రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తో పోరాటానికి వినూత్న 3డి ఉత్పత్తులను రూపొందించిన - ఎన్.ఐ.పి.ఆర్.

ఈ ఉత్పత్తుల తయారీ హెచ్.ఏ.ఎల్. సహకారంతో జరుగుతోంది.

Posted On: 15 MAY 2020 4:06PM by PIB Hyderabad

గువాహటి లోని జాతీయ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధనా సంస్థ - (ఎన్.ఐ.పి.ఆర్.-జి.)  కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణకు సహాయపడే రెండు ఉత్పత్తులను రూపొందించింది.  

 

 

మొదటి ఉత్పత్తి, 3డి సాంకేతిక పరిజ్ఞానంతో ముద్రితమైన, చేతులతో పెట్టుకోవలసిన అవసరంలేని వస్తువు.  ఇది తలుపులు, కిటికీలు, డ్రాయర్లు (నిలువుగా ఉన్నవి, అడ్డంగా ఉన్నవి), రెఫ్రిజిరేటర్, లిఫ్టులు, లాప్ టాప్ / డెస్క్ టాప్ కీ బోర్డులు తెరవడానికి లేదా మూసివేయడానికి సహాయపడుతుంది. ఇది స్విచ్ బటన్లు ఆన్ చేయడానికి, ఆఫ్ చెయ్యడానికి కూడా పనికి వస్తుంది.  వైరస్ లు  చేతుల ద్వారా ఎలా వ్యాప్తి చెందుతాయి అనే విషయాన్ని పరిశీలించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అనేక వనరులను సవివరంగా విశ్లేషించిన అనంతరం 3 డి-ప్రింటెడ్ వస్తువు రూపకల్పన కోసం పరిశోధకులు ముందుకు వచ్చారు.  ఫేస్ షీల్డ్ రూపకల్పన చేయడం కూడా సులభం . అదేవిధంగా ప్రోటోటైప్‌ల వేగవంతమైన అభివృద్ధిని కలిగి ఉండటం సాధ్యమే.  దీని ధర చాలా తక్కువ, సులువుగా ధరించవచ్చు, మంచి రసాయన స్థిరత్వాన్ని కలిగి ఉంది, పెళుసుగా లేదు, ఇప్పటికే అందుబాటులో ఉన్న శానిటైజర్ లేదా ఆల్కహాలిక్ క్రిమిసంహారక మందులతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. 

రెండవ ఉత్పత్తి - నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి 3 డి-ప్రింటెడ్ యాంటీమైక్రోబయల్ ఫేస్-షీల్డ్.  నోరు, కళ్ళు, ముక్కు,  ఇతర శరీర కుహరాల ద్వారా వైరస్ లు  ఎలా వ్యాపిస్తాయో అర్థం చేసుకోవడానికి  అవసరమైన సమగ్ర అధ్యయనం తర్వాత దీన్ని రూపొందించారు. 

ఈ  ఎన్.ఐ.పి.ఆర్. లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యుటికల్స్ విభాగం పరిధిలో ని అత్యుత్తమ శ్రేణి సంస్థలు. మొత్తం 7 సంస్థలు అహ్మదాబాద్, హైదరాబాద్, హాజీపూర్కోల్కతా, గువాహటి, మొహాలీరాయబరేలి లలో పనిచేస్తున్నాయి. 

ఫార్మాస్యుటికల్స్ కార్యదర్శి డాక్టర్ పి.డి.వాఘేలా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక సమావేశం జరిగింది.  పరిశోధన, ఆవిష్కరణల కార్యకలాపాల్లో ఎన్.ఐ.పి.ఆర్. సంస్థల పనితీరుపై ఈ సమావేశంలో సమీక్షించారు.  కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఎన్.ఐ.పి.ఆర్. సంస్థలు  ఏ విధమైన సేవలందించే అవకాశం ఉన్నదనే విషయంపై ముఖ్యంగా చర్చించారు. 

చైర్మన్ తో పాటు డైరెక్టర్లు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.  శీఘ్ర ధృవీకరించబడిన ప్రోటోటైప్ / ఉత్పత్తి అభివృద్ధిచేసి, విస్తరింప చేయడం ద్వారా  ఎన్.ఐ.పి.ఆర్.-జి., కరోనా వైరస్ తో పోరాడుతున్న దేశానికి ఎంతగానో సహాయపడుతోంది.  "ఎన్.ఐ.పి.ఆర్.-జి., ఉపయోగకరమైన సేవలు, పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉంది.  చర్మానికి ఎటువంటి హాని చేయని స్నేహపూర్వక మూలికా శానిటైజర్‌ను కూడా ఎన్.ఐ.పి.ఆర్.-జి. తయారుచేసింది." - అని ఆయన చెప్పారు. ఈ కొత్త ఉత్పత్తుల పారిశ్రామిక స్థాయి తయారీని శాఖాపరమైన ప్రభుత్వ రంగ సంస్థ  హిందూస్తాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఏ.ఎల్.) సహకారంతో చేయనున్నారు. 

ఇళ్లల్లో, ఆసుపత్రుల్లో, ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో, సంస్థల్లో, ఇతర భవనాల్లో ముఖ్యంగా తలుపులు, కిటికీలు, స్విచ్ బటన్లు, లిఫ్ట్ బటన్లు, డ్రాయర్ హేండిల్, రిఫ్రిజిరేటర్ హేండిల్, లాప్ టాప్ / డెస్క్ టాప్ కీబోర్డులు మొదలైనవి సూక్ష్మ క్రిములు ఎక్కువగా సోకే అవకాశమున్న వస్తువులు.  కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో,  చేతులు కలపడం లేదా కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వైరస్  ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాప్తి చెందడానికి ఈ అంశం కీలక పాత్ర పోషిస్తుంది.

********



(Release ID: 1624189) Visitor Counter : 214