రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం కొనసాగిస్తున్న పోరులో ఎన్.సి.సి. అందిస్తున్న సహకారాన్ని సమీక్షించిన - రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్.

Posted On: 05 MAY 2020 4:08PM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి.) అందిస్తున్న సేవలను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  దేశవ్యాప్తంగా ఉన్న 17 ఎన్.సి.సి. డైరెక్టరేట్లతో రక్షణ మంత్రి నేరుగా సమావేశం కావడం ఇదే మొదటి సారి.  ఎన్.సి.సి. డైరెక్టర్ జనరల్ లెఫ్టనెంట్ జనరల్ రాజీవ్ చోప్రా మరియు రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

రక్షణ మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం సవాళ్లతో కూడిన సమయాన్ని ఎదుర్కొంటోందనీ, కోవిడ్-19 ను కట్టడి చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో  ప్రభుత్వం అనేక సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటోందనీ పేర్కొన్నారు.  ఈ సంక్షోభం నుండి దేశం సమర్ధవంతంగా విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

60 వేల మంది కంటే ఎక్కువగా ఎన్.సి.సి. క్యాడెట్లు, ఇందులో 25 శాతం మంది బాలికలు కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో స్థానిక పాలనా యంత్రాంగానికి సహాయపడుతున్నారు.  ఈ విషయంలో ఎన్.సి.సి. డైరెక్టరేట్లు పోషిస్తున్న కీలక పాత్రను శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. 

ఎన్.సి.సి. క్యాడెట్లు ఎక్కువగా రవాణా మరియు సప్లై చైన్ నిర్వహణ, నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాతో పాటు ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో తమ సేవలనందిస్తున్నారు.  కొంత మంది క్యాడెట్లు సామాజిక మాధ్యమాల కోసం విద్యా సంబంధమైన వీడియోలు రూపొందించారు. మరి కొంత మంది మాస్కులు తయారుచేసి, స్థానికంగా పంపిణీ చేశారు. 

వారు నిర్వహిస్తున్న ప్రశంసనీయమైన పాత్రను అభినందిస్తూ, ఎన్.సి.సి. క్యాడెట్లను వారు శిక్షణ పొందిన కార్యక్రమాలలో మాత్రమే వారి సేవలను వినియోగించుకోవాలని రక్షణ మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. 

ఎన్.సి.సి. ని విస్తరించాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు సమీక్షా సమావేశం సందర్భంగా శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. కోస్తా తీరా ప్రాంతాల్లోనూ, సరిహద్దు ప్రాంతాల్లోనూ ఎన్ .సి.సి. ని విస్తరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 

కొత్తగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఎన్.సి.సి. ని మరింత సందర్భోచితంగా ఆధునీకరించాలని కూడా రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సెమిస్టర్ విధానానికి అనుకూలంగా ఎన్.సి.సి. కార్యకలాపాలను రూపొందించవలసిన అవసరాన్ని కూడా అయన నొక్కి చెప్పారు. 

రక్షణ మంత్రితో నేరుగా సంభాషించే అపూర్వమైన అవకాశాన్ని కలిగించినందుకు ఎన్.సి.సి. డైరెక్టరేట్లకు చెందిన ఏ.డి.జి. లు మరియు డి.డి.జి. లు రక్షణ మంత్రికి ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తమ తమ డైరెక్టరేట్ల పరిధిలో కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరిగిన పోరులో ఎన్.సి.సి. క్యాడెట్లు అందజేసిన సేవల గురించి వారు రక్షణ మంత్రికి వివరించారు.  

ఎన్.సి.సి. క్యాడెట్లకు ధైర్యం, ఉత్సాహం ఎక్కువగా ఉన్నాయనీ, వారు చేసిన సేవలు పౌరుల నుండీ, పాలనా యంత్రాంగం నుండి మంచి ప్రశంసలు అందుకున్నాయనీ వారు రక్షణ మంత్రికి తెలియజేశారు. 

 

***



(Release ID: 1621270) Visitor Counter : 193