ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

బీహార్ లో ఎఇఎస్ సంసిద్ధతను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్షించిన డాక్టర్ హర్షవర్థన్ ఎఇఎస్ నిర్వహణలో బీహార్ కు అన్ని రకాలా మద్దతు ఇవ్వనున్నట్టు హామీ

Posted On: 01 MAY 2020 8:22PM by PIB Hyderabad

బీహార్ లో తీవ్రమైన మెదడువాపు వ్యాధి (ఎఇఎస్) కేసుల నిర్వహణకు, అదుపు చేయడానికి కేంద్రం అన్ని రకాలా సహాయం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. బీహార్ ఆరోగ్య మంత్రి శ్రీ మంగళ్ పాండేతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన అక్కడ ఎఇఎస్ పరిస్థితిపై ఆయన సమీక్షించారు. అలాగే గ్రామీణ స్థాయిలో వాస్తవంగా పని చేస్తున్న సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ లో పాల్గొన్నారు.

ఎఇఎస్ తో రాష్ట్రంలో కొందరు బాలలు మరణించడం పట్ల ఆందోళన ప్రకటిస్తూ “మే 15 నుంచి ప్రారంభమై జూన్ నెల వరకు వేసవి తీవ్రత అధికంగా ఉండే సమయంలో ఎప్పుడూ బీహార్ లో ఎఇఎస్ తో బాలల మరణాలు అధికంగా నమోదవుతూ ఉండడం బాధాకరం” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. బహుళ స్థాయిల్లో సకాలంలో సరైన నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ మరణాలను నివారించవచ్చునని ఆయన అన్నారు. “ఎఇఎస్ పై పోరాటం ఎంతో కాలంగా చేస్తున్న‌దే. దాని గురించి మనందరికీ తెలుసు. ఒక క్రమపద్ధతిలో సమగ్ర, ముందస్తు కట్టడి చర్యలు తీసుకోవడం ఒక్కటే దానికి సరైన నివారణ” అని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.  బీహార్ లో గతంలో ఎఇఎస్ తీవ్ర స్థాయిలో విజృంభించిన 2014, 2019 సంవత్సరాల్లో రెండు సార్లు తాను బీహార్ లో పర్యటించి పరిస్థితిని స్వయంగా సమీక్షించి, వ్యాధి బారిన పడిన బాలలను, వారి తల్లిదండ్రులను కూడా కలిసి రోగం మూలాలు తెలుసుకునేందుకు కృషి చేసిన విషయం ఆయన గుర్తు చేశారు.

“ఈ సారి కూడా మేం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఎఇఎస్ నిర్వహణ, కట్టడి  విషయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నాం” అని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. వ్యాధి విస్తరించిన ప్రాంతాలపై నిరంతర నిఘా పెట్టి సరైన నివారణ కార్యాచరణ సూచించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఇలాంటి చర్యల ద్వారానే రాబోయే కాలంలో ఎఇఎస్ మరింత విజృంభించకుండా కట్టడి చేయవచ్చు అని ఆయన చెప్పారు.

“ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంక్షేమ వ్యవస్థ పటిష్ఠతలో రాష్ర్టానికి అన్ని విధాలా మద్దతు ఇస్తుంది. పూర్తి చేయూత అందిస్తుంది. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా కేంద్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలను కూడా తక్షణ, దీర్ఘకాలిక చర్యల విషయంలో జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం కింద తగు మద్దతు ఇవ్వాలని కోరతాం” అని మంత్రి ప్రకటించారు.

ఎఇఎస్, జపాన్ మెదడువాపు వ్యాధుల నివారణలో బీహార్ కు అందించనున్న మద్దతు చర్యలను మరింతగా వివరిస్తూ “రోజువారీగా పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు తగు విధానపరమైన చర్యలు తీసుకునేందుకు, ఇతర మద్దతు చర్యలు సూచించేందుకు సహాయపడే విధంగా జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం (ఎస్ సిడిసి), జాతీయ వెక్టర్ బోర్న్ డిసీజ్ (వైరస్ ల ద్వారా జన్మించి వ్యాపించే వ్యాధులు) కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ విబిడిసిపి), భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్), పాట్నాలోని ఎయిమ్స్, కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని బాలల ఆరోగ్య విభాగం ప్రతినిధులతో బహుళ విభాగాల స్పెషలిస్టులతో ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఏర్పాటు తక్షణావసరం” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. 

రాష్ట్రప్రభుత్వం తన వంతుగా తీసుకోవలసిన తక్షణ ప్రత్యేక చర్యలను వివరిస్తూ “ఇలాంటి వ్యాధుల చికిత్స కోసం బాలల ప్రత్యేక ఐసియులు తక్షణం ఏర్పాటు చేయాలి. వ్యాధి విజృంభణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సమీపంలోని జిల్లాల్లో కనీసం 10 పడకల బాలల ఐసియులు ఏర్పాటు చేయడం ద్వారా తగినన్ని వైద్య వసతులు కల్పించడం;  జ్వరం, మూర్ఛ, మందకొడిగా ఉండడం వంటి ఎఇఎస్ వ్యాధి లక్షణాల తీవ్రత ఎక్కువ మంది బాలల్లో అధికంగా కనిపించే సమయం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అంబులెన్స్ సర్వీసులు తగినన్ని సిద్ధం చేయడం;  తీవ్రత అధికగా ఉన్న సమయంలో ఆ సవాలును సమర్థవంతంగా స్వీకరించేందుకు వైద్యులు, పారామెడికల్, ఆరోగ్య కార్యకర్తలను సంసిద్ధులను చేయడం అవసరం. అంతే కాదు, కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు సహా ప్రతిపాదిత ఆరోగ్య మౌలిక వసతుల ఏర్పాటు పనులు కూడా వేగవంతం చేయాలి” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
ఒక పక్క కోవిడ్ విజృంభణ అధికంగా ఉన్న ప్రస్తుత సమయంలో దాని కట్టడిలో పడి ఎఇఎస్ కేసులు మరుగున పడిపోకుండా చూడాలని, దాన్ని నిర్లక్ష్యం చేయరాదని డాక్టర్ హర్షవర్ధన్ నొక్కి చెప్పారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్, ఒఎస్ డి శ్రీ రాజేష్ భూషణ్, ప్రత్యేక కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీ సంజీవ్ కుమార్, ఎఎస్ అండ్ ఎండి (ఎన్ హెచ్ఎం) శ్రీమతి వందన గుర్నానితో పాటు బీహార్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, బీహార్ స్వాస్థ్య సురక్ష సమితి కార్యదర్శి/ సిఇఒ, ఆరోగ్య సర్వీసుల శాఖ డైరెక్టర్, ఎన్ సిడిసి డైరెక్టర్, పాట్నాలోని ఎయిమ్స్ డైరెక్టర్, బీహార్ లోని అన్ని జిల్లాల కలెక్టర్/  జిల్లా మెజిస్ర్టేట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీహార్ లోని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, జిల్లా స్థాయి నిఘా విభాగం అధికారులు, బీహార్ కు చెందిన జిల్లాల సిడిఎంఓ/  సిఎంహెచ్ఓలు కూడా వెబ్ లింక్ ద్వారా సమావేశంలో భాగస్వాములయ్యారు.

****
 



(Release ID: 1620340) Visitor Counter : 179