PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 15 MAY 2020 6:36PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • మహమ్మారి నియంత్రణ వ్యూహం, నిర్వహణాంశాలపై ‘కోవిడ్‌-19 మంత్రివర్గ సంఘం’ భేటీలో లోతైన చర్చ.
 • మొత్తం కోవిడ్‌-19 కేసులు 81,970; మరణాలు: 2,649; కోలుకున్నవారు 27,920 మంది (34.06 శాతం).
 • దిగ్బంధానికి ముందు వారంలో కేసులు రెట్టింపు వ్యవధి 3.4 రోజులు కాగా, మెరుగుపడి గతవారంలో12.9 రోజులుగా నమోదైంది.
 • కోవిడ్‌-19పై పోరులో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా స్వయం సమృద్ధ భారతం మూడోవిడత చర్యలపై ఆర్థికశాఖ మంత్రి ప్రకటన.
 • కోవిడ్‌-19 సహాయచర్యలతో స్వయం సమృద్ధ భారత్‌ దిశగా వనరుల వినియోగంపై రాష్ట్రపతి భవన్‌ మద్దతు.
 • పాడి పరిశ్రమ రంగం నిర్వహణ మూలధనం రుణాలపై వడ్డీ రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
 • 1000కిపైగా శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లలో 12 లక్షల మందిని తరలించిన రైల్వేశాఖ; ఒక్కరోజులో 2 లక్షల మంది తరలింపు.

కోవిడ్‌-19పై మంత్రివర్గ ఉపసంఘం 15వ భేటీ; ప్రస్తుత స్థితి, సన్నద్ధత, మహమ్మారి నియంత్రణ చర్యలపై సమీక్ష

కోవిడ్‌-19పై ఏర్పాటైన ఉన్నతస్థాయి మంత్రివర్గ ఉపసంఘం 15వ సమావేశం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి అధ్యక్షతన ఇవాళ నిర్మాణ భవన్‌లో జరిగింది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్‌-19పై తీసుకున్న వివిధ చర్యలపై సమీక్షించడంతోపాటు దేశవ్యాప్తంగా మహమ్మారి నియంత్రణ వ్యూహం, నిర్వహణాంశాలపై లోతుగా చర్చించింది. ఇక దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య 81,970కి చేరగా, ఇప్పటివరకూ 2,649 మరణాలు సంభవించగా మరణాలు 3.23 శాతంగా నమోదయ్యాయి. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 27,920 కాగా, వీరిలో గడచిన 24 గంటల్లోనే 1,685 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి శాతం 34.06 శాతానికి చేరింది. ఇక కేసులు రెట్టింపయ్యే వ్యవధిపై దిగ్బంధం ప్రభావం ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ మేరకు దిగ్బంధానికి ముందు రెట్టింపయ్యే వ్యవధి 3.4 రోజులు కాగా, గడచిన వారంలో బాగా మెరుగుపడి 12.9 రోజులకు పెరిగింది.

కోవిడ్‌-19పై పోరులో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా స్వయం సమృద్ధ భారతం కార్యక్రమ మూడోవిడత చర్యలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624133

వ‌ల‌స ‌కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు, వీధి వ‌ర్త‌కులుస‌హా పేద‌ల‌కు చేయూత‌నిస్తూ చేప‌ట్టిన పలు స్వ‌ల్ప-దీర్ఘ‌కాలిక చ‌ర్య‌ల‌పై కేంద్ర ఆర్థికమంత్రి ప్ర‌క‌ట‌న‌

దేశంలోని వలస కార్మికులు, వీధి వ‌ర్తకులు, వలస పట్టణ పేదలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులు, చిన్న రైతులుస‌హా పేద‌లు ఎదుర్కొంటున్న క‌ష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన రెండోవిడ‌త స్వ‌ల్ప‌-దీర్ఘ‌కాలిక చ‌ర్య‌ల గురించి కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న‌టి విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌క‌టించారు.  ఇందులో భాగంగా-  వలసదారులకు 2 నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా; ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ కింద‌గ‌ల దేశంలోని ఏ చౌక‌ధ‌ర‌ల దుకాణంలోనైనా స‌ర‌కులు తీసుకునేందుకు వీలుగా సాంకేతిక ప‌రిజ్ఞాన వినియోగంతో 2021మార్చినాటికి ‘ఒకే దేశం-ఒకే కార్డు’ విధానం అమ‌లు; వ‌ల‌స ‌కార్మికుల‌కు, పట్ట‌ణ పేద‌ల‌కు అందుబాటు ధ‌ర‌లో అద్దె ఇళ్ల స‌ముదాయాల నిర్మాణ ప‌థ‌కం; శిశు ముద్రా లోన్ల‌కు 12 నెల‌ల‌పాటు 2 శాతం వ‌డ్డీరాయితీ కింద రూ.1500 కోట్ల మేర స‌హాయం; వీధి వ‌ర్త‌కుల‌కు రుణ స‌దుపాయం కోసం రూ.5000 కోట్లు కేటాయింపు; ‌పీఎంఏవై (అర్బ‌న్) కింద మ‌ధ్యాదాయ వ‌ర్గాలకు రుణ ఆధారిత స‌బ్సిడీ పథకం పొడిగింపు ద్వారా గృహ‌నిర్మాణ రంగానికి, మధ్యాదాయ వర్గాలకు చేయూత కోసం రూ .70,000 కోట్లు కేటాయింపు; సీఏఎంపీఏ నిధుల‌తో ఉపాధి క‌ల్ప‌న కోసం రూ.6000 కోట్లు కేటాయింపు; నాబార్డ్ ద్వారా రైతుల‌కు అద‌న‌పు అత్య‌వ‌స‌ర నిర్వ‌హ‌ణ మూల‌ధ‌నం కింద రూ.30,000 కోట్లు కేటాయింపు; కిసాన్ క్రెడిట్ కార్డ్ ప‌థ‌కం కింద 2.5 కోట్ల మంది రైతుల‌కు రాయితీ రుణ స‌దుపాయం కోసం రూ.2 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623914

దిగ్బంధం నేపథ్యంలో పాడి రంగానికి నిర్వహణ మూలధన రుణాలపై వడ్డీ రాయితీ

పాడి రంగంపై కోవిడ్-19 ఆర్థిక ప్రభావ ఉపశమనం దిశగా పాల సహకార సంస్థలతోపాటు పాడిసంబంధ కార్యకలాపాల్లోగల ఉత్పత్తి సంస్థలకు చేయూతనిచ్చేందుకు "పాడి రంగానికి నిర్వహణ మూలధనంపై వడ్డీ రాయితీ" పేరిట 2020-21 మధ్యకాలంలో అమలుచేసేలా మత్స్య, పశుసంవర్ధక-పాడి పరిశ్రమలశాఖ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సహకార, రైతుల యాజమాన్యంలోని పాల ఆధారిత ఉత్పత్తి సంస్థల నిర్వహణ మూలధన అవసరాలు తీర్చడంలో భాగంగా వాణిజ్య బ్యాంకులు/ప్రాంతీయ గ్రామీణ/సహకార బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిర్వహణ మూలధన రుణాలపై 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య కాలానికిగాను వడ్డీ రాయితీ ఇవ్వబడుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623903

వ్యయం తగ్గింపుద్వారా ఆదర్శంగా నిలిచిన రాష్ట్రపతి భవన్‌

కోవిడ్‌-19 సహాయ చర్యల కోసం వనరుల లభ్యత దిశగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ మార్చిలో ఒకనెల వేతనాన్ని ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళంగా ప్రకటించడమేగాక ఏడాదిపాటు తన జీతంలో 30 శాతం వదులుకోవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రపతి భవన్‌లో వనరులను పొదుపుగా వినియోగించడంద్వారా వ్యయాన్ని తగ్గించాలని ఆదేశాలిచ్చారు. తద్వారా మిగిలే మొత్తాన్ని కోవిడ్‌-19 ఉపశమనంసహా, ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు అందజేయాలని సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623976

బిల్‌గేట్స్‌తో ప్రధానమంత్రి చర్చ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ‘బిల్‌ అండ్ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌’ సహాధ్యక్షుడు బిల్‌ గే్ట్స్‌తో సంభాషించారు. కోవిడ్‌-19పై ప్రపంచ ప్రతిస్పందన, ఈ మహమ్మారిపై పోరు దిశగా శాస్త్రీయ ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధిలో అంతర్జాతీయ సమన్వయ ప్రాముఖ్యం గురించి ప్రముఖులిద్ద‌రూ ఈ సంద‌ర్భంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిట్టచివరి వ్యక్తిదాకా ఆరోగ్య సేవాప్రదానంలో భారత్‌ విధానం ఆధారంగా ప్రత్యేక నమూనాకు రూపకల్పన, రోగులతో సంబంధాలున్నవారి జాడ పసిగట్టడం కోసం భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన సమర్థ మొబైల్‌ యాప్‌ విధానం విస్తృత అనుసరణ, అన్నిటికన్నా ముఖ్యంగా వ్యాక్సిన్లు కనుగొన్న తర్వాత ఔషధాలను భారీస్థాయిలో ఉత్పత్తి చేయగల భారత సామర్థ్య సద్వినియోగం ప్రధానాంశాలుగా వారిమధ్య చర్చలు సాగాయి. ప్రత్యేకించి మహమ్మారిపై పోరాటంలో ప్రపంచం ప్రయత్నాలకు తనవంతు తోడ్పాటు ఇవ్వడానికి భారత్‌ సన్నద్ధత, సామర్థ్యం నేపథ్యంలో సాటి వర్ధమాన దేశాలకు ప్రయోజనం కలిగేవిధంగా ప్రస్తుత అంతర్జాతీయ కృషి సమన్వయం దిశగా కొనసాగుతున్న చర్చలలో భారత్‌ను భాగస్వామిని చేయడం చాలా ముఖ్యమన్న వాస్తవాన్ని వారు అంగీకరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623979

భారత, డెన్మార్క్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డెన్మార్క్‌ ప్రధానమంత్రి గౌరవనీయులైన మెదీ ఫ్రెడరిక్సన్‌తో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడంలో రెండు దేశాల్లో అనుసరించిన ప్రతిస్పందనాత్మక చర్యలను ఈ సందర్భంగా వారు విశ్లేషించారు. దిగ్బంధం ఆంక్షల సడలింపుతోపాటు వ్యాధి వ్యాప్తిని విజయవంతంగా అరికట్టడంలో డెన్మార్క్‌ తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ నేపథ్యంలో పరస్పరం అనుభవాలను పంచుకునే దిశగా భారత, డెన్మార్క్‌ నిపుణుల మధ్య నిరంతర సంబంధాలు నెరపడానికి వారిద్దరూ అంగీకరించారు. భారత-డెన్మార్క్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైనా దేశాధినేతలిద్దరూ తమ ఆకాంక్షను పునరుద్ఘాటించారు. అలాగే కోవిడ్‌-19 అనంతర ప్రపంచంలో ఉభయదేశాలూ అనుసరించాల్సిన విధానాలపైనా వారు చర్చించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623981

భారత విదేశీ వాణిజ్యం: ఏప్రిల్‌ 2020

ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత విదేశీ వాణిజ్యం (వస్తువులు/సేవలు) 27.96 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు అంచనా. నిరుడు ఇదే వ్యవధిలో పోలిస్తే ఇది మైనస్‌ 36.65 శాతం  ప్రతికూల వృద్ధిగా తేలింది. కాగా, 2020 ఏప్రిల్‌లో మొత్తం దిగుమతుల విలువ 27.80 బిలియన్లు కాగా, నిరుడు ఇదే వ్యవధిలో మైనస్‌ 47.36గా ప్రతికూల వృద్ధి నమోదైంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624102

అత్య‌వ‌సర మందులు, చికిత్సలు, వ్యాక్సిన్లు సరసమైన ధరలకు ల‌భ్య‌మ‌య్యేలా చూడాలని జి-20 దేశాలకు భారత్ పిలుపు

అత్య‌వ‌సర మందులు, చికిత్సలు, వ్యాక్సిన్లు సరసమైన ధరలకు ల‌భ్య‌మ‌య్యేలా చూడాలని జి-20 దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన జి-20 వాణిజ్య-పెట్టుబడుల శాఖ మంత్రుల రెండో సమావేశంలో పాల్గొన్న భారత వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కూటమిలోని దేశాలకు సూచించారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఉపశమింపజేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలని జి-20 సభ్యదేశాలను ఆయన కోరారు. ఈ వ్యాధికి సరికొత్త చికిత్స విధానాలతోపాటు టీకాల అభివృద్ధికి అంతర్జాతీయంగా సాగుతున్న కృషిలో ‘ప్రపంచ ఔషధ నిధి’గా ప్రాచుర్యంగల భారత్‌ తనవంతు భాగస్వామ్యం అందిస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623974

రోజుకు 4 రైళ్లస్థాయి నుంచి 145 రైళ్లు నడుపుతూ ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లద్వారా ‘స్వస్థలాలకు ప్రజలు’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న రైల్వేశాఖ

భారత రైల్వేశాఖ 2020 మే 1న కేవలం 4 రైళ్లతో ప్రారంభించి కేవలం 15 రోజుల్లో వెయ్యికిపైగా ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడిపింది. ఇందులో భాగంగా 2020 మే 14న మొత్తం 145 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లద్వారా 2.10 లక్షల మంది ప్రయాణికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చింది. తద్వారా ఒక్కరోజులోనే ప్రయాణికుల సంఖ్య 2 లక్షలు దాటింది. కాగా, ఇప్పటివరకూ మొత్తం 12 లక్షల మంది ప్రయాణికులు ఈ శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లద్వారా సొంత రాష్ట్రాలకు చేరారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624222

దిగ్బంధం నేపథ్యంలో ఈపీఎఫ్‌-ఎంపీ చట్టం-1952కింద చందాల జమలో ఆలస్యంపై సంస్థలకు జరిమానా విధించరాదని నిర్ణయం

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ దిశగా ప్రభుత్వం దిగ్బంధాన్ని సుదీర్ఘంగా పొడిగిస్తున్న దృష్ట్యా ఈపీఎఫ్‌-ఎంపీ చట్టం-1952 కింద భవిష్యనిధి బకాయిలను జమ చేయడంలో సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఎదుర్కొంటున్నందున,  సకాలంలో చందాలు చెల్లించడంలో ఆలస్యమైతే ఆ వ్యవధిని చెల్లింపులో వైఫల్యంగా పరిగణించరాదని, అలాగే జరిమానాలను విధించరాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ-ఈపీఎఫ్‌వో ​​నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624200

కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి సూచనమేరకు 9, 11 తరగతుల్లో ఫెయిలైన విద్యార్థులు మళ్లీ పాఠశాల ఆధారిత పరీక్షకు హాజరయ్యేలా అవకాశమిచ్చిన సీబీఎస్‌ఈ

కోవిడ్‌-19 అనూహ్య పరిస్థితుల దృష్ట్యా 9, 11 తరగతుల్లో ఫయిలైన విద్యార్థులందరికీ మరోసారి ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు (CBSE)కి సూచించారు. మంత్రి సూచనను ఆమోదించిన సీబీఎస్‌ఈ తదనుగుణంగా తాజా నోటిఫికేషన్‌ జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623943

‘ఈ-నామ్‌’తో మరో 38 మండీల అనుసంధానం

ఆన్‌లైన్‌ వ్యవసాయ విపణి వేదిక ‘ఈ-నామ్‌’ వేదిక కింద ఇవాళ మరో 38 మండీలు అదనంగా జోడించబడ్డాయి. దీంతో నిర్దేశిత లక్ష్యం మేరకు 415 మండీల ఏకీకరణ మైలురాయిని అధిగమించినట్లయింది. కొత్తగా జోడించబడిన మండీలలో రాష్ట్రాలవారీగా మధ్యప్రదేశ్‌ (19), తెలంగాణ (10), మహారాష్ట్ర (4); గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌, కేరళ, జమ్ముకశ్మీర్‌లనుంచి ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. దీంతో తొలిదశ కింద 515 మండీలు, మరింత విస్తరణలో భాగంగా రెండో దశలో తాజాగా 415 మండీల ఏకీకరణ ముగియడంతో దేశంలోని 18 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ‘ఈ-నామ్‌’కింద మొత్తం మండీల సంఖ్య 1,000కి చేరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624203

భార‌త తీర ర‌క్ష‌క‌ద‌ళ నౌక ‘‌స‌చేత్‌’తోపాటు రెండు చొర‌బాటు నిరోధ‌క ప‌డ‌వ‌ల‌ను ప్రారంభించిన ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ ‌సింగ్‌

భార‌త తీర ర‌క్ష‌క‌ద‌ళ నౌక (ICGS) ‘‌స‌చేత్‌’తోపాటు రెండు చొర‌బాటు నిరోధ‌క (IBs) ప‌డ‌వ‌ల‌ (C-450, C-451)ను ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ ‌సింగ్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా గోవాలో జలప్రవేశం చేయించారు. ఐదు తీర గస్తీ నౌకల పరంపరలో మొదటిదైన ఐసీజీఎస్‌ సచేత్‌ నౌకకు గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (జీఎస్‌ఎల్‌) రూపకల్పన చేయడంతోపాటు దేశీయంగా నిర్మించింది. ఇందులో అత్యాధునిక మార్గదర్శన, సమాచార పరికరాలను కూడా అమర్చింది. ఈ నేపథ్యంలో ఐసీజీ, జీఎస్‌ఎల్‌ సంయుక్త కృషిని ప్రశంసించడంతోపాటు డిజిటల్‌ మార్గాన ఈ నౌకను, మిగిలిన రెండు పడవలను జలప్రవేశం చేయించడంపై శ్రీ రాజ్‌నాథ్‌ అభినందనలు తెలిపారు. “భారత తీరరక్షణ సామర్థ్యం పెంపు దిశగా ఈ నౌకలను జల ప్రవేశం చేయించడంద్వారా ఒక కీలక మైలురాయిని అధిగమించాం” అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. కోవిడ్‌-19 మహమ్మారి సవాలు విసిరిన ప్రస్తుత సమయంలోనూ దేశభద్రత, రక్షణ విషయంలో మన చిత్తశుద్ధికి, కర్తవ్య దీక్షకు ఇదొక తిరుగులేని నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే మన ‘తీర రక్షకదళం’ ఐసీజీ, భారత నౌకా నిర్మాణ పరిశ్రమలు దేశానికే గర్వకారణమని చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624221

జల్‌జీవన్‌ మిషన్‌ కింద గ్రామీణ నీటిసరఫరా రంగంలో సేవాప్రదానంపై సెన్సర్‌ ఆధారిత పర్యవేక్షణకు శ్రీకారం చుట్టనున్న గుజరాత్‌

జల్‌జీవన్‌ మిషన్‌కింద గ్రామీణ నీటిసరఫరా రంగంలో సేవాప్రదానంపై సెన్సర్‌ ఆధారిత పర్యవేక్షణకు గుజరాత్‌ శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నిర్దేశిత నాణ్యత ప్రమాణాల మేరకు నిర్ణీత పరిమాణంలో నీరు సరఫరా అవుతున్నదీ/లేనిదీ దీర్ఘకాలిక ప్రాతిపదికన క్రమబద్ధంగా గమనిస్తోంది. కాగా, ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నడుమ అందరికీ నీటిసరఫరా తప్పనిసరిగనుక తదనుగుణంగా పనులు చేపట్టాలని అన్ని రాష్ట్రాలనూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623899

దేశ‌ంలోని గిరిజ‌న యువ‌త‌కు డిజిట‌ల్ నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ‌దిశగా కేంద్ర గిరిజ‌న‌ వ్య‌వ‌హారాల శాఖ ఫేస్‌బుక్‌ భాగ‌స్వామ్యంతో చేప‌ట్టిన ‘గోల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అర్జున్ ముండా

గిరిజన యువతకు డిజిటల్‌ విధానంలో మార్గనిర్దేశం కోసం ‘గోల్‌’ రూపొందించబడింది. గిరిజన యువతరంలో నిబిడీకృతమైన ప్రతిభాపాటవాలను ఈ డిజిటల్‌ మాధ్యమ కార్యక్రమం వెలుగులోకి తెస్తుంది. తద్వారా వారి వ్యక్తిత్వ వికాసంతోపాటు గిరిజన సామాజిక సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624046

కోవిడ్‌-19 పోరులో చురుకైన పాత్ర పోషిస్తున్న ‘నైపర్’

కోవిడ్‌-19 గుర్తింపు, నియంత్రణ, చికిత్స దిశగా వివిధ జాతీయ ఔషధ విద్య-పరిశోధన సంస్థలు ‌(NIPERs‌) త‌మ బహుముఖ పరిశోధన ప్రతిపాదనలను ఆమోదం కోసం సంబంధిత ధ్రువీక‌ర‌ణ సంస్థ‌ల‌కు పెద్ద సంఖ్యలో సమర్పించాయి. ఈ మేర‌కు కోవిడ్‌-19ను విచ్ఛిన్నం చేసే యాంటీవైరల్‌ ఏజెంట్‌ ప్రొటీజ్‌ డిజైన్‌ ‌(NIPER‌-మొహాలీ), ఎఫ్‌డీఏ ఆమోదించిన ఔషధ-డేటాబేస్ ఆధారంగా ఔషధ భిన్న‌వినియోగం (NIPER‌-మొహాలీ, రాయ్‌బరేలీ), రెమ్‌డెసివిర్‌ ఔషధ మార్పిడిలో అనుకూల ఔషధాల విశ్లేషణ (NIPER‌-మొహాలీ) రోగులు ముక్కు ద్వారా తీసుకునే ఔషధ సహాయక చికిత్స (NIPER‌-హైదరాబాద్‌), స‌త‌ర్వ కోవిడ్‌-19 నిర్ధారణ క్వాంటం-డాట్‌స‌హా వాహకత ఆధారిత బయోసెన్సర్ అభివృద్ధి (NIPER‌-అహ్మ‌దాబాద్‌), కోవిడ్-19 ఫ‌లితంగా సంభ‌వించే గుండెపోటు నియంత్రణపై ఆసక్తికర అధ్యయనం త‌దిత‌రాలు ఆయా సంస్థల పరిశోధనల్లో భాగంగా ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623902

కోవిడ్‌-19పై పోరులో భాగంగా వినూత్న 3డీ ఉత్పత్తులకు ‘నైపర్-గువహటి’ రూపకల్పన

కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా జాతీయ ఔషధ విద్య-పరిశోధన సంస్థ ‌(NIPER‌-గువహటి), రెండు వినూత్న ఉత్పత్తులకు రూపకల్పన చేసింది. ఇందులో మొదటిది చేతులు ఉపయోగించకుండా తలుపులు, కిటికీలు, టేబుల్‌ సొరుగులు (నిలువు-అడ్డం), తెరిచేందుకే కాకుండా ఫ్రిజ్‌ హ్యాండిల్‌ లేదా ఎలివేటర్‌ బటన్లు, ల్యాప్‌టాప్‌/పీసీల కీబోర్డుల (ఆన్‌/ఆఫ్‌ బటన్‌సహా)ను వాడుకోగల 3డీ ప్రింటెడ్‌ పరికరం. రెండోది నవ్య కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే సూక్ష్మజీవ నిరోధక 3డీ ప్రింటెడ్‌ ముఖ కవచం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624189

‘దేఖో అప్నాదేశ్‌’ సిరీస్‌ కింద ‘మైసూరు: క్రాఫ్ట్‌ కారవాన్‌ ఆఫ్‌ కర్ణాటక’ శీర్షికన మైసూరుకు చెందిన శతాబ్దాలనాటి హస్తకళలపై కేంద్ర పర్యాటకశాఖ వెబినార్‌

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624139

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలో అత్యంత ఆవ‌శ్య‌క‌మైన పారిశ్రామిక పునరుజ్జీవన సౌల‌భ్య క‌ల్ప‌న‌తోపాటు వివిధ పారిశ్రామిక‌ సంఘాల ఆందోళనలపై ప్రతిస్పంద‌నలో భాగంగా లూధియానాలో నియంత్ర‌ణేత‌ర‌, మిశ్ర‌మ వినియోగ ప్రాంతాల్లో సూక్ష్మ/కుటీర ప‌రిశ్ర‌మ‌ల త‌క్ష‌ణ ప్రారంభానికి పంజాబ్ ముఖ్యమంత్రి అనుమ‌తించారు. వీటి త‌యారీపై ఆధార‌ప‌డిన పెద్ద ప‌రిశ్ర‌మ‌లు పునఃప్రారంభం కావ‌డం కోసం వీటిని అనుమ‌తించ‌డం ప్రస్తుతం త‌క్ష‌ణావ‌స‌రం. అందుకే ముఖ్య‌మంత్రి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రోవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు భారీ ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు. త‌ద‌నుగుణంగా దిగ్బంధం స‌మ‌యంలో ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న పాఠశాలల‌ను మాత్ర‌మే ట్యూషన్ ఫీజు వసూలు చేసుకోవ‌డానికి అనుమ‌తిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ప్రవేశ రుసుము, యూనిఫాం లేదా ఏ ఇతర రూపంలోనైనా విద్యార్థుల నుంచి ఫీజుల వ‌సూలుకు వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. దేశవ్యాప్త విపత్తును దృష్టిలో ఉంచుకుని 2020-21 విద్యా సంవ‌త్స‌రంలో పాఠశాల యాజమాన్యాలు రుసుములు లేదా ఇతర ఛార్జీలను పెంచరాద‌ని నిర్దేశించారు.
 • హర్యానా: ప్రత్యేక కోవిడ్ ప్యాకేజీ రెండో విడ‌త ప్రకటించినందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు హ‌ర్యానా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్యాకేజీతో వలసదారులకే కాకుండా రాష్ట్ర రైతులకు భారీ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్నారు. అలాగే కేంద్ర ఆర్థికశాఖ‌ మంత్రి చేసిన వివిధ ఇతర ప్రకటనలతో ఎంఎస్‌ఎంఈ, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి రంగం,  విద్యుత్ పంపిణీ త‌దిత‌ర రంగాల‌తోపాటు వేత‌న‌జీవుల‌కు నూత‌నోత్తేజం క‌ల్పించి, ఆర్థిక వ్యవస్థలో కొత్త శక్తిని నింపుతాయ‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ ఆర్థిక రంగాలకూ ల‌బ్ధి చేకూరుతుంద‌ని పేర్కొన్నారు. కాగా, స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూపుతున్న వల‌స కార్మికుల‌ను వెన‌క్కు పంప‌డాన్ని హర్యానా ప్రభుత్వం కొనసాగిస్తోంది. వలస కార్మికుల ప్ర‌యాణ ఏర్పాట్లు చేయ‌డంతో స‌రిపెట్టుకోకుండా ప్ర‌యాణ స‌మ‌యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త కూడా అధికారుల‌దేన‌ని ముఖ్యమంత్రి అన్ని జిల్లా యంత్రాంగాల‌కూ ఆదేశాలు జారీచేశారు.
 • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని  పంచాయతీల స‌ర్పంచులు, ఇత‌ర క్షేత్ర‌స్థాయి ప్రజాస్వామ్య సంస్థల ఎన్నికైన ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు. ఈ మేర‌కు త‌మ‌త‌మ ప‌రిధిలో క‌‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధం దిశ‌గా ప్ర‌భుత్వం రాష్ట్రమంత‌టా ఏర్పాటు చేసిన గృహ నిర్బంధ వైద్య స‌దుపాయాల నిర్వ‌హ‌ణ‌, నియంత్ర‌ణ‌పై శ్ర‌ద్ధ చూపాల‌ని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రారంభించిన ‘నిఘా’ కార్యక్రమ సమర్థ అమలులో చిత్త‌శుద్ధితో స‌హ‌క‌రించాల‌ని స‌ర్పంచుల‌ను కోరారు. నిర్బంధ వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నను నిరోధించేందుకే ఆ కేంద్రాల్లో ఉంచిన‌వారిపై జాగ్ర‌త్త వ‌హించాల‌న్న‌ది ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా 1602 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,524కు చేరింది. యాక్టివ్‌ కేసులు 20,441 కాగా, 6059 మంది కోలుకున్నారు. రాష్ట్రంలోని కోవిడ్ హాట్‌స్పాట్ నగరాల్లో దిగ్బంధం పొడిగించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇవాళ ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన విస్తృత అంశాలపై చర్చించారు.
 • గుజరాత్: రాష్ట్రంలో నిన్న 13 జిల్లాలనుంచి 324 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 9,592కు పెరిగింది. కాగా, నిన్న పూర్తిగా కోలుకున్న 191 మందిని డిశ్చార్జ్ చేయగా, 20 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు దిగ్బంధం నడుమ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు తిరిగి మొదలయ్యాయి. రాష్ట్రంలో రోడ్లు-భవనాల నిర్మాణానికి రూ.9,000 కోట్ల విలువైన 300  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. ఇక ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ‘ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన’ను ప్రకటించారు. దీనికింద చిన్న వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధిదారులకు 2 శాతం రాయితీ వడ్డీ రేటుతో  రూ.లక్ష మేర ఉచిత రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
 • రాజస్థాన్: రాష్ట్రంలో 55మందికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. దీంతో యాక్టివ్‌ రోగుల సంఖ్య 1,881కి చేరింది. మొత్తంమీద ఇప్పటిదాకా 2,646 మంది కోలుకోగా ఇవాళ కోటా నుంచి 29, జైపూర్ నుంచి 11, ఉదయపూర్లో 9 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, ఉదయపూర్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 313కు పెరిగిన నేపథ్యంలో నగరం కోవిడ్‌-19 కొత్త హాట్‌స్పాట్‌గా మారింది. ఇక కరోనా సోకడంతో మొత్తం 125మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రానికి వలస కార్మికుల రాక నేపథ్యంలో 4 రోజుల్లోనే అకస్మాత్తుగా వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగింది.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 253 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 4,426కు చేరింది. ఇప్పటిదాకా 2,171కి నయం కాగా, ఇప్పటిదాకా 2,018మంది ఆరోగ్యం స్థిరంగా ఉంది. మరోవైపు రాష్ట్రంలో వ్యాధి సంక్రమణవల్ల 237 మంది మరణించారు.
 • గోవా: ముంబైలో 14 రోజుల నిర్బంధ వైద్య పర్యవేక్షణ తర్వాత గోవాకు తిరిగి వచ్చిన నావికాదళ ఉద్యోగి ఒకరికి గురువారం రాత్రి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. దీంతో గోవాలో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. గత రెండు రోజుల వ్యవధిలో కొత్త కేసులు నమోదవుతుండటంతో గోవా ప్రభుత్వం రైళ్లద్వారా జనం రాకను నియంత్రించాలని భావిస్తోంది.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాలలు జూన్‌ 29 నుంచి పునఃప్రారంభం కానున్నాయి ఈ మేరకు విశ్వవిద్యాలయం 2020-21కి సంబంధించి విడుదల చేసిన విద్యా కేలండర్‌లో ప్రకటించింది.
 • అసోం: రాష్ట్రంలో దిగ్బంధంపై కొ్త్త ప్రామాణిక విధాన ప్రక్రియలతోపాటు నిర్బంధ వైద్య పర్యవేక్షణపై కఠిన నిఘా గురించి చర్చించేందుకు ఆరోగ్యశాఖ మంత్రి  దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు.
 • మణిపూర్: రాష్ట్రంలో ఒక కోవిడ్‌-19 రోగిని ఇవాళ జవహర్లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని ఏకాంత చికిత్స వార్డుకు తరలించారు.
 • మిజోరం: సరిహద్దు గ్రామాల్లోని మరింతమంది నిరుపేదలకు ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు సరిహద్దు భద్రత నిర్వహణ బృందం, కోలాసిబ్ మిజోరం, 10 గ్రామ కార్యాచరణ బృందాలద్వారా బియ్యం, పప్పుదినుసులు, ఉప్పు, ఉల్లిపాయ, సోయాబీన్, వంటనూనెలు తదితర ప్రధాన వస్తువులను పంపిణీ చేసింది.
 • నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 నిర్ధారణ కోసం పంపిన 891 నమూనాల్లో 873 ప్రతికూల ఫలితాలు వచ్చాయి. మరో 18 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
 • కేరళ: రాష్ట్రంలోకి తిరిగివస్తున్నవారి రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్-19 కేసులు ఆకస్మికంగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత పెరిగింది. కాగా, న్యూఢిల్లీ నుంచి వచ్చిన తొలి ప్రత్యేక రైలు ఇవాళ రాష్ట్ర రాజధాని చేరుకుంది. ఏడుగురు ప్రయాణికులు జ్వర లక్షణాలతో కనిపించడంతో వారిని కోళికోడ్, తిరువనంతపురం ఆస్పత్రులకు పంపారు. ఇక విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయులకు 14 రోజుల సంస్థాగత నిర్బంధ వైద్యపర్యవేక్షణ తప్పనిసరి అని కేంద్రం కేరళ హైకోర్టుకు తెలిపింది. దీంతో 7 రోజులకు పరిమితం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కేరళలో చిక్కుకున్న వలస కార్మికులను తరలించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 28 రైళ్లను కేటాయించింది. గల్ఫ్‌ దేశాల్లో మరో ముగ్గురు కేరళవాసులు కోవిడ్-19తో మరణించడంతో విదేశాల్లో వైరస్ బారినపడిన కేరళ ప్రవాసుల సంఖ్య 120 దాటింది.
 • తమిళనాడు: మద్యం దుకాణాలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్‌ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు నిలిపివేత ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ  పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్రణాళికలో తన వాటాకోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో కోవిడ్‌-19 రోగులకు ఆహారం మందులు అందించడానికి రోబోలను రంగంలో దించారు. ఇక పుదుచ్చేరిలో ఒక బాలికసహా ముగ్గురికి వ్యాధి నిర్ధారణ కావడంతో కోవిడ్-19 కేసుల సంఖ్య 12కు పెరిగింది. నిన్నటి వరకు తమిళనాడులో మొత్తం కేసులు: 9,674, యాక్టివ్ కేసులు: 7,365, మరణాలు: 66, డిశ్చార్జ్: 2240. చెన్నైలో యాక్టివ్ కేసులు 5637గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో 42,500 మంది ఆశా కార్యకర్తలకు రూ.3వేల వంతున నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించడానికి, గిట్టుబాటు ధర పొందడానికి వీలుగా APMC సవరణ చట్టాన్ని రాష్ట్రం ఆమోదించింది. కాగా, 109మంది ప్రయాణికులతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం బెంగళూరుకు చేరింది. మరోవైపు దుబాయ్ నుంచి విమానంలో మంగళూరుకు తిరిగి వచ్చిన 20 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఈ మధ్యాహ్నం 12 గంటలదాకా రాష్ట్రంలో 45 కొత్త కేసులు నమోదవగా- బెంగళూరు 14, దక్షిణ కన్నడ 16, ఉడుపి 5, బీదర్, హసన్లలో మూడేసి, చిత్రదుర్గ 2, బాగల్‌కోట్-కోలార్‌లలో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1032కి చేరగా, యాక్టివ్‌ కేసులు: 520, కోలుకున్నవి: 476, మరణాలు: 35గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో అర్హులైన 49 లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ పథకం తొలివిడత కింద రూ.5,500 వంతున ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర అందేలా చూస్తామని ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారు. మే 7న విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ ఉదంతంలో ఆస్పత్రిపాలైన వారందరూ పూర్తిగా కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో ఇవాళ 57 కొత్త కోవిడ్-19 కేసులు నమోదవగా మొత్తం కేసులు 2157కి చేరాయి. ఇక 9,038 నమూనాల పరీక్ష అనంతరం గత 24 గంటల్లో 60మంది డిశ్చార్జ్ కాగా, మరణాలేవీ నమోదు కాలేదు. క్రియాశీల కేసులు: 857, కోలుకున్నవి: 1252, మరణాలు: 48. కేసుల సంఖ్య రీత్యా కర్నూలు (599), గుంటూరు (404), కృష్ణా (360), చిత్తూరు (165), నెల్లూరు (140), అనంతపురం (122) జిల్లాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.
 • తెలంగాణ: కోవిడ్-19 మహమ్మారికి తక్షణ చికిత్స కోసం ‘యాంటీబాడీ ఫ్రాగ్మెంట్-బేస్డ్ ఇమ్యునోథెరపీ’ని అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయం-సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థలు శుక్రవారం విన్స్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో జట్టుకట్టాయి. కాగా, ఒడిసానుంచి సొంత రాష్ట్రాలకు వలస కార్మికులను తీసుకెళ్తున్న ఒక ప్రైవేట్‌ ట్రావెల్ ఏజెన్సీ బస్సు వారిని హైదరాబాద్‌లో రహదారిపై వదిలివేసి వెళ్లిపోయింది. రాష్ట్రంలో నిన్నటివరకూ మొత్తం కేసులు 1,414 కాగా, కోలుకున్నవారు 952మంది, యాక్టివ్ కేసులు 428, మరణాలు 34గా నమోదయ్యాయి. ఇవాళ్టిదాకా 42 మంది వలసదారులకు కోవిడ్‌-19 నిర్ధారణ అయింది.

***(Release ID: 1624226) Visitor Counter : 55