ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి జన ఆందోళన్ అమలుపై చత్తీస్ గఢ్ ఆరోగ్య, వైద్యవిద్యాశాఖ మంత్రి శ్రీ టి.ఎస్.సింగ్ దేవ్ తో చర్చించి డాక్టర్ హర్షవర్ధన్
"వచ్చే మూడు నెలలూ మనందరం మరింత జాగ్రత్తగా ఉండాలి"
చత్తీస్ గఢ్ లోని కొన్ని జిల్లాల్లో రోజువారీ కేసులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకరం
Posted On:
06 NOV 2020 8:14PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చత్తీస్ గఢ్ లో కోవిడ్ తాజా పరిస్థితిపై చత్తీస్ గఢ్ ఆరోగ్య, వైద్యవిద్యా శాఖ మంత్రి శ్రీ త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ దేవ్ తో చర్చించారు. చత్తీస్ గఢ్ కు చెందిన వివిధ జిల్లాల మేజిస్ర్టేట్లు, మునిసిపల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాబోయే పండుగల సీజన్, చలికాలం ఎనలేని రిస్క్ ను మన ముందుకు తీసుకురానున్నాయని, కోవిడ్-19 అదుపులో ఇప్పటి వరకు సాధించిన లాభాలకు ముప్పు వాటిల్లవచ్చునన్న ఆందోళనను డాక్టర్ హర్షవర్ధన్ పునరుద్ఘాటించారు. "రాబోయే మూడు నెలలు మనందరం అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తతో వ్యవహరించాలి. మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, తరచు చేతులు కడుక్కోవాలి అంటూ ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం చిట్టచివరి పౌరునికి కూడా చేరేలా చూడాలి" అని ఆయన అన్నారు.
చత్తీస్ గఢ్ లో తాజా పరిస్థితిని దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితితో సరిపోల్చుతూ "దేశవ్యాప్తంగా రికవరీ రేటు 92 % ఉంటే చత్తీస్ గఢ్ లో 87 % మాత్రమే ఉంది. సిఎఫ్ఆర్ రేటు కూడా జాతీయ స్థాయిలో 1.19 % ఉంటే రాష్ర్టంలో 1.49 % ఉంది" అన్నారు. రాజ్ నందన్ గాంవ్, దుర్గ్, రాయపూర్, బిలాస్ పూర్, రాయగఢ్, బలోడా-బజార్ జిల్లాల్లో పాజిటివిటీ రేటు గరిష్ఠంగా ఉండడంపై కూడా ఆయన ఆందోళన ప్రకటించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో మరణిస్తున్న వారి సంఖ్య 34.8 % ఉండగా 72 గంటల్లో మరణిస్తున్న వారి సంఖ్య 46.2 % ఉన్నట్టు చెప్పారు. కేసులు అడ్వాన్స్ స్థితికి చేరడం కన్నా ముందుగానే గుర్తించలేకపోతున్నారనేందుకు ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ఆందోళనను రాష్ట్ర అధికారులు గుర్తించి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో ఆర్ టి-పిసిఆర్ తో ఆర్ఏటి నిష్పత్తి ప్రస్తుతం 20:80గా ఉన్నదంటూ ఆర్ఏటి వల్ల ముందుగానే వ్యాధిని గుర్తించే వీలుంటుందని చెప్పారు. అలాగే ఆర్ టి-పిసిఆర్ గోల్డ్ స్టాండర్డ్ టెస్టింగ్ అని, ఆ పరీక్షలను మరింతగా పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్నారు.
ఇటీవల కాలంలో రోజువారీ కేసుల సంఖ్య పెరగడం పట్ల, అది సగటున 60 ఉండడం కూడా ఆందోళన చెందాల్సిన మూడో అంశమన్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సిడిసి) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ సింగ్ చత్తీస్ గఢ్ లోని వివిధ జిల్లాల్లో కోవిడ్ తాజా స్థితిని అందరికీ వివరించారు. సెంట్రల్ రీజిన్ లోను, ప్రధానంగా ముంబై-కోల్కతా రవాణా కారిడార్ వెంబడి ఉన్నప్రాంతాల్లోను కేసులు గరిష్ఠంగా విస్తరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిందని శ్రీ దేవ్ చెప్పారు. ముందు రోజుల బాక్ లాగ్ అంతటినీ క్లియర్ చేసే ప్రక్రియ కారణంగా మరణాల రేటు ఇటీవల పెరిగినట్టు కనిపిస్తున్నదన్నారు. అలాగే మరణాలకు కారణాన్ని కూడా గుర్తించినట్టు తాజా రిపోర్టులు తెలుపుతున్నాయని, ఈ కారణంగా కూడా కేసులు పెరుగుతున్నట్టవుతోందని ఆయన వివరించారు. ఇవన్నీ పరిష్కారం అయితే రోజువారీ మరణాల రేటులో కూడా స్థిరత్వం వస్తుందని ఆయన తెలిపారు. చివరి స్థానంలో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందించడం, కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే వైద్య వస్తువులను బల్క్ గా కొనుగోలు చేయడం ద్వారా అవుతున్న పొదుపు వంటి అంశాల గురించి ఆయన వివరించారు.
రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న రాయపూర్, దుర్గ్, బిలాస్ పూర్, బలోడా-బజార్ జిల్లాల మేజిస్ర్టేట్లతో కూడా డాక్టర్ హర్షవర్ధన్ సంభాషించారు. వైద్య మౌలిక వసతుల పటిష్ఠత, కోవిడ్ సంబంధిత ప్రవర్తన అలవరచేందుకు తీసుకున్న చర్యలు, టెస్టింగ్ సదుపాయాల పెంపు, వ్యాధి సంబంధిత సర్వేల్లో అత్యుత్తమ ప్రమాణాలు, తమ అనుభవాలను జిల్లా మేజిస్ర్టేట్ల వివరించారు.
కరోనా పరీక్షలు పెంచాలని, కేసులు పెరిగేందుకు అవకాశం గల మార్కెట్లు, బస్టాండ్ ల వద్ద ప్రత్యేక టెస్టింగ్ సదుపాయాలు నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ సూచించారు. అలాగే రోగిని గుర్తించిన 72 గంటల వ్యవధిలోనే వారితో సన్నిహితంగా తిరిగిన వారిని గుర్తించాలని, అధిక ప్రమాదకరమైన వ్యాధులున్న ప్రజలకు సంబంధించిన డేటా తయారుచేయడంతో పాటు 50 సంవత్సరాల పైబడిన వయసు వారిపై పర్యవేక్షణ పెంచాలని కూడా ఆయన కోరారు. కోవిడ్ సంబంధిత ప్రవర్తనను అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాలని, ప్రవర్తనలో మార్పు రావడంలో సమాచారం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. పంచాయతీ స్థాయి ప్రతినిధులను, యుఎల్ బి ప్రతినిధులను, ఎంఎల్ఏలు, కేబినెట్ మంత్రులు, రాష్ట్రంలోని ఇతర ప్రముఖులను కూడగట్టి కోవిడ్ సంబంధిత ప్రవర్తనను ప్రచారం చేయాలని సూచించారు.
చత్తీస్ గఢ్ ఆరోగ్యం, వైద్యవిద్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీమతి రేణు జి పిళ్ళై, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1670902)
Visitor Counter : 173