కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈఎస్ఐసీ 'అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన' క్లెయిములకు అఫిడవిట్‌ ఫారం అవసరం లేదు స్కాన్‌ చేసిన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

Posted On: 08 NOV 2020 2:07PM by PIB Hyderabad

'అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన' (ఏబీవీకేవై)ను మరో ఏడాది, అంటే 01.07.2020 నుంచి 30.06.2021 వరకు పొడిగిస్తూ 20.08.2020న జరిగిన సమావేశంలో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. 25 శాతంగా ఉన్న సగటు రోజువారీ వేతనాన్ని 50 శాతానికి పెంచాలని కూడా ఆ సమావేశంలోనే నిర్ణయించింది. కొవిడ్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపశమనం కలిగించేలా, 24.03.2020 నుంచి 31.12.2020 కాలానికి అర్హత ప్రమాణాలను సడలించింది.

    ఈ పథకం లబ్ధిదారుల అభిప్రాయాలను విశ్లేషించగా, క్లెయిమ్‌ చేసుకునేందుకు అఫిడవిట్‌ ఫారం సమర్పణ ఇబ్బందికరంగా ఉందని తేలింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, 'అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన' కింద ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ చేసుకుని, ఆధార్‌, బ్యాంకు వివరాల వంటి పత్రాలను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌ చేసినవారు భౌతికంగా ఆయా పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ సమయంలో సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయకపోతే, క్లెయిమ్‌ ఫారం ప్రింట్‌ తీసి, దానిపై సంతకం చేసి, సంబంధిత పత్రాలను జత చేసి సమర్పించాలి. 

భారత్‌లో ఈఎస్‌ఐ పథకం
    ఉద్యోగులు గాయపడినా, అనారోగ్యానికి గురైనా వైద్య సంరక్షణ, నగదు ప్రయోజనాలు వంటి సామాజిక భద్రత ప్రయోజనాలు అందించే సంస్థ "ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌" (ఈఎస్‌ఐసీ). ఇది 3.49 కోట్ల కుటుంబాల్లో ఉన్న 13.56 కోట్ల లబ్ధిదారులకు వైద్య, నగదు ప్రయోజనాలను కల్పిస్తోంది. 1520 డిస్పెన్సరీలు (వాహన డిస్పెన్సరీలతో కలిపి) / 307 ఐఎస్‌ఎం యూనిట్లు, 159 ఈఎస్‌ఐ ఆస్పత్రులు, 793 బ్రాంచి/పే ఆఫీసులు, 64 ప్రాంతీయ & ఉప ప్రాంతీయ కార్యాలయాలతో ఈ వ్యవస్థ విస్తరించి ఉంది. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 566 జిల్లాల్లో ఈఎస్‌ఐ పథకం అమలవుతోంది.

***



(Release ID: 1671241) Visitor Counter : 212