రైల్వే మంత్రిత్వ శాఖ

రోజుకు 4 రైళ్ల స్థాయి నుండి 145 రైళ్ల స్థాయికి సామ‌ర్థ్యాన్ని పెంచుతూ శ్రామిక్ స్పెష‌ల్ ద్వారా మిష‌న్ "బ్యాక్ హోమ్" కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేసిన భార‌త రైల్వే

‌- వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారంద‌రినీ తిరిగి తమ సొంత రాష్ట్రాలకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో.. ఒక్క రోజులో రెండు లక్షలకు పైగా వలసదారుల్ని రవాణా చేసే మైలురాయి దాటేసిన భార‌త రైల్వే
- ఈ నెల ఒక‌టో తేదీన సుమారు 5000 మంది ప్రయాణికులతో మొద‌లై.. మే 14వ తేదీ నాటికి 2.10 లక్షలకు పైగా ప్ర‌యాణికుల చేర‌వేత మైలు రాయిని రెండు వారాలలోపు దాటింది

- ఈ “శ్రామిక్‌ స్పెషల్” రైళ్ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 12 లక్షలకు పైగా ప్రయాణికులు తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు

- వలసదారులను ఇంటికి చేర్చేందుకు గాను ఇప్పటివరకు 1000 కి పైగా “శ్రామిక్‌ స్పెషల్” రైళ్లు పనిచేశాయి

- వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వారి కోసం మిషన్ మోడ్‌లో “శ్రామిక్‌ స్పెషల్” రైళ్ల ద్వారా రోజుకు 4 లక్షలకు పైగా పౌరులను రవాణా చేయడానికి.. రోజుకు 300 “శ్రామిక్ స్పెషల్” రైళ్లను నడపడానికి సిద్ధ‌మైన భార‌త రైల్వే

Posted On: 15 MAY 2020 3:40PM by PIB Hyderabad

కోవిడ్-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విధించిన లా‌క్‌డౌన్ కార‌ణంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేర‌కు, దేశంలోని వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వలస కూలీలు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు మరియు ఇతర వ్యక్తులను స్వ‌స్థ‌లాల‌కు తరలించడానికి భార‌తీయ రైల్వే "శ్రామిక్ స్పెషల్" రైళ్ల సేవ‌ల‌ను ప్రారంభించింది. మే 1వ తేదీ "కార్మిక దినోత్సవం" సందర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.
ఒకే రోజు 2.10 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు..
మే 1వ తేదీ నాడు కేవలం 4 రైళ్లతో ఈ త‌ర‌లింపు కార్య‌క్ర‌మం మొద‌లైంది. గ‌డిచిన ప‌క్షం రోజుల్లో దాదాపు 1000 కి పైగా శ్రామిక్ రైళ్లు న‌డ‌ప‌బ‌డ్డ‌యి. ఈ నెల 14వ తేదీన‌ వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 145 "శ్రామిక్ స్పెషల్" రైళ్లు 2.10 లక్షల మంది ప్రయాణికుల్ని తిరిగి తమ సొంత రాష్ట్రాలకు తీసుకు వెళ్లాయి. భార‌త రైల్వేకు ఇది అద్భుత విజయం. ఒకే రోజులో "శ్రామిక్ స్పెషల్" రైళ్ల‌లో ప్రయాణీకుల సంఖ్య దాదాపు రెండు లక్షలను దాటడం ఇదే మొదటి సారి. తోలి రోజు అంటే ఈ నెల 1వ తేదీన "శ్రామిక్ స్పెషల్" రైళ్లు కేవలం 5000 మంది ప్రయాణికులతో కార్యకలాపాల‌ను ప్రారంభించిన విష‌యం ఇక్క‌డ స్పుర‌ణ‌కు వ‌స్తుంది.
4 లక్షల మంది ప్ర‌జ‌ల‌ను రవాణా చేయడానికి సిద్ధం..
"శ్రామిక్ స్పెషల్" రైళ్ల ద్వారా ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా ప్రయాణికులు తమత‌మ‌ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌‌, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల‌లో ఈ రైళ్లు సేవ‌లందించాయి.
వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వలసదారులు అందరినీ తిరిగి స్వ‌స్థ‌లాల‌కు తీసుకెళ్లేందుకు తన మిషన్‌లో రోజుకు 4 లక్షల మంది ప్ర‌జ‌ల‌ను రవాణా చేయడానికి కూడా తాము సిద్ధ‌మ‌ని భార‌తీయ రైల్వే తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రోజుకు దాదాపు 300 "శ్రామిక్ స్పెషల్" రైళ్లు నడపడానికి కూడా సన్నద్ధమేన‌ని రైల్వే స‌గ‌ర్వంగా వెల్ల‌డించ‌డం విశేషం. ప్రయాణీకులను పంపుతున్న రాష్ట్రం మరియు వారిని స్వీకరిస్తున్న రెండు రాష్ర్టాల సమ్మతి తరువాత మాత్రమే "శ్రామిక్ స్పెషల్" రైళ్లను రైల్వే నడుపుతోంది. ఈ రైలు ఎక్కే ముందు ప్రయాణీకులను పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు. ఈ ప్రయాణంలో ప్రయాణీకులకు ఉచితంగా భోజనం మరియు మంచి నీరును కూడా అందిస్తున్నారు. 

 


(Release ID: 1624222) Visitor Counter : 227