PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 05 MAY 2020 6:22PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • మొత్తం 46,433 కోవిడ్‌-19 కేసులకుగాను 12,726 మందికి నయంకాగా- కోలుకున్నవారు 27.41%.
  • నిన్నటినుంచి 3,900 కొత్త కేసులు నమోదవగా, 195 మరణాలు సంభవించాయి.
  • కోవిడ్‌-19 నియంత్రణ వ్యూహం, నిర్వహణాంశాలపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృత చర్చలు
  • దేశంలో పీపీఈలు, మాస్కులు, వెంటిలేటర్లు, మందులు, ఇతర నిత్యావసర పరికరాల కొరత లేదు.
  • ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఇప్పటిదాకా కోట్లాది పేదలకు సహాయం.
  • ‘నామ్‌’ సంప్రదింపుల బృందం ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి; ఆర్థికవృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా మానవాళి సంక్షేమానికీ పాటుపడాలని పిలుపు.
  • ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల విద్యార్థులకు 2020-21లో ఫీజులు పెరగవు; జేఈఈ మెయిన్స్‌ తేదీ ప్రకటన.
  • వాట్సాప్‌, ఈ-మెయిల్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తున్న జనౌషధి కేంద్రాలు

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌-19 బారినపడి నయమైనవారి సంఖ్య 12,726కు చేరగా, కోలుకున్నవారి శాతం 27.41గా ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 42,553కాగా, నిన్నటినుంచి 3,900 కొత్త కేసులు నమోదవగా 195 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,568కి పెరిగింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్త కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన నేపథ్యంలో నిర్ధారిత రోగులతో సంబంధంగలవారి కోసం నిశితంగా అన్వేషించాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అదే సమయంలో యాక్టివ్‌ కేసుల శోదన, వైద్యపరమైన నిర్వహణలపై శ్రద్ధ చూపాలని కోరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621274

దేశంలో కోవిడ్‌-19 ప్రస్తుత స్థితి, నిర్వహణ సన్నద్ధత-కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష

దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 నియంత్రణ వ్యూహం, నిర్వహణ అంశాలతోపాటు కేంద్ర-రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై మంత్రివ‌ర్గ ఉపసంఘం లోతుగా చర్చించింది. ప్రస్తుతం మరణాల శాతం 3.2 కాగా, కోలుకుంటున్న‌వారి శాతం 25క‌న్నా ఎక్కువగా ఉన్న‌ట్లు అధికారులు నివేదించ‌డంతో క్ల‌స్ట‌ర్ల నిర్వ‌హ‌ణ‌-నియంత్ర‌ణ వ్యూహంతోపాటు  దిగ్బంధం స‌త్ఫ‌లితాలిస్తున్న‌ట్లు ప‌రిగ‌ణించ‌వ‌చ్చున‌ని అభిప్రాయ‌ప‌డింది. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాలలో రోగుల నుండి సేక‌రించిన న‌వ్య కరోనావైరస్ జన్యు క్ర‌మంపై విశ్లేష‌ణ ప్రారంభ‌మైంది. దేశంలో పీపీఈలు, మాస్కులు, వెంటిలేటర్లు, మందులు, ఇతర అత్య‌వసర పరికరాలకు కొర‌త‌లేద‌ని, అవ‌స‌రం మేరకు అన్నీ ల‌భ్య‌మ‌వుతున్నాయ‌ని అధికార‌వ‌ర్గాలు నివేదించాయి. ఇక పీఎంజీకేపీ కింద 2020 మే 4 నాటికి 29.38 లక్షల టన్నుల ఆహారధాన్యాలను మొదటి నెల పంపిణీ కింద 58.77 కోట్లమందికి, రెండో నెల పంపిణీ కింద 5.82 లక్షల టన్నులను 11.63 కోట్ల మంది లబ్ధిదారుల‌కు అంద‌జేయ‌డం పూర్త‌యింది. మ‌రోవైపు 2020 ఏప్రిల్-మే నెలల్లో 4.98 కోట్లమంది పీఎంయూవై ల‌బ్ధిదారులు వంట‌గ్యాస్ బుక్ చేసుకోగా, 4.72 కోట్ల మందికి పంపిణీ చేయబడ్డాయి. అలాగే 2020-21కిగాను రైతుల‌కు ఆర్థిక స‌హాయం కింద 8.18 కోట్ల మందికి రూ.2000/ వ‌ంతున విడుద‌ల చేయ‌బ‌డింది. వ‌యోజ‌న పౌరులు, వితంతువులు, దివ్యాంగుల‌కు మద్దతుగా అర్హతగ‌ల‌ 2.812 కోట్ల లబ్ధిదారుల ఖాతాలకు తొలివిడ‌త సాయం రూ.500 జ‌మచేయ‌బ‌డింది. అలాగే 20.05 కోట్ల మంది మహిళల ప్రధాన‌మంత్రి జన్‌ధ‌న్ ఖాతాలకూ రూ.500 వంతున జ‌మ చేయ‌బ‌డింది. అంతేకాకుండా దేశ‌వ్యాప్తంగా 9.27 లక్షల మంది ఉద్యోగుల భ‌విష్య‌నిధి చందాదారులు ఆన్‌లైన్ ఉపసంహరణ సౌకర్యం ద్వారా రూ.2,895 కోట్లు వాప‌సు తీసుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621396

‘నామ్‌’ సంప్రదింపుల బృందం ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 మే 4వ తేదీ సాయంత్రం అలీనోద్యమ దేశాల కూటమి (నామ్‌) సంప్రదింపుల బృందం ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి సంక్షోభంపై ప్రతిస్పందనపై ఈ సందర్భంగా చర్చ సాగింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621146

 ‘నామ్‌’ సంప్రదింపుల బృందం దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం సందర్భంగా కోవిడ్‌-19 ప్రతిస్పందనపై ప్రధానమంత్రి స్పష్టీకరణ

“దశాబ్దాలుగా ఎన్నడూ ఎరుగని తీవ్ర సంక్షోభాన్ని మానవాళి ఇవాళ ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో అంతర్జాతీయ సంఘీభావాన్ని అలీనోద్యమం (నామ్‌) ప్రోత్సహించాలి. అనేక సందర్భాల్లో ప్రపంచ నైతికగళంగా నామ్‌ తనవంతు పాత్ర పోషించింది. ఈ పాత్రను కొనసాగించేలా తన సార్వజనీనతను నిలబెట్టుకోవాలి. నేటి ప్రపంచ అవసరాలకు తగినట్టు స్పందించే అంతర్జాతీయ సంస్థలు మనకిప్పుడు అవసరం. అలాగే ఆర్థికవృద్ధిపై దృష్టి సారించడం  ఒక్కటే కాకుండా మానవాళి సంక్షేమాన్ని మనం ప్రోత్సహించాలి. అటువంటి వినూత్న చర్యలలో భారత్‌ సదా ముందు నిలుస్తుంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621145

వెబినార్‌ ద్వారా దేశంలోని విద్యార్థులతో సంభాషించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి

దేశంలోని విద్యార్థులతో వెబినార్‌ద్వారా సంభాషించిన సందర్భంగా పెండింగ్‌లోగల పరీక్షల తేదీలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకటించారు. ఈ మేరకు నీట్‌ (NEET) 2020 జూలై 26న నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష 2020 జూలై 18, 20, 21, 22, 23 తేదీలలో జరుగుతుందని, జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఇక యూజీసీ నెట్‌-2020, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇక 2020-21కిగాను ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీలలో ఫీజుల పెంపు ఉండదని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621253

దిగ్బంధం నేపథ్యంలో మందుల కొనుగోలుకు వాట్సాప్‌, ఈ-మెయిల్‌ద్వారా ఆన్‌లైన్‌ ఆర్డర్లను అంగీకరిస్తున్న ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు

దేశంలోని 726 జిల్లాల్లో ప్రస్తుతం 6,300కుపైగా ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు ప్రజలకు చౌకధరలో నాణ్యమైన మందులను అందిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో విక్రయించే మందులు సగటున 50 నుంచి 90 శాతందాకా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ నెలలో దాదాపు రూ.52 కోట్ల రూపాయల విలువైన మందులను ఈ కేంద్రాలు వినియోగదారులకు అందించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621167

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పెన్షనర్లకు రూ.764 కోట్లు విడుదల

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ-ఈపీఎఫ్‌వో పెన్షన్‌ పథకం కింద 65 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో వీరందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడటం కోసం మొత్తం 135 క్షేత్రస్థాయి కార్యాలయాలద్వారా 2020 ఏప్రిల్ నెల పెన్షన్‌ మొత్తాన్ని ఈపీఎఫ్‌వో ముందుగానే మంజూరు చేసింది. ఆ మేరకు అన్ని ఇబ్బందులనూ అధిగమించిన అధికారులు, సిబ్బంది రూ.764 కోట్లను దేశవ్యాప్తంగా పెన్షన్‌ పంపిణీచేసే నోడల్‌ బ్యాంకు శాఖలకు విడుదల చేశారు. తదనుగుణంగా నిర్ణీత ప్రక్రియ ప్రకారం పెన్షనర్ల ఖాతాల్లో పెన్షన్‌ మొత్తాన్ని జమచేయాల్సిందిగా అన్ని శాఖలనూ ఈపీఎఫ్‌వో ఆదేశించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621181

కోవిడ్‌-19పై జాతి పోరాటంలో ఎన్‌సీసీ నిర్వహించిన పాత్రపై రక్షణ మంత్రి సమీక్ష

కోవడ్‌-19పై దేశం చేస్తున్న పోరాటంలో ఎన్‌సీసీ కేడెట్లు నిర్వహించిన పాత్రపై రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించారు. దేశం నేడు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నదని, కోవిడ్‌-19 నియంత్రణలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ప్రభుత్వం అనేక సమర్థ చర్యలు తీసుకున్నదని సమీక్ష ప్రారంభం సందర్భంగా రాజ్‌నాథ్‌ చెప్పారు. కాగా, ప్రభుత్వ కృషికి తోడ్పాటుగా ఎన్‌సీసీ కార్యకర్తలు రవాణా, సరఫరా శృంఖల నిర్వహణ బాధ్యతలతోపాటు నిత్యావసర ఆహారపదార్థాలు, మందుల సరఫరా, ట్రాఫిక్‌ నియంత్రణ విధుల్లో సహాయం తదితర రూపాల్లో తమవంతు సేవలందించారు. మరికొందరు కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించేందుకు వీడియోలు రూపొందించగా, మరికొందరు మాస్కులు తయారుచేసి, స్థానికంగా పంపిణీ చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621270

కోవిడ్‌-19పై డీఏఆర్‌పీజీ పరిధిలో 2020 మార్చి 30 నుంచి 2020 మే4 దాకా ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రగతి నివేదికమీద దేశంలోని 28 రాష్ట్రాలు/9 కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించిన డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ఈ వ్యవధిలో డీఏఆర్‌పీజీలోని జాతీయ కోవిడ్‌-19 ప్రజా సమస్యల పర్యవేక్షణ విభాగం (https://darpg.gov.in) 52,327 ఫిర్యాదులు పరిష్కారమైనట్లు పేర్కొంది. ఇందులో కేంద్ర మంత్రులు, శాఖలు పరిష్కరించినవి 41,626. కాగా, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవధి ఫిర్యాదుకు సగటున 1.45 రోజులు మాత్రమే కావడం గమనార్హం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621271

‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద 443 విమానాలను నడిపిన ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ప్రైవేటు విమాన సంస్థలు

 ‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 443 విమానాలను నడిపాయి. ఈ విమానాలు దేశవ్యాప్తంగా 4,34,531 కిలోమీటర్లు ప్రయాణించి, 821.07 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భారత ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలకు పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ సంస్థసహా పలు హెలికాప్టర్‌ సర్వీసులు కీలక వైద్య సామగ్రితోపాటు కోవిడ్‌-19 రోగులను కూడా తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా పవన్‌హన్స్‌ సంస్థ హెలికాప్టర్లు 2020 మే 3వ తేదీదాకా 7,729 కిలోమీటర్లు ప్రయాణించి 2.27 టన్నుల వస్తుసామగ్రిని చేరవేశాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621047

దిగుమతులకు ప్రత్యామ్నాయ విధానంపై యోచన: శ్రీ నితిన్‌ గడ్కరీ

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి సృష్టించిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త దిగుమతి ప్రత్యామ్నాయ విధానంపై ప్రభుత్వం యోచన చేస్తున్నదని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డురవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ ఇవాళ వెల్లడించారు. వినూత్న ఆవిష్కరణలతో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, నాణ్యతను పెంచడంద్వారా  విజ్ఞానాన్ని సంపదగా మార్చడంపై దృష్టి సారించాలని వివిధ భాగస్వాములకు ఆయన సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621272

వ్యవసాయ ఎంఎస్‌ఎంఈ విధానంపై దృష్టి సారించిన కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ: శ్రీ నితిన్‌ గడ్కరీ

దేశం నుంచి ఎగుమతులను పెంచడంతోపాటు దిగుమతులను తగ్గించే దిశగా వాటికి ప్రత్యామ్నాయాలను దేశీయంగా ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి సూచించారు. సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు ఆవిష్కరణ, వ్యవస్థాపన, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన నైపుణ్యం, అనుభవాల ఆధారంగా విజ్ఞానాన్ని సంపదగా మార్చేందుకు కృషిచేయాలని కోరారు. చైనానుంచి మరేదైనా దేశానికి పెట్టుబడులను తరలించే తమ పరిశ్రమలకు జపాన్‌ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సదరు అవకాశాన్ని భారత (పరిశ్రమలు) సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621059

శీతల గిడ్డంగుల శృంఖల సంస్థలతో శ్రీమతి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

కోవిడ్‌-19 సంక్షోభం దేశంలో ఆహార ఉత్పత్తుల సరఫరా గొలుసుకు పెనుసవాలు విసిరిన నేపథ్యంలో సమీకృత శీతల గిడ్డంగుల శృంఖలం సమష్టి శక్తిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీమతి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ నొక్కిచెప్పారు. దిగ్బంధం కారణంగా సంప్రదాయ మార్కెట్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, విందువినోద కార్యక్రమాలు వగైరాలన్నీ స్తంభించినందువల్ల శీతల గిడ్డంగుల్లో పేరుకుపోయిన కూరగాయలు, పాడి ఉత్పత్తుల నిల్వలు గడ్డకట్టుకుపోతున్నాయి. దీనికితోడు ఎగుమతులు కూడా ఆగిపోవడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పలు సమస్యలపై మంత్రి చర్చించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621046

డీఎస్టీ ఎంత లోతైన శాస్త్రవిజ్ఞాన రూపశిల్పిగా మారుతున్నదో తేటతెల్లం చేస్తున్న కోవిడ్‌-19 సంక్షోభం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621203

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగ‌ఢ్‌: ఈ కేంద్ర‌పాలిత ప్రాంతంలోని బాపూధామ్ కాలనీ, సెక్టార్ 30-బి త‌దిత‌ర నియంత్ర‌ణ జోన్ల‌పై నిశితంగా దృష్టి సారించాల‌ని న‌గ‌ర‌ పాల‌నాధికారి సీనియర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో అనుమానిత కేసుల వ‌డ‌పోత‌, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంకింద‌ చేపట్టాల‌ని ఆరోగ్య సేవ‌ల  డైరెక్ట‌ర్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా ప్ర‌దేశాల‌కు వెళ్లే సిబ్బందికి వ్యాధి సంక్ర‌మించ‌కుండా త‌గిన వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి ధ‌రించి వెళ్లాల‌ని సూచించారు.
  • పంజాబ్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని వృద్ధులు, వ‌యోజ‌నుల ప్రత్యేక సంరక్షణకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సలహాప‌త్రం జారీచేసింది. క‌రోనా వైరస్ నిరోధ‌క ‌శ‌క్తి తక్కువగా ఉండటంతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ, గుండె, మూత్రపిండాలు, కాలేయ రుగ్మతలతో బాధపడుతున్న వ‌యోజ‌నులు... 60 ఏళ్లు దాటిన‌వారి సంక్షేమం ల‌క్ష్యంగా ఈ స‌ల‌హాప‌త్రం జారీచేసింది. మ‌రోవైపు దిగ్బంధం కొన‌సాగుతున్న కార‌ణంగా చిన్న-సూక్ష్మ- కుటీర పరిశ్రమలు ఎదుర్కొంటున్న‌ దుస్థితిపై ముఖ్య‌మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇటువంటి ప‌రిశ్ర‌మ‌ల‌ను కుటుంబ‌స‌భ్యుల‌తో లేదా ఇరుగుపొరుగుతో న‌డిపేందుకు అనుమ‌తించాల్సిందిగా ఆయ‌న కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు.
  • హర్యానా: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేర‌కు రాష్ట్ర ఆయుష్ శాఖ కరోనా యోధుల రోగ‌నిరోధ‌క శ‌క్తికి పెంచే మందుల‌ను వారికి పంపిణీ చేస్తోంది.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఉచిత పంపిణీ కోసం ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ విరాళంగా అంద‌జేసిన ఆహారం, ఇత‌ర నిత్యావ‌స‌ర సామ‌గ్రితో కూడిన మూడు ట్రక్కులను ముఖ్యమంత్రి జండా ఊపి సాగ‌నంపారు. సమాజానికి తోడ్పాటునిచ్చే విధంగా ఇతర సంస్థలకూ ఈ దాతృత్వ చర్య ప్రేర‌ణనిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్నారు.
  • కేరళ: విదేశాల నుంచి తిరిగివ‌చ్చేవారికి వ్య‌వ‌స్థాగ‌త నిర్బంధానికి బ‌దులు స్వీయ గృహ‌నిర్బంధానికి అనుమ‌తించేలా ఆదేశాల‌ను స‌వ‌రించాల‌ని కేంద్రాన్ని కోరుతామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలిపింది. గ‌ల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న కేర‌ళ‌వాసుల‌తో వ‌స్తున్న తొలి విమానం ఈ నెల 7న కేర‌ళ చేర‌నుంది. ఇందులో భాగంగా కేవ‌లం కేర‌ళ‌వాసుల కోస‌మే మొత్తం 15 విమానాలు న‌డ‌వ‌నున్నాయి. మ‌రోవైపు ఇత‌ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లో మ‌ల‌యాళీలు వ‌స్తుండ‌టంతో రాష్ట్రంలోని ఆరు ప్ర‌వేశ మార్గాల‌వ‌ద్ద ర‌ద్దీ విప‌రీతంగా ఉంది. కాగా, ఉద్యోగుల జీతాల వాయిదాపై ప్ర‌భుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ నిలిపివేత ఉత్త‌ర్వులిచ్చేందుకు హైకోర్టు తిర‌స్క‌రించింది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసులు: 499, యాక్టివ్ కేసులు: 34, డిశ్చార్జ్ అయిన‌వారు: 465, మొత్తం మరణాలు: 4.
  • తమిళనాడు: రాష్ట్రంలోని అమ్మ క్యాంటీన్ల‌లో పనిచేసేవారితోపాటు ఆవిన్ పాల క‌ర్మాగారం కార్మికులకు కోవిడ్‌-19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. మ‌రోవైపు చెన్నైలో సోమవారం దిగ్బంధాన్ని కాస్త స‌డ‌లించ‌డంతో వందలాదిగా జ‌నం రోడ్లపైకి వచ్చారు. చెన్నై హాస్పిటల్‌లో పడకలు ఖాళీ లేక‌పోవ‌డంతో వ్యాధి ల‌క్ష‌ణాలు లేని/ఆరోగ్యం  స్థిరంగా ఉన్న రోగుల‌ను ప్రైవేట్ వైద్య‌ కళాశాలల్లోని, చెన్నై ట్రేడ్ సెంటర్‌లోగ‌ల సంరక్షణ కేంద్రాలకు త‌ర‌లించారు. రాష్ట్రంలో 600కుపైగా కేసులకు కోయంబేడు మార్కెట్ మూల‌స్థానం కాగా, నిన్నటిదాకా మొత్తం కేసులు: 3550, యాక్టివ్ కేసులు: 2107, మరణాలు: 31గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 8 కొత్త కేసులు నిర్ధార‌ణ కాగా, వీటిలో బెంగళూరు 3, బాగల్‌కోట్ 2, బళ్లారితోపాటు  దక్షిణ కన్నడ, ఉత్తర‌ కన్నడ జిల్లాల్లో ఒక్కొక్క‌టి వంతున న‌మోద‌య్యాయి.ఒక 62 ఏళ్ల మ‌హిళ ఇవాళ విజయపురలో కోవిడ్ వ్యాధితో మ‌ర‌ణించింది. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 28కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 659 కాగా, డిశ్చార్జ్ అయిన‌వారు: 324 మంది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ‌ మద్యం ధరలను మరో 50 శాతం పెంచింది; అలాగే వ్యాపార సమయాన్ని తగ్గించింది. అంతకుముందు ధరలను 25 శాతం పెంచిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే, ర‌ద్దీ నియంత్ర‌ణ కోసం టోకెన్ ప‌ద్ధ‌తిని అమ‌లు చేయ‌నుంది. రాష్ట్రంలో ఇవాళ 67 కొత్త కేసులు న‌మోదు కాగా, (వీటిలో 14 గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన‌వారు) 65 మంది డిశ్చార్జ్ అయ్యారు, గ‌డ‌చిన 24 గంటల్లో ఒక మరణం నమోదైంది. మొత్తం కేసులు 1,717కు పెరిగిన నేప‌థ్యంలో యాక్టివ్ కేసులు: 1094, కోలుకున్నవి: 589, మరణాలు: 34గా ఉన్నాయి. గ‌రిష్ఠ కేసుల రీత్యా కర్నూలు (516), గుంటూరు (351), కృష్ణా (286) జిల్లాలు అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: దేశవ్యాప్తంగా మూడో దశ దిగ్బంధం సోమవారం ప్రారంభమైన నేప‌థ్యంలో గ‌ణ‌నీయ స‌డ‌లింపుల‌తో నియంత్ర‌ణ జోన్ల ప‌రిధిలోని ప్రాంతాల‌ను త‌గ్గించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కాగా, బీహార్‌లోని ఖ‌గారియాకు చెందిన 1,200 మంది వలస కార్మికులతో వెళుతున్న ఘ‌ట్‌కేస‌ర్ నుంచి ఇవాళ తెల్ల‌వారుజామున 3:‌05 నిమిషాల‌కు శ్రామిక్ స్పెషల్ రైలు బ‌య‌ల్దేరింది. ఇది రాష్ట్రం నుంచి వ‌ల‌స కార్మికుల‌ను తీసుకెళ్లిన రెండో ప్ర‌త్యేక రైలు. కాగా, ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసులు 1085, యాక్టివ్ కేసులు: 471, కోలుకున్నవి: 585, మ‌ర‌ణాలు: 29గా ఉన్నాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో రికార్డు స్థాయిన 1,567 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించ‌డంతో సోమవారం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 14,541కి పెరిగింది. అయితే, గత వారం పెండింగ్ కేసులను ప‌రిష్క‌రించిన కార‌ణంగా ఈ పెరుగుద‌ల క‌నిపిస్తున్న‌ద‌ని ఆరోగ్య‌శాఖ పేర్కొంది. ఇక సోమ‌వారం 35 మంది మ‌ర‌ణించ‌డంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 583కు పెరిగింది. రాష్ట్ర అధికారుల స‌మాచారం ప్రకారం... ముంబైలో ఇప్పటిదాకా 9,310 కేసులు రాగా, 361 మరణాలు నమోదయ్యాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలోనే 42 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 632కు పెరిగింది. ధార‌విలో ఇప్పటిదాకా 20 మంది మరణించారు. కోవిడ్-19 విజృంభ‌ణ‌తో రాష్ట్రం త‌ల్ల‌డిల్లుతున్న నేప‌థ్యంలో 2021 మార్చివ‌ర‌కూ అన్ని నిర్మాణ ప‌నుల‌నూ నిలిపివేస్తున్న‌ట్లు  మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త కొనుగోళ్లకు టెండర్లను నిలిపివేయాలని, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వవ‌ద్ద‌ని అన్ని శాఖ‌ల‌నూ ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అన్ని కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.
  • గుజరాత్: గుజరాత్‌లో తాజా నివేదిక మేర‌కు 376 కేసులు నిర్ధార‌ణ కాగా, 29 మరణాలు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్ర సంచిత గణాంకాల ప్ర‌కారం... మొత్తం కేసుల సంఖ్య‌ 5,804కు, మ‌ర‌ణాలు 319కి పెరిగాయి. కోలుకున్న‌వారి సంఖ్య 1,195 కాగా, డిశ్చార్జ్ అయినవారు 153 మంది.
  • రాజస్థాన్: రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రాజస్థాన్‌లో మే 5 న ఉదయం 8:00 గంటల వరకు 175 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,061కి చేరింది. ఇప్ప‌టివ‌ర‌కూ 1,394 మంది కోలుకోగా 77 మంది మరణించారు. మద్యం దుకాణాల వెలుపల నిన్నటి గందరగోళం నేప‌థ్యంలో  జైపూర్ ఎక్సైజ్ శాఖ ఇవాళ కొత్త ఆదేశాలిచ్చింది. ఈ మేర‌కు కొనుగోలుదారుల‌కు కూప‌న్లు జారీచేయాల‌ని దుకాణ యజమానులను ఆదేశించింది. ఈ కూపన్ల నంబ‌ర్ల ఆధారంగా అనుమతించిన స‌మ‌యంలో కొనుగోలుదారులు దుకాణాల‌కు రావాల్సి ఉంటుంది. త‌ద్వారా సామాజి దూరాన్ని పాటించేలా చేయ‌వ‌చ్చున‌ని పేర్కొంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 2,952కు పెరగ్గా, మ‌ర‌ణాల సంఖ్య 165కు చేరింది. ఇక మొత్తం కేసుల‌లో 798 మంది కోలుకున్నారు. రాష్ట్ర రాజధాని భోపాల్ త‌ర్వాత కేసుల సంఖ్య‌రీత్యా ఇండోర్ రెండో స్థానంలో ఉంది. మ‌రోవైపు మరణాల శాతం బాగా పెరగడంతో ఉజ్జయిని కొత్త హాట్‌స్పాట్‌గా ఆవిర్భ‌వించింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రం వెలుప‌ల చిక్కుకుపోయిన వారు తిరిగి వ‌చ్చేందుకు వీలు క‌ల్పించేలా నియమించిన నోడల్ అధికారుల సంప్రదింపు ఫోన్ నంబ‌ర్ల జాబితాను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. మ‌రోవైపు  కోవిడ్‌-19కు సంబంధించి ఏదైనా తాజా స‌మాచారం, సహాయం కోసం covid19.itanagarsmartcity.in/index.php పేరిట వెబ్‌సైట్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.
  • అసోం: రాజ‌స్థాన్‌లోని కోట న‌గ‌రం నుంచి వ‌చ్చిన 124 మంది విద్యార్థుల తొలిబృందాన్ని గువహటిలోని సారుస‌జై స్టేడియంలో నిర్బంధ వైద్య‌ప‌రిశీల‌న‌లో ఉంచిన నేప‌థ్యంలో వారికి నిర్ణీత వ్య‌వ‌ధి ముగిశాక ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఇళ్ల‌కు పంపిన‌ట్లు ఆరోగ్యశాఖ‌ మంత్రి హిమంత బిశ్వ‌శర్మ ట్వీట్ చేశారు.
  • మణిపూర్: రాష్ట్రంలో ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి సాధించే మార్గాల‌పై వ్య‌వ‌సాయ‌-ఉద్యాన శాఖ‌ల కార్యాచ‌ర‌ణ బృందంతో స‌మావేశానికి ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త వ‌హించారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని, ఇందుకోసం మ‌రిన్ని మాన‌వ వ‌న‌రుల‌తోపాటు సంబంధిత ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
  • మణిపూర్: ఎక్కువ మానవశక్తికి శిక్షణ ఇవ్వడం మరియు సంబంధిత పరికరాలను సేకరించడం ద్వారా COVID19 పరీక్ష సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
  • మిజోరాం: అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన లాంగ్‌త‌ల‌య్ జిల్లావాసులు 173 మందిని నిర్దిష్ట‌ నిర్బంధ వైద్య‌ప‌రిశీల‌న శిబిరాల‌కు త‌ర‌లించారు.
  • నాగాలాండ్: కోహిమా, దిమాపూర్‌ల‌లోని సివిల్ సెక్రటేరియట్, డైరెక్టరేట్లు డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్ స్థాయి లేదా అంత‌కంటే అధిక హోదాగ‌ల అధికారులతోనూ; జిల్లాల్లో హెచ్‌వోవోలు, త‌క్ష‌ణ జూనియ‌ర్ సిబ్బందితో కార్యాల‌యాలు ప‌నిచేస్తాయి. ఇక సవరించిన మార్గదర్శకాల మేర‌కు నాగాలాండ్ రాష్ట్రంలో ప్రజల అంతర్-జిల్లా ప్ర‌యాణానికి అనుమ‌తి ల‌భిస్తుంది. ఈ మేర‌కు నిర్దిష్ట నిబంధ‌న‌ల‌కు త‌గిన‌ట్లుగా టాక్సీలు, రిక్షాలు న‌డుస్తాయి. కానీ, ప్ర‌యాణికుల బ‌స్సుల‌పై మాత్రం నిషేధం కొన‌సాగుతుంది.
  • త్రిపుర: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన, తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న పౌరుల నమోదు కోసం ప్రభుత్వం covid19.tripura.gov.in. పేరిట కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది.

****



(Release ID: 1621433) Visitor Counter : 255