార్కెట్లలోకి ప్రవేశం లేనివారికి కూడా  ద్రవ్యం అందుబాటులోకి రావడం 

ఆర్ధిక సుస్థిరతను పరిరక్షించడం  

మార్కెట్ల పనితీరును మెరుగుపరిచే చర్యలు
* సిడీబీ  రీ  ఫైనాన్స్ గడువు మరో 90 రోజులకు పొడిగింపు
చిన్న పరిశ్రమలకు  యోగ్యమైన రీతిలో పరపతిని సమకూర్చే లక్ష్యంతో  భారత రిజర్వు బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్ 17న, సిడీబీకి  15వేల కోట్ల రూపాయల ప్రత్యేక రీ ఫైనాన్సు వెసులుబాటును కల్పించింది.  ఆర్ బి ఐ విధాన రేపో రేటు ప్రకారం 90 రోజులకు గాను ఈ పరపతి అమలు లోకి వచ్చింది.   తాజాగా దీనిని మరో 90 రోజులకు పొడిగించారు.  

*స్వచ్ఛంద రిటెన్షన్ మార్గం (విఆర్ఆర్)లో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల నిబంధనల సడలింపు
విదేశీ పోర్టుఫోలియో మదుపరులకు భారత రిజర్వు బ్యాంకు కల్పిస్తున్న పెట్టుబడుల గవాక్షమే వి ఆర్ ఆర్.  మరింత హెచ్చు స్థాయిలో పెట్టుబాటులను పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రతిఫలంగా నిబంధనల వెసులుబాటుతో ఈ సౌకర్యాన్ని ఆర్ బి ఐ కల్పించింది.  మొదటి మూడు నెలల కాలంలో 75% కేటాయించిన పెట్టుబడులను అందించాలని ఈ నిబంధనలు నిర్ధేషిస్తున్నాయి.  ఇన్వెస్టర్లు వారి కస్టోడియన్ల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు ఆ కాల పరిమితిని ఆరు నెలలకు పొడిగించారు.  

ఎగుమతులు మరియు దిగుమతుల మద్దతుగా  చర్యలు
*  ఎక్కువ కాలం పాటు బ్యాంకు రుణాలు తీసుకునేందుకు ఎగుమతుదారులకు అవకాశం
సరుకుల ప్రీ-షిప్మెంట్ (నౌకల్లో ఎక్కించడానికి ముందు) మరియు పోస్ట్ - షిప్మెంట్  (దించిన తరువాత)కు సంబందించి ఎగుమతిదారులకు బ్యాంకులు కేటాయించిన ఎగుమతి పరపతి గరిష్ట గడువును ప్రస్తుత ఏడాది నుంచి 15 నెలలకు పెంచారు.  2020 జూలై 31వ తేదీ వరకు జరిగే రుణ పంపిణీలకు ఇది వర్తిస్తుంది.  

* ఎగ్జిమ్ బ్యాంకుకు రుణ సౌలభ్యం  
భారత విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు, నిధులను సమకూర్చేందుకు ఎగ్జిమ్ బ్యాంకు 15 వేల  కోట్ల రూపాయల మేర రుణ సౌకర్యాన్ని గవర్నర్ ప్రకటించారు.   ఈ రుణ సౌకర్యం 90 రోజుల పాటు అందుబాటులోకి వస్తుంది. అయితే అవసరానుగుణంగా దీనిని ఏడాది పాటు పొడిగించేందుకు అవకాశం ఉంటుంది.   ముఖ్యంగా అమెరికా డాలర్ బదలాయింపు సౌకర్యాన్నీ వినియోగించుకోవడంతో పాటు  విదేశీ మారక ద్రవ్య అవసరాలను తీర్చుకునేందుకు ఈ రుణ సౌకర్యాన్ని కల్పించారు.  

* దిగుమతుల చెల్లింపులకు దిగుమతిదారులకు మరింత గడువు
భారతదేశంలోకి వచ్చే దిగుమతులకు చెల్లింపుల (అంటే బంగారం/వజ్రాలు మరియు విలువైన రాళ్లు / ఆభరణాలు మినహా) కాల వ్యవధిని ఆరు నెలల నుంచి 12 నెలలకు పొడిగించారు.   ఈ గడువు సరుకులను నౌకలో ఎక్కించిన తేదీ నుంచి అమలు లోకి వస్తుంది.  
2020 జూలై 31 లోగా జరిగిన దిగుమతులకు ఇది వర్తిస్తుంది.  

 

ఆర్ధిక వత్తిడిని తీర్చే చర్యలు  
* నియంత్రణ చర్యలు మరో 3 నెలలు పొడిగింపు  
గతంలో ప్రకటించిన నియంత్రణ చర్యల వర్తింపును మరో మూడు నెలల పాటు అంటే 2020 జూన్ 1 నుంచి 2020 ఆగస్టు 31 వరకు ఆర్ బి ఐ పొడిగించింది.   అంటే మొత్తం మీద ఆరు నెలల కాలం( 2020 మార్చి 1 నుంచి 2020 ఆగస్టు 31) అమలులో ఉంటాయి.  పైన పేర్కొన్న నియంత్రణ చర్యలు ఇవి:  ఎ)  టర్మ్ లోన్ వాయిదాలపై 3 నెలల మారటోరియం;  బి) వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యంపై  వడ్డీ మూడు నెలలు వాయిదా;  సి)  వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పునర్ మదింపు చేయడం లేదా మార్జిన్లను తగ్గించడం ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ అవసరాలను సరళతరం చేయడం;  డి)  పర్యవేక్షణ నివేదికలో 'డిఫాల్టర్'  అనే  ముద్రనుంచి మినహాయింపు ఇవ్వడం, పరపతి సమాచార కంపెనీలకు పంపే నివేదికలో కూడా  కూడా ఈ రకమైన ముద్రను తొలగించడం;  ఇ)  ఆస్తులకు సంబంధించిన వివాదాల పరిష్కార గడువు పొడిగింపు;  ఎఫ్)    రుణ సంస్థల 3 నెలల మారటోరియం గడువును మినహాయించడం ద్వారా వస్తులా వర్గీకరణలో యధాతథ స్థితి.  అయితే 2021 మార్చి 31 నాటికి వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్లను పునరుద్ధరించుకునేందుకు
రుణ సంస్థలకు అనుమతి.   అలాగే,  వర్కింగ్ క్యాపిటల్ చక్రం పునర్ మదింపునకు సంబంధించిన చర్యలను తీసుకునే గడువును కూడా 2021 మార్చి 31 వరకు పొడిగించారు.    

* వర్కింగ్ క్యాపిటల్ పై వడ్డీని టర్మ్ లోన్ వడ్డీగా మార్చుకునే నిబంధన
వాయిదా పడ్డ మొత్తం ఆరు నెలల కాలంలో (2020 మార్చి 1 నుంచి  2020 ఆగస్టు 31 వరకు) పేరుకుపోయిన వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలపై వడ్డీని వడ్డీతో కూడిన టర్మ్ లోన్ గా మార్చుకునేందుకు అనుమతించారు.   ఈ మొత్తాన్ని 2021 మార్చి 31తో ముగిసే ఆర్ధిక సంవత్సర కాలంలో పూర్తిగా తిరిగి చెల్లిస్తారు

* కార్పొరేట్ సంస్థలకు నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు గ్రూప్ కంపెనీల రుణ పరిమితి పెంచడం
ఒక కార్పొరేట్ గ్రూపునకు బ్యాంకులు ఇచ్చే గరిష్ట రుణ పరిమితిని ఆ బ్యాంకుల మూలధన అర్హతలో ప్రస్తుత 25% నుంచి 30% కి పెంచారు.   మార్కెట్ల నుంచి నిధులను సమకూర్చుకోవడంలో కార్పొరేట్ సంస్థలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బ్యాంకుల నుంచే ఈ అవసరాలు తీర్చుకునే అవకాశం కల్పించారు.   పెంచిన రుణ పరిమితి  2021 జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.  

రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక ఇబ్బందులను తీర్చే చర్యలు
*  కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్  నుంచి మరింతగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం  
రుణాల చెల్లింపును జరిపేందుకు దనపు సౌకర్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సి ఎస్ ఎఫ్)  ఏర్పాటు చేసుకున్నాయి.   రుణ చెల్లింపు వత్తిడిని తట్టుకునేందుకు వీలుగా రాష్ట్రాల సౌలభ్యం కోసం ఈ నిధి ఏర్పాటైంది.   ఈ నిధి నుంచి రాష్ట్రాలు తమకు అవసరమైన మొత్తాన్ని తీసుకునేందుకు సంబంధించిన నిబంధనలను సడలించారు.   దీని ద్వారా 2020-21 సంవత్సరంలో మార్కెట్ల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడానికి రాష్ట్రాలకు వీలు కలుగుతుంది.   తక్షణమే అమలులోకి వచ్చే విధంగా ఈ రుణాలు తీసుకునే అవకాశం కల్పించారు.   2021 మార్చి 31 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.  అయితే ఈ రుణ సమతూకం ఏ మాత్రం దెబ్బతినని విధంగానే అర్ధవంతమైన రీతిలో  నిబంధనలను సడలించినట్లు గవర్నర్ వివరించారు.    

ఆర్ధిక వ్యవస్థ మదింపు 


ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్నులను అనేక కోణాల్లో మదించిన గవర్నర్ మాట్లాడుతూ స్థూల ఆర్హిక విత్తపరమైన పరిస్థితులు అన్ని కోణాల్లోనూ అర్ధవంతమైన రీతిలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.   అయితే ప్రపంచ ఆర్హిక వ్యవస్థ బయట పడలేనంతగా మాంద్య  స్థితిలోకి జారుకుందని  ఆయన స్పష్టం చేశారు.  

రెండు నెలల లాక్ డౌన్ ప్రభావం దేశీయ ఆర్హిక వ్యవస్థ పైనా తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 'దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో  దాదాపు 60 శాతం వాటా కలిగిన మొదటి 6 పారిశ్రామిక రాష్ట్రాలు దాదాపుగా  రెడ్ లేదా ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి' అని అన్నారు.   ఈ రాష్ట్రాల్లో డిమాండ్ పతనమైందని, ఉత్పాదకత కూడా తగ్గిపోయిందని,  ఫలితంగా రెవెన్యూ వసూళ్లపైనా ప్రభావం పడిందని తెలిపారు.  అలాగే ప్రయివేట్ వినియోగం కూడా ఈ కారణంగా తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించారు.  

విస్తరిస్తున్న ఈ అనిశ్చిత పరిస్థితుల్లోనూ వ్యవసాయం,  దాని అనుబంధ రంగాలు కొండంత ఆశను అందించాయని తెలిపారు.   భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం  ఈ ఏడాదిలో  నైరుతి రుతుపవనాలు  ఆశాజనకంగా ఉంటాయని  చెప్పడం కూడా మరింత సానుకూల పరిస్థితిని కల్పించిందన్నారు.  

ప్రస్తుతం డిమాండ్ తగ్గినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 8.6 శాతానికి విస్తరించిందని తెలిపారు.  2020 జనవరిలో వరుసగా రెండవ నెలైన మార్చిలో తగ్గిన ద్రవ్యోల్బణం ఆకస్మికంగా ప్రతికూలించిందని,  అసంపూర్తిగా అందుబాటులో ఉన్న డేటాను గవర్నర్ గుర్తుచేశారు.   గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా భారత వ్యాపార ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయని కోవిడ్ -19  మొత్తం ప్రపంచ ఉత్పత్తి డిమాండ్ లను దెబ్బతీసిందని ఆయన తెలిపారు.    

దేశ ద్రవ్యోల్బణం తీరుతెన్నులు పూర్తిగా అనిశ్చితంగా ఉన్నాయని ద్రవ్య విధాన కమిటీ మదింపు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.   ఏప్రిల్ నెలలో ఆహార ధరలు పెరగడానికి  దారితీసిన  సరఫరాల ప్రభావం మరికొన్ని నెలల పాటు ఉండవచ్చునని,  ఇదంతా కూడా లాక్ డౌన్ స్థితిగతులు, సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ పైనే ఆధారపడి ఉంటుందని  వెల్లడించారు.  
ప్రస్తుతం కల్పించిన సడలింపులు ఏ మేరకు ప్రభావాన్ని చూపుతాయన్న దానిపైనే మొత్తం పరిస్థితుల్లో మెరుగుదల ఆధారపడి ఉంటుందన్నారు.  పప్పుధాన్యాల ద్రవ్యోల్బణ స్థాయి కూడా ఆందోళన కలిగిస్తోందని,  దిగుమతి సుంకాల పునర్ మదింపు సహా తక్షణమే , సత్వరమే, సరఫరా నిర్వహణ పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.  

దేశ ఆర్ధిక వ్యవస్థ  భవితవ్యం గురించి మాట్లాడిన గవర్నర్ డిమాండ్ తగ్గిపోవడం,  సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వంటి వాటి ఉమ్మడి ప్రభావం వల్ల ప్రస్తుత ఆర్ధిక సంవత్సర మొదటి ఆరు నెలల కాలంలో  ఆర్ధిక కార్యకలాపాలు నిస్తేజమవుతాయని వెల్లడించారు.   దశల వారీగా ఆర్ధిక కార్యకలాపాలు మళ్ళీ గాడిలో  పడుతాయని ముఖ్యంగా ఈ ఆర్ధిక సంవత్సరం ద్వితీయార్ధంలో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్న దృష్ట్యా ప్రస్తుతం తీసుకుంటున్న విత్త, ద్రవ్య, పాలనాపరమైన చర్యల ఉమ్మడి ప్రభావం వల్ల 2020-21 ఆర్ధిక సంవత్సర ద్వితీయార్ధంలో పరిస్టులు మెరుగై ఆర్ధిక కార్యకలాపాల క్రమానుగత పునరుద్ధరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.  

ప్రస్తుతం అనేక అనిశ్చిత పరిస్థితులు ఆవహించినప్పటికీ 2020-21 ఆర్ధిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ప్రతికూలంగానే ఉండే అవకాశం ఉంది.   అయితే 2020-21 ద్వితీయార్ధం నుంచి కొంత మేర వృద్ధి పుంజుకునే అవకాశం ఉంటుందని భావితున్నారు.   అయినప్పటికీ ప్రస్తుతం కోవిడ్ వైరస్ ప్రభావం  ఎంత మేరకు తగ్గుతుంది,  ఏ మేరకు అదుపులోకి వస్తుందనే దానిపైనే
ఈ చర్యలన్నింటి ప్రభావం  వాటి ద్వారా ఆశిస్తున్నా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.    

గవర్నర్ ప్రసంగం  పూర్తి  ఆంగ్ల పాఠాన్ని ఇక్కడ చదవవచ్చు.  



(Release ID: 1626254) Visitor Counter : 353