PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 09 NOV 2020 5:56PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశవ్యాప్తంగా వరుసగా 37వ రోజున కొత్త కేసులకన్నా అధికంగా నమోదైన కోలుకున్న కేసులు
  • గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 48,405 కాగా, కొత్త కేసులు కేవలం 45,903 మాత్రమే
  • దేశంలో చురుకైన కేసుల సంఖ్య మరింత తగ్గి 5.09 లక్షలకు పరిమితం
  • కోలుకునేవారి జాతీయ సగటు మరింత మెరుగుపడి 92.56 శాతానికి చేరిక
  • భారతదేశంలో నిర్ధారిత కేసుల సంచిత సగటు మరింత తగ్గి నేడు 7.19 శాతంగా నమోదు
  • కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఈ-సంజీవని’ సేవలకింద 7 లక్షల దూరవాణి-వైద్య సంప్రదింపులు పూర్తి

Image

భారత్‌లో వరుసగా 37వ రోజు కొత్త కేసులకన్నా అధికంగా కోలుకున్న కేసులు; కొత్త కేసుల నమోదు సగటు… రోజువారీ మరణాల సగటు స్థిరంగా తగ్గుదల

దేశవ్యాప్తంగా ఇవాళ వరుసగా రెండోరోజున నమోదైన కొత్త కేసులు 50 వేలు దాటకపోవడం విశేషం.  ఈ మేరకు గత 24 గంటల్లో 45,903 మందికి మాత్రమే కోవిడ్‌ నిర్ధారణ అయింది. కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనపై ప్రభుత్వం చేపట్టిన ప్రజా ఉద్యమంవల్ల రోజువారీ కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో వరుసగా 37వ రోజున కోలుకునే కేసుల సంఖ్య కొత్త కేసులకన్నా అధికంగా నమోదైంది. తదనుగుణంగా గత 24 గంటల వ్యవధిలో 48,405 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశంలో చురుకైన కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రస్తుతం 5,09,673 వద్ద నిలిచింది. కోలుకునే కేసుల సగటు కూడా బాగా మెరుగుపడి 92.56 శాతానికి పెరిగింది. దీంతో ఇప్పటిదాకా కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య నేడు 79,17,373కు చేరింది. దీంతో ప్రస్తుత కేసులతో పోలిస్తే కోలుకున్న కేసులు 74,07,700 మేర అధికంగా నమోదయ్యాయి. ఈ వ్యత్యాసం అధికంగా ఉన్నందున మొత్తం కేసులలో చురుకైన కేసులు నేడు 7.19 శాతంగా ఉన్నాయి. కోలుకున్న తాజా కేసులలో 79 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనివే కాగా- మహారాష్ట్ర 8,232, కేరళ 6,853 కేసులతో తొలి రెండు స్థానాల్లో నిలవగా, 6,069 కేసులతో ఢిల్లీ తృతీయ స్థానంలో ఉంది. ఇక కొత్త కేసులలోనూ 79 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనివే కాగా- 7,745 కేసులతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఇక 5,585 కేసులతో మహారాష్ట్ర, 5,440 కేసులతో కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 490 మరణాలు సంభవించగా, 24 గంటల్లో నమోదయ్యే మృతుల సంఖ్య స్థిరంగా తగ్గుతూ 500కన్నా తక్కువ స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ 490 మరణాల్లోనూ దాదాపు 81 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671369  

దేశంలోని 9 రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులతో డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ దేశంలోని 9 రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రులు, ఆ శాఖ ముఖ్య/అదనపు కార్యదర్శులు, ఇతర సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. డాక్టర్‌ హర్షవర్ధన్‌ సమావేశాన్ని ప్రారంభిస్తూ- జనవరి 8న కోవిడ్‌పై తొలిసారి భేటీ నిర్వహించిన నేపథ్యంలో నేడు మహమ్మారి 11వ నెలకు చేరిందని గుర్తుచేశారు. రాబోయే శీతాకాలంతోపాటు సుదీర్ఘ పండుగల సీజన్‌వల్ల కోవిడ్‌-19పై పోరులు మనం ఇప్పటిదాకా సమష్టిగా సాధించిన విజయాలకు విఘాతం కలిగే ముప్పుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “దసరాతో ప్రారంభమైన పండుగల సీజన్ దీపావళి, ఛాత్‌పూజ, క్రిస్మస్‌, అటుపైన కొత్త సంవత్సరంలో మకర సంక్రాంతివరకూ సాగుతుంది. ఇక శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ కాలం పొడవునా మనమంతా అప్రమత్తంగా ఉండాలి” అని హెచ్చరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671516

ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ప్రజా ఉద్యమం’ అమలుపై ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య-వైద్యవిద్యాశాఖ మంత్రితో డాక్టర్ హర్షవర్ధన్ చర్చ

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం ప్రధానమంత్రి ‘ప్రజా ఉద్యమం’ అమలుపై ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య-వైద్యవిద్యా శాఖ మంత్రి శ్రీ త్రిభువనేశ్వర్‌ శరణ్‌సింగ్‌ దేవ్‌తో చర్చించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. కోవిడ్‌-19పై దేశం సమష్టిగా సాధించిన విజయాలకు రాబోయే శీతాకాలం, సుదీర్ఘ పండుగల సీజన్‌లో విఘాతం కలిగే ప్రమాదం గురించి ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ- “మనమందరం రాబోయే మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలి. గౌరవనీయ ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ప్రజా ఉద్యమంలో మాస్కు ధారణ, భౌతికదూరం కొనసాగింపు, తరచూ చేతులు కడుక్కోవడం వంటి చర్యలపై సందేశం దేశంలో చివరి పౌరుడిదాకా చేరాలి” అని సూచించారు. ఇక కోలుకునేవారి జాతీయ సగటు 92 శాతం కాగా, ఛత్తీస్‌గఢ్‌లో 87 శాతంగా ఉందని డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. అయితే, మరణాల్లో జాతీయ సగటు 1.49 శాతంకాగా, రాష్ట్రంలో 1.19 శాతంగా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే- రాజ్‌నందగావ్, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, రాయ్‌గఢ్‌, బలోడా బజార్ జిల్లాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670902

ఎస్‌టీఐపీ-2020పై ప్రవాస భారత శాస్త్రవిజ్ఞాన నిపుణులతో తొలి విధాన సంప్రదింపుల వర్చువల్ సమావేశం నిర్వహించిన డాక్టర్ హర్షవర్ధన్‌

భారత శాస్త్ర-సాంకేతిక-ఆవిష్కరణల విధానం-2020 (STIP-2020)లో తోడ్పాటు దిశగా ప్రవాస భారత శాస్త్రవిజ్ఞాన నిపుణులకు మార్గం సుగమం చేస్తూ కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన; ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖల మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ న్యూఢిల్లీనుంచి వారితో తొలిసారి వర్చువల్‌ మార్గంలో ఆదివారం నిర్వహించిన విధాన సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభం నుంచి కోలుకునే దిశగా భారత్‌తోపాటు ప్రపంచం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చరిత్రాత్మక విధానానికి శ్రీకారం చుట్టినట్లు డాక్టర్ హర్షవర్ధన్‌ తెలిపారు. ఈ మేరకు విధాన రూపకల్పన ప్రక్రియలో ప్రవాస భారతీయ శాస్త్రవిజ్ఞాన నిపుణులు ప్రధాన భాగస్వాములని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671362

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఈ-సంజీవని’ సేవలకింద 7 లక్షల దూరవాణి-వైద్య సంప్రదింపులు పూర్తి

భారత ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన జాతీయ దూరవాణి-వైద్య సేవ ‘ఈ-సంజీవని’ శనివారం 7 లక్షల సంప్రదింపులు పూర్తిచేసుకుంది. కాగా, ఇందులో చివరి లక్ష సంప్రదింపులు కేవలం 11 రోజుల్లోనే పూర్తికావడం గమనార్హం. అవుట్‌పేషెంట్‌ సేవలు అందించడం కోసం ఈ నవ్య డిజిటల్ నమూనా వాస్తవంగా సత్వర ప్రజాదరణ పొందుతోంది. ఇందులో భాగంగా రోజుకు 10,000కు పైగా సంప్రదింపులు ‘ఈ-సంజీవని’లో నమోదవుతున్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671005

వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా వారణాసిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.220 కోట్ల వ్యయంతో చేపట్టే 16 పథకాలను ప్రారంభించారు. కాగా, వారణాసిలో ఇప్పటికే రూ.400 కోట్ల విలువైన 14 పథకాల పనులు ప్రారంభమైనట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671411

వారణాసిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671394

ఐఐటీ-ఢిల్లీ 51వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

ఐఐటీ నుంచి తాజాగా ఉత్తీర్ణులైన యువతరం దేశ అవసరాలేమిటో గుర్తించి, క్షేత్రస్థాయిలో మార్పులతో మమేకం కావాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఐఐటీ-ఢిల్లీ 51వ స్నాతకోత్సవంలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్వయం సమృద్ధ భారతం సాధన లక్ష్యం దిశగా సామాన్యుల ఆకాంక్షలను గుర్తించాలని కూడా ఆయన ఈ సందర్భంగా ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టాలు అందుకున్న 2000 మంది స్నాతక ఐఐటీ విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. దేశంలో నేడు ఆలోచనలు-ఆవిష్కరణలకు తగిన వాతావరణం సృష్టించబడిందని గుర్తుచేశారు. ముఖ్యంగా “దేశం మీకు 'వాణిజ్య సౌలభ్యం’ కల్పిస్తుంది… తదనుగుణంగా మీరు చేయాల్సిందల్లా ఈ దేశ ప్రజల జీవన సౌలభ్యం కోసం కృషిచేయడమే” అని శ్రీ మోదీ యువ ఐఐటీ స్నాతకులకు దిశానిర్దేశం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671031

ఐఐటీ-ఢిల్లీ 51వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671199

హజీరాలో ‘రో-పాక్స్‌’ టెర్మినల్‌కు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లోని హజీరా-ఘోగాల మధ్య ‘రో-పాక్స్’ పడవ ప్రయాణ టెర్మినల్‌ను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల పడవను జెండా ఊపి సాగనంపారు. అలాగే ఈ సేవలను వినియోగించుకునే స్థానికులతోనూ ఆయన సంభాషించారు. కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ పేరును ‘ఓడరేవులు- షిప్పింగ్-జలమార్గాల’ మంత్రిత్వశాఖగా మార్చినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ‘రో-పాక్స్‌’ టెర్మినల్‌ ప్రారంభంతో వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, సంధానం మరింత వేగం పుంజుకుంటుందని అన్నారు. హజీరా-ఘోగాల మధ్య ‘రో-పాక్స్‌’ (RO-PAX) సేవల ప్రారంభంతో సౌరాష్ట్ర-దక్షిణ గుజరాత్‌ ప్రజల కలల సాకారం అయ్యాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671318

హజీరాలో ‘రో-పాక్స్‌’ టెర్మినల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671363   

‘పట్టణ రవాణాలో ఆధునిక ధోరణులు’పై 13వ భారత పట్టణ రవాణా సదస్సు ప్రారంభం

“భవిష్యత్‌ తరం రవాణా అంటే- పర్యావరణహిత, సమీకృత, స్వయంచలిత, వ్యక్తిప్రధాన ఆన్‌ డిమాండ్‌ ప్రయాణ సదుపాయం కోసం కృషి చేయడమే” అని కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరి అన్నారు. ఈ దిశగా ప్రధాన నగరాల్లో  ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలు, ట్రాఫిక్ నిర్వహణ అనువర్తనాలువంటి కొత్త విధానాలు పురోగమన దిశలో ఉన్నాయని పేర్కొన్నారు. “పట్టణ రవాణాలో ఆధునిక ధోరణులు” అంశంపై ‘13వ అర్బన్ మొబిలిటీ ఇండియా’ సదస్సులో ఆయన ప్రసంగించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670494

ఖాదీ ఫేస్ మాస్కులు ధరించనున్న అరుణాచల్ ప్రదేశ్ పాఠశాల పిల్లలు

అరుణాచల్ ప్రదేశ్‌లో కోవిడ్‌-19 దిగ్బంధం అనంతరం తొలిసారి పాఠశాలలకు వెళ్లనున్న వేలాది బాలలు త్రివర్ణ ఖాదీ ఫేస్ మాస్కులను ధరించనున్నారు. రాష్ట్రంలో నవంబరు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పిల్లల కోసం ౬0,000 అత్యుత్తమ నాణ్యతగల ఖాదీ కాటన్ మాస్కులను  సరఫరా చేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670494

మధుమేహ నియంత్రణలో సరైన ఆహారపు అలవాట్లదే కీలకపాత్ర: కేంద్ర మంత్రి, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జితేంద్ర సింగ్

మధుమేహ వ్యాధి నియంత్రణలో కీలకపాత్ర పోషించేది సరైన ఆహారపు అలవాట్లేనని ప్రముఖ డయాబెటాలజిస్ట్ అయిన కేంద్ర (సహాయ)మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ‘ప్రపంచ మధుమేహ వారోత్సవం’ సందర్భంగా అసోషియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియా ఆదివారం డిజిటల్‌ మాధ్యమంద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. మధుమేహ పీడితులకు సూచించే ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా ఉన్నవారు కూడా పాటిస్తే వారికి ఈ రుగ్మత సోకే పరిస్థితిని నివారించవచ్చునని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాగా, ప్రతికూల పరిస్థితుల నడుమ సరికొత్త పద్ధతులు అలవరచుకునేందుకు కోవిడ్‌ మనల్ని ప్రేరేపించిందని పేర్కొన్నారు. ఆ మేరకు భారత సంప్రదాయ ఔషధ వ్యవస్థ ప్రాముఖ్యం ఏమిటో పూర్తిగా వెల్లడైందని జితేంద్ర సింగ్‌ గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671357

ఈఎస్‌ఐసీ పరిధిలోని అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన కింద క్లెయిమ్స్‌ కోసం ఇకపై అఫిడవిట్ ఫారంతో అవసరం లేదు

“అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన” పథకాన్ని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ 01.07.2020 నుంచి 30.06.2021 వరకు పొడిగించింది. ఈ మేరకు 20.08.2020నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ పథకం కింద ఉపశమన కల్పన ప్రస్తుతం రోజువారీ ఆర్జన సగటులో 25 శాతం కాగా, దీన్ని 50 శాతానికి పెంచాలని కూడా తీర్మానించింది. అలాగే అర్హత షరతుల సడలింపును 24.03.2020 నుంచి 31.12.2020 వరకు పొడిగించింది. కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల్లో నిరుద్యోగులుగా మారిన కార్మికులకు ఉపశమనం దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671241

హజ్‌-2021 మార్గదర్శకాలను ప్రకటించిన ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ

కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా హజ్-2021కి సంబంధించిన మార్గదర్శకాలను గణనీయమైన మార్పులతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శనివారం హజ్‌ హౌస్‌లో ప్రకటించారు. దీంతో ఈ యాత్ర కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 2020 డిసెంబర్ 10వ తేదీతో దరఖాస్తు దాఖలు గడువు ముగియనుంది. హజ్‌కు వెళ్లదలచినవారు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్/హజ్ మొబైల్ అనువర్తనం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671029

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ మేరకు నవంబర్‌ నెలలో ఇప్పటిదాకా నిర్ధారిత కేసుల సగటు 8.35 శాతం కాగా, ఇది 15 శాతం, సెప్టెంబర్‌లో 24 శాతంగా ఉండటం గమనార్హం. కాగా, కొన్ని వారాలనుంచీ మహారాష్ట్రలో 5,052 కొత్త కేసులు నమోదవగా ముంబైలో 998 నమోదయ్యాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో  ఆదివారం 1,020 కొత్త కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,80,980కి, మృతుల సంఖ్య 3,788కి చేరాయి. సూరత్‌లో రోజువారీ నమోదయ్యే కేసులు 200 నుంచి తాజాగా 194కు తగ్గినప్పటికీ మొత్తం కేసుల రీత్యా ఈ నగరం అగ్రస్థానంలో ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గడంతో అక్టోబర్ చివరి వారంతో పోలిస్తే నవంబర్ మొదటివారం పరిస్థితి కొంత మెరుగుపడింది. అక్టోబర్ చివరి వారంలో 12,571 కొత్త కేసులు, 81 మరణాలు నమోదవగా, నవంబర్ తొలివారం 12,445 తాజా కేసులు, 72 మరణాలు సంభవించాయి.  అలాగే అక్టోబర్‌ చివరి వారంతోపోలిస్తే కొత్త కేసులు 126, మరణాలు 9 వంతున తక్కువగా ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో నెల రోజుల తర్వాత చురుకైన కేసుల సంఖ్య గత రెండు రోజులుగా పెరుగుతోంది. ఈ మేరకు నవంబర్ 2 నుంచి రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ ఆదివారం 891గా నమోదయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1.77 లక్షలకు చేరింది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఆదివారం 1,375 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,00,937కు చేరిందని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. ఇక వివిధ ఆస్పత్రుల నుంచి 153 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా ఇప్పటిదాకా వ్యాధినుంచి బయటపడినవారి సంఖ్య 1.76 లక్షలకు పెరిగింది.
  • కేరళ: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కార్యక్రమం కింద అమలవుతున్న దూరవాణి-వైద్యసేవల్లో భాగంగా  ‘ఈ-సంజీవని’ ద్వారా రాష్ట్రంలో కోవిడ్‌ అవుట్‌-పేషెంట్‌ సేవలు అందుబాటులో ఉంటాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ అన్నారు. కోవిడ్-ప్రేరిత మానసిక సమస్యల పరిష్కారం కోరుతూ మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అర్థించేవారి కోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, బెంగళూరులోని ‘నిమ్హాన్స్’ సిఫారసులను పరిశీలిస్తోంది.
  • తమిళనాడు: రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం సీటీ-స్కాన్‌మీద ప్రజలు అధికంగా ఆధారపడటంపై ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమిళనాడులోని 3 జిల్లాల్లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు; ఇక మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు డాక్టర్లు, నర్సులకు కరోనావైరస్‌ తిరిగి సోకింది.
  • కర్ణాటక: రాష్ట్రంలోని చిత్రదుర్గలో కోవిడ్‌-19 టీకా నిల్వ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ కేంద్రంలో ఒకేసారి 10 లక్షల మోతాదుల మేర టీకాలను నిల్వ చేయవచ్చు. కోవిడ్ కేసులు తగ్గడంతో అనేకమంది జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మాండ్యా జిల్లా అధికారులు కోవిడ్ ఆంక్షల అమలుపై పర్యవేక్షణతోపాటు అవగాహన కల్పించడానికి గ్రామస్థాయి కార్యాచరణ బృందాలను పునరుద్ధరిస్తున్నారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పౌరులలో కరోనావైరస్ విస్తరణను నిర్ధారించడానికి, పరిస్థితిని సరిదిద్దడానికి వ్యూహాలు రూపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండో సెరోలాజికల్ నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి సర్వేని మొత్తం 13 జిల్లాల్లో రెండుదశల కింద నిర్వహించగా, రెండో సర్వేను ఒకేసారి చేపడుతున్నారు. మొదటి సర్వే ఫలితాల ప్రకారం- రాష్ట్ర జనాభాలో 19.7 శాతం ప్రజల్లో ప్రతిరోధకాలు అభివృద్ధి అయ్యాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 857 కొత్త కేసులు, 4 మరణాలు నమోదవగా 1504 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 250 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,51,188; క్రియాశీల కేసులు: 19,239; మరణాలు: 1381; డిశ్చార్జి: 2,30,568గా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగాగల ప్రభుత్వ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాగా, సెప్టెంబరులో మెట్రో సేవలు పునఃప్రారంభమయ్యాక హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో తర్వాత ఇప్పుడు రెండోస్థానానికి చేరింది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 152 కొత్త కేసులు నమోదవగా 395 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 2,08,789కి చేరగా ఇప్పటిదాకా 2,01,331 మంది కోలుకున్నారు. ప్రస్తుత క్రియాశీల కేసులు 6,512 కాగా, ఇప్పటివరకూ 943 మరణాలు సంభవించాయి.

FACT CHECK

 

 

 

Image

 

********



(Release ID: 1671555) Visitor Counter : 171