PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
25 SEP 2020 6:21PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో తొలిసారి ఒకేరోజు అత్యధికంగా 15 లక్షల కోవిడ్ పరీక్షల నిర్వహణ; పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య ఒక్కసారిగా 7 కోట్ల స్థాయికి చేరువ.
- కోలుకునేవారి సంఖ్య వేగంగా పెరుగుతూ 47.5 లక్షలకు (47,56,164)పైగా నమోదు; గత 24 గంటల్లో 81,777 మందికి వ్యాధి నయం.
- కోలుకునేవారి జాతీయ సగటు నేడు 81.74 శాతంగా నమోదు.
- కొత్తగా కోలుకున్న కేసులలో 73 శాతం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే.
- వైద్య విద్యలో వినూత్న సంస్కరణలు; జాతీయ వైద్య కమిషన్సహా 4 స్వయంప్రతిపత్తి బోర్డుల ఏర్పాటు.
- దేశీయ విమానయాన సేవల పునఃప్రారంభంతో ఇప్పటిదాకా 1 కోటిమంది ప్రయాణం.
దేశంలో కోలుకునేవారి సంఖ్య వేగంగా పెరుగుతూ 47.5 లక్షలకుపైగా నమోదు; ఇందులో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వాటా 73 శాతం
భారత్‌లో ఇవాళ వ్యాధి నయమైనవారి సంఖ్య 47.5 లక్షలు (47,56,164) దాటింది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 81,177 మంది కోలుకోగా, ప్రస్తుత క్రియాశీల (9,70,116) కేసులతో పోలిస్తే కోలుకున్న కేసుల వ్యత్యాసం ఇవాళ దాదాపు 38 లక్షలు (37,86,048) దాటింది. నానాటికీ కోలుకునేవారి సంఖ్య పెరుగుతున్నందున దేశంలో వ్యాధి నయమయ్యేవారి సగటు నేడు 81.74 శాతానికి చేరింది. తాజాగా కోలుకుని ఇళ్లకు వెళ్లినవారిలో 73 శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోనివారే కావడం గమనార్హం. ఈ జాబితాలో తదనుగుణంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలున్నాయి. కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 17,000 మందికి వ్యాధి నయం కాగా, ఆంధ్రప్రదేశ్ 8,000కుపైగా కోలుకున్న కేసులతో రెండో స్థానంలో ఉంది. కాగా, దేశంలో గత 24 గంటల్లో 86,052 కొత్త కేసులు నమోదవగా, వీటిలో 75 శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనే ఉన్నాయి. ఈ విషయంలో 19,000కన్నా ఎక్కువ కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా- ఆంధ్రప్రదేశ్ , కర్ణాటకలు 7,000కన్నా అధిక కేసులతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో సంభవించిన 1,141 మరణాల్లో 83 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659106
భారత్ చారిత్రక శిఖరారోహణ; తొలిసారి ఒకేరోజు దాదాపు 15 లక్షల కోవిడ్ పరీక్షలతో సరికొత్త రికార్డు... పరీక్షించిన మొత్తం నమూనాలు 7 కోట్లకు చేరిక
భారత్ కోవిడ్-19 పోరాటంలో చారిత్రక శిఖరాన్ని అధిరోహించింది... తొలిసారి ఒకేరోజు దాదాపు 15 లక్షల నమూనాల పరీక్షతో కొత్త రికార్డు సృష్టించింది. గడచిన 24 గంటల్లో 14,92,409 నమూనాల పరీక్షతో నేటిదాకా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య దాదాపు 7 కోట్లకు (6,89,28,440) పెరిగింది. రోజువారీ పరీక్షల సామర్థ్యం రీత్యా దేశంలో పరీక్షా మౌలిక సదుపాయాల వేగవంతమైన పెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది. తదనుగుణంగా చివరి కోటి పరీక్షలు కేవలం 9 రోజుల్లోనే పూర్తికావడం విశేషం. దీంతో ప్రతి 10 లక్షల జనాభాకూ రోజువారీ పరీక్షల సగటు నేడు 49,948కి దూసుకెళ్లింది. మరోవైపు పరీక్షల రీత్యా నిర్ధారిత కేసుల జాతీయ సగటు 8.44 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా పరీక్షా మౌలిక సదుపాయాల విస్తరణతో 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షలు జాతీయ సగటు (49,948)కన్నా అధికంగా నమోదవుతోంది. ఇక దేశంలో నేడు ప్రభుత్వ రంగంలో 1084, ప్రైవేటు రంగంలో 734 వంతున మొత్తం 1818 ప్రయోగశాలలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659027
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ 65వ ఆవిర్భావ దినోత్సవాలకు డాక్టర్ హర్షవర్ధన్ శ్రీకారం
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ 65వ ఆవిర్భావ దినోత్సవాలకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎయిమ్స్ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. ఎయిమ్స్‌లో 1956లో ఇదే రోజున అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల బోధనకు నాందితోపాటు తొలి బ్యాచ్ ఎంబీబీఎస్ తరగతులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ- మానవ వనరులశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకటించే ర్యాంకులలో వైద్యానికి సంబంధించి దేశంలోనే ప్రథమస్థానంలో నిలవడంపై ఎయిమ్స్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఆ మేరకు 1956లో భారత పార్లమెంటు చట్టంద్వారా స్థాపించిన నాటినుంచి నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో ఎయిమ్స్ విజయవంతమైందని డాక్టర్ వర్ధన్ సంతృప్తి వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్య-పరిశోధనలలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు నిరంతరం కృషి చేస్తున్నదని కొనియాడారు. ప్రస్తుతం కోవిడ్-19పై పోరాటంలో విజయ పథం సాగడానికి మహమ్మారి నియంత్రణ-నిరోధంలో ఎయిమ్స్ భారీ సహకారం అందించిందని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658991
వైద్య విద్యలో వినూత్న సంస్కరణలు; జాతీయ వైద్య కమిషన్సహా 4 స్వయంప్రతిపత్తి బోర్డుల ఏర్పాటు
దేశం వైద్య విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (NMC)తోపాటు నాలుగు స్వయంప్రతిపత్తి బోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో దశాబ్దాలనాటి భారత వైద్యమండలి (MCI) రద్దయింది. తదనుగుణంగా ‘ఎన్ఎంసీతోపాటు అండర్ గ్యాడ్యుయేట్, పీజీ మెడికల్ ఎడ్యకేషన్, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్, ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్’ పేరిట నాలుగు స్వయంప్రతిపత్తిగల బోర్డులు అమలులోకి వచ్చినట్లయింది. ఇవన్నీ ఎన్ఎంసికి రోజువారీ కార్యకలాపాల్లో సహకరిస్తాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659029
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- మాననీయ జపాన్ ప్రధాని సుగా యోషిహిడేల మధ్య టెలిఫోన్ సంభాషణ
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జపాన్ ప్రధాని మాననీయ సుగా యోషిహిడేతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. జపాన్ ప్రధానమంత్రిగా నియమితులైన నేపథ్యంలో ప్రధాని సుగాను అభినందించిన శ్రీ మోదీ అభినందించారు. తన పదవీకాలంలో అన్ని లక్ష్యాలనూ ఆయన సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కాగా, కోవిడ్-19 మహమ్మారి సంక్షోభంసహా ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సవాళ్ల నడుమ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఎంతో సముచితమైనదని దేశాధినేతలిద్దరూ అంగీకరించారు. ప్రపంచంలో కోవిడ్ పరిస్థితులు మెరుగుపడిన అనంతరం వార్షిక ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా భారత పర్యటనకు రావాలని ప్రధాని సుగాకు శ్రీ మోదీ ఆహ్వానం పలికారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659056
నేటినుంచి పని ప్రదేశాల్లో యోగా విరామాన్ని పునఃప్రారంభించిన ఆయుష్ శాఖ
కోవిడ్-19 విధివిధానాల కారణంగా పని ప్రదేశాల్లో యోగా విరామాన్ని నిలిపివేసిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇవాళ్టినుంచి దీన్ని పునఃప్రారంభించింది. విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఐదు నిమిషాల విరామం సందర్భంగా యోగాపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతోపాటు కొద్దిసేపు విశ్రాంతి తర్వాత తిరిగి ఉత్సాహంగా విధుల్లో పాల్గొనేలా వారిని ప్రోత్సహిస్తారు. కాగా, ఎండీఎన్‌ఐవైతో సంయుక్తంగా ఆయుష్ మంత్రిత్వశాఖ 2019లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు 5 నిమిషాల విరామం అనంతరం ఒత్తిడినుంచి ఉపశమనం పొంది, తిరిగి బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించడం లక్ష్యంగా ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658875
‘ఆయుష్ ఫర్ ఇమ్యూనిటి’ కార్యక్రమంలో భాగంగా వినూత్న ‘ఈ-మారథాన్’కు ఆయుష్ మంత్రిత్వశాఖ మద్దతు
“ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ" పేరిట ఆయుష్ మంత్రిత్వశాఖ చేపట్టిన మూడు నెలల కార్యక్రమంలో భాగంగా వినూత్న రీతిలో ‘ఈ-మారథాన్’ నిర్వహించడం కోసం కొచ్చిలోని ‘రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్’, రాజగిరి బిజినెస్ స్కూల్’ యాజమాన్యాలతో చేయి కలిపింది. ఆకాంక్షిత ఆరోగ్య-ప్రోత్సాహం, వ్యాధి నివారణ చర్యలు లక్ష్యంగా ఈ కార్యక్రమంపై దృష్టి సారించింది. సాంకేతిక పరిజ్ఞానం, భౌతికంగా పరుగు, ధార్మికత, శ్రేయస్సుల సమ్మేళనమైన ఈ కార్యక్రమంలో పాల్గనేవారిలో సానుకూల దృక్పథం పెపొంది, చక్కని ఆరోగ్యం సొంతం కాగలదని భావిస్తోంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658875
కోవిడ్ -19 నిర్వహణ కోసం వాసా (అధాటోవాసికా), గుడుచి సామర్థ్యంపై వైద్య అధ్యయనం చేపట్టడానికి సిద్ధమైన ఆయుష్ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారికి సత్వర పరిష్కారాల అవసర దృష్ట్యా ఆయుష్ మంత్రిత్వశాఖ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఆ మేరకు ఓ క్రమపద్ధతిలో అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్-19 నిర్ధారిత కేసులలో లక్షణాలకు చికిత్స నిర్వహణలో “వాసా ఘనా, గుడుచి ఘనా, వాసా-గుడుచి ఘనా”ల పాత్ర ఏ మేరకు ఉంటుందో అంచనా వేయడం కోసం వైద్యపరమైన అధ్యయనం చేపట్టేందుకు వచ్చిన ఒక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659186
బీహార్ శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు- ఎన్నికల షెడ్యూలు విడుదల
బీహార్ శాసనసభకు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూలును విడుదల చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658980
ఈ ఏడాది ఖరీఫ్‌లో 1116.88 లక్షల హెక్టార్లలో పంటల సాగు; నిరుడు ఇదే వ్యవధితో సాగు విస్తీర్ణం 1066.06 లక్షల హెక్టార్లు మాత్రమే
దేశవ్యాప్తంగా ప్రధాన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో కేంద్ర వ్యవసాయ- రైతు సంక్షేమ మంత్రిత్వశాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమస్థాయిలో కృషిచేశాయి. ఇందులో భాగంగా రైతులకు విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, యంత్రాలతోపాటు రుణలభ్యత వంటి ఉత్పాదకాలను సకాలంలో అందుబాటులో ఉంచాయి. దీంతో మహమ్మారి దిగ్బంధం కొనసాగిన పరిస్థితులలోనూ వ్యవసాయ కార్యకలాపాలు అడ్డంకులు లేకుండా సాగిపోయాయి. మరోవైపు ప్రస్తుతం ఖరీఫ్ పంటలకింద సేద్యం విస్తీర్ణం పెరగడంపై కోవిడ్-19 ప్రభావం ఎంతమాత్రం లేదు. ఈ నేపథ్యంలో నిరుడు ఇదే వ్యవధిలో ఖరీఫ్ సీజన్ పంటలు 1066.06 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగుచేయగా, ఈ ఏడాది మరింత పురోగమించి 1116.88 లక్షల హెక్టార్లుగా నమోదైంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659185
కోవిడ్-19 అనంతర కోలుకునే ప్రణాళికలో ప్రకృతికి పెద్దపీట వేయాలని ప్రపంచ దేశాలకు భారత్ విజ్ఞప్తి
“ప్రకృతితతో సహజీవనం” లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా రూపొందించే ప్రణాళికల్లో ప్రకృతికి పెద్దపీట వేసేందుకు ఉద్దేశించిన “సుస్ధిర ప్రగతి కోసం ఐక్యరాజ్యసమితి కార్యాచరణ-అమలు దశాబ్దం” కార్యక్రమ ఆరంభం సందర్భంగా ప్రపంచదేశాలన్నీ కలసిరావాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ అన్ని దేశాల ప్రభుత్వాలకూ విజ్ఞప్తి చేశారు. నిన్న “2020 తర్వాత జీవ వైవిధ్యం: భూమిపై జీవం కోసం ఉమ్మడి భవిష్యత్తు” ఇతివృత్తంగా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా చైనా నిర్వహించిన మంత్రులస్థాయి రౌండ్ టేబుల్ చర్చలో శ్రీ జావడేకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి సదస్సు నిర్వహణకు ఒక వారం ముందుగా చైనా ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658939
దేశీయ విమానయాన సేవల పునఃప్రారంభంతో నేటిదాకా కోటిమంది ప్రయాణం
దేశవ్యాప్తంగా 2020 మే 25 నుంచి ప్రభుత్వం దేశీయ విమానయాన సేవల పునఃప్రారంభానికి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా 1,08,210 విమాన సర్వీసులు నడపగా దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య కోటిమందికిపైగా ప్రయాణించారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈ మేరకు వెల్లడించారు. దేశీయ విమానయానం క్రమంగా కోవిడ్ పూర్వస్థితి వైపు సాగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659187
బ్రూసెలోసిస్ వ్యాక్సిన్ టెక్నాలజీ మార్పిడికి బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) తోడ్పాటు
నవ్య బ్రూసెల్లో వ్యాక్సిన్ సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి భారత జీవ-సాంకేతిక విభాగం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు “బ్రూసెల్లా అబార్టస్ ఎస్19 డెల్టా పర్ వ్యాక్సిన్”కు సంబంధించి ఈ వారం ప్రారంభంలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంలో తోడ్పడింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659192
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలో నిత్యం కేసులు పెరుగుతున్న కారణంగా జాతీయ స్థాయిలో కేరళ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచింది. పరీక్షల తర్వాత కేసుల నిర్ధారణ శాతం ప్రస్తుతం జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వారం వ్యవధిలో రోగుల సంఖ్య 30శాతం పెరిగింది. తదనుగుణంగా ప్రస్తుతం చికిత్స పొందే కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు 45,919 మంది చికిత్స పొందుతుండగా, 2.12 లక్షల మంది నిర్బంధవైద్య పరిశీలనలో ఉన్నారు. మృతుల సంఖ్య 613గా ఉంది.
- తమిళనాడు: రాష్ట్రంలో 10-12 తరగతులకు అక్టోబర్ 1 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి లిఖితపూర్వక అనుమతికి లోబడి ఇది అమలవుతుంది. అయితే, ఆన్లైన్ తరగతులు, దూరవిద్య కొనసాగుతాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో ఆశా కార్మికుల సమ్మెతోపాటు దాదాపు 30,000 మంది కాంట్రాక్టు, ఔట్సోర్స్ ఆరోగ్య కార్యకర్తలు గురువారం విధులను బహిష్కరించారు. కాగా, కోవిడ్‌పై పోరులో అంకితభావంతో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సుల పేరిట బళ్లారి జిల్లాలో ప్రజలు కొందరు నవజాత శిశువులకు నామకరణం చేస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. కాగా, బెంగళూరు తరువాత అత్యధిక మరణాల నమోదవుతున్న మైసూరు జిల్లాలో రాబోయే వారాల్లో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ కార్యాచరణ ప్రణాళికను అధికార యంత్రాంగం రూపొందించింది.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ లక్ష కోవిడ్ పరీక్షల నిర్వహణతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా 10 శాతం జనాభాకు పరీక్షలు నిర్వహించినట్లయింది. ఈ మేరకు ఇవాళ్టిదాకా మొత్తం 53,78,367 నమూనాలను పరీక్షించారు. గత ఆరు నెలల్లో పరీక్ష సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడం ద్వారా రాష్ట్రం జాతీయస్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వైద్య-ఆరోగ్యశాఖ బలోపేతంసహా రోగులకు మరింతగా సేవలందించడానికి రాష్ట్ర వైద్య-ఆరోగ్య విభాగంలో ప్రభుత్వం కొత్త సిబ్బందిని నియమించింది.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2381 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 2021మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 386 జీహెచ్ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,81,627; క్రియాశీల కేసులు: 30,387; మరణాలు: 1080; డిశ్చార్జి: 1,50,160గా ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో నిలిపివేసిన సిటీబస్సు సర్వీసులు 6 నెలల తర్వాత నేటినుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. తదనుగుణంగా అవసరమైన అన్ని జాగ్రత్తలతో 25 ప్రధాన మార్గాల్లో ఈ బస్సులు నడుస్తున్నాయి. కాగా, నకిలీ ఎన్కౌంటర్లకు నిరసనగా సెప్టెంబరు 28న తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 283 కొత్త కేసులతో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2,331కి చేరింది.
- అసోం: రాష్ట్రంలో నిన్న 2,432 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,35,141కి చేరగా, క్రియాశీల రోగుల సంఖ్య 29,830గా ఉంది.
- మణిపూర్: రాష్ట్రంలో 161 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 9,537కు చేరింది. ఇక 77 శాతం కోలుకునే సగటుగల మణిపూర్‌లో ఇప్పుడు 2,106 క్రియాశీల కేసులున్నాయి.
- మేఘాలయ: రాష్ట్రంలో ఇవాళ 199 మంది కోలుకోగా, క్రియాశీల కేసులు 1,977గా ఉన్నాయి. వీరిలో బిఎస్ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది 219 కాగా, ఇతరులు 1,758మంది ఉన్నారు. మేఘాలయలో ఇప్పటిదాకా 3,058 కోలుకున్నారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 26 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసులు 1,786కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 681గా ఉన్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలోని కోవిడ్ కేసులలో సాయుధ దళాల సిబ్బంది సంఖ్య 2,716 (47శాతం)గా ఉంది. అలాగే నాగాలాండ్‌కు తిరిగివచ్చినవారిలో 1,462 మంది, పరిచయాలద్వారా వ్యాధిబారిన పడినవారు 1,216 మంది, ముందువరస పోరాటయోధులలో 336 మంది రోగుల జాబితాలో ఉన్నారు.
- సిక్కిం: రాష్ట్రంలో 95 కొత్త కేసులు నమోదవగా, ప్రస్తుతం చికిత్స పొందే కేసుల సంఖ్య 679కి చేరింది. ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 1,994గా ఉంది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో గురువారం 19,164 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12.82 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 32,284మంది మరణించారు. కాగా, రాష్ట్రంలోని 36 జిల్లాలకుగాను మొత్తం 11.92 లక్షల కేసులలో 92.91 శాతం, అలాగే 32,284 మరణాల్లో 94 శాతం 20 జిల్లాల పరిధిలోనే నమోదయ్యాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి సమీక్ష సమావేశం తర్వాత ఈ జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షించడానికి అంకితభావంగల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తోంది. అలాగే తీవ్ర ప్రభావిత జిల్లాల్లో తగిన సంఖ్యలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లుసహా ఆరోగ్య సదుపాయాలను పెంచాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది.
- గుజరాత్: రాష్ట్రంలో గురువారం 1,408 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,949కు పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు 1,410 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని తెలిపింది. దీంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 1,09,211కు పెరిగింది. దీంతో కోలుకునే సగటు 84.69 శాతంగా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో కరోనా రోగులకు తగు పరిమాణంలో ఆక్సిజన్ సరఫరా అయ్యేలా జైపూర్లో ఆక్సిజన్ తయారీపై దృష్టి సారించాలని రాజస్థాన్ ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆ మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థల్లో ఔషధ నియంత్రణ అధికారులకు బాధ్యత అప్పగించింది.
- ఛత్తీస్గఢ్: రాష్ట్రంలో వైరస్ సంక్రమణ కొనసాగుతున్నందున కోవిడ్-19 పరీక్షలను ప్రభుత్వం గణనీయంగా పెంచుతోంది. తదనుగుణంగా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు సంచార బృందాలు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు రోగులను త్వరగా గుర్తించేందుకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సదుపాయం 832 కేంద్రాల్లో అందుబాటులో ఉంది. ఇందులో 539 గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 36 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో సెరో నిఘాకోసం నమూనాల సేకరణను ఐసీఎంఆర్ పూర్తిచేసింది.
FACT CHECK
****
(Release ID: 1659194)
Visitor Counter : 252