ప్రధాన మంత్రి కార్యాలయం
వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; మరికొన్ని పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు
దీపావళి పండుగ వేళ స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
వారాణసీ కి సంధాన సదుపాయం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అగ్ర ప్రాధాన్యంగానే ఉంటూ వచ్చింది: ప‌్రధాన మంత్రి
Posted On:
09 NOV 2020 1:33PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం/ కొన్ని అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి 220 కోట్ల రూపాయల విలువైన 16 పథకాలను వారాణసీ లో ఈ రోజున ప్రారంభించారు; 400 కోట్ల రూపాయల విలువైన 14 పథకాల పనులు ఇప్పటికే మొదలయినట్లు ఆయన వెల్లడించారు.
ఈ రోజున ప్రారంభించిన పథకాల లో.. సారనాథ్ లైట్ అండ్ సౌండ్ శో, రామ్ నగర్ లో లాల్ బహాదుర్ శాస్త్రి ఆసుపత్రి ఉన్నతీకరణ, మురుగునీటి పారుదలకు సంబంధించిన పనులు, గోవుల సంరక్షణ, గోవుల పరిరక్షణకు ఉద్దేశించిన మౌలిక సదుపాయాలు, బహుళ ప్రయోజక విత్తన నిలవ కేంద్రం, 100 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన వ్యవసాయోత్పత్తుల గిడ్డంగి, ఐపిడిఎస్ రెండో దశ, సంపూర్ణానంద్ స్టేడియమ్ లో క్రీడాకారులకు ఒక ఆవాసభవన సముదాయం నిర్మాణం, వారాణసీ నగరంలో ఆర్షణీయమైన విద్యుద్దీపాల వ్యవస్థల తో పాటు 105 ఆంగన్‌వాడీ కేంద్రాలు, మరో 102 గోవుల ఆశ్రయ కేంద్రాలు.. ఉన్నాయి.
ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పర్యటన సదుపాయాల కల్పన అనేది కూడా వారాణసీ నగరం, నగర పరిసరాల అభివృద్ధి ప్రణాళిక లో ఒక భాగంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి గంగానది శుద్ధి, ఆరోగ్య సేవలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యటన, విద్యుత్తు, యువత, క్రీడలు, రైతులు మొదలైన ప్రతి ఒక్క రంగం లోనూ ఏ విధంగా పురోగతి పథంలో వారాణసీ జోరు ను అందుకొన్నదీ సూచించే ఓ ఉదాహరణ గా ఉందని ఆయన అన్నారు. గంగా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంటు పథకం నవీనీకరణ ఈ రోజు పూర్తి అయిందని ఆయన ప్రకటించారు. స్నాన ఘట్టాలను సుందరీకరించడం, కాలుష్యాన్ని తగ్గించడానికి సిఎన్ జిని పరిచయం చేయడం, దశాశ్వమేథ్ ఘాట్ లో టూరిస్టు ప్లాజా వంటి మౌలిక సదుపాయాల సంబంధిత పనులు వారాణసీ లో చేపట్టడం జరిగినట్లు ఆయన వివరించారు.
గంగానది కి సంబంధించిన ఈ ప్రయత్నాలు కాశీ తాలూకు ఒక సంకల్పమే కాకుండా, కాశీ కోసం నూతన అవకాశాల బాటను పరచడం కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. అక్కడి స్నానఘట్టాలలో స్థితిగతులు క్రమంగా మెరుగు పడుతున్నాయని ఆయన చెప్పారు. గంగానది స్నాన ఘట్టాల శుద్ధి, సుందరీకరణ లతో పాటే సారనాథ్ కూడా ఒక కొత్త రూపు ను సంతరించుకొంటోందన్నారు. ఈ రోజు న ప్రారంభించిన లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రాము సారనాథ్ శోభ ను ఇనుమడింపచేయగలదని కూడా ఆయన అన్నారు.
కాశీ లో చాలా ప్రాంతాల లో వేలాడుతున్న విద్యుత్తు తీగల సమస్య కు ఈ రోజు న స్వస్తి పలకడం జరుగుతోందని ప్రధాన మంత్రి ప్రకటించారు. భూగర్భం లో వైరులను వేసే పని లో మరో దశ సైతం ఈ రోజు న పూర్తి అయిందన్నారు. దీనికి తోడు, ఆర్షణీయమైన ఎల్ఇడి దీపాల అమరిక వీధుల లో వెలుగులను విరజిమ్మడమే కాకుండా వీధులకు కొత్త అందాలను తీసుకువస్తుందన్నారు.
వారాణసీ కి సంధానాన్ని కల్పించడం అనేది ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అగ్ర ప్రాధాన్యంగానే ఉంటూ వచ్చింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. కాశీ ప్రజలు, అలాగే కాశీ ని చూడటానికి వచ్చే యాత్రికులు ట్రాఫిక్ జామ్ లలో వారి కాలాన్ని వృథా పోనీయకుండా చూడటానికే నూతన మౌలిక సదుపాయాల ను కల్పించడం జరుగుతోందని ఆయన నొక్కి చెప్పారు. బాబత్‌పుర్ ను నగరానికి కలిపే రహదారి కూడా వారాణసీ కి ఒక కొత్త గుర్తింపు చిహ్నంగా మారినట్లు ఆయన అభివర్ణించారు. వారాణసీ విమానాశ్రయం లో రెండు ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిల ప్రారంభం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే, 6 సంవత్సరాల క్రితం నుంచే వారాణసీ విమానాశ్రయం నిత్యం 12 విమాన సర్వీసుల రాకపోకలకు నిలయంగా ఉండగా, ప్రస్తుతం రోజు కు 48 విమాన సర్వీసులు రాక పోక లను జరుపుతున్నాయని ఆయన గుర్తు చేశారు. వారాణసీ లో నివసించే ప్రజల తో పాటు వారాణసీ ని చూడటానికి వచ్చే యాత్రికుల జీవనాన్ని సౌలభ్యమైంది గా మార్చేందుకు అక్కడ ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని ఆయన చెప్పారు. వారాణసీ నగరం లో ప్రస్తుతం జరుగుతున్న రహదారి సంబంధిత మౌలిక సదుపాయాల పనులను గురించి ఒక్కటొక్కటిగా ఆయన ప్రస్తావించారు.
గడచిన 6 సంవత్సరాల కాలంలో వారాణసీ లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన పరంగా చూసినా కూడా అంతకు ముందు ఎరుగని స్థాయి లో పనులు జరిగాయని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ఒక్క యుపియే కాకుండా, ఒక రకంగా చూస్తే, యావత్తు పూర్వాంచల్ లో ఆరోగ్య సౌకర్యాలకు ఇది ఒక కేంద్రంగా మారుతోందన్నారు. రామ్ నగర్ లో గల లాల్ బహాదుర్ శాస్త్రి ఆసుపత్రి ఆధునీకరణ తదితర ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన పనులను ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు.
వారాణసీ లో ప్రస్తుతం సర్వతోముఖ అభివృద్ధి చోటు చేసుకొంటోందని, ఇది పూర్వాంచల్ సహా భారతదేశం లోని యావత్తు ఈశాన్య ప్రాంతాలకు లాభదాయకంగా ఉందని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఇప్పుడు పూర్వాంచల్ ప్రజలు చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడానికైనా దిల్లీకి, లేదా ముంబయికి వెళ్ళనక్కరలేదని ఆయన అన్నారు.
వారాణసీ, పూర్వాంచల్ రైతుల కోసం ఇక్కడ అంతర్జాతీయ వరి సంస్థ, మిల్క్ ప్రోసెసింగ్ ప్లాంటు, త్వరగా పాడయిపోయే వస్తు సామగ్రి రవాణా కేంద్రం నిర్మాణం మొదలైన అనేక సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. రైతులు ఆ తరహా అనేక సదుపాయాల తో లబ్ధి ని పొందుతున్నారని ఆయన అన్నారు. ఈ సంవత్సరం లో మొట్టమొదటి సారిగా వారాణసీ ప్రాంతం నుంచి ధాన్యం, కాయగూరలు, పండ్లు, విదేశాలకు ఎగుమతి అయినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 100 మెట్రిక్ టన్నుల నిలవ సామర్ధ్యం కలిగిన ఒక గోదాము ను ఈ రోజు న ప్రారంభించడమైందని, ఇది కాశీ లో రైతులకు నిలవ సదుపాయాల ను విస్తరింప చేస్తుందని ఆయన చెప్పారు. బహుళ ప్రయోజక విత్తన గిడ్డంగి ని జంసా లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు.
గ్రామీణ పేదలు, రైతులు ఆత్మనిర్భర్ భారత్ ప్రచారోద్యమానికి అతిపెద్ద స్తంభాలే కాకుండా, అతి ప్రధాన లబ్ధిదారులు కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో ఇటీవలి సంస్కరణలు రైతుల కు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందించనున్నాయని ఆయన అన్నారు. వీధులలో తిరుగుతూ సరుకులను అమ్మే వ్యాపారస్తులు ప్రస్తుతం ‘ప్రధాన మంత్రి స్వనిధి యోజన’ లో భాగం గా సులభంగా రుణాలను పొందుతూ ఉన్నారని, మహమ్మారి అనంతర కాలంలో వారు వారి కార్యకలాపాలను మళ్ళీ మొదలుపెట్టుకొనేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన చెప్పారు.
గ్రామాల లో నివసించే ప్రజలకు వారి భూముల పైన, ఇళ్ళ పైన చట్టబద్ధమైన హక్కులను కల్పించడానికి ‘స్వామిత్వ యోజన’ ను ప్రారంభించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పథకం లో భాగంగా సంపత్తి కార్డుల జారీ అనంతరం వారి సంపత్తి వివాదాల పరిధి పల్లెల లోనే ఉండిపోదని ఆయన అన్నారు. గ్రామ ప్రాంతాల లో గల భూమి పైన, ఇంటి పైన ఒక రుణాన్ని తీసుకోవడం ఇకపై సులభతరం అవుతుందని కూడా ఆయన చెప్పారు.
దీపావళి, గోవర్ధన పూజ, భాయీ దూజ్ ల సందర్భం లో ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వారంతా దీపావళి పండుగ కు చాలావరకు స్థానిక ఉత్పత్తులనే ప్రోత్సహించాలని, అలాగే స్థానిక వస్తువులే గొప్పవి అని సగర్వంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. ఇది స్థానిక గుర్తింపు ను పటిష్టపరుస్తుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1671411)
Visitor Counter : 217
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam