రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కొవిడ్‌పై యుద్ధంలో క్రియాశీలంగా జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థలు
ఎన్‌ఐపీఈఆర్‌లు తయారుచేసిన పరికరాల అనుమతులు, వాణిజ్యీకరణకు ప్రాధాన్యత
ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో వేగంగా మార్కెట్‌కు చేరేలా ప్రాధాన్యం
Posted On:
14 MAY 2020 6:07PM by PIB Hyderabad
కొవిడ్-19 గుర్తింపు, నియంత్రణ, చికిత్స దిశగా వివిధ జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థలు (ఎన్‌ఐపీఈఆర్లు) తాము చేసిన బహుముఖ పరిశోధన ప్రతిపాదనలను ఆమోదం కోసం సంబంధిత ఏజెన్సీలకు పెద్ద సంఖ్యలో సమర్పించాయి. కొవిడ్-19ను విచ్ఛిన్నం చేసే యాంటీవైరల్ ఏజెంట్ ప్రొటీజ్ డిజైన్ (ఎన్‌ఐపీఈఆర్-మొహాలీ), ఎఫ్‌డీఏ ఆమోదించిన ఔషధ-డేటాబేస్‌ను ఉపయోగిస్తూ నిర్దేశించిన ఔషధాల పునర్నిర్మాణం (ఎన్‌ఐపీఈఆర్-మొహాలీ, రాయ్‌బరేలీ), రెమ్‌డెసివిర్ ఔషధ మార్పిడిలో అనుకూల ఔషధాల విశ్లేషణ (ఎన్‌ఐపీఈఆర్-మొహాలీ), రోగులు ముక్కు ద్వారా తీసుకునే ఔషధ సహాయక చికిత్స (ఎన్‌ఐపీఈఆర్-హైదరాబాద్), వేగవంతమైన కొవిడ్-19 నిర్ధరణ పరీక్షల కోసం క్వాంటం-డాట్ ఆధారిత, వాహకత ఆధారిత బయోసెన్సర్ అభివృద్ధి (ఎన్‌ఐపీఈఆర్-అహ్మాదాబాద్), కొవిడ్ -19 సమయంలో వస్తున్న గుండెపోట్ల నియంత్రణ గురించి ఆసక్తికర అధ్యయనం ఆయా సంస్థలు సమర్పించిన పరిశోధనల్లో ఉన్నాయి. సంప్రదాయ మూలికలను ఉపయోగించి రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసే విధానంపై భారీ ప్రాజెక్టును ఎన్‌ఐపీఈఆర్-రాయ్‌బరేలీ ప్రారంభించింది. ఇందుకు ఐఐటీ, ఒక పారిశ్రామిక సంస్థను భాగస్వాములుగా చేర్చుకుంది. భారతీయులు ఆర్థికంగా భరిచగలిగే ఐసీయూ వెంటిలేటర్లను రూపొందించేందుకు ఎన్‌ఐపీఈఆర్-కోల్‌కతా పనిచేస్తోంది. ఇందుకు సీఎస్‌ఐఆర్ సీఈసీఆర్‌ఐ, మరో ప్రైవేటు ఉత్పత్తి సంస్థతో చేతులు కలిపింది.
జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థలు (ఎన్‌ఐపీఈఆర్) జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఫార్మాస్యూటికల్ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఈ ఏడు సంస్థలు అహ్మదాబాద్, హైదరాబాద్, హాజీపూర్, కోల్‌కతా, గువాహటి, మొహాలీ, రాయ్‌బరేలీ నుంచి పని చేస్తాయి.
ఫార్మాస్యూటికల్స్ కార్యదర్శి డా. పీడీ వాఘేలా ఆధ్వర్యంలో ఈ సంస్థల డైరెక్టర్లు, ఛైర్మన్లతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగింది. ఆయా సంస్థల పరిశోధనలు, ఆవిష్కరణలపై చర్చించారు. కొవిడ్-19పై పోరాటంలో జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థలకు ఉన్న మార్గాలు, భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ జరిగింది.
3డి ప్రింటెడ్ ఫేస్ షీల్డ్‌ల కోసం ప్రోటోటైప్‌ల కల్పన, ముట్టుకోకుండానే తలుపులు, సొరుగులు, ఎలివేటర్లు తెరిచే 'హ్యాండ్స్ ఫ్రీ ఆబ్జెక్ట్', యాంటీవైరల్ మాస్కులు, చర్మానికి హాని చేయని మూలికా శానిటైజర్ల గురించి గువాహటి ఎన్‌ఐపీఈఆర్ డైరెక్టర్ వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. పంజాబ్‌లో కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయడానికి, మొహాలీఎన్‌ఐపీఈర్ వద్ద ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆర్‌టీ-పీసీఆర్ ఆధారిత పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
రోగులకు వీలైనంత త్వరగా సాయం చేసేలా కొవిడ్-19 సంబంధిత పరిశోధనలు, ఉత్పత్తుల అభివృద్ధి వేగంగా సాగాలని డా.వాఘేలా సూచించారు. తయారైన ఉత్పత్తులకు అనుమతులు, వాణిజ్యీకరణకు ప్రాధాన్యతనిచ్చేలా నియంత్రణ సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దీనివల్ల, ప్రస్తుత అవసర పరిస్థితుల్లో ఆయా ఉత్పత్తులు వేగంగా మార్కెట్ చేరతాయన్నారు. తమ పరిశోధన ప్రయత్నాలు, ప్రజలకు సాయం చేయడంలో సామాజిక భాగస్వామ్యం ద్వారా.., వివిధ సమూహాలతో కలిసి పనిచేయడానికి, దేశానికి సాధ్యమైనంత ఉత్తమ సేవలు అందించడానికి జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థలు కట్టుబడి ఉన్నాయి.
(Release ID: 1623902)
Visitor Counter : 279