PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 26 APR 2020 6:16PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారు 21.90 శాతం... అంటే- 5,804 మంది; మొత్తం నిర్ధారిత కేసులు 26,496 కాగా; మరణాలు 824గా నమోదయ్యాయి.
  • దేశంలోని హాట్‌స్పాట్‌ జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడి, హాట్‌స్పాటేతర జాబితాలోకి చేరుతున్నట్లు పేర్కొన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • కరోనాపై భారత్‌ పోరుకు దేశ ప్రజలే నాయకత్వం వహిస్తున్నారన్న ప్రధానమంత్రి; అతి విశ్వాసంతో చిక్కుల్లో పడవద్దని ప్రజలకు సూచించారు.
  • రైతులు, తదితరులు తమ ఉత్పత్తులను భారీ కొనుగోలుదారులకు ప్రత్యక్షంగా విక్రయించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారు 21.90 శాతం... అంటే- 5,804 మంది; మొత్తం నిర్ధారిత కేసులు 26,496 కాగా; మరణాలు 824గా నమోదయ్యాయి. కాగా, కోవిడ్‌-19 నిరోధం, ప్రతిస్పందనపై వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమ సమీక్ష నిర్వహించారు. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో దిగ్బంధ చర్యలు కఠినంగా అమలు చేయాలని, నియంత్రణ వ్యూహాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. కాగా, దేశంలోని హాట్‌స్పాట్‌ జిల్లాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలు క్రమంగా హాట్‌స్పాటేతర జిల్లాల జాబితాలోకి వస్తున్నాయని ఆయన వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618485

"మన్ కీ బాత్ 2.0"లో ప్రధానమంత్రి 11వ విడత ప్రసంగం

‘మన్ కీ బాత్ 2.0’లో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ  11వ విడత ప్రసంగం చేశారు. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటం ప్రజల నాయకత్వంలో నడుస్తున్నదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజలతోపాటు ప్రభుత్వం, పాలన యంత్రాంగం ఈ మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయని తెలిపారు. ఈ యుద్ధంలో దేశంలోని ప్రతి పౌరుడు ఒక సైనికుడని, వారి నాయకత్వంలోనే ఈ పోరాటం సాగుతున్నదని ఆయన అన్నారు. ప్రతి ప్రదేశంలో ప్రజలు పరస్పరం సాయం చేసుకోవడానికి ముందుకు రావడంలో వారు ప్రదర్శించిన సంకల్పబలం అనుపమానమని ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618517

ప్రధానమంత్రి ‘మన్‌ కీ బాత్‌’ 2.0 కార్యక్రమంలో భాగమైన 26.04.2020నాటి 11వ విడత ప్రసంగం ఆంగ్లపాఠం లభ్యం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618390

దిగ్బంధం సమయాన సకాలంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ‘ప్రత్యక్ష విక్రయం’ ద్వారా మండీలలో రద్దీ తగ్గే అవకాశం

వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యక్ష విక్రయంద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం సంయుక్త కృషి సాగుతోంది. అయితే, కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా మండీలలో సామాజిక దూరం పాటించాల్సిందిగా వ్యవసాయ మంత్రిత్వశాఖ సూచనలు జారీచేసింది. భారీ కొనుగోలుదారులకు ప్రత్యక్ష విక్రయాలు చేసేలా రైతులు/రైతుసంఘాలు, ఆహారోత్పత్తిదారులు, సహకార సంఘాలను ప్రోత్సహించాల్సిందిగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618311

కోవిడ్‌-19 రోగులకు చికిత్సచేసే వైద్య సిబ్బందికి అవసరమైన కవరాల్స్‌ తయారీ సామర్థ్యం రోజులకు లక్షదాకా పెంపు

దేశంలో ఇప్పటిదాకా తయారైన మొత్తం కవరాల్స్‌ సంఖ్య సుమారు 10 లక్షల యూనిట్లు దాటింది. కోవిడ్‌-19పై ముందువరుసన నిలిచి పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి రక్షణ కల్పించడంలో ఇదొక ముందడుగు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ కిట్ల కవరాల్స్‌ తయారీలో బెంగళూరు నగరం అగ్రస్థానంలో ఉండగా తమిళనాడులోని చెన్నై, తిరుప్పూర్‌ నగరాలతోపాటు  పంజాబ్‌, గురుగ్రామ్‌, ఎన్‌సీఆర్‌ పరిధిలోని నోయిడాలలోగల ఫగ్వారా, లూధియానాలు కూడా పీపీఈ కవరాల్స్‌ ఉత్పత్తి కూడళ్లుగా మారాయి. తదనుగుణంగా పీపీఈల సుస్థిర సరఫరా శృంఖలం నిరంతరం కొనసాగేవిధంగా ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం వివిధ పారిశ్రామిక వర్గాలతో కలసి కృషిచేస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618488

ఐఐటీ-బాంబే విద్యార్థి నాయకత్వంలో చౌకధర మెకానికల్‌ వెంటిలేటర్‌ రూధర్‌ను రూపొందించిన బృందం

ఐఐటీ-బాంబే, ఎన్‌ఐటీ-శ్రీనగర్‌, జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాపరిధిలోగల అవంతిపురాలలోని ఇస్లామిక్‌ శాస్త్ర-సాంకేతిక విశ్వవిద్యాలయం తదితరాలకు చెందిన సృజనాత్మక వ్యక్తులు సమష్టిగా వెంటిలేటర్ల కొరత తీర్చడానికి కృషిచేశారు. ఇందులో భాగంగా ఈ బృందం తమకు అందుబాటులోగల వస్తువులతోనే చౌకధర వెంటిలేటర్‌ను రూపొందించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618375

‘కరోనా సహాయత యోజన’ కింద ప్రభుత్వం రూ.1,000 మంజూరు చేస్తున్నట్లు వాట్సాప్‌లో అవాస్తవ సమాచారం

‘కరోనా సహాయత యోజన’ కింద ప్రభుత్వం రూ.1,000 మంజూరు చేస్తున్నట్లు వాట్సాప్‌లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని పత్రికా సమాచార సంస్థ-పీఐబీ ‘ఫ్యాక్ట్‌చెక్‌’ యూనిట్‌ ట్విట్టర్‌ సందేశంద్వారా తేల్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618404

కోవిడ్‌-19పై భారత పోరాటంపై అవగాహన కోసం మాజీ ఉన్నతాధికారులతో విస్తృతంగా సంప్రదించిన డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618286

 ‘దేఖో అప్నాదేశ్‌’ వెబినార్‌ సిరీస్‌ కింద ‘అవధ్‌ కీ సైర్‌ - ది ప్రైడ్‌ ఆఫ్‌ లక్నో’ శీర్షికన పాకశాస్త్ర పర్యాటక సామర్థ్యాన్ని చాటిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618409

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అసోం: రాష్ట్రంలో దిగ్బంధం అమలు తర్వాత ఇప్పటిదాకా 18 జిల్లాల పరిధిలోగల 28 రైల్వే కేంద్రాల్లో బియ్యం, ఉప్పు, చక్కెర, బంగాళాదుంప, ఉల్లి తదితర నిత్యావసరాలను స్వీకరించారు. ఈ మేరకు 357 గూడ్సురైళ్లలో వచ్చిన వస్తువుల తరలింపునకు రోజూ సుమారు 1,500 ట్రక్కులను వినియోగించి 44,624 ట్రిప్పులు నడిపించారు. కాగా, వీటిలో భారత ఆహారసంస్థ 179 రైళ్లద్వారా ఈశాన్య భారత రాష్ట్రాలన్నిటికోసం 4.7 లక్షల టన్నుల బియ్యం, 0.21 లక్షల టన్నుల గోధుమలను అసోం రాష్ట్రానికి చేర్చింది. ఇందులో 3.75 లక్షల టన్నుల బియ్యం, 0.14 లక్షల టన్నుల గోధుమలను అసోంకు కేటాయించారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్‌-19 నుంచి కోలుకున్న 8 మందికి వరుసగా నిర్వహించిన పరీక్షలలో వ్యాధి నయమైనట్లు తేలిన తర్వాత ఆస్పత్రుల నుంచి ఇళ్లకు పంపినట్లు ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. అయినప్పటికీ వారు 14 రోజులపాటు వైద్య పరిశీలనలో ఉంటారని చెప్పారు.
  • మణిపూర్‌: దిగ్బంధం తొలగించిన తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించినవారి సంఖ్యను జిల్లాలవారీగా అంచనా వేసే ప్రక్రియ రాష్ట్రంలో మొదలైంది. అయితే, వారిని 14 రోజులపాటు నిర్బంధ వైద్య పరిశీలనలో ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో దిగ్బంధం నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమ బోర్డు 49,598 మంది రోజువారీ కార్మికులకు రూ.3,000 వంతున పంపిణీ చేసింది.
  • నాగాలాండ్‌: రాష్ట్రంలో దిగ్బంధం ఉల్లంఘన కింద 469 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే 5 సామాజిక మాధ్యమ నిబంధనల ఉల్లంఘన కేసుల నమోదుతోపాటు 335 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి దరఖాస్తుల పరిశీలన అనంతరం 9,800 మంది రాష్ట్రవాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.1.63 కోట్లు పంపిణీ చేసింది.
  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటిదాకా పేదలకు 21.5 లక్షల ఆహారపొట్లాలను పంపిణీ చేశారు. ఈ అన్నదానంలో పాలుపంచుకున్న గురుద్వారాలు, స్వచ్ఛంద/స్వయం సహాయ సంఘాల బృందాలు తదితరాలకు చండీగఢ్‌ పాలనాధికారి కృతజ్ఞతలు తెలిపారు. కాగా నగరంలో కోవిడ్‌-19 నిర్వహణను పర్యవేక్షించేందుకు కొత్త కంట్రోల్‌-కమాండ్‌ సెంటర్‌ను పాలన యంత్రాంగం ప్రారంభించింది. దీనిద్వారా నగరవ్యాప్తంగా కూరగాయలు, పండ్లు, పాలు, బ్రెడ్‌, పారిశుధ్య పనులు తదితరాలను అధికారులు పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.
  • పంజాబ్‌: కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో నివాస/వాణిజ్య-ఆస్పత్రి తదితరాల్లో ఎయిర్‌ కండిషనింగ్‌ సదుపాయం వినియోగంపై ప్రభుత్వం సలహాపత్రం జారీచేసింది. కాగా, ‘ఈ-సంజీవని’ పేరిట ఆన్‌లైన్‌ ఓపీడీ (డాక్టర్‌-రోగి మధ్య సంధానం) సదుపాయాన్ని కల్పించింది. ఈ టెలి-మెడిసిన్‌ సంధాన సౌకర్యాన్ని మొహాలీలోని  సి-డాక్‌ రూపొందించింది. దీనిద్వారా పట్టణాలు, గ్రామాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్ల్లోనూ ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పైగా దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా తీవ్ర రుగ్మతలకు ప్రత్యేక వైద్యనిపుణుల చికిత్సతోపాటు సాధారణ ఆరోగ్య సమస్యలపై ఇంటినుంచే సలహాలను కూడా పొందవచ్చు.
  • హర్యానా: రాష్ట్రంలో ‘హెల్ప్‌ మీ’ పేరిట ఒక మొబైల్‌ యాప్‌ను ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు.  టెలిమెడిసిన్, సంచార పాసులు, వ్యవసాయ కొనుగోళ్లలో సాయం, సాధారణ రేషన్‌ సరుకుల సరఫరా, విద్యాసామగ్రి, వండిన ఆహారం తదితరాలన్నిటినీ ఒకే వేదికపై అందించడం దీని లక్ష్యం. కాగా, గడచిన ఐదు రోజుల్లో రాష్ట్రంలోని 1,30,707 మంది రైతుల నుంచి 19.26 లక్షల టన్నుల గోధుమలను కోనుగోలు చేశారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 26.04.2020 నుంచి కర్ఫ్యూను ఉదయం 5:30 నుంచి 7 గంటలవరకు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయోజనులు, సామాన్యుల ఉదయం నడకకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సోమవారం నుంచి ప్రస్తుతం మూడు గంటలపాటు అనుమతిస్తున్న సడలింపు వ్యవధిని నాలుగు గంటలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాజిక దూరం నిబంధన పాటింపుతోపాటు దుకాణాలలో రద్దీని కనీస స్థాయికి తగ్గిస్తుంది. మరోవైపు గనుల తవ్వకం ప్రదేశాల నుంచి ప్రాజెక్టు ప్రాంతాలకు నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లే ట్రక్కుల అంతర్ జిల్లా రవాణాను అనుమతించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రహదారి నిర్మాణ యంత్రాల కదలికలను కూడా అనుమతించింది.
  • కేరళ: అంతర్రాష్ట్ర సరిహద్దులలో దిగ్బంధం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య సగటున 500 కన్నా తక్కువ కావడంతో మరింత పెంచాలని నిర్ణయించింది. మరోవైపు ‘ది నార్కా (ప్రవాస కేరళీయుల వ్యవహారాల) రూట్స్’ ప్రభుత్వ సంస్థ విదేశాలలో చిక్కుకున్న, రాష్ట్రానికి తిరిగి రావాలనుకునే ప్రవాసుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించనుంది. వారికోసం మరిన్ని నిర్బంధ వైద్య పరిశీలన సౌకర్యాలను అన్వేషణకు నిర్ణయించింది. రాష్ట్రంలో నిర్ధారిత కేసులు: 457, యాక్టివ్ కేసులు: 116, నయమైనవారు: 338 మంది; పరిశీలనలో ఉన్నవారు: 21,044; పరీక్షించిన నమూనాలు: 22,360.
  • తమిళనాడు: తమిళనాడులో వైరస్ వ్యాప్తి నిరోధం దిశగా ఇవాళ్టినుంచి ఐదు నగరాల్లో పూర్తి దిగ్బంధం ప్రారంభమైంది. కాగా, ఆరుగురు సిబ్బందికి వ్యాధి నిర్ధారణ కావడంతో కోయంబత్తూరులోని రెండు పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం మూసివేసింది. కోయంబేడు మార్కెట్‌లోని విక్రేతలకు కోవిడ్‌-19 సోకిన నేపథ్యంలో చెన్నై కార్పొరేషన్‌ అక్కడి వారందరికీ పరీక్షల నిర్వహణను వేగవంతం చేసింది. కాగా, నిన్నటివరకూ నమోదైన కోవిడ్-19 కేసులు: 1,821, యాక్టివ్ కేసులు: 835; మరణాలు: 23, డిశ్చార్జ్ అయినవారు: 960 మంది. వీటిలో చెన్నైలోనే గరిష్ఠంగా 495 కేసులున్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో బెంగళూరుకు చెందిన 45 ఏళ్ల గర్భవతి మృతితో కర్ణాటకలో 19వ కోవిడ్ మరణం నమోదైంది. రాష్ట్రంలో నమోదైన సమాచారం ప్రకారం... కొత్త నిర్ధారిత కేసులలో అధికశాతం పరీక్షలలో రోగలక్షణాలు లేనివారివే కావడం గమనార్హం. మొత్తం కేసులు: 501, మరణాలు: 19, నయమైనవారు: 177 మంది.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో గడచిన 24 గంట్లో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,097కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య: 835 కాగా, కోలుకున్నవారు 231మంది; మరణాలు 31గా నమోదయ్యాయి. కోవిడ్‌-19 కేసులు అత్యధికంగా నమోదువుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దిగ్బంధం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం పట్టణాన్ని పూర్తిగా దిగ్బంధం చేశారు. ఇక్కడ నమోదైన కేసులకు సంబంధించి వారితో ప్రాథమిక సంబంధాలున్న అందర్నీ అధికారులు గుర్తించారు. యధావిధిగానే కర్నూలు 279, గుంటూరు 214, కృష్ణా 177 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్ల కొరత ఏర్పడింది. విశాఖపట్నం సెజ్‌లోని బొమ్మల తయారీదారులు ఈ సామగ్రి ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో 7 లక్షల జనాభాగల గద్వాల జిల్లా కోవిడ్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఒకటిగా తయారైంది. జిల్లానుంచి ఇప్పటివరకూ 45 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ప్రతిరోజూ ఒకటిరెండు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 990కి చేరింది.

PIB FACTCHECK

 

*********


(Release ID: 1618538) Visitor Counter : 260