ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

7 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకున్న టెలీమెడిసిన్ సేవ ఈ-సంజీవని

రోజుకు సగటున 10,000 కు చేరిన సంప్రదింపులు; 11 రోజుల్లోనే ఆఖరి లక్ష

Posted On: 07 NOV 2020 3:42PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ సేవ ఈ-సంజీవని నేటితో 7 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకుంది. ఆఖరి లక్ష సంప్రదింపులు కేవలం 11 రోజుల్లోనే పూర్తయ్యాయి. ఈ విధంగా డిజిటల్ పద్ధతిలో ఔట్ పేషెంట్లకు సేవలందించే విధానం వల్ల పేషెంట్లు నేరుగా డాక్టర్ ను సంప్రదించే అవకాశం కల్పించటంతో ఇప్పుడిది దేశంలోనే అతిపెద్ద ఒపిడి సర్వీసుగా మార్చింది.

ఆరోగ్యసేవలు నేరుగా ఇంటికే అందించే ఈ సరికొత్త విధానం ఇప్పుడు చిన్నపట్టణాలు, గ్రామాలలో సైతం ప్రభావం చూపగలుగుతోంది. ఒకవైపు రోగులకు ఈ టెలీమెడిసిన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుండగా, వర్చువల్ విధానంలో తాకకుండానే చికిత్స అందించటం అటు రోగికి, ఇటు డాక్టర్ కు అనుకూలంగా ఉంది.  ఈ-సంజీవని వలన డాక్టర్ కచ్చితంగా అక్కడే ఉండాలన్న అవసరం లేకుండా వైద్యం అందుతోంది. భౌగోళికంగా సువిశాలంగా ఉన్న రాష్ట్రాలకు ఇది మరింతగా ఉపయోగపడుతోంది. మానవ వనరులను మెరుగ్గా వాడుకోవటం కూడా సాధ్యమవుతోంది.

ఈ-సంజీవని ద్వారా డాక్టర్ సలహాలు పొందాలనుకునేవారు వర్చువల్ పద్ధతిలో వరుసలో ఉంటే తమ వంతు వచ్చినప్పుడు ఎక్కడో ఇంకో నగరంలో ఉన్న డాక్టర్ కు సమస్య చెప్పుకొని, లక్షణాలు వివరించి తగిన చికిత్స తెలుసుకోవచ్చు. సంప్రదింపులు పూర్తికాగానే ఈ-ప్రిస్క్రిప్షన్ అందుబాటులోకి వస్తుంది. వాటి ఆధారంగా మందులు కొనుక్కోవచ్చు. లేదా, నిర్థారణ  కోసం అవసరమైన పరీక్షలు చేయించుకోవచ్చు. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఆ ప్రిస్క్రిప్షన్ ను ఆమోదించేలా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీచేశాయి.

ఇటీవలి కాలంలో మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్నాటక వంటి రాష్ట్రాలలో ఈ-సంజీవని వినియోగం బాగా పెరిగింది.  తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాష్ట్రాల్లో అంతకుముందు కొన్ని నెలలనుంచే ఈ సేవలు అధికంగా వాడుకుంటూ ఉన్నారు.

అత్యధికంగా ఈ సంజీవని వాడుకుంటున్న మొదటి పది రాష్ట్రాలలో  తమిళనాదు, ఉత్తరప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ కర్నాటక, మహారాష్ట్ర ఉన్నాయి.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, మొహాలి లోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ కలసి ఉమ్మడిగా  ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు కొత్త ఫీచర్స్ తో ఈ వేదిక సామర్థ్యాన్ని పెంచుతూ వస్తున్నాయి.

ఈ-సంజీవని కింద రెండు రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. జనరల్ ఫిజీషియన్లతో బాటు వివిధ రంగాల స్పెషలిస్టులు కూడా సలహాలకు అందుబాటులో ఉంటారు. రాష్ట్రాలలో జిల్లా వైద్య కేంద్రాలలో ఉంటూ తీవ్ర లక్షణలతో ఐసియు లో ఉన్న రోగులకు సేవలందించే డాక్టర్లకు మార్గదర్శనం చేయటానికి ఈ సంజీవని పనిచేస్తోంది. అలా డాక్టర్లతో డాక్టర్లు సంప్రదించే పద్ధతి ఒకటైతే రోగి నేరుగా డాక్టర్ తో మాట్లాడేది మరో పద్ధతి. మొదటిది 2019 నవంబర్ లో మొదలైంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ కోసం దీన్ని రూపొందించారు. దీన్ని 2022 డిసెంబర్ నాటికల్లా మొత్తం 1.5 లక్షల వెల్ నెస్ సెంటర్లలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్టాలు తమ పరిధిలో ఉన్న వైద్య కళాశాలలలోను, జిల్లా ఆస్పత్రులలోను ఈ హబ్ లు ఏర్పాటు చేసుకోవాలి.

ఇక రెండో రకమైన ఈ-సంజీవనిని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆ తరువాత ప్రారంభించింది. దీని ద్వారా రోగులు నేరుగా డాక్టర్ తో సంప్రదించే వెసులుబాటు ఉంటుంది. ఇది ఔట్ పేషెంట్ విభాగం తరహాలో పనిచేస్తుంది. లాక్ దౌన్ సమయంలో అన్ని ఆస్పత్రులూ ఔట్ పేషెంట్ విభాగాలను మూసివేయగా ఈ టెలీమెడిసిన విధానం అందుబాటులోకి వచ్చి బాధితులకు బాగా ఉపయోగపడింది.

***


(Release ID: 1671005) Visitor Counter : 220