రాష్ట్రపతి సచివాలయం
వ్యయాన్ని తగ్గించుకోవడంద్వారా ఆదర్శంగా నిలిచిన రాష్ట్రపతి భవన్
స్వయం సమృద్ధ భారత్ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ కోవిడ్ -19 నిరోధానికి పొదుపు చర్యలు
Posted On:
14 MAY 2020 5:00PM by PIB Hyderabad
కోవిడ్ -19 సహాయ చర్యలకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కోవింద్ ఆదర్శనీయమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన మార్చి నెల జీతాన్ని పిఎం కేర్స్ నిధికి ఇచ్చారు. సంవత్సర జీతంలోని 30 శాతం పిఎం కేర్స్ కు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు.
అంతే కాదు రాష్ట్రపతి భవన్ నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చులను తగ్గించాలని పొదుపు చేసిన డబ్బులను కోవిడ్ -19 పోరాటానికి వినియోగించాలని రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. వ్యయాన్ని తగ్గించుకోవడంద్వారా రాష్ట్రపతి భవన్ అందరికీ ఆదర్శంగా నిలవడానికి ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ నిర్ణయం కారణంగా ఆదా అయ్యే డబ్బు తక్కువే కావచ్చు కానీ ఇది స్వయం సమృద్ధ భారత్ సాధనలో ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్రపతి అన్నారు. వ్యయాన్ని తగ్గించుకోవడానికిగాను రాష్టపతి భవన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇలా వున్నాయి.
1. 2020-21 సంవత్సరానికిగాను కొత్తగా నిర్మాణ పనులు చేపట్టకూడదని నిర్ణయించారు. కొనసాగుతున్న వాటిని మాత్రం పూర్తి చేస్తారు.
2. బాగా అవసరమైతేనే రిపేర్ల పనులు, ఇతర నిర్వాహణ పనులను చేపడతారు.
3. ఇ - టెక్నాలజీ ఉపయోగించడంద్వారా పేపర్ వినియోగాన్ని తగ్గిస్తారు. ఆఫీసును పర్యావరణ హితంగా మారుస్తారు. అలాగే ఇంధన వినియోగాన్ని బాగా తగ్గిస్తారు.
4. రాష్ట్రపతి కార్యక్రమాలకోసమని లిమోసిన్ కారును కొనాలనే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు అందుబాటులో వున్న వాహనాలనే వాడతారు.
5. దేశీయంగా చేసే పర్యటనల్ని చాలా వరకు తగ్గిస్తారు. తద్వారా భౌతిక దూరం నిబంధన పాటించినట్టుగా వుంటుందని, ఖర్చులు కూడా తగ్గుతాయని రాష్ట్రపతి భావించారు. ప్రజలను చేరుకోవడానికిగాను సాంకేతికతను ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి నిర్ణయించారు.
6. రాష్ట్రపతి భవన్ నిర్వహించే ఎట్ హోమ్ లాంటి కార్యక్రమాల్ని తక్కువ ఖర్చుతో నిర్వహిస్తారు. ఇందుకోసం తక్కువ మంది అతిథులను పిలుస్తారు. భౌతిక దూరం పాటించే నిబంధన తప్పకుండా అమలు చేస్తారు. అధికార కార్యక్రమాల అలంకరణకోసం తక్కువ పూలను వినియోగిస్తారు. ఎంతవీలైతే అంత తక్కువగా ఆహార పదార్థాలను వడ్డిస్తారు.
ఈ పొదుపు చర్యల కారణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 20 శాతం ఖర్చులను తగ్గించినట్టవుతుందని అంచనా వేశారు. అయితే రాష్టపతి భవన్ తీసుకుంటున్న పొదుపు చర్యలు కాంట్రాక్ట్ సిబ్బందిపై పడకుండా చూస్తారు. అంతే కాదు రాష్ట్రపతి భవన్ ద్వారా పేద ప్రజల సంక్షేమంకోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కూడా ఈ పొదుపు చర్యల ప్రభావముండదు.
****
(Release ID: 1623976)
Visitor Counter : 234