ప్రధాన మంత్రి కార్యాలయం

టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ సుగా యోశిహిదే

Posted On: 25 SEP 2020 2:09PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ సుగా యోశిహిదే శుక్ర‌వారం టెలిఫోన్ లో మాట్లాడారు.  

జ‌పాన్ ప్ర‌ధాని గా నియమితులైనందుకు శ్రీ సుగా యోశిహిదే కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ, శ్రీ సుగా యోశిహిదే త‌న ల‌క్ష్యాల సాధనలో స‌ఫ‌లం కావాలంటూ శుభాకాంక్ష‌ల‌ను వ్య‌క్తం చేశారు.

భారత్, జపాన్ ల మ‌ధ్య ఏర్పడ్డ ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క, ప్ర‌పంచ స్ధాయి భాగ‌స్వామ్యం గ‌త కొన్నేళ్ళ లో ఎంతో పురోగ‌మించింద‌ని నేత‌లిద్ద‌రూ అంగీకరిస్తూ, ప‌ర‌స్ప‌ర విశ్వాసం, ఉమ్మ‌డి విలువ‌ల ద్వారా ఈ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్ట‌ం చేసుకోవాలన్న తమ ఉద్దేశాన్ని వ్య‌క్తం చేశారు.

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి స‌హా ప్ర‌పంచానికి ఎదుర‌వుతున్న స‌వాళ్ళను దృష్టిలో ఉంచుకొంటే, ఇరు దేశాల మ‌ధ్య ఏర్పడిన భాగ‌స్వామ్యం ప్ర‌స్తుతం మ‌రింత సందర్భశుద్ధి కలదిగా ఉంద‌ంటూ ఉభ‌య నేతలు ఏకీభవించారు.  ఆటు పోటుల‌కు త‌ట్టుకొని నిల‌చే స‌ర‌ఫ‌రా వ్యవస్థ అండదండలతో ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో  అర‌మ‌రిక‌ల‌కు తావు లేని, స్వేచ్ఛాయుత‌, స‌మ్మిళిత స్వ‌రూపం క‌లిగిన ఆర్థిక వ్య‌వ‌స్థ ముందుకుసాగాల‌ని వారు స్ప‌ష్టం చేశారు. భార‌త‌దేశాని కి, జ‌పాన్ కు, భావ‌సారూప్యం క‌ల ఇత‌ర దేశాల‌ కు మ‌ధ్య ఇప్పుడు కొనసాగుతున్న స‌హ‌కారాన్ని నేత‌లిద్దరూ స్వాగ‌తించారు.

ఇరు దేశాల ఆర్థిక భాగ‌స్వామ్యం లో నమోదైన పురోగ‌తిని ఉభ‌య నేత‌లు ప్రశంసించారు.  ప్ర‌త్యేక నైపుణ్యాలున్న శ్రామికుల కు సంబంధించి ఒప్పంద పాఠం ఖరారుకావడాన్ని వారు స్వాగతించారు.  

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యం లో ఎదురైన ప‌రిస్థితి మెరుగుప‌డ్డ తర్వాత వార్షిక ద్వైపాక్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలుపంచుకోవ‌డానికి భార‌త‌దేశానికి రావలసిందిగా ప్రధాని శ్రీ సుగా యోశిహిదేను శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానించారు.


*** 



(Release ID: 1659056) Visitor Counter : 269