ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, శ్రీ బిల్ గేట్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు

Posted On: 14 MAY 2020 10:22PM by PIB Hyderabad

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, బిల్ అండ్‌ మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ అధ్య‌క్షుల‌లో ఒక‌రైన శ్రీ బిల్ గేట్స్ మ‌ధ్య వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చ‌ర్చ‌లు జ‌రిగాయి. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితుల గురించి, ఈ సమ‌యంలో శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ల విష‌యంలో అంత‌ర్జాతీయంగా వుండాల్సిన స‌మ‌న్వ‌యం గురించి, మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల గురించి ఈ చ‌ర్చ‌లు కొన‌సాగాయి. 
ప్ర‌జారోగ్య రంగంలో సంభ‌వించిన ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికిగాను భార‌త‌దేశం స‌మ‌ర్థ‌వంత‌మైన విధానాలు అమ‌లు చేస్తోంద‌ని స‌రైన చైత‌న్యాన్ని పెంచుతూ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తుల‌ను చేస్తూ పోరాటం చేస్తోంద‌ని ప్ర‌ధాని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, కింది స్థాయినుంచి అవ‌గాహన పెంచ‌డంవ‌ల్ల భౌతిక దూరానికి ప్ర‌జ‌లు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ప్ర‌ధాని అన్నారు. అంతే కాదు వైర‌స్ ను క‌ట్ట‌డికోసం ముందుభాగంలో నిలిచి ప‌ని చేస్తున్న సిబ్బందికి త‌గిన గౌర‌వ‌మివ్వ‌డంలో‌ను, మాస్కుల‌ను ధ‌రించ‌డంలోను, ప‌రిస‌రాల పారిశుద్ధ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలోను, లాక్ డౌన్ నియ‌మ నిబంధ‌న‌ల్ని అమ‌లు చేయ‌డంలోను ప్ర‌జ‌లు త‌గిన అవ‌గాహ‌న పొందార‌ని అన్నారు. 
క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌స్య రావ‌డానికంటే ముందు దేశంలో కొన‌సాగిన అభివృద్ది కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌ధాని త‌న చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావించారు. పేద‌లంద‌రూ ప్ర‌భుత్వ ఆర్ధిక స‌హాయ సేవ‌ల‌ను పొందేలా చేయ‌డం, వైద్య సేవ‌ల‌ను మారుమూల ప్రాంతాల‌కు కూడా విస్త‌రించి బ‌లోపేతం చేయ‌డం, స్వ‌చ్ఛ భార‌త్ ద్వారా ప‌రిస‌రాల శుభ్ర‌త‌, పారిశుద్ధ్యంపంట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, ఆయుర్వేద విజ్ఞానం ద్వారా ప్ర‌జ‌ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి కృషి చేయ‌డం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌వ‌ల్ల ప్ర‌స్తుతం కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని ఎదుర్కోగ‌లుగుతున్నామ‌ని ప్ర‌ధాని అన్నారు. 
భార‌త‌దేశంతోపాటు ప‌లు దేశాల్లో ఆరోగ్య సేవ‌ల‌ను అందిస్తున్నందుకుగాను గేట్స్ ఫౌండేష‌న్ కు ప్ర‌ధాని అభినంద‌న‌లు తెలిపారు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని తుద‌ముట్టించ‌డానికిగాను గేట్స్ ఫౌండే ష‌న్ చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయమ‌ని ప్ర‌ధాని అన్నారు. ప్ర‌పంచ ప్ర‌జ‌లకు ల‌బ్ధి జ‌రిగేలా భార‌త‌దేశ‌క్తియుక్తుల‌ను ఎలా ఉప‌యోగించాల‌నే విష‌యంపై శ్రీ గేట్స్ త‌గిన సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వాల‌ని ప్ర‌ధాని కోరారు. 
ఈ నేప‌థ్యంలో ఇరువురు నేత‌ల చర్చ‌ల త‌ర్వాత కొన్ని ఆలోచ‌న‌ల‌కు తుదిరూప‌మొచ్చింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అంద‌రికీ ఆరోగ్య సేవ‌లందించ‌డానికిగాను భార‌త‌దేశం అనుస‌రిస్తున్న విశిష్ట విధానం ఆద‌ర్శనీయ‌మ‌ని అన్నారు. వైర‌స్ బాధితుల‌ను గుర్తించ‌డానికిగాను కేంద్ర‌ ప్ర‌భుత్వం అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేష‌న్ , వ్యాక్సిన్లు కనుగొన్న త‌ర్వాత వాటిని భారీ స్థాయిలో ఉత్ప‌త్తి చేయ‌డానికిగాను భార‌త‌దేశం ద‌గ్గ‌ర వున్న స‌దుపాయాలు ప్ర‌పంచానికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డతాయ‌ని ఈ చ‌ర్చ‌ల్లో భావించారు. ఈ నేప‌థ్యంలో మ‌హ‌మ్మారినినుంచి బైట‌ప‌డ‌డానికిగాను అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో, అభివృద్ది చెందుతున్న దేశాల‌కు మేలు చేయ‌డంలో భార‌త‌దేశానికి త‌గిన భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని ఇది చాలా ముఖ్య‌మ‌ని ఈ చ‌ర్చ‌ల్లో ఇరువురు అంగీక‌రించారు. 
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌జ‌ల జీవ‌న శైలిలోను, ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌లోను, సామాజిక ప్ర‌వ‌ర్త‌న‌లోను, విద్య‌, వైద్య రంగాల విస్త‌ర‌ణలోను రావాల్సిన త‌ప్ప‌నిస‌రి మార్పుల‌ను గేట్స్ ఫౌండేష‌న్ విశ్లేషించాల‌ని ప్ర‌ధాని సూచించారు. అంతే కాకుండా వీటికి సంబంధించిన సాంకేతిక స‌వాళ్ల‌ను ఎలా ఎదుర్కోవాలో గేట్స్ ఫౌండేష‌న్ తెలియ‌జేయాల‌ని ప్ర‌ధాని కోరారు. ఇలాంటి విశ్లేషణాత్మ‌క‌ క‌స‌ర‌త్తు విషయంలో త‌న అనుభ‌వాల ఆధారంగా స‌హ‌కారం అందించ‌డానికిగాను భార‌త‌దేశం స‌దా సిద్ధంగా వుంద‌ని ప్ర‌ధాని అన్నారు. 
 

 

****** 



(Release ID: 1623979) Visitor Counter : 288