హోం మంత్రిత్వ శాఖ

2020 మే నెల 4వ తేదీ నుండి మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు

Posted On: 01 MAY 2020 6:33PM by PIB Hyderabad

1.  పరిస్థితులను సమగ్రంగా సమీక్షించిన అనంతరం, దేశంలో చేపట్టిన లాక్ డౌన్ చర్యల వల్ల కోవిడ్-19 పరిస్థితిలో గణనీయమైన ప్రయోజనం కనబడడంతో,  2020 మే నెల 4వ తేదీ తర్వాత మరో రెండు వారాలు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఈ రోజు భారత ప్రభుత్వం (జి.ఓ.ఐ.), దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్.హెచ్.ఏ.) విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద ఆదేశాలు జారీ చేసింది.  ఈ సమయంలో దేశంలోని వివిధ జిల్లాలలో నెలకొన్న ప్రమాద స్థాయి ఆధారంగా రెడ్ (హాట్ స్పాట్), గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లుగా విభజిస్తూ, వివిధ కార్యకలాపాలను నియంత్రించడానికి ఎమ్.హెచ్.ఏ. కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.  ఈ నూతన మార్గదర్శకాలలో, గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో గణనీయమైన సడలింపులకు అనుమతి ఇచ్చారు. 

2.      జిల్లాలను రెడ్, గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లుగా గుర్తించడానికి తగిన ప్రమాణాలను భారత ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచెఫ్.డబ్ల్యూ.) 2020 ఏప్రిల్, 30వ తేదీన విడుదల చేసిన లేఖలో వివరించింది.  ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా ధృవీకరించని జిల్లాలు లేదా గత 21 రోజులుగా ఒక కేసు కూడా ధృవీకరించని జిల్లాలను గ్రీన్ జోన్ గా గుర్తిస్తారు.  మొత్తం ధృవీకరించిన కేసులు, ఆ కేసులు రెట్టింపు అవుతున్న రేటు, ఎన్ని కేసులు పరీక్షకు పంపించారు మరియు జిల్లాల నుండి అందుతున్న నిఘా / పర్యవేక్షణ వివరాల వంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని వాటి తీవ్రతను బట్టి రెడ్ జోన్ జిల్లాలను  వర్గీకరిస్తారు.  రెడ్ జోన్ లేదా గ్రీన్ జిల్లాలు గా నిర్వచించని జిల్లాలను ఆరంజ్ జోన్లు గా వర్గీకరిస్తారు. రెడ్, గ్రీన్ మరియు గ్రీన్ జోన్లుగా వర్గీకరించిన జిల్లాల వివరాలను ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. సంబంధిత రాష్ట్రాలు మరియు కేంద్రపాలితప్రాంతాలకు వారానికి ఒకసారి లేదా అవసరమైనప్పుడు తెలియజేస్తుంది.  రాష్ట్రాలు మరియు కేంద్రపాలితప్రాంతాలు రెడ్ మరియు ఆరంజ్ జోన్లలో ఏవైనా జిల్లాలను చేర్చవచ్చు.  అయితే, ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. నిర్ణయించిన రెడ్ లేదా ఆరంజ్ జోన్లను అంతకంటే తక్కువగా వర్గీకరించడానికి అవకాశం లేదు. 

3.      ఒక జిల్లా పరిధిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నట్లయితే, వాటిని కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండు జోన్లుగా వర్గీకరించవచ్చు. ఒకటి మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లోని ప్రాంతం, రెండోది జిల్లాలోని మిగిలిన ప్రాంతంగా వర్గీకరించాలి.  మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 21 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని పక్షంలో ఆ ప్రాంతాన్ని మిగిలిన జిల్లా మొత్తం స్థాయి రెడ్ లేదా ఆరంజ్ జోన్ గా ఉంటే అంతకంటే ఒక స్థాయి తక్కువగా వర్గీకరించడానికి అనుమతిస్తారు. అంటే, ఒకవేళ జిల్లా మొత్తం మీద రెడ్ జోన్ లో ఉంటే ఆరంజ్ జోన్ గా వర్గీకరించవచ్చు.  లేదా ఒక వేళ జిల్లా మొత్తం మీద ఆరంజ్ జోన్ గా ఉంటే  గ్రీన్ జోన్ గా వర్గీకరించవచ్చు. జిల్లాల్లో కోవిడ్-19 ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింతగా ఆర్ధిక మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోడానికి ఈ వర్గీకరణ అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించడానికి మరింత ఎక్కువగా శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.  ఈ అవకాశం కేవలం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్న జిల్లాలకు మాత్రమే కల్పించబడింది. 

4.      దేశంలో కోవిడ్-19 వ్యాప్తి ని దృష్టిలో పెట్టుకుని రెడ్ మరియు ఆరంజ్ జోన్ల పరిధిలోని సున్నితమైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా వ్యవహరిస్తారు.  ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో మొత్తం వ్యాధి సోకిన కేసుల సంఖ్యను, వాటి భౌగోళిక వ్యాప్తిని బట్టి సంబంధిత జిల్లా పాలనా యంత్రాంగం వాటిని కంటైన్మెంట్ ప్రాంతాలుగా నిర్వచిస్తుంది. నిబంధనల అమలుకు వీలుగా ఆ ఆయా ప్రాంతాల సరిహద్దులను ఖచ్చితంగా నిర్ణయించవలసి ఉంటుంది.  కంటైన్మెంట్ జోన్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ పరిధిలోకి వచ్చే విధంగా స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలి. నిఘా వ్యవస్థ, వ్యాధి సోకినవారు ఎవరు ఎవరిని కలిశారు అనే వివరాలు సేకరించడం, ఇంటి ఇంటి నిఘా, వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వారికి గృహ / సంస్ధాగతమైన క్వారంటైన్ నిర్ధారించడం, ఆసుపత్రి వైద్యం మొదలైన వాటిని ఈ కంటైన్మెంట్ జోన్లలో పటిష్టంగా అమలుచెయ్యాలి.  వైద్య అత్యవసరాలు, నిత్యావసర వస్తువులు, సేవలు తప్ప మిగిలిన వాటికి ప్రజలు ఈ కంటైన్మెంట్ జోన్ లోపల, జోన్లో నుండి బయటకు తిరగకుండా కదలికలను పూర్తిగా నియంత్రించవలసిన అవసరం ఉందికంటైన్మెంట్ జోన్లలో మరి ఏ ఇతర కార్యకలాపాలను అనుమతించకూడదు. 

5.      కొత్త మార్గదర్శకాల కింద, దేశవ్యాప్తంగా జోన్ తో నిమిత్తం లేకుండా పరిమిత సంఖ్యలో కార్యకలాపాలను నిషేధించడం జరిగిందినిషేధించిన కార్యకలాపాలలో, విమానాలురైళ్లుమెట్రోల్లో ప్రయాణాలురోడ్డుపై అంతర్ రాష్ట్ర ప్రయాణాలు చేయకూడదు. పాఠశాలలుకళాశాలలు, ఇతర విద్యా సంస్థలు, శిక్షణ / కోచింగ్ సంస్థలు నడపకూడదు.  హోటళ్లురెస్టారెంట్లు వంటి ఆతిధ్య సర్వీసులు నిర్వహించకూడదు.  సినిమా హాళ్లుమాల్స్, వ్యాయామశాలలు, క్రీడా ప్రాంగణాలు మొదలైన భారీ ప్రజలు పాల్గొనే స్థలాలను తెరవకూడదు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనే సామాజిక, రాజకీయ, సాంస్కృతిక మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదు. మత సంబంధమైన ప్రాంతాలు / ప్రార్ధనా స్థలాలలోకి ప్రజలను అనుమతించకూడదు.  అయితే, విమానాలురైళ్లు, రోడ్డు ద్వారా ఎంపిక చేసిన అవసరాలకోసం, ఎమ్.హెచ్.ఏ. అనుమతించిన కార్యకలాపాలకు మాత్రమే అనుమతించబడుతుంది. 

6. ప్రజల శ్రేయస్సు మరియు భద్రతా కోసం కొత్త మార్గదర్శకాలలో కొన్ని జాగ్రత్తలు సూచించడం జరిగిందిఅందువల్ల, రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు అత్యవసర కార్యక్రమాలకు తప్ప ఎవరూ బయట తిరగకూడదుస్థానిక అధికారులు తగిన చట్ట నిబంధనల కింద సి.ఆర్.పి.సి. కి చెందిన సెక్షన్ 144 కింద నిషేధపు ఉత్తర్వులు (కర్ఫ్యూ) వంటి ఆదేశాలు జారీ చేయాలి  అన్ని జోన్లలోనూ, 65 సంవత్సరాల వయస్సు పైబడినవారు, వ్యాధిగ్రస్థులు, గర్భిణీలు, 10 సంవత్సరాల లోపు వయసు పిల్లలు, ఇంటిలోనే ఉండాలి.  అత్యవసరమైన కార్యకలాపాలకు, ఆరోగ్య అవసరాలకు తప్ప వేరే అవసరాలకు బయట తిరగకూడదు.  రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లలో సామాజిక దూరం మరియు  ఇతర  ముందస్తు భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ, అవుట్-పేషేంట్ విభాగాలు (ఓ.పి.డి.ఎస్.) మరియు వైద్య క్లినిక్కులను నిర్వహించుకోడానికి అనుమతించారు. అయితే, కంటైన్మెంట్ జోన్లలో వీటికి అనుమతి లేదు. 

7.      దేశవ్యాప్తంగా నిషేధించిన వాటికి అదనంగా కంటైన్మెంట్ జోన్లకు వెలుపల రెడ్ జోన్లలో మరి కొన్ని కార్యకలాపాలను కూడా నిషేధించారు.  అవి : సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలుటాక్సీలుక్యాబ్ లు నడపకూడదు. జిల్లాల మధ్య, జిల్లాల్లోనూ బస్సులు తిరగకూడదు క్షౌరశాలలు, స్పాలు, సెలూన్లు తెరవకూడదు. 

8. రెడ్ జోన్లలో కొన్ని నిబంధనలతో కొన్ని ఇతర కార్యకలాపాలను అనుమతిస్తారు. వ్యక్తులు, వాహనాల కదలికలను కొన్ని అనుమతి పొందిన కార్యకలాపాలకు మాత్రమే అనుమతిస్తారు. నాలుగు చక్రాల వాహనాల్లో గరిష్టంగా ఇద్దరిని (డ్రైవర్ తో పాటు) అనుమతిస్తారు.  ద్విచక్రవాహనాలకైతే ఒక్కరినే అనుమతిస్తారు. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు (ఎస్.ఈ.జెడ్.లు), ఎగుమతి ఆధారిత యూనిట్లు(ఈ.ఓ.యు.లు), పారిశ్రామిక వాడలు వంటి పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక సంస్థలు కొన్ని నియంత్రణలకు లోబడి అనుమతిస్తారు.  ఇతర పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతించిన వాటిలో మందులు, ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాలు, వాటి ముడి సరుకులు వంటి అత్యవసర వస్తువుల తయారీ యూనిట్లు,  నిరంతరం కొనసాగే ప్రక్రియ గల ఉత్పత్తి యూనిట్లు, వాటి సరఫరా సంస్థలు,  ఐ.టి. హార్డ్ వేర్ తయారీ, జనపనార పరిశ్రమ, ప్యాకేజింగ్ వస్తువుల తయారీ యూనిట్లు  మొదలైనవి ఉన్నాయి. అయితే వీటిని, షిఫ్టులు పద్దతిలోసామాజిక దూరం నిబంధనను పాటిస్తూ నిర్వహించాలి. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను ( పని వారిని బయట నుండి తీసుకురావలసిన అవసరం ఉండకూడదుకార్మికులు పని ప్రదేశంలో అందుబాటులో ఉండాలి) ప్రారంభించవచ్చు. పునరుత్పాదక ఇంధన ప్రోజెక్టుల నిర్మాణం చేపట్టవచ్చు. పట్టణ ప్రాంతాల్లో దుకాణాలను అనుమతిస్తారు.  మాల్స్మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్ లలో నిత్యావసర వస్తువులకాని దుకాణాలను అనుమతించరు.  అయితే, పట్టణాలల్లో విడివిడిగా ఉండే చిన్న షాపులుకాలనీల్లో ఉండే దుకాణాలు, నివాస ప్రాంగణాల్లో ఉండే షాపులు నిత్యావసర వస్తువులు, నిత్యావసరం కాని వస్తువులు అనే తేడా లేకుండా తెరుచుకోవచ్చు. రెడ్ జోన్లలో అత్యవసర వస్తువుల విషయంలో మాత్రమే ఈ-కామర్స్ కార్యకలాపాలను అనుమతిస్తారు. ప్రయివేటు కార్యాలయాలు అవసరాన్ని బట్టి 33 శాతం సిబ్బందితోమిగిలినవారు ఇంటి నుండి పనిచేసే విధంగా పని చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ కార్యదర్శి స్థాయి సీనియర్ అధికారులు అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులు అందరూ, మిగిలిన సిబ్బందిలో అవసరం ఉన్నంతవరకు 33 శాతం  హాజరుతో పనిచేయాలి. అయితే, రక్షణ, భద్రతా సేవలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోలీసు, కారాగారాలు, హోం గార్డులు, పౌర రక్షణ, అగ్ని మాపకఅత్యవసర సేవలు, విపత్తు యాజమాన్యం, సంబంధిత సేవలు, జాతీయ ఇన్ఫర్మాటిక్స్ కేంద్రం (ఎన్.ఐ.సి.), కస్టమ్స్, భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.), ఎన్.సి.సి., నెహ్రూ యువక్ కేంద్ర (ఎన్.వై.కె.), మునిసిపల్ సేవలకు చెందిన ఉద్యోగులు ఎటువంటి నిబంధనలు లేకుండా పనిచేయవచ్చు. ప్రజా సేవలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలి. ఆ పనులకు అవసరమైన సిబ్బందిని నియోగించుకోవాలి. 

9.      రెడ్ జోన్లలో పెద్ద సంఖ్యలో ఇతర కార్యకలాపాలను కూడా అనుమతించారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఎమ్.ఎన్.ఆర్.ఈ.జి.ఏ. పనులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లుఇటుకల బట్టీలతో పారిశ్రామిక, నిర్మాణ పనులను అనుమతించారు.  దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్న వస్తువులతో సంబంధం లేకుండా షాపింగ్ మాల్స్ తప్ప  అన్ని దుకాణాలకు అనుమతి ఇచ్చారువిత్తనాలు నాటడంకోతల వంటి వ్యవసాయ కార్యకలాపాలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా , సేకరణ, మార్కెటింగ్ కార్యకలాపాలను కూడా అనుమతించారు. పశు సంవర్ధక శాఖ పరిధిలో స్వదేశీ, విదేశీ మత్స్య పరిశ్రమ కార్యకలాపాలతో పాటు అన్ని పనులకు పూర్తిగా అనుమతి ఇచ్చారుప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ తో సహా తోటల పెంపకం కార్యకలాపాలను అనుమతించారు. ఆయుష్ తో సహా అన్ని ఆరోగ్య సేవలతో పాటు, వైద్య సిబ్బంది, రోగులకు ఎయిర్ అంబులెన్సు సేవలను కూడా అనుమతించారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్ధిక సంస్థలు (ఎన్.బి.ఎఫ్.సి.లు), బీమా, క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాలు, సహకార పరపతి సంఘాల వంటి పెద్ద సంఖ్యలో ఆర్ధిక రంగ సంస్థలు తెరిచే ఉంటాయిపిల్లలు, వయోవృద్దులుఆనాధలుమహిళలువితంతువులు మొదలైనవారు కోసం నిర్వహించే ఆశ్రమాలుఅంగన్ వాడీల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు.  విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, పారిశుధ్యం, వ్యర్ధపదార్ధాల నిర్వహణ, టెలీకమ్యూనికేషన్లు, ఇంటర్ నెట్ వంటి ప్రజా సదుపాయాలు తెరిచే ఉంటాయి.  కొరియర్, తపాలా  సేవలు నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చారు

10.    రెడ్ జోన్లలో చాలా భాగం వాణిజ్యప్రయివేటు సంస్థలకు అనుమతి ఇచ్చారు. వీటిలో ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, ఐ.టి. మరియు ఐ.టి. ఆధారిత సంస్థలు, డేటా మరియు కాల్ సెంటర్లు, శీతల గిడ్డంగులు,  వేర్ హోసింగ్ సేవలుప్రయివేటు సెక్యూరిటీ, సదుపాయాల నిర్వహణ సేవలుక్షురకులు మినహా  స్వయం ఉపాధి వ్యక్తుల  ద్వారా సేవలు ఉన్నాయి మందులు, ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాలు, వాటి ముడి సరుకులు వంటి అత్యవసర వస్తువుల తయారీ యూనిట్లు,  నిరంతరం కొనసాగే ప్రక్రియ గల ఉత్పత్తి యూనిట్లు, వాటి సరఫరా సంస్థలు,  ఐ.టి. హార్డ్ వేర్ తయారీ, జనపనార పరిశ్రమ, ప్యాకేజింగ్ వస్తువుల తయారీ యూనిట్లు  మొదలైనవి ఉన్నాయి.   అయితే వీటిని, షిఫ్టులు పద్దతిలోసామాజిక దూరం నిబంధనను పాటిస్తూ నిర్వహించాలి.

11.    ఆరంజ్ జోన్లలో, రెడ్ జోన్లలో అనుమతించిన కార్యకలాపాలకు అదనంగా టాక్సీలుక్యాబ్ లలో ఒక డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణీకులను అనుమతిస్తారు.  వ్యక్తులు, వాహనాల అంతర్ జిల్లా కదలికలకు కేవలం అనుమతి పొందిన కార్యకలాపాలకు మాత్రమే అనుమతిస్తారు. నాలుగు చక్రాల వాహనాల్లో డ్రైవర్ తో పాటు గరిష్టంగా ఇద్దరిని అనుమతిస్తారు.  ద్విచక్రవాహనాలకైతే ఇద్దరిని అనుమతిస్తారు.  

12.    గ్రీన్ జోన్లలోదేశవ్యాప్తంగా జోన్లతో సంబంధం లేకుండా నిషేధించిన పరిమితమైన కార్యకలాపాలు తప్ప మిగిలిన అన్ని కార్యకలాపాలను అనుమతిస్తారు. అయితే, బస్సు డిపోల్లోని 50 శాతం బస్సులు నడపవచ్చు.  ఆ బస్సుల్లో 50 శాతం సీట్లలోనే ప్రయాణీకులను తీసుకువెళ్ళాలి. 

13.     అన్ని రకాల సరకుల రవాణాను అనుమతిస్తారు. పొరుగు దేశాలతో అంతర్ సరిహద్దు వ్యాపారానికి ఒప్పందాలు కుదుర్చుకున్న సరకు రవాణాను  సరిహద్దుల వద్ద ఈ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు  నిలుపుచేయరాదు. అటువంటి రవాణాకు ప్రత్యేకమైన అనుమతి పత్రం లాంటిది అవసరం లేదు.  లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా సరకులు, సేవల సరఫరా కొనసాగించడానికి ఇది చాలా అవసరం. 

14.  ఈ మార్గదర్శకాల కింద ప్రత్యేకంగా నిషేధించబడని లేదా వివిధ జోన్లలో నిబంధనలతో అనుమతించబడిన ఇతర అన్ని కార్యకలాపాలు అనుమతించినట్లే. అయితే, రాష్ట్రాలు  కేంద్రపాలితప్రాంతాలు తమ పరిస్థితికి తగ్గట్టు, కోవిడ్-19 వ్యాప్తిని అదుపుచేయాలనే ప్రాధమిక ఉద్దేశ్యానికి లోబడి, ఏమైనా నిబంధనలు అవసరం అనుకుంటే, ముందుగా అనుమతించిన కార్యకలాపాలలో కొన్ని ఎంపిక చేసిన కార్యకలాపాలను మాత్రమే అనుమతించవచ్చు.  

15.       2020 మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ లో తీసుకోవలసిన చర్యలపై రూపొందించిన మార్గదర్శకాల కింద ఇప్పటికీ అనుమతించిన కార్యకలాపాలకు అధికారుల నుండి వేరే ప్రత్యేకమైన / తాజా అనుమతుల అవసరం లేదు. భారతదేశంలో విదేశీయుల ట్రాన్సిట్ ఏర్పాటు, క్వారంటైన్ లో ఉన్న వ్యక్తుల విడుదల, రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల మధ్య చిక్కుకుపోయిన కార్మికుల కదలికలు, భారతీయ నావికుల ప్రవేశం, నిష్క్రమణల విధానం, చిక్కుకుపోయిన వలస కూలీలు, యాత్రీకులు, విద్యార్థులు ఇతర వ్యక్తులను రైళ్లు, రోడ్డు మార్గాల్లో తరలించడం వంటి విషయాలపై హోంమంత్రిత్వశాఖ జారీచేసిన ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొటొకాల్స్ (ఎస్.ఓ.పి.) అమలులో కొనసాగుతాయి.  

16.    విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్ డౌన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి.  ఏ విధంగానూ ఈ మార్గదర్శకాలను నీరుకార్చరాదు. 

 

*****(Release ID: 1620274) Visitor Counter : 288