PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 02 MAY 2020 6:29PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్‌-19 కేసుల సంఖ్య 37,336.. వీరిలో 9.950 మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 26.65కు పెరిగింది. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,293.
 • మే 4 నుంచి మరో రెండు వారాలపాటు దిగ్బంధం పొడిగింపు; గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో గణనీయ సడలింపులు.
 • ప్రయాణికుల రైళ్ల రద్దు 2020 మే 17దాకా కొనసాగింపు; వలస కార్మికులు తదితరుల తరలింపునకు ‘శ్రామిక ప్రత్యేక’ రైళ్లకు మాత్రం అనుమతి.
 • వ్యవసాయ రంగానికి ఉత్తేజమిచ్చేందుకు, విద్యారంగంలో సమస్యలు-సంస్కరణలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి.
 • కోవిడ్‌-19 నిరోధం దిశగా సంయుక్త కృషి చేపడదామని ప్రపంచ దేశాలకు శ్రీ పీయూష్‌ గోయల్‌ పిలుపు

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో ఇప్పటివరకూ కోవిడ్‌-19 బారినపడి నయమైన వారి సంఖ్య 9,950కు చేరగా, వీరిలో గడచిన 24 గంటల్లో కోలుకున్నవారు 1,061 మంది. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 26.65కు పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 37,336 కాగా, నిన్నటినుంచి 2,293 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, వ్యక్తిగత రక్షణ సామగ్రిని హేతుబద్ధంగా వినియోగించడంపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ అదనపు మార్గదర్శకాలను జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620436

దేశంలో 2020 మే 4 నుంచి మరో రెండు వారాలపాటు దిగ్బంధం పొడిగింపు

దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ దిగ్బంధాన్ని 2020 మే 4 నుంచి మరో రెండు వారాలపాటు పొడిగిస్తున్నట్లు దేశీయాంగ వ్యవహారాలశాఖ ఇవాళ ప్రకటించింది. కోవిడ్‌-19 పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించడంతోపాటు దిగ్బంధంవల్ల ఒనగూడిన గణనీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద దిగ్బంధం పొడిగింపుపై ఉత్తర్వులిచ్చింది. అలాగే వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన జిల్లాలను రెడ్‌ (హాట్‌స్పాట్‌), గ్రీన్‌-ఆరెంజ్‌ జోన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో వాటి పరిధిలో దిగ్బంధకాలపు కార్యకలాపాల నియంత్రణ మార్గదర్శకాలను దేశీయాంగ శాఖ జారీచేసింది. అయితే, గ్రీన్‌-ఆరెంజ్‌ జోన్లలోకి వచ్చే జిల్లాల్లో గణనీయ సడలింపులను అనుమతించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620274

రెండువారాల దిగ్బంధం సందర్భంగా ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తులు, వాహనాల కదలికలకు సంబంధించి స్పష్టీకరణ

దేశవ్యాప్తంగా నిషేధించబడిన కార్యకలాపాలతోపాటు ఆరెంజ్ జోన్లలో జిల్లావ్యాప్త, అంతర-జిల్లా బస్సులు నడపడం కూడా నిషేధించబడ్డాయి. అయితే, రెండు కార్యకలాపాలు కొన్ని ఆంక్షలతో అనుమతించబడతాయి. ఈ మేరకు...

· టాక్సీలు, క్యాబ్  సంస్థలు నడిపించే వాహనాలకు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులతో ప్రయాణించే అనుమ‌తి ఉంటుంది.

· అంతర-జిల్లా పరిధిలో వ్యక్తులు, వాహనాలకు... నాలుగు చక్రాల వాహనాలకు డ్రైవర్‌, గరిష్ఠంగా ఇద్దరు ప్రయాణికులతో- అదీ అనుమతించిన కార్యకలాపాలకు పరిమితరీతిలో మాత్రమే అనుమతి ఉంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620406

ప్రయాణికుల రైళ్ల రద్దు 2020 మే 17దాకా కొనసాగింపు

దేశంలో కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో తీసుకున్న చర్యల కొనసాగింపులో భాగంగా ప్రయాణికుల రైళ్ల రద్దును 2020 మే 17దాకా అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, దిగ్బంధంవల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులను తరలించేందుకు దేశీయాంగ శాఖ మార్గదర్శకాలకు లోబడి, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ‘శ్రామిక ప్రత్యేక’ రైళ్లను మాత్రం నడుపుతామని ప్రకటించింది. అదేవిధంగా పార్శిల్‌, సరకు రవాణా రైళ్లు యధావిధిగా నడుస్తాయని తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620160

వ్యవసాయరంగానికి ఉత్తేజంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి

వ్యవసాయ రంగంలో సమస్యలు-సంస్కరణలపై చర్చించడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మార్కెటింగ్‌, విక్రయించదగిన మిగులు నిర్వహణ, రైతులకు వ్యవస్థాగత రుణలభ్యత, చట్టం అండతో వ్యవసాయ రంగానికి వివిధ ఆంక్షల నుంచి విముక్తి తదితర అంశాలపై చర్చలో ప్రధానంగా దృష్టి సారించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620444

విద్యారంగంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి

జాతీయ విద్యావిధానంసహా దేశ విద్యారంగంలో సమస్యలు-చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సమావేశం నిర్వహించారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై చర్చకు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఆన్‌లైన్‌ తరగతులు, విద్యాపోర్టల్‌, ప్రత్యేక విద్యా చానెళ్లపై తరగతులవారీ ప్రసారాలతో అభ్యసనం పెంపుపై సమావేశం లోతుగా చర్చించింది. అదే సమయంలో విద్యారంగంలో ఏకరూపత, అందరికీ నాణ్యమైన విద్యా లభ్యత, ప్రాథమిక విద్యా నాణ్యత పెంపుపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆ మేరకు బహుళ-భాషా, 21వ శతాబ్దపు నైపుణ్యసహిత, క్రీడా-కళా-పర్యావరణాంశ ప్రాధాన్యంగల సరికొత్త జాతీయ పాఠ్యాంశ చట్రం రూపకల్పనపై చర్చించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620232

గ్రీన్‌, ఆరెంజ్‌-రెడ్‌ జోన్లలో ‘క్యాట్‌’ (CAT) కేసుల విచారణకు కొత్త మార్గదర్శకాలు

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620379

పరస్పర ప్రయోజనాలు-ప్రతిస్పందనాత్మకతలపై ఆసక్తిగల దేశాలతో సంయుక్త కృషికి సదా సిద్ధమని విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలకు శ్రీ పీయూష్‌ గోయల్‌ వెల్లడి

పరస్పర ప్రయోజనాలపై ఆసక్తిగల దేశాలతో సంయుక్త కృషికి భారత్‌ సదా సిద్ధమని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ చెప్పారు. అలాగే సంయుక్త సహకార ఒప్పందాలకు ప్రతిస్పందనాత్మకత కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి ఇవాళ దృశ్యమాధ్యమంద్వారా విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల అధికారులతో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. భారత్‌తో వర్తక-వాణిజ్యాలపై ఆసక్తిగల దేశాలకు స్వాగతం పలుకుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ద్వైపాక్షిక (లేదా బహుపాక్షిక) ఒప్పందాల దిశగా మార్గ ప్రణాళిక రూపకల్పన కోసం డిజిటల్‌ అనుసంధానానికి ఇదే తగిన సమయమని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిపై సంయుక్త పరిశోధనలకు సిద్ధం కావాలని ప్రపంచ దేశాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620211

బీహార్‌లో ‘అక్యూట్‌ ఎన్‌సెఫలైటిస్‌ సిండ్రోమ్‌’ (ఏఈఎస్‌)కు చికిత్స సన్నద్ధతపై దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా డాక్టర్ హర్షవర్ధన్‌ సమీక్ష

కోవిడ్‌ వ్యాప్తి కారణంగా ‘అక్యూట్‌ ఎన్‌సెఫలైటిస్‌ సిండ్రోమ్‌’ (ఏఈఎస్‌) కేసులను నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్ని రాష్ట్రాలకూ సూచించారు. బీహార్‌లో ‘ఏఈఎస్‌’ నిర్వహణ-చికిత్స సన్నద్ధతను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయన సమీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620340

రైల్వే భద్రత, కార్యకలాపాల సామర్థ్యం మెరుగుకు కృషి; దిగ్బంధం వేళ దీర్ఘకాలిక పెండింగ్‌లోగల ప్రధాన నిర్వహణ పనులు పూర్తిచేసిన వెన్నెముక సిబ్బంది

దేశవ్యాప్త దిగ్బంధం వేళ రైల్వే భద్రత, కార్యకలాపాల సామర్థ్యం మెరుగు దిశగా భారత రైల్వేశాఖ వెన్నెముక సిబ్బంది విశేషంగా కృషి చేశారు. ఈ మేరకు దీర్ఘకాలం నుంచీ పెండింగ్‌లో పడిన యార్డుల ఆధునికీకరణ, సిజర్స్‌ క్రాస్‌-ఓవర్ల నవీకరణ, వంతెనల మరమ్మతులు వంటి ప్రధాన నిర్వహణ పనులను పూర్తిచేశారు. కోవిడ్‌-19 కారణంగా ప్రయాణికుల రైళ్లు రద్దయిన నేపథ్యంలో ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాలు, వైద్య సామగ్రి కొరతలేకుండా పార్శిల్‌-వస్తు రవాణా రైళ్లను నడుపుతూ సరఫరా శృంఖలానికి రైల్వేశాఖ పూర్తిస్థాయిలో చేయూత అందించింది. మరోవైపు దిగ్బంధకాలంలో లభించిన సమయాన్ని దీర్ఘకాలిక పెండింగ్‌ పనులు పూర్తిచేయడంలో సద్వినియోగం చేసుకుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620377

కరోనా యోధులకు అగ్రశ్రేణి వాస్తవ వీరుల అభివందనం; మద్దతు కొనసాగిస్తామని ప్రతిన

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాడుతున్న యోధులకు భారత సాయుధ దళాల వీరులు శిరసాభివందనం చేశారు. ఈ మేరకు సాయుధ దళాల సంయుక్త అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, సైనికదళాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవాణే, నావికా దళాధిపతి అడ్మిరల్‌ కరమ్‌వీర్‌ సింగ్‌, వైమానిక దళాధిపతి ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భదూరియా ఇవాళ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు రానున్న కాలంలోనూ పూర్తి మద్దతు కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు ప్రతినబూనారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620339

కోవిడ్‌-19 యోధులకు జాతిజనులతో కలసి భారత తీరగస్తీ దళం కృతజ్ఞతలు

‘కోవిడ్‌-19 యోధులకు భారత్‌ కృతజ్ఞతలు’ కార్యక్రమంలో భారత తీర గస్తీదళం కూడా చురుగ్గా పాలుపంచుకుంటోంది. ఈ మేరకు గస్తీ నౌకలను విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రులలో పూలుచల్లే కార్యక్రమం నిర్వహించింది. ఈ మేరకు దేశంలోని మొత్తం తీరప్రదేశాలను కలుపుతూ 25 ప్రాంతాల్లో 2020 మే 3న నౌకలలో దీపాలు వెలిగించడంద్వారా కోవిడ్‌-19 యోధులకు కృతజ్ఞతలు తెలుపుతారు. అలాగే మారుమూల ప్రాంతాలు, సుదూర అండమాన్‌-నికోబార్‌ దీవులు, ద్వీప ప్రదేశాలు, లక్షద్వీపాలు, మినికోయ్‌ ద్వీపాలుసహా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తీరగస్తీ దళం హెలికాప్టర్లు కూడా 5 ప్రదేశాల్లో కోవిడ్‌-19 ఆస్పత్రులపై పూలు చల్లుతాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620477

భారత, థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌ద్వారా థాయ్‌లాండ్‌ ప్రధాని, గౌరవనీయులైన రిటైర్డ్‌ జనరల్‌ ప్రయూత్‌ చానోచాతో సంభాషించారు. ప్రపంచ మహమ్మారిపై కోవిడ్‌-19 నియంత్రణలో తమతమ దేశాల్లో తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా వారిద్దరూ చర్చించుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620232

‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద దేశవ్యాప్తంగా 422 విమానాలద్వారా అత్యవసర వైద్య సామగ్రి రవాణా

‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 422 విమానాలను నడిపాయి. వీటిలో 244 విమానాలు ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌ సంస్థలకు చెందినవి కాగా, ఇవన్నీ 4,13,538 కిలోమీటర్ల మేర ప్రయాణించి 790.22 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి. కోవిడ్‌-19పై జాతి పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు నిత్యావసరాలు, అత్యవసర వైద్య సామగ్రిని చేరవేయడం కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ దేశీయ రంగంలో ‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ విమానాలను నడుపుతోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620428

కోవిడ్‌-19 నేపథ్యంలో 49 రకాల సూక్ష్మ అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతుధర

కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని గిరిజనుల జీవనోపాధి మెరుగు దిశగా 49 రకాల సూక్ష్మ అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నవీకరించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620192

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల నమోదు కోసం చండీగ‌ఢ్ పాల‌న యంత్రాంగం ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇది చండీగఢ్ పాల‌న యంత్రాంగం వెబ్‌సైట్ http://Chandigarh.gov.in లేదా http://admser.chd.nic.in/migrant ద్వారానూ అందుబాటులో ఉంటుంది. ఈ పోర్ట‌ల్ ద్వారా వ్య‌క్తులు త‌మ‌ ప్రాథమిక వివరాలను పూరించాలి. అటుపైన తమ‌ మొబైల్‌కు చేరిన ఒన్‌టైమ్ పాస్‌వ‌ర్డ్‌ను న‌మోదుచేయాలి. ఒక‌వేళ ఎవ‌రైనా స్వ‌యంగా ఇలా చేయ‌లేని ప‌క్షంలో స‌హాయ కేంద్రం నంబ‌రు 1800-180-2067కు ఉద‌యం 8 నుంచి రాత్రి 8 గంట‌ల్లోగా ఫోన్ చేసి పేరు న‌మోదు చేసుకోవ‌చ్చు. కాగా, పీఎంజీకేఏ కింద ఇప్ప‌టిదాకా 50,500 అర్హతగల కుటుంబాలకు గోధుమలు, పప్పుదినుసుల పంపిణీ పూర్త‌యింది. తద్వారా కేంద్ర‌పాలిత ప్రాంతం చండీగ‌ఢ్‌లోని అర్హుల‌లో ఇప్పటివరకూ 80 శాతం పేద‌ల‌కు స‌హాయం అందింది.
 • పంజాబ్:రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక ప‌రిజ్ఞానం, నైపుణ్యాన్ని కోరింది. ఈ మేర‌కు "ఇన్వెస్ట్ పంజాబ్ పేరిట భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంద్వారా ప్రత్యేక వెబి‌నార్‌ను సమన్వయం చేసింది. కోవిడ్‌-19 వ్యాప్తి నిర్వ‌హ‌ణ‌లో ఇజ్రాయెల్ సాంకేతిక ప‌రిజ్ఞానం పొంద‌డం ల‌క్ష్యంగా ఈ ప్ర‌య‌త్నం చేసింది. కాగా, రాష్ట్రంలోని పెట్రోలు పంపుల‌లో సిబ్బంది సామూహిక విధులు నిర్వ‌ర్తించ‌కుండా చూడ‌టం కోసం షిఫ్టు ప‌ద్ధ‌తిలో నిర్ణీత స‌మ‌యాల మేర‌కు డ్యూటీలు వేయాల్సిందిగా యాజ‌మాన్యాలు/మేనేజ‌ర్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది.
 • హర్యానా: కోవిడ్‌-19 దిగ్బంధం నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ 87 పుర‌పాలిక‌లు, స్థానిక సంస్థ‌ల తోడ్పాటుతో నిత్యావ‌స‌ర సేవ‌లందిస్తామ‌ని హర్యానా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ మేర‌కు అన్ని పుర‌పాలిక‌ల‌లో ఇంటింటి వ్య‌ర్థాల‌ను 100 శాతం తొల‌గిస్తుండ‌గా ఈ ప‌నుల్లో పాల్గొంటున్న సిబ్బంది సామాజిక దూరం నిబంధ‌న‌ను క‌చ్చితంగా పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలోని పారిశ్రామిక సంస్థ‌లు తమ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఉద్యోగులను కొన‌సాగించేందుకు ప్రభుత్వం "హర్యానా ఎంఎస్ఎంఈ పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌న ప‌థ‌కం" రూపొందించింది. ఇది ఎంఎస్ఎంఈల‌కు ఆర్థిక సహాయం అందించడంలో తోడ్ప‌డుతుంది. తద్వారా వారు శాశ్వత/కాంట్రాక్టు సిబ్బంది, కార్మికులుస‌హా తమ ఉద్యోగులంద‌రికీ వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర అవసరాల‌ను తీర్చ‌గ‌లుగుతారు.
 • హిమాచల్ ప్రదేశ్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల రోగనిరోధక శక్తిని పెంచడానికి రాష్ట్ర ఆయుర్వేద  తయారుచేసిన ఆయుర్వేద ఔషధం *మధుయాస్తియాడి కషాయ్*ను ముఖ్యమంత్రి ఆవిష్క‌రించారు.  ఈ ఆయుర్వేద ఉత్పత్తి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ నేప‌థ్యంలో క‌రోనాపై పోరాడుతున్న  వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, సీనియర్ సిటిజన్లుస‌హా కరోనా నుంచి కోలుకున్న వారంద‌రికీ ఈ మందు ఉచితంగా పంపిణీ చేయ‌బ‌డుతుంది. కాగా, రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, ప్ర‌ధాన వైద్యాధికారులతో ముఖ్య‌మంత్రి దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మ స‌మావేశం నిర్వ‌హించారు. హిమాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించే రాష్ట్రవాసుల‌ను, ఇత‌రుల‌ను వైద్యపరంగా పరిశీలించి గృహ నిర్బంధ వైద్య ప‌రిశీల‌న‌లో ఉంచేందుకు ప్రత్యేక ప్రచారం ప్రారంభిస్తామని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
 • కేరళ: రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాల‌ను తెర‌వ‌రాద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒక‌వేళ దుకాణాల‌ను తెరిస్తే దిగ్బంధం నిబంధ‌న‌ల‌ను మ‌ద్య‌పాన ప్రియులు ఉల్లంఘించే ప్ర‌మాదం ఉండ‌టమే ఇందుకు కార‌ణం. ఇక గ్రీన్‌జోన్ల‌లో బ‌స్సు స‌ర్వీసులు ఉండ‌వ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రోవైపు కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కోవిడ్ జోన్లను పునర్ వ‌ర్గీక‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇక‌ రాంచీ, భువనేశ్వర్, పాట్నాకు బయలుదేరిన మరో 5 నాన్-స్టాప్ ప్ర‌త్యేక రైళ్లు ఇవాళ వలస కార్మికులతో బ‌య‌ల్దేరాయి. కాగా, గ‌ల్ఫ్‌లో మ‌రో ముగ్గురు కోవిడ్-19కు బ‌లి కావ‌డంతో ఇప్ప‌టిదాకా విదేశాల్లో మ‌ర‌ణించిన కేర‌ళీయుల సంఖ్య 70 దాటింది. ఇక రాష్ట్రంలో మొత్తం కేసులు 497కాగా, యాక్టివ్ కేసులు 102గా నమోద‌య్యాయి.
 • తమిళనాడు: చెన్నైలో నిన్న 176 కొత్త కేసులు న‌మోదైన నేప‌థ్యంలో న‌గ‌రం హాట్‌స్పాట్‌గా కొన‌సాగుతోంది. రాష్ట్రంలో కోవిడ్ -19 మొత్తం కేసుల సంఖ్య 2,526 కాగా, చెన్నై న‌గ‌రంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌డం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి జె.రాధాకృష్ణన్‌ను ప్ర‌త్యేక నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. న‌గ‌రంలోని ఎంఎంసీలో ర‌క్త కేన్స‌ర్‌తో చికిత్స పొందుతున్న వ్య‌క్తికి కోవిడ్-19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. కాగా, చెన్నైలో సేక‌రించిన మురుగునీటిపై ప‌రీక్ష‌ల్లో వైర‌స్ ఆర్ఎన్ఏ ఉనికి స్ప‌ష్ట‌మైంది. కాగా, చెన్నై న‌గ‌రంలో 1082 కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1183గా ఉంది.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 9 కొత్త కేసులు నిర్ధార‌ణ కాగా, తుమ్‌కూరు, విజ‌య‌పుర‌ల‌లో రెండేసి; బెళ‌గావి, బెంగళూరు, చిక్కబళ్లాపూర్, బీద‌ర్, బాగల్‌కోట్‌లో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ రోజు 3 మరణాలు సంభ‌వించ‌గా దావణ‌గేరె, బీదర్, బెంగళూరుల‌లో ఒక్కొక్కరు ఉన్నారు. కాగా, 255 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసులు 598 కాగా, మృతుల సంఖ్య 25గా ఉంది.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని శ్రీ‌కాకుళం, ప్ర‌కాశం జిల్లాల్లో కోవిడ్ పరీక్షల‌ కోసం రెండు కొత్త ప్రయోగశాలలు ఏర్పాట‌య్యాయి. దీంతో మొత్తం ప్రయోగశాలల సంఖ్య 10కి చేరింది. కాగా, గుజరాత్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న మ‌త్స్య‌కారుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, వ్యాధి సోక‌నివారిని మాత్ర‌మే ఇళ్ల‌కు పంపుతారు. గడ‌చిన 24 గంటల్లో 62 కొత్త కేసులు న‌మోదుకాగా, 38మంది డిశ్చార్జ్ అయ్యారు... మొత్తం కేసుల సంఖ్య‌ 1525కి పెరిగింది. యాక్టివ్ కేసులు 1,051 కాగా, కోలుకున్న‌వారు 441 మంది, మ‌ర‌ణాలు 33. కాగా, క‌ర్నూలు 436, గుంటూరు 308, కృష్ణా 258, నెల్లూరు 90, చిత్తూరు 80 కేసుల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బ‌తిన్న సూక్ష్మ‌-చిన్న‌-మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం కేంద్రం నుంచి ప్ర‌త్య‌క్ష ఆర్థిక సహాయం కోరింది.  దిగ్బంధం స‌డ‌లింపుతో వివిధ పరిశ్రమలు నెమ్మదిగా తెరుచుకుంటూండ‌టం, రాష్ట్రానికి  ‌వ‌ల‌స కార్మికుల రాక‌తో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ప‌డింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 1044, యాక్టివ్ కేసులు 552, కోలుకున్నవారు 464 మంది కాగా, మరణాలు 28గా ఉన్నాయి.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌-19పై పోరాటం కోసం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ర‌వాణా విమానం ద్వారా పంపిన 1 టన్ను వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి, వీటీఎం కిట్లు ప్ర‌స్తుతం అసోం రాజ‌ధాని గువ‌హ‌టికి చేరుకున్నాయ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.
 • అసోం: కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం, నియంత్ర‌ణ వార్త‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో ప్రాణాలను పణంగా పెట్టి సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న ప‌త్రికా, ప్ర‌సార మాధ్య‌మాల ప్ర‌తినిధుల‌కు ముఖ్య‌మంత్రి స‌ర్వానంద సోనోవాల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 • మణిపూర్: రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ క్షేత్ర ద‌ళాలు ఇప్పటివరకూ 15,840 మందికి వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి (గ్లోవ్స్, మాస్క్‌లు త‌దిత‌రాల‌ను) పంపిణీ చేశాయి; అలాగే 9,187 మందికి శానిటైజర్, సబ్బులు, ఇతర పారిశుధ్య సామ‌గ్రిస‌హా 8,430 మందికి ఆహార పదార్థాలు, రేషన్ స‌ర‌కులు అందించాయి.
 • మేఘాలయ: క‌రోనా యోధుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపే కార్య‌క్ర‌మంలో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు పౌర ఆస్ప‌త్రిపై భార‌త వాయుసేన హెలికాప్ట‌ర్లు పుష్ప‌వ‌ర్షం కురిపించ‌నున్నాయి.
 • మిజోరం: కోవిడ్‌-19 సంక్షోభం నేప‌థ్యంలో రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న చ‌ర్య‌లపై మంత్రిమండ‌లి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న నొక్కిచెప్పారు.
 • నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 న‌మూనాల ప్రాథమిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు మొకోక్చుంగ్ జిల్లా ఆస్ప‌త్రిలో *ట్రూనాట్* ప‌రిక‌రాన్ని ఆరోగ్య‌శాఖ మంత్రి ఆవిష్క‌రించారు.
 • సిక్కిం: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానానికి, వ్య‌వ‌స్థీకృత అభివృద్ధికి వీలుగా స్వతంత్ర బీఎస్ఎన్ఎల్‌ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కానుంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.
 • త్రిపుర: రాష్ట్రంలో మొత్తం కేసులు 4 కాగా, ఇద్ద‌రు కోలుకుని వెళ్ల‌గా, మ‌రో ఇద్ద‌రు చికిత్స పొందుతున్నారు.
 • మహారాష్ట్ర: రాష్ట్ర రాజ‌ధాని ముంబైలో 741స‌హా ఇత‌ర ప్రాంతాల‌తో క‌ల‌పి ఇవాళ ఒక్క‌రోజే మహారాష్ట్రలో 1,003 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ ఒక్క‌రోజునే అత్యధికంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 485కు చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,506 కాగా, ముంబైలోనే 7,625 మంది కోవిడ్ రోగులున్నారు. కాగా, రాష్ట్రంలోని పేద‌ల కోసం అమ‌లు చేస్తున్న బీమా పథకం *మహాత్మా జ్యోతిబా ఫూలే జ‌నారోగ్య యోజన*ను రేష‌న్ కార్డు, నివాస ధ్రువీక‌ర‌ణ‌గ‌ల ప్ర‌తి ఒక్క‌రికీ వ‌ర్తింప‌జేస్తామ‌ని ప్ర‌భుత్వం ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీనికింద రాష్ట్రవ్యాప్తంగాగ‌ల 900 ఆస్ప‌త్రుల‌లో ఏటా రూ.1.5 లక్షల ప‌రిమితితో 1000 చికిత్సలు చేస్తున్నారు.
 • గుజరాత్: రాష్ట్రంలో 302 మందికి వ్యాధి నిర్ధార‌ణ కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 4,721కి చేరింది. వీరిలో 735 మంది కోలుకోగా 236 మంది మరణించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్ సహా తొమ్మిది జిల్లాలు ప్ర‌స్తుతం రెడ్ జోన్ ప‌రిధిలో ఉన్నాయి.
 • రాజస్థాన్: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 12 కొత్త కేసులు నమోద‌వ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 2,678కి చేరింది. వీరిలో ఇప్ప‌టిదాకా 1,116 మంది కోలుకోగా, 65 మంది మ‌ర‌ణించారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 90 కొత్త కేసులు న‌మోద‌డంతో మొత్తం కేసుల సంఖ్య 2,719కు చేరింది. వీరిలో 524 మందికి నయంకాగా, 145 మంది మరణించారు.
 • ఛత్తీస్‌గ‌ఢ్‌: రాష్ట్రంలో ప్ర‌స్తుతం 7 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన 43 కేసుల‌కుగాను 36 మంది కోలుకుని ఇళ్ల‌కు వెళ్లారు.
 • గోవా: మొత్తం 7 కేసులు మాత్ర‌మే న‌మోదైన గోవాలో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు.

Fact Check on #Covid19

***(Release ID: 1620531) Visitor Counter : 41


Read this release in: English , Urdu , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam