PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
25 JUN 2020 6:25PM by PIB Hyderabad



(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం


కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: దేశంలో 75లక్షలు దాటిన నిర్ధారణ పరీక్షల సంఖ్య; కోలుకునేవారి శాతం 57.43కు చేరిక
దేశంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష సదుపాయాలు గణనీయంగా పెరుగుతూ ప్రస్తుతం ప్రయోగశాలల సంఖ్య 1,007కు చేరగా, ప్రభుత్వ రంగంలో 734, ప్రైవేటు రంగంలో 273 అందుబాటులో ఉన్నాయి. దీంతో 2020 జనవరి నాటికి పరిమిత సంఖ్యలో మాత్రమే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో గడచిన 24 గంటల వ్యవధిలో 2,07,871 నమూనాలను పరీక్షించగలగడం సదుపాయాల పెరుగుదల వేగానికి నిదర్శనం. తద్వారా ఇప్పటివరకూ మొత్తం 75,60,782 నమూనాలను ప్రభుత్వ, ప్రైవేటు ప్రయోగశాలల్లో పరీక్షించారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 13,012 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,71,696కు పెరిగి, కోలుకునేవారి శాతం 57.43కు చేరింది. ప్రస్తుతం 1,86,514 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో ప్రతి లక్ష జనాభాకు కేసుల సంఖ్య 120.21 కాగా, భారత్‌లో ప్రతి లక్ష జనాభాకు కేవలం 33.39 మాత్రమే కావడం గమనార్హం. అదేవిధంగా మరణాల్లో ప్రపంచ సగటు ప్రతి లక్షమందికి 6.24 కాగా, మన దేశంలో కేవలం 1.06 మాత్రమే.
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర బృందం తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 2020 జూన్ 26 నుంచి 29 తేదీల మధ్య పర్యటించనుంది. ఈ సందర్భంగా కోవిడ్-19 నిర్వహణలో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను మరింత పటిష్ఠం చేసేలా ఈ బృందం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634333
డాక్టర్ హర్షవర్ధన్ చేతులమీదుగా భారత రెడ్‌క్రాస్ సొసైటీ మొబైల్ యాప్ “ఈ-బ్లడ్ సర్వీసెస్” ఆవిష్కరణ
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) పరిధిలోని ‘ఈ-రక్తకోష్’ బృందం ఈ అనువర్తనాన్ని అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- “అనేకమందికి తమ కుటుంబాల్లోని వైద్య పరిస్థితుల కారణంగా క్రమబద్ధ రక్తసరఫరా సంబంధిత సేవలు అవసరం అవుతుంటాయి. అటువంటివారు ఈ యాప్‌ద్వారా అభ్యర్థన పంపితే రక్తనిధి (బ్లడ్‌బ్యాంకు)లో నాలుగు యూనిట్ల రక్తాన్ని సిద్ధంగా ఉంచుతారు. దీన్ని 12 గంటల్లోగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు ఐఆర్‌సీఎస్ ఎన్‌హెచ్‌క్యూ (IRCS NHQ) వద్ద రక్తం కోసం ఈ యాప్‌ద్వారా సులభంగా అభ్యర్థన దాఖలు చేయవచ్చు” అని చెప్పారు. దేశం ఇటువంటి మహమ్మారిని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రక్త సరఫరా అత్యవసరమైన వారందరికీ ఈ మొబైల్ యాప్ ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. ప్రస్తుత కోవిడ్-19 విజృంభణ సమయంలో రక్తదానం చేసిన స్వచ్ఛంద దాతలందరినీ డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. ఈ మేరకు రెడ్‌క్రాస్ సొసైటీ వారికి రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు సంచార వాహనాలద్వారా రక్త సేకరణ చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634355
కోవిడ్‌పై భారత్ పోరాటం: ఉత్తర ముంబై శివార్లలో వైరస్ నియంత్రణకు ‘ధారవి’ నమూనాను అనుసరిస్తున్న బీఎంసీ
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవి ప్రాంతంలో కరోనా వైరస్‌పై పోరు సందర్భంగా నేర్చిన పాఠాల ఆధారంగా బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఉత్తర ముంబై శివార్లలో “సత్వర కార్యాచరణ ప్రణాళిక”ను ప్రస్తుతం అమలు చేస్తోంది. మరోవైపు ముంబైలోని కోవిడ్-19 ప్రధాన హాట్‌స్పాట్‌లు ధారవి, వర్లీ ప్రాంతాల్లో నేడు గణనీయ మెరుగుదల కనిపిస్తోంది. అయితే, ఉత్తర ముంబైలోని ములుంద్, భాండుప్, మలాడ్, కందివ్లీ, బొరివ్లీ, దహిసర్ ప్రాంతాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్లీ, ధారవిలలో వైరస్ వ్యాప్తిని నియంత్రించిన వ్యూహం తరహాలోనే ఈ ప్రాంతాలకోసం సత్వర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా బీఎంసీ 50 అంబులెన్స్‌లను సంచార జ్వరచికిత్స వైద్యశాలలుగా మార్చి రంగంలో దించింది. ఒక డాక్టర్ల బృందం ఈ వాహనాల్లో రోజంతా సంచరిస్తూ ఇంటింటికీ వెళ్లి జ్వరంతోపాటు ఇతర వ్యాధి లక్షణాలను పరిశీలించడంతోపాటు అవసరమైతే అనుమానితుల నమూనాలను సేకరిస్తుంది.
ప్రధానమంత్రి చేతులమీదుగా జూన్ 26న “స్వయంసమృద్ధ ఉత్తరప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్” ప్రారంభం
కోవిడ్-19 మహమ్మారి దేశంలోని కార్మికశక్తిపై... ప్రత్యేకించి వలస కార్మికులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో అనేక రాష్ట్రాల వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చేశారు. కోవిడ్-19 నియంత్రణ సవాలుకుతోడు వలస, గ్రామీణ కార్మికులకు ప్రాథమిక సదుపాయాలు, జీవనోపాధి మార్గాలు చూపాల్సిన అదనపు బాధ్యత ప్రభుత్వంమీద పడింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు ఉద్దీపన దిశగా ‘స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ’ని ప్రకటించింది. మరోవైపు దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యంతో ఉపాధి సృష్టి లక్ష్యంగా ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ను 2020 జూన్ 20న ప్రారంభించింది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 లక్షల మంది వలసకార్మికులు తిరిగిరాగా, 31 జిల్లాల పరిధిలో ఒక్కొక్క జిల్లాకు చెందినవారు 25,000 మందికిపైగా ఉన్నారు. వీటిలో 5 ప్రగతికాముక జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి 2020 జూన్ 26న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో ఈ అభియాన్‌ను ప్రారంభిస్తారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634290
ప్రత్యక్ష పన్నులు, బినామీ చట్ట సంబంధిత వివిధ కాలపరిమితుల పొడిగింపు
కోవిడ్-19 కారణంగా వివిధ రంగాల్లో చట్ట-నియంత్రణ నిబంధనలను పాటించడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం 2020 మార్చి 31న “పన్ను విధానం-ఇతర చట్టాల (కొన్ని నిబంధనల సడలింపు) ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికింద ఆయా చట్టాల పరిధిలో అనుసరించాల్సిన నిబంధనల గడువుకు సంబంధించి కాలపరిమితులను పొడిగించింది. దీంతోపాటు ఇతరత్రా వివిధ నిబంధనలకు సంబంధించి మరింత ఊరట కల్పించే నిమిత్తం 2020 జూన్ 24న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను వాస్తవ, సవరించిన రిటర్నుల దాఖలు గడువును 2020 జూలై 31దాకా పొడిగించింది. అదేవిధంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను 2020 నవంబరు 30వరకూ పొడిగిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక చిన్న-మధ్యతరహా పన్ను చెల్లింపువర్గాలకు ఊరటగా, రూ.లక్షవరకూ పన్ను బాధ్యతగల స్వీయ అంచనా పన్ను చెల్లింపు తేదీని కూడా 2020 నవంబరు 30 వరకూ పొడిగించింది. అయితే, రూ.లక్షకుపైగా పన్ను చెల్లింపు బాధ్యతగలవారికి మాత్రం ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634185
పట్టణ పథకాలు- ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్), స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రెజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ 5వ వార్షికోత్సవం
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వెబినార్‌లో కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి ప్రసంగించారు. ప్రపంచ చరిత్రలో అత్యంత సమగ్ర ప్రణాళికబద్ధ పట్టణీకరణ కార్యక్రమాల్లో ఒకదాన్ని భారతదేశం అమలు చేస్తున్నదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కోవిడ్‌పై ప్రతిస్పందనలో భాగంగా 47 సమీకృత కంట్రోల్-కమాండ్ సెంటర్లు (ICCC) వ్యూహరచన కేంద్రాలుగా కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆధునిక రహదారులు, ఆధునిక సౌరశక్తి, ఆధునిక నీటి సరఫరా, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, ఉత్తేజిత బహిరంగ ప్రదేశాల ప్రాజెక్టులువంటివి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని వివరించారు. ‘అమృత్-11’ పథకంకింద సమర్థ పరిపాలన, పౌరసేవల ప్రదానం దిశగా నగరస్థాయి పాలన సంస్థల సామర్థ్యం బలోపేతం లక్ష్యంగా గడచిన నాలుగేళ్లుగా మైలురాళ్లవంటి 54 సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు. మునుపటి గృహవసతి కల్పన పథకాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ‘పీఎంఏవై (అర్బన్)’ కింద 8 రెట్లు అధికంగా పక్కా ఇళ్లు మంజూరుచేసినట్లు గుర్తుచేశారు. ఈ గృహ నిర్మాణ కార్యకలాపాలతో ఉపాధి సృష్టి బహుముఖంగా విస్తరించగా, దీనికి అనుబంధంగా సుమారు 1.65 కోట్లమంది పౌరులకు ప్రత్యక్ష, పరోక్ష జీవనోపాధి లభించిందన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634367
కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు చరిత్రాత్మకం: దేశీయాంగ మంత్రి ప్రశంసలు
కేంద్ర మంత్రిమండలి సమావేశం తీసుకున్న నిర్ణయాలు ‘చరిత్రాత్మకం’ అని దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ- “ప్రస్తుత సవాళ్ల సమయంలో స్వావలంబన, పేదల సంక్షేమం, ఆర్థిక వ్యవస్థకు జవసత్వాల దిశగా మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ నిర్ణయాలు మరొకసారి ప్రస్ఫుటం చేశాయి” అని కొనియాడారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634371
భారత రైల్వేశాఖ ద్వారా 24/06/2020దాకా 1.91 లక్షల పీపీఈ గౌన్లు, 66.4 కిలోల హస్త శుభ్రకాలు, 7.33 లక్షల మాస్కుల తయారీ
కోవిడ్-19 మహమ్మారిపై పోరులో ముందువరుసలోగల వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించే సవాలుకు దీటుగా భారత రైల్వేశాఖ, ఇతర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఆ మేరకు తనవద్దగల అన్ని వనరులనూ చక్కటి సమన్వయంతో వినియోగించుకుంటూ సదుపాయాల సృష్టి/ఉన్నతీకరణను చేపట్టింది. దీనికి అనుగుణంగా రైల్వే వర్క్ షాపులు పీపీఈ కవరాల్స్, హస్త శుభ్రకాలు, మాస్కులు, మంచాల తయారీని అంతర్గతంగా చేపట్టింది. వీటికి అవసరమైన ముడిసరకును క్షేత్రస్థాయి యూనిట్లద్వారా సేకరిస్తూ 24/06/2020నాటికి 1.91 లక్షల పీపీఈ గౌన్లు, 66.4 కిలోల హస్త శుభ్రకాలు, 7.33 లక్షల మాస్కులు వగైరాలను తయారుచేసింది. ఈ నేపథ్యంలో జూన్, జూలై మాసాల్లో చెరో 1.5 లక్షల కవరాల్స్ వంతున తయారుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634362
ఉద్యోగార్థులకు చేరువయ్యేలా... దేశంలోని వ్యాపార యాజమాన్యాలకు కొత్త వనరుల కల్పనదిశగా ఎంఎస్‌డీఈ-ఐబీఎం భాగస్వామ్యంలో ఉచిత డిజిటల్ అభ్యాస వేదిక ‘స్కిల్స్ బిల్డ్ రీఇగ్నైట్’ ప్రారంభం
నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) వృత్తిపరమైన శిక్షణ పథకాల అమలుతోపాటు ‘డిజిటల్ ఇండియా’ స్వప్న సాకారం దిశగా కీలకపాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా ఏడాది కాలం నుంచీచ అనేక డిజిటల్ పరిశ్రమ అగ్రగాములతో సంయుక్తంగా విద్యార్థులకు పరిశ్రమ-సంసిద్ధత నైపుణ్యం కల్పించేందుకు కృషిచేస్తోంది. ఆ క్రమంలో ప్రస్తుత కోవిడ్-19 ప్రభావిత పరిస్థితుల్లోనూ పారిశ్రామిక భాగస్వాములతో జతకట్టి డీజీటీ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. తదనుగుణంగా విద్యార్థులు/శిక్షణార్థులు, శిక్షకులు, పాలనాధికారుల కోసం సంయుక్త/ ఈ-లెర్నింగ్ సమ్మిళిత మల్టీమీడియాసహా అదేతరహా డిజిటల్ వనరులను అందుబాటులో ఉంచుతోంది. అంతేకాకుండా ‘భారత్ స్కిల్స్’ అభ్యాస వేదికద్వారా వీటన్నిటినీ ఏ వేళనైనా, ఎక్కడినుంచయినా అందుకోగల వీలు కల్పించింది. ఈ నేపథ్యంలో ‘స్కిల్స్ బిల్డ్ రీఇగ్నైట్’ ద్వారా ఉద్యోగార్థులకు, వ్యవస్థాపకులకు ఉచిత ఆన్‌లైన్ కోర్సుతోపాటు వారు తమ ఉద్యోగ భవిష్యత్తును, వ్యాపారాలను ఉత్తమస్థాయిలో పునరావిష్కరించుకునే విధంగా ప్రోత్సాహక మద్దతు కల్పిస్తోంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634361
కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ రథచక్రాలు నిరంతరం నడిచేలా కృషిచేసిన నావికులకు శ్రీ మాండవీయ కృతజ్ఞతలు
కేంద్ర నౌకాయానశాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ ఇవాళ అంతర్జాతీయ నావికా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా- కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ రథచక్రాలు నిరంతరం నడిచేలా చేయడంలో నావికులు పోషించిన పాత్రను మంత్రి ప్రశంసించారు. భవిష్యత్తులోనూ వారు సురక్షిత సముద్రయానం కొనసాగిస్తూ నవభారత నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థతోపాటు దేశాభివృద్ధిలో భారత నావికుల పాత్ర ఘనమైనదని ఆయన కొనియాడారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634369
ముడి ఔషధాలు, వైద్య పరికరాల పార్కుల ప్రతిపాదన సంబంధిత వివిధ అంశాలపై ఔషధశాఖ అధికారులతో శ్రీ గౌడ సమీక్ష సమావేశం
దేశంలో 3 ముడి ఔషధాల, 4 వైద్య పరికరాల పార్కుల ఏర్పాటు ప్రతిపాదన సంబంధిత వివిధ అంశాలపై కేంద్ర రసాయాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ నిన్న ఔషధశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పార్కుల ఏర్పాటుకు ప్రదేశాలతోపాటు పీఎల్‌ఐ పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై శ్రీ గౌడ, శ్రీ మాండవీయ పలు సూచనలు చేశారు. పార్కుల క్రమబద్ధ ప్రగతికి భరోసా ఇవ్వగల స్పష్టమైన లక్ష్యాల ప్రాతిపదికన ఈ పథకం రూపొందాలని వారు స్పష్టం చేశారు. అత్యాధునిక ఉమ్మడి మౌలిక సదుపాయాలతోపాటు ఇతర సౌకర్యాల రూపేణా ఈ సముదాయాలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నందువల్ల ఈ పథకాలు ముడి ఔషధాల, వైద్య పరికరాల దేశీయ ఉత్పత్తిలో పోటీతత్వాన్ని పెంచుతాయని శ్రీ గౌడ పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634064
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా కోవిడ్-19 సామాజిక సంక్రమణ మొదలయ్యే ప్రమాదం ఉందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ హెచ్చరించారు. రాజధాని నగరంసహా 6 జిల్లాల్లో ఉన్నతస్థాయి అప్రమత్తత ప్రకటించినట్లు ఆమె తెలిపారు. కాగా, కోవిడ్ నిబంధనలను పాటించడంపై ఇకపై సలహాలిచ్చే ప్రసక్తి ఉండదని, పాటించనివారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ లోకనాథ్ బెహెరా స్పష్టం చేశారు. ఇక కోవిడ్ మహమ్మారితో రాష్ట్రం వెలుపల ఇద్దరు కేరళీయులు మరణించారు. కేరళలో నిన్న అత్యధికంగా 152 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 3,603కు చేరింది. ప్రస్తుతం 1,691 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,54,759 మంది పరిశీలనలో ఉన్నారు.
కోవిడ్-19 నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న తమిళనాడులోని వివిధ జిల్లాల జాలర్లు 700 మంది స్వదేశం వచ్చేందుకుగాను భారత నావికాదళ నౌక ‘ఐఎన్ఎస్ జలాశ్వ’లో బయల్దేరారు. రాష్ట్రంలోని జోన్ల మధ్య రవాణా సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. కోవిడ్-19 నేపథ్యంలో పోలీసుల ఆరోగ్యభద్రత దిశగా నేరగాళ్ల అరెస్టుకు సంబంధించి డీజీపీ కొన్ని ప్రామాణిక ప్రక్రియ విధానాలను జారీచేశారు. కాగా, రామనాథపురం జిల్లాలోని నావికాదళ విమాన స్థావరం ‘ఐఎన్‌ఎస్ పరుందు’వద్ద 29 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న 2865 కొత్త కేసులు, 33 మరణాలు నమోదవగా మొత్తం కేసులు 67468కు, మరణాలు 866కు పెరిగాయి. ప్రస్తుతం 28836 యాక్టివ్ కేసులుండగా వాటిలో 18673 చెన్నైకి చెందినవి.
మంగళూరులో కోవిడ్-19 విధుల్లో ఉన్న ఐదుగురు పీజీ వైద్యులకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక కరోనావైరస్ మహమ్మారి పరిస్థితుల నడుమ కర్ణాటకవ్యాప్తంగా ఇవాళ 2879 కేంద్రాల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని రకాల అభ్యర్థనలకు ఒకే మార్గంలో అనుమతులిచ్చే విధంగా కర్ణాటక పరిశ్రమ సౌకర్యాల చట్టం-2020లో సవరణలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బెంగళూరు నగరంలో మళ్లీ దిగ్బంధం విధించే అంశాన్ని రెవెన్యూశాఖ మంత్రి తోసిపుచ్చారు. రాష్ట్రంలో నిన్న 397 కొత్త కేసులు నమోదవగా, 149మంది ఆస్పత్రులనుంచి ఇళ్లకు వెళ్లారు. మరోవైపు 14 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య: 10118, యాక్టివ్ కేసులు: 3799, మరణాలు: 164, డిశ్చార్జి: 6151గా ఉన్నాయి.
రాష్ట్ర హైకోర్టుతోపాటు విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులలో అన్నిరకాల విచారణలను జూన్ 28వరకు నిలిపివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గంలో కేసులు పెరగడంపై కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం ఇవాళ్టినుంచి జిల్లావ్యాప్తంగా దిగ్బంధం విధించింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో జ్వరాలపై సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 19,085 నమూనాలను పరీక్షించగా, 553 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 118మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 10,884, యాక్టివ్ కేసులు: 5760, డిశ్చార్జ్: 4988, మరణాలు: 136గా ఉన్నాయి.
దేశంలో కోవిడ్-19 మందు ‘రెమ్‌డెసివిర్’ తయారీ, విక్రయాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెటెరో తొలివిడతగా 20,000 ఇంజెక్షన్ వయల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, తెలగాణలో మొత్తం కేసుల సంఖ్య 10,444కు చేరగా, వీటిలో 5,858 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలోని గువహటి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోగల 31 వార్డులలో ప్రతి చోటా ఒకటి వంతున 31 కోవిడ్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో పౌరులు స్వచ్ఛందంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు.
పౌరులు మాస్కు ధరించకపోతే జరిమానా విధిస్తామని దిమాపూర్ జిల్లా పాలన యంత్రాంగం ప్రకటించింది. నాగాలాండ్‌లో వస్తుసేవల పన్ను చట్టం కింద లాభాపేక్ష నిరోధక తనికీ కమిటీ ఏర్పాటైంది.
రాష్ట్రానికి ఎరువుల కొరత ఉండబోదని, రైతులు ఆందోళన పడవద్దని మణిపూర్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కాగా, కోవిడ్-19 రోగులకు డయాలసిస్ కోసం సంబంధిత యూనిట్లు తెరవాలని స్టేట్ మిషన్ డైరెక్టర్ మార్గదర్శకాలు జారీచేశారు. ఈ మేరకు 5 జిల్లా ఆసుపత్రులకుగాను ఈ సదుపాయంగల చురాచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రికి మాత్రమే అనుమతి లభించింది.
రాష్ట్రంలో మరో ముగ్గురు రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం 118 యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు.



*********
(Release ID: 1634372)