రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కరోనాపై ముందువరుసలో నిలిచి పోరాడుతున్న యోధులకు శాల్యూట్ చేసి, పోరాటానికి మద్దతు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ

Posted On: 01 MAY 2020 9:52PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారిపై ముందువరుసలో నిలిచి పోరాడుతున్న యోధులందరికీ శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో రక్షణ దళాల సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవానే, నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ కరంబీర్ సింగ్ ఘనమైన ప్రశంసలు అందించడంతో పాటు భవిష్యత్తులో కూడా వారికి మద్దతును కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధానంగా 2020 మార్చి 24 నుంచి మే 3వ తేదీ మధ్యలో ప్రతీ ఒక్క భారతీయుడు విశేషమైన త్యాగాలకు సిద్ధం కావాలంటూ పిలుపు ఇచ్చిన సమయం అత్యంత కీలకమైనదని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అధిక శాతం భారతీయులు లాక్ డౌన్ పిలుపును స్వీకరించి ఇంటి నుంచే పని చేస్తున్నారని ప్రశంసించారు. అయినా విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో తీర్చడానికి, వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు, కనీస ప్రాథమిక ఆహారం అందుబాటులో ఉంచేందుకు, ఏ ఒక్క రోగి చికిత్స నిరాకరణకు గురి కాకుండా చూసేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు, విదేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధిక సంఖ్యలో కరోనా పోరాట యోధులు కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నారని ఆయన చెప్పారు. వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, మీడియా సిబ్బంది అందరూ ఈ వ్యాధిని కట్టడి చేయడంలో తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు, వారందరికీ మేము శాల్యూట్ చేస్తూ వారి ఆరోగ్యం పూర్తి భద్రంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం అని చెప్పారు. వారందరూ ఎలాంటి ప్రమాదం ఎదుర్కొంటూ కోవిడ్-19పై ముందు వరుసలో నిలిచి పోరాడుతున్నారో మాకందరికీ తెలుసు, వారందరి త్యాగాలకు అందరం ఎంతో రుణపడి ఉంటామని, హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నామని ఆయన అన్నారు.

ఆ మహమ్మారిని పరాజయం పాలు చేసి తరిమికొట్టేందుకు కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా పౌరులు కూడా ఎంతో నియంత్రణ పాటిస్తూ నిర్దేశించిన నియమనిబంధనలు కఠినంగా పాటిస్తున్నారని, వారందరి కృషి కారణంగానే ఇతర దేశాలతో పోల్చితే వ్యాధి వ్యాప్తి రేఖ సమాంతరంగా నిలిపే దిశలో భారత్ ముందుకు సాగుతున్నదని సిడిఎస్ అన్నారు.

తగినన్ని దళాలను అందుబాటులో ఉంచడం, పౌర అధికారులకు సహాయం అందించడం అనే రెండు సిద్ధాంతాలు పునాదిగా సాయుధ దళాలు కూడా కోవిడ్-19పై పోరాటాన్ని కొనసాగిస్తాయని సిడిఎస్ హామీ ఇచ్చారు. ముందువరుసలో నిలిచి పోరాడుతున్న ఒక్క సైనికుడు లేదా ఒక్క నావికుడు లేదా ఒక్క వైమానికుడు వ్యాధిబారిన పడలేదని, అన్ని రకాల సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధంగా ఉన్నాయని ఒక ప్రశ్నకు స్పందనగా ఆయన చెప్పారు. సాయుధ దళాల్లో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఆ రక్షణకవచం యథాతథంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన అన్నారు.  

కరోనా పోరాట యోధులకు సంఘీభావం ప్రకటించడానికి సాయుధ దళాలు మే 3వ తేదీన కొన్ని కార్యకలాపాలు చేపడుతున్నట్టు సిడిఎస్ చెప్పారు. ఆదివారం నాడు సాయుధ దళాలు కవాతు నిర్వహించడంతో పాటు వైమానిక దళానికి చెందిన రవాణా విమానాలు శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు, డిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు గగనతల విహారం చేస్తాయి. భారత వైమానిక దళం, నౌకాదళానికి చెందిన హెలీకాప్టర్లు కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రులపై పూలవర్షం కురిపిస్తాయి. నౌకాదళం, భారత కోస్తా రక్షణ దళం నౌకలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో సముద్రంపై బృంద విన్యాసాలు నిర్వహిస్తాయి. సైనికదళానికి చెందిన బ్యాండు దళం కోవిడ్ ఆస్పత్రులకు వెళ్లి కరోనా పోరాట యోధులకు కృతజ్ఞతగా నాద విన్యాసాలు చేస్తాయి. 

ఈ పోరాటంలో పోలీసు సిబ్బంది సహకారాన్ని ప్రశంసిస్తూ వారందరూ అసాధారణమైన, వీరోచితమైన కృషి చేస్తున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. వారి చర్యలకు గౌరవ పూర్వకంగా త్రివిధ దళాల అధిపతులు మే 3వ తేదీ ఉదయం పోలీసు స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతాయని ఆయన అన్నారు. ఈ సమావేశం ముగించే ముందు సిడిఎస్ మరోసారి వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, మీడియా సిబ్బందికి, ఈ అసాధారణ పోరాటంలో ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్న భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.       
 

        
***



(Release ID: 1620339) Visitor Counter : 258