ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

9 రాష్ట్రాల మంత్రులు, సీనియర్ అధికారులతో

కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష

ప్రధాని పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ కు ప్రాధాన్యమివ్వాలని సూచన

కోవిడ్ కు తగినట్టు వ్యవహరించటం

బ్రహ్మవిద్యేమీ కాదన్న కేంద్ర మంత్రి

Posted On: 09 NOV 2020 4:01PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 9 రాష్ట్రాల ఆరోగ్య శాఖామంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, కేరళ రాష్ట్రాలు పాల్గొన్నాయి. కుమారి శైలజ ( కేరళ), శ్రీ పీయూష్ హజారికా ( అస్సాం), శ్రీ బల్బీర్ సింగ్ సిద్ధు (పంజాబ్), శ్రీ ఈటెల రాజేందర్ (తెలంగాణ), శ్రీ రాజీవ్ శైజాల్ ( హిమాచల్ ప్రదేశ్) పాల్గొన్నారు.

కొన్ని రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాలలో కోవిడ్ పాజిటివ్ కెసులు పెరుగుతూ ఉండటాన్ని మంత్రి ప్రస్తావించారు. సగటున వారానికి ఎక్కువ కేసులు రావటం, పరీక్షలు తగ్గటం, ఆస్పత్రిలో చేరిన 24/48/72 గంటలలోపు మరణాలు పెరగటం, తక్కువ సమయంలో రెట్టింపు కేసులు రావటం, దీర్ఘకాల వ్యాధులున్నవారి మరణాలు ఎక్కువగా నమోదు కావటం లాంటి అంశాలమీద మంత్రి తన సమీక్షలో దృష్టి సారించారు.  

 

దేశం కోవిడ్ సంక్షోభపు 11వ నెలలో ప్రవేశించిందని మంత్రి గుర్తు చేశారు. జనవరి 8న మొదటి సారిగా కరోనామీద సమీక్ష జరపటాన్ని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రస్తావించారు.  వచ్చే శీతాకాల సమావేశం, వరుసగా వస్తున్న దీపావళి, చాత్ పూజ, క్రిస్మస్, సంక్రాంతి పండుగలను ప్రస్తావిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. శ్వాస సంబంధమైన వైరస్ లు శీతాకాలంలో చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కోవిడ్ సంక్షోభ సమయంలో జాతి ప్రయాణాన్ని ఆయన అందరితో పంచుకుంటూ, జనవరిలో పూణెలో ఒకే ఒ లాబ్ ఉండగా ఇప్పుడు 2074 లాబ్ లకు చేరుకోవటాన్ని మంత్రి ఉదహరించారు.  ఆ విధంగా రోజుకు 15 లక్షల కోవిడ్ పరీక్షలు చేయగల సామర్థ్యం పొందామన్నారు.  సాధారణ పడకలు, ఆక్సిజెన్ పడకలు, ఐసియు పడకలు పెద్ద సంఖ్యలో పెరిగిన సంగతి కూడా డాక్టర్ హర్షవర్ధన్ గుర్తు చేశారు.  ఇప్పుడున్న మొత్తం కోవిడ్ కేసులలో కేవలం 0.44% మాత్రమే వెంటిలేటర్ మీద ఉన్నాయని, 2,47% కేసులు ఐసియు లో ఉండగా 4.13% మంది ఆక్సిజెన్ మీద ఉన్నారని చెప్పారు. అంతజాతీయంగా చూసినప్పుడు భారతదేశంలో కోలుకుంటున్నవారి శాతం చాలా ఎక్కువగా ఉందని కూడా వెల్లడించారు.

ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో, సీనియర్ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశాల గురించి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితిని ప్రధాని స్వయంగా గమనిస్తూ సమీక్షిస్తున్నట్టు చెప్పానన్నారు. కోవిడ్ విషయమై ప్రధాని అనేక సందర్భాలలో జాతినుద్దేశించి ప్రసంగించారని, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతులతో చర్చించారని కూడా మంత్రి గుర్తు చేశారు.ఇటీవలి తాజా ప్రసంగం కేవలం పది నిమిషాలే అయినప్పటికీ కోవిడ్ కు నివారణ దిశలో ప్రవర్తన ఉండాలన్న సందేశమే అందులో ప్రధానంగా ఉందని, “ జన్ ఆందోళన్’ కు ఆయన పిలునిచ్చారని చెప్పారు.  కాల ర్ట్యూన్ సహా వివిధ మార్గాలలో ప్రభుత్వం జన్ ఆందోళన్ ను ప్రజలలోకి తీసుకువెళ్ళి అవగాహన పెంచుతోందన్నారు. కోవిడ్ నియంత్రణ పద్ధతులు పాటించటం చాలా సులువుగనుక దానిమీద పోరాటానికి ఇదే సరైన మార్గమన్నారు.

వ్యాధి నియంత్రణ జాతీయ కేంద్ర (ఎన్ సి డి ఎస్) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ సింగ్ మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం తీరుతెన్నులను, అయా రాష్ట్రాలలో ప్రజారోగ్య స్పందనను, చేస్తున్న కృషిని వివరించారు. అయితే, ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్న జిల్లాల గురించి కూడా  ఆయన ప్రస్తావించారు.

వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖామంత్రులు తమ తమ రాష్ట్రాలలో కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను వివరించారు. నిఘా ద్వారా గుర్తించటం, పాజిటివ్ గా నిర్థారణ అయినవారికి తగిన చికిత్స అందించటం గురించి సమావేశంలొ చెప్పారు. తాము అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను కూడా ప్రస్తావించారు.

 

 

కేండ్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ, రాష్ట్రాలు ప్రధానంగా దృష్టి సారించాల్సిన పది కీలక అంశాలను గుర్తు చేశారు. వీటి ద్వారానే కోవిడ్ మీద పోరులో పైచేయి సాధించవచ్చునని హితవు చెప్పారు. పరీక్షల సంఖ్య పెంచటం, రద్దీ ప్రదేశాలమీద దృష్టి పెట్టటం, పనిప్రదేశాల్లో, మత సంబంధమైన కార్యక్రమాల్లో గుమికూడకుండా చూడటం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు. పరీక్షలలో ఆర్ టి-పిసిఆర్ పరీక్షల వాటా పెంచటం, ఆర్ ఎ టి నెగటివ్ వచ్చిన వారికి లక్షణాలను బట్టి తప్పనిసరిగా పరీక్షలు చేయటం, మొదటి 72 గంటలలోనే వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించి పరీక్షించటం, కనుక్కున్న ప్రతి పాజిటివ్ కేసుకూ కనీస 10-15 మంది దగ్గరివాళ్ల ఆనవాళ్లు గుర్తించి పరీక్షలు జరపటం, తీవ్ర లక్షణాలున్నవారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి మొదటి 24-72 గంటలు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవటం, ప్రతిరోజూ మృతుల వివరాలు విశ్లేషించటం, మరణాల శాతం 1% లోపు ఉండేలా చూడటం ఎంతో అవసరమన్నారు. 60 ఏళ్ళు పైబడ్డవారు, ఇతర దీర్ఘకాల వ్యాధులున్నవారి విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవటం, ప్రజలందరూ కోవిడ్ నివారణ దిశలో జాగ్రత్తలు తీసుకునేలా చేయటం, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు, పంచాయితీరాజ్ సంస్థలు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు విజ్ఞప్తి చేయటం ద్వారా వారు తగిన జాగ్రత్తలు తీసుకునేట్టు ప్రోత్సహించటం ఎంతో అవసరమన్నారు.

 

ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా, సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్,  మంత్రిత్వశాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1671516) Visitor Counter : 236