మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హజ్ 2021 యాత్రకు మార్గదర్శక సూత్రాల ప్రకటన
కరోనా నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ మార్గదర్శక సూత్రాలు, ప్రొటోకాల్స్ కచ్చితంగా అమలు చేస్తామన్న కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
ఈ రోజై మొదలైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ, చివరి తేదీ డిసెంబరు 10.
గత ఏడాది “వితౌట్ మెహ్రమ్” కేటగిరీ మహిళల దరఖాస్తులు ఈ సారీ చెల్లుబాటు
హాజ్ 2021 యాత్రకు బయలుదేరే 10 ప్రాంతాలు
అహ్మదాబాద్, బెంగుళూరు, కొచ్చిన్, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్,
కోల్కతా, లక్నో, ముంబై, శ్రీనగర్.
Posted On:
07 NOV 2020 3:57PM by PIB Hyderabad
వచ్చే ఏడాది జరిగే హజ్ యాత్రకు వెళ్లదలచిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఈ రోజు మొదలైంది. 2021వసంతవ్సరపు హాజ్ యాత్రకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ముంబైలోని హజ్ హౌస్ లో ప్రకటించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కొన్ని గణనీయమైన మార్పులతో ఈ మార్గదర్శక సూత్రాలను వెలువరించారు. డిసెంబర్ 10వరకూ హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా, ఆఫ్ లైన్ ద్వారా, హజ్ మొబైల్ యాప్ ద్వారా కూడా యాత్రికుల దరఖాస్తుకు వీలుంది. హజ్ మార్గదర్శక సూత్రాల ప్రకటనకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముంబైలోని సౌదీ అరేబియా రాయల్ వైస్ కాన్సులర్ జనరల్ మొహ్మద్ అబ్దుల్ కరీమ్ అల్ ఎనాజీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, భారత హజ్ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) ఎం.ఎ. ఖాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
మంత్రి నఖ్వీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహమ్మారి వైరస్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నియమావళిని, మార్గదర్శక సూత్రాలను, 2021 హజ్ సందర్భంగా అమలుచేస్తామన్నారు. 2021, జూన్, జూలై నెలల్లో హాజ్ యాత్ర జరుగుతుందని, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా సౌదీ అరేబియా, భారత్ ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయ ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా హజ్ యాత్ర జరుగుతుందన్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, విదేశాంగ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు, భారత హజ్ కమిటీ, సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని భారతీయ కాన్సుల్ జనరల్, ఇతర సంస్థల మధ్య విస్తృత చర్చల అనంతరం హజ్ యాత్ర నిర్వహణా ప్రక్రియను నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. వైరస్ మహమ్మారితో ఎదురైన సవాళ్లను, అన్ని ఇతర అంశాలను దృష్టిలోపెట్టుకుని హజ్ యాత్ర ప్రక్రియను నిర్ణయించారని అన్నారు.
ప్రత్యేకమైన నిబంధనలు, నియమాలు, నియంత్రణలు, అర్హతా విధానాలు, వయోపరమైన ఆంక్షలు, శారీరక ఆరోగ్యం, సౌదీ అరేబియాకు సంబంధించి పరిస్థితులు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని హజ్ యాత్రకు ఏర్పాట్లు చేసినట్టు నఖ్వీ చెప్పారు. భారత దేశంలో, సౌదీలో యాత్రికులకు వసతి సదుపాయం, వసతి వ్యవధి, రవాణా, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టితో హజ్ యాత్రను రూపొందించినట్టు చెప్పారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాత్రికుల వయోపరిమితిలో మార్పులు ఉండవచ్చని, ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల ప్రకారం ప్రతి యాత్రికుడు తన ప్రయాణానికి 72గంటలు ముందుగా కరోనా పరీక్ష చేయించుకోవాలని, ఏదైనా అధీకృత సంస్థ జారీ చేసిన ఆర్.టి.పి.సి.ఆర్. టెస్ట్ నెగిటివిటీ సర్టిఫికెట్ ను బయలుదేరే ముందుగానే సమర్పించవలసి ఉంటుందని మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి పరిస్థితిని, ఎయిర్ ఇండియా తదితర సంస్థల సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని హజ్ ప్రయాణికులను విమానం ఎక్కించుకునే ప్రదేశాల సంఖ్యను 21నుంచి 10కి కుదించినట్టు చెప్పారు.
హజ్ 2021 యాత్రకు ప్రయాణికులు బయలుదేరాల్సిన ప్రదేశాలు- అహ్మదాబాద్, బెంగుళూరు, కొచ్చిన్, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, శ్రీనగర్.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారంతా అహ్మదాబాద్ నుంచి బయలు దేరాల్సి ఉంటుంది. కర్ణాటక యాత్రికులంతా బెంగుళూరులో,.. కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, అండమాన్ నికోబార్ ప్రాంతాల వారు కొచ్చిన్.లో,..ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ జిల్లాలవారు ఢిల్లీలో..., అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలవారు గువాహటిలో.., పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపుర, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారు కోల్కతాలో...,ఉత్తరప్రదేశ్ పశ్చిమ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాలవారు లక్నోలో..., మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేళీ ప్రాంతాల వారు ముంబైలో..., జమ్ము కాశ్మీర్, లేహ్, లఢక్, కార్గిల్ ప్రాంతాల ప్రయాణికులు శ్రీనగర్ లో హజ్ యాత్రకు బయలుదేరవలసి ఉంటుంది.
2020 హజ్ యాత్రకోసం పురుష సంరక్షణ, తోడు (మెహ్రమ్) లేకుండా వెళ్లే మహిళలు సమర్పించుకున్న దరఖాస్తులు 2021 హజ్ యాత్రకు కూడా చెల్లుబాటవుతాయి. మెహ్రమ్ లేకుండా వెళ్లే (“వితౌట్ మెహ్రమ్”) కేటగిరీ మహిళలనుంచి హజ్ యాత్రకు కొత్త దరఖాస్తులను కూడా ఆమోదిస్తారు. ఈ కేటగిరీ మహిళలందరినీ లాటరీ పద్ధతి ఎంపిక నుంచి మినహాయించారు.
*********
(Release ID: 1671029)
Visitor Counter : 240