ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి ప్రస్తుత స్థితి, ప్రభుత్వ సన్నద్ధత, తీసుకుంటున్న చర్యలపై మంత్రుల బృందం సమీక్ష

కోవిడ్ -19 మహమ్మారిని అదుపుచేసే వ్యూహంలో టెక్నాలజీ వినియోగం ముఖ్యమైనదని డాక్టర్ హర్షవర్ధన్ ఉద్ఘాటన

Posted On: 05 MAY 2020 5:05PM by PIB Hyderabad

కోవిడ్ -19పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం 14వ సమావేశం మంగళవారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన నిర్మాణ్ భవన్ లో జరిగింది.   సమావేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పురి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్,  హోమ్ శాఖ  సహాయ మంత్రి శ్రీ  నిత్యానంద రాయ్ ,  కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే  హాజరయ్యారు.   వారితో పాటు  రక్షణ సిబ్బంది ప్రధానాధికారి శ్రీ బిపిన్ రావత్ మరియు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి  అజయ్ కుమార్ భల్లా  కూడా పాల్గొన్నారు.    
ప్రపంచవ్యాప్తంగా,   దేశంలో  కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితిని గురించి  మంత్రుల బృందానికి సవివరంగా తెలియజేయడం జరిగింది.  ఆ  తరువాత ఈ మహమ్మారిని అదుపు చేయడానికి అనుసరించవలసిన వ్యూహాన్ని గురించి,  కేంద్రం, వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి  మంత్రుల బృందం కూలంకషంగా చర్చించింది.  దేశంలో ఉన్న అన్ని జిల్లాలను మూడు కేటగిరీలుగా రెడ్ జోన్ 130 జిల్లాలు,   ఆరెంజ్ జోన్  284 జిల్లాలు మరియు గ్రీన్ జోన్ 319 జిల్లాలుగా విభజించినట్లు మంత్రుల బృందానికి తెలిపారు.    గత 21 రోజుల్లో కొత్త కేసులు రాని  జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చారు.    జిల్లాల వర్గీకరణ ప్రకారం  మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రణాళికలను రూపొందించి వాటిని సమర్ధవంతంగా అమలు చేయవలసిందిగా రాష్ట్రాలను కోరారు.     తగిన వనరులను కేటాయించడం,  కోవిడ్ -19 రోగుల కోసం ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటు,  ఆసుపత్రులలో అవసరమైన చికిత్సా సామగ్రి,  వ్యక్తిగత సంరక్షణ సాధనాలు,  వెంటిలేటర్లు,  ఇతర అత్యవసర ఉపకరణాలు మొదలగునవి సమకూర్చడం గురించి సవివరంగా చర్చించారు.  
కోవిడ్ -19  మరణాల రేటు ప్రస్తుతం  3.2 శాతం  ఉండగా కోలుకునే రేటు 25% కన్నా ఎక్కువ ఉందని  మంత్రులకు తెలియజేశారు.  ఇది లాక్ డౌన్ పాటించడం వల్ల  జరిగిన సానుకూల పరిణామమని వారికి తెలిపారు.  
కాగా  పీపీఈలు,  మాస్కులు,  వెంటిలేటర్ల వంటి అత్యవసర వైద్య సామగ్రి , మందులు మరియు ఇతర ఉపకరణాల సరఫరాకు సాధికార బృందం -3 తగిన చర్యలు తీసుకుంటున్నదని  మంత్రుల బృందానికి తెలిపారు.   ప్రస్తుతం  దేశీయ ఉత్పత్తిదారులు రోజుకు రెండున్నర లక్షల పీపీఈలు, దాదాపు  2 లక్షల ఎన్95 మాస్కులు   ఉత్పత్తి  చేస్తున్నారని  సమీప భవిష్యత్తులో ఇవి దేశ అవసరాలకు సరిపోతాయని బృందానికి తెలిపారు.    దేశీయ ఉత్పత్తిదారులు వెంటిలేటర్లు కూడా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.  ఆర్డర్లు ఇవ్వడం మొదలైంది.   పీపీఈలు, మాస్కులు,  వెంటిలేటర్ల తయారీలో  నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం కోరింది.  
లాక్ డౌన్ వివిధ స్థాయిల్లో తీసుకున్న చర్యలు,  అనుసరించిన వ్యూహం,  దాని వల్ల కలిగిన ఫలితాలను గురించి  మంత్రుల బృందానికి కేంద్ర హోమ్ శాఖ  కార్యదర్శి మరియు  సాధికార  బృందం -11 చైర్మన్  శ్రీ అజయ్ కుమార్ భల్లా వివరించారు.  
సాంకేతిక వ్యవహారాలు చూస్తున్న సాధికార  బృందం -9 చైర్మన్  మరియు మీటి   కార్యదర్శి శ్రీ అజయ్ సానీ మంత్రుల బృందానికి  సాంకేతిక అంశాలను  ప్రజంటేషన్ ద్వారా వివరించారు.  ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని,   దాని ద్వారా కోవిద్ -19  వ్యాధి లక్షణాలు ఉన్న వారిని  కనుగొనడం  సాధ్యమవుతుందని తెలిపారు.  సాధికార బృందాల పనితీరు పట్ల మంత్రుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది.  
 కోవిడ్ -19ను  అదుపుచేసే వ్యూహంలో  టెక్నాలజీ వినియోగం అంగభూతమని,  కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో టెక్నాలజీ రాష్ట్రాలకు ఎంతో సహాయకారిగా ఉందని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.  
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పీ  ఎం జీ కే పీ)  కింద 2020,  మే 4వ తేదీ నాటికి ఈ దిగువ సూచించిన విధంగా ప్రగతి సాధించినట్లు  కూడా మంత్రుల బృందానికి తెలియజేయడం జరిగింది.  ఆ వివరాలు:
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇప్పటివరకు   మొదటి నెల (ఏప్రిల్) కొత్త కింద 36 రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల లోని 58.77 కోట్ల మంది లబ్ధిదారులకు  29.38 లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరిగింది.   మరియు ఇప్పటివరకు రెండవ నెల (మే)  కోటా కింద 20 రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల  ద్వారా 11.63 కోట్ల మంది లబ్ధిదారులకు 5.82 లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరిగింది.    మొత్తం మీద ఇప్పటి వరకు 36 రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) నుంచి  66.08 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకున్నాయి.  
ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు రూ.   6868.74 కోట్ల సొమ్మును బదిలీ చేయడం జరిగింది.   2020 ఏప్రిల్ - మే నెలల్లో  మొత్తం  4.98 కోట్ల పిఎంయువై సిలిండర్లను బుక్ చేయగా 4.72 కోట్ల సిలిండర్లను అందజేయడం జరిగింది.  
 నగదు బదిలీ కింద 2020-21 ఆర్ధిక సంవత్సరంలో  8.18 కోట్ల మంది లబ్ధిదారులకు  (రైతులకు) రూ.  2000 చొప్పున మంజూరుకు ఆమోదం తెలిపారు మరియు  2020-21లో రూ.  16,364 కోట్ల నగదు రైతుల ఖాతాలలోకి నేరుగా  బదిలీ చేసేందుకు విడుదల చేశారు.  
సీనియర్ సిటిజన్లు,  వితంతువులు మరియు దివ్యాంగులకు  చేయూతను అందించేందుకు  ప్రతి లబ్దిదారుకు రూ.  500 చొప్పున మొదటి విడత నిధులను అర్హులైన 2.812 కోట్ల మంది లబ్ధిదారుల అందరి  ఖాతాల లోకి మొత్తం రూ. 1405 కోట్లు విడుదల చేయడం జరిగింది   తదుపరి  విడత రూ.  500 చొప్పున సహాయం రెండవ పక్షంలో విడుదల చేయడం జరుగుతుంది.  
పీఎంజీకేపీ కింద ప్రస్తుతం  20.05 కోట్ల మంది మహిళల జన ధన్ యోజన  ఖాతాలలో ఒక్కొక్క ఖాతాలో రూ.  500 చొప్పున నగదు బదిలీ చేయడం జరుగుతోంది.  
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈ ఫై ఎఫ్ ఓ) లో సభ్యత్వం ఉన్న 9.27 లక్షల మంది రూ.2895 కోట్ల సొమ్మును విత్ డ్రా చేసుకోవడం జరిగింది.  
ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి  ప్రీతీ సుడాన్,   ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖలో  ఓఎస్డీ శ్రీ రాజేష్ భూషణ్,  విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి  శ్రీ హెచ్,  వర్ధన్ శృంగలా,  జవుళి శాఖ కార్యదర్శి,  శ్రీ రవి కపూర్,  పౌర విమానయాన శాఖ కార్యదర్శి  శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా,  ఔషధ శాఖ కార్యదర్శి   శ్రీ పి.డి. వాఘేలా ,  వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ అనూప్ వాధ్వాన్ ,  టెలికాం శాఖ కార్యదర్శి అంశు ప్రకాశ్,  భారత వైద్య పరిశోధనా మండలి (ఐ సి ఎం ఆర్)  డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ,  హోమ్ శాఖ అదనపు కార్యదర్శి  శ్రీ అనిల్ మాలిక్,  డైరెక్టర్ జనరల్ - ఎన్ ఐ సి  డాక్టర్ నీతా వర్మ,  డిజి- ఏ ఎఫ్ ఎం ఎస్ లెఫ్టినెంట్ జనరల్ అనూప్ బెనర్జీ,  డిజిహెచ్ఎస్ డాక్టర్ రాజీవ్ గార్గ్,  ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీ లవ్ అగర్వాల్  మరియు  ఫార్మా, సమాచార ప్రసార ,  జవుళి,  ఎన్ఐసి,  డిజిసిఏకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.  
కోవిడ్ -19కు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు మరియు సూచనలను గురించిన యదార్ధ , తాజా సమాచారం  కోసం  దయచేసి క్రమం తప్పకుండా   https://www.mohfw.gov.in/. వెబ్ సైటును దర్శించండి.  
కోవిడ్ -19కు సంబంధించిన ప్రశ్నలను   technicalquery.covid19[at]gov[dot]inకు  మరియు ఇతర ప్రశ్నలను  ncov2019[at]gov[dot]inకు మెయిల్ చేయవచ్చు.   లేదా  ట్విట్టర్ లో  @CovidIndiaSevaకు ట్వీట్ చేయవచ్చు.  
ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు +91-11-23978046 లేదా 1075 టోల్  ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయవచ్చు.  



(Release ID: 1621396) Visitor Counter : 224