ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రోజువారీ కోవిడ్ పరీక్షలలో భారత్ సరికొత్త రికార్డు
ఒక్కరోజులో 15 లక్షల పరీక్షలు
7 కోట్లకు చేరిన మొత్తం పరీక్షలు
Posted On:
25 SEP 2020 11:16AM by PIB Hyderabad
కోవిడ్-19 మీద జరుపుతున్న పోరులో భారత్ ఒక చరిత్రాత్మక స్థాయికి చేరింది. మొట్టమొదటి సారిగా రికార్డు స్థాయిలో ఒకే రోజు 15 లక్షలమందికి కోవిడ్ పరీక్షలు జరిపింది. గడిచిన 24 గంటలలో 14,92,409 శాంపిల్స్ పరీక్షించటం ద్వారా ఈ సరికొత్త రికార్డు స్థాపించగలిగింది. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షలు దాదాపు ఏడు కోట్లకు (6,89,28,440) చేరాయి.
ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు జరపగలిగే సామర్థ్యం పెంచుకోవటం దేశంలో పెరిగిన వైద్య మౌలిక సదుపాయాల స్థాయికి అద్దం పడుతోంది. కేవలం గడిచిన 9 రోజుల్లోనే కోటి కోవిడ్ పరీక్షలు జరగటం మరో విశేషం. దీనివలన ఇప్పటివరకు సగటున ప్రతి పదిలక్షల మందిలో 49,948 మందికి కోవిడ్ పరీక్షలు జరిపినట్టయింది.
పరీక్షల సంఖ్య ఇలా పెద్ద మొత్తంలో పెరిగేకొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందనటానికి ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన సమాచారం సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటివరకూ ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కూడా తేలింది. జాతీయ స్థాయిలో ఈరోజు పాజిటివ్ శాతం 8.44% కు తగ్గింది.
పరీక్షలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు విస్తృతం చేయటంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పరీక్షలు బాగా పెరిగాయి. ప్రతి పదిలక్షల మందిలో పరీక్షలు జరిపినవారి సంఖ్యలో జాతీయ సగటు (49,948) కంటే ఎక్కువ నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 23 ఉన్నాయి.
ఎక్కువ కేసులు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల పరిస్థితిని సమీక్షిస్తూ ప్రధాని పదే పదే చెబుతున్నట్టుగా పరీక్షలు ఎక్కువ జరిపే కొద్దీ స్పందన కూడా ఎక్కువగా ఉంటుంది. పరీక్షించు, అనవాలు పట్టు, చికిత్స అందించు అనే మూడంచెల వ్యూహాన్ని కేంద్రం క్రమం తప్పకుండా అనుసరించటం వలన సత్ఫలితాలు సాధ్యమయ్యాయి. వైరస్ ను వెంటాడటం అనే కేంద్ర ప్రభుత్వ వైఖరి వలన ఎవరూ తప్పిపోకుండా పరీక్షలు జరపగలుగుతున్నారు. ఆ విధంగా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్దుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పరీక్షల విషయంలో కేంద్రం తీసుకున్న చర్యలు, రాష్ట్రాలను కూడా ఎక్కువ పరీక్షలు జరిపేలా ప్రోత్సహించటం, లక్షణాలు కనబడిన వారందరికీ కచ్చితంగా ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు చేయించటం లాంటి చర్యలవలన కోవిడ్ ను సమర్థంగా అడ్దుకోగలుగుతున్నారు.
పరీక్షల విషయంలో అనుసరించిన కీలకమైన వ్యూహం లాబ్ ల నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయటం. దీంతో ప్రస్తుతం లాబ్ ల సంఖ్య 1818 కి చేరింది. ఇందులో ప్రభుత్వ రంగంలో 1084 లాబ్ లు ఉండగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 734 ఉన్నాయి.
రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 923 (ప్రభుత్వ: 478 + ప్రైవేట్: 445)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 769 (ప్రభుత్వ: 572 + ప్రైవేట్: 197)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 126 (ప్రభుత్వ: 34 + ప్రైవేట్ 92 )
***
(Release ID: 1659027)
Visitor Counter : 239
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam