వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈనామ్‌ ఫ్లాట్‌ఫాం కిందకు కొత్తగా 38 వ్యవసాయ మార్కెట్లు

దేశవ్యాప్తంగా వెయ్యికి చేరిన ఈనామ్‌ మండీలు
18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈనామ్‌ మార్కెట్లు

Posted On: 15 MAY 2020 4:34PM by PIB Hyderabad

దేశంలో మరో 38 మార్కెట్లను ఈనామ్‌ ఫాట్‌ఫాం కిందకు తెచ్చారు. ముందుగా నిర్ణయించిన లక్ష్యం ప్రకారం 415 మండీలను ఏకీకృతం చేసే మైలురాయిని సాధించారు. ఈ 38 మండీల్లో మధ్యప్రదేశ్‌లో 19, తెలంగాణలో 10, మహారాష్ట్రలో 4, గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌, కేరళ, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో మార్కెట్‌ ఉన్నాయి. 

తొలి విడతలో 585 మార్కెట్లను, రెండో విడతలో 415 మార్కెట్లను ఈనామ్‌ ఫ్లాంట్‌ఫాం కిందకు తేవడం ద్వారా మొత్తం 1000 మార్కెట్ల మైలురాయిని సాధించారు. ఈ వెయ్యి మార్కెట్లు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి.

ఈనామ్‌ వ్యవస్థను, స్మాల్‌ ఫార్మర్స్‌ అగ్రిబిజినెస్‌ కన్సార్టియం (ఎస్‌ఎఫ్‌ఏసీ) రూపొందించింది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ ప్రాజెక్టుకు ఎస్‌ఎఫ్‌ఎసీ ప్రధాన ఏజెన్సీగా ఉంది. ఈనామ్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర మార్కెటింగ్‌ బోర్టులు, మండీ సెక్రటేరియట్లు, సూపర్‌వైజర్లు, నాణ్యత పరీక్షకులు, వెయిట్‌ ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు, రైతులు, పీఎఫ్‌వోలు, వ్యాపారులు, ఈనామ్‌ బృందం మద్దతుతో పనిచేస్తోంది.

వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ స్థాయిలో విక్రయించుకునేలా రూపొందించిన ఈనామ్‌ (ఎలక్ట్రానిక్ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) పోర్టల్‌ను 2016 ఏప్రిల్‌ 14న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించారు. "ఒకే దేశం-ఒకే మార్కెట్‌" నినాదంతో, ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లన్నింటినీ ఒకే ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఫ్లాట్‌ఫాం కిందకు తేవాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.     

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫాం ద్వారా, అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల సమాచారం, సేవలు సింగిల్‌ విండో పద్ధతిలో అందుతాయి. మార్కెట్లలోకి ఉత్పత్తుల రాక, నాణ్యత, పోటీ బిడ్లు, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ వంటి సేవలు కూడా ఈనామ్‌ ద్వారా అందుతాయి. లావాదేవీల ఖర్చులు తగ్గించడం, సమాచార లోపాలను పూరించడం, రైతులు, ఇతరులకు మార్కెట్‌ను మరింత చేరువ చేయడం వంటివాటిని ఈ ఆన్‌లైన్‌ డిజిటల్‌ మార్కెట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

గత నాలుగేళ్లలో, 1.66 కోట్ల మంది రైతులు, 1.31 లక్షల మంది వర్తకులు, 73,151 మంది కమీషన్‌ ఏజెంట్లు ఈనామ్‌లో నమోదయ్యారు. 1012 ఎఫ్‌పీవోలు కూడా దీనిలో చేరాయి. 14, మే 2020 నాటికి, 3.43 కోట్ల మెట్రిక్‌ టన్నులు & 38.16 లక్షల వెదురు, కొబ్బరికాయలను ఈనామ్‌ ఫ్లాట్‌ఫారం ద్వారా విక్రయించి, లక్ష కోట్ల వ్యాపారాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఆహారధాన్యాలు, నూనెగింజలు, ఫైబర్లు, పండ్లు, కూరగాయలు సహా 150 ఉత్పత్తులను ఈనామ్‌ ద్వారా విక్రయిస్తున్నారు.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఏప్రిల్‌ 2, 2020న ఈనామ్‌లో మూడు కొత్త విధానాలను ప్రారంభించారు. 

1. ఈనామ్‌లో ఎఫ్‌పీవో విధానం: "డీమ్డ్ మార్కెట్" లేదా "సబ్ మార్కెట్ యార్డులు"గా ప్రకటించిన సేకరణ కేంద్రాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించడానికి FPOలకు ఇది వీలు కల్పిస్తుంది. మే 14, 2020 నాటికి, 1012 ఎఫ్‌పీవోలు ఈనామ్‌ ఫ్లాట్‌ఫాం కింద నమోదయ్యాయి. 8.11 కోట్ల రూపాయల విలువైన 3053 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తుల వ్యాపారం చేశాయి. కొత్తగా ప్రకటించిన ఎఫ్‌పీవో మాడ్యూల్‌ కింద, వీటిలో 42 ఎఫ్‌పీవోలు తమ సొంత సేకరణ కేంద్రాల ద్వారా వ్యాపారం చేశాయి. 

2. వేర్‌ హౌస్‌ బేస్డ్‌ ఎలక్ర్టానిక్‌ నెగోషియబుల్‌ వేర్‌హౌస్‌ రిసిప్ట్స్‌ (eNWR) ట్రేడ్‌: eNWR ఆధారిత వర్తకం కోసం, డబ్ల్యూడీఆర్‌ఏ గుర్తింపు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని 23, తెలంగాణలోని 14 గిడ్డంగులను డీమ్డ్‌ మార్కెట్లుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవలే 138 రాష్ట్ర ప్రభుత్వ, సహకార గిడ్డంగులను ఉప మార్కెట్ యార్డులుగా ప్రకటించింది. గిడ్డంగి ఆధారిత వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు తమ చట్టాలలో సవరణలను ప్రారంభించాయి.

3. లాజిస్టిక్స్‌ విధానం‌: వ్యవసాయ క్షేత్రాల నుంచి మార్కెట్లకు, మార్కెట్ల నుంచి గిడ్డంగులు/వినియోగ కేంద్రాలకు ఉత్పత్తులను రవాణా చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. 2.3 లక్షల మంది రవాణాదారులు, 11.37 లక్షల వాహనాలతో అనుసంధానమైన తొమ్మిది లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్లు/అగ్రిగేటర్లు ఈనామ్ ప్లాట్‌ఫాం కింద సేవలు అందిస్తున్నారు.

మే 1, 2020న, ReMS, ఈనామ్‌ పోర్టల్‌ మధ్య ( ఏకీకృత మార్కెట్‌ పోర్టల్‌-యూఎంపీ) సహాయ, సహకారాలను ప్రారంభించారు. ఈ కొత్త విధానంలో కర్ణాటక ReMSతోపాటు ఈనామ్‌ ఫ్లాట్‌ఫాం కింద ఉన్న రైతులు, వ్యాపారులు వాణిజ్యం కోసం మరిన్ని మార్కెట్లకు చేరువయ్యే వీలుంది. 

ఈ విప్లవాత్మక అడుగులు "ఒకే దేశం-ఒకే మార్కెట్‌" లక్ష్యం దిశగా ఈనామ్‌ ఫ్లాట్‌ఫాంను మరింత బలోపేతం చేస్తాయి. దేశంలో ఆన్‌లైన్ విక్రయాలను బలోపేతం చేసేలా  రైతులు, వ్యాపారులు, మార్కెట్లు సమష్టిగా కలిసి పనిచేయడానికి, ఈనామ్‌ పోర్టల్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కృషి చేస్తాయి. 

 

***


(Release ID: 1624203) Visitor Counter : 359