రైల్వే మంత్రిత్వ శాఖ

ఈనెల 24వ తేదీ వరకు 1.91 లక్షల పీపీఈ గౌన్లు, 66.4 వేల లీటర్ల శానిటైజర్‌, 7.33 లక్షల మాస్కులు తయారు చేసిన రైల్వేలు


జూన్‌, జులై నెలల్లో నెలకు 1.5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేయాలని లక్ష్యం

22 లక్షల పీపీఈ కిట్లు, 22.5 లక్షల ఎన్‌95 మాస్కులు, 500 ఎం.ఎల్‌. చొప్పున 2.25 లక్షల శానిటైటర్ల తయారీకి ఆర్డర్‌

Posted On: 25 JUN 2020 5:35PM by PIB Hyderabad

 

        కరోనా నుంచి తన ఆరోగ్య సిబ్బంది, ఉద్యోగుల రక్షణ కోసం.. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రైల్వే శాఖ చురుగ్గా అడుగులు వేస్తోంది. భద్రత కల్పించడం లేదా పెంచడానికి అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది.

 

        రైల్వే వర్క్‌షాపుల్లో పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, కోట్లు తయారు చేస్తున్నారు. ఈనెల 24వ తేదీ వరకు 1.91 లక్షల పీపీఈ గౌన్లు, 66.4 వేల లీటర్ల శానిటైజర్‌, 7.33 లక్షల మాస్కులు రూపొందించారు. జూన్‌, జులై నెలల్లో నెలకు 1.5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, దీనిని పెంచే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో, ముడిపదార్థాలు, తయారైన వస్తువుల సేకరణ, పంపిణీ అత్యంత కష్టసాధ్యమైంది. నాణ్యమైన పీపీఈ కిట్ల తయారీకి ముడిపదార్థాలను సేకరించే బాధ్యతను తూర్పు రైల్వేకు అప్పగించారు. తయారైన పీపీఈ కిట్లు అన్ని నాణ్యత ప్రమాణాలను అందుకున్నాయి.

 

        కొవిడ్‌పై పోరాటంలో సంసిద్ధతను మరింత పెంచేందుకు, 22 లక్షల పీపీఈ కిట్లు, 22.5 లక్షల ఎన్‌95 మాస్కులు, 500 ఎం.ఎల్‌. చొప్పున 2.25 లక్షల శానిటైటర్ల తయారీకి రైల్వే శాఖ ఆర్డర్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'హెచ్‌ఎల్ఎల్‌'కు ఈ ఆర్డర్‌ ఇచ్చింది. 50 రైల్వే ఆస్పత్రులను, కొవిడ్‌ డెడికేటెడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ డెడికేటెడ్‌ ఆరోగ్య కేంద్రాలుగా మార్చింది. కొవిడ్‌ చికిత్సకు కావల్సిన మొత్తం వైద్య సామగ్రిని సమకూర్చి ఈ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచింది. కొవిడ్‌ రోగులను ఉంచేందుకు 5,231 రైల్వే బోగీలను ఐసోలేషన్‌ బోగీలుగా మార్చింది. 960 బోగీలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. ఈ బోగీల్లో రోగులు, అనుమానితులకు అందించాల్సిన చికిత్సపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.  

 

        రైల్వేల ద్వారా జరిగే రవాణాపై కొవిడ్‌ ప్రభావం పడిందిగానీ.., రైల్వేల కార్యకలాపాలు, నిర్వహణను ఇబ్బంది పెట్టలేకపోయింది. కార్యకలాపాలు తక్కువగా ఉండటం, నిల్వ కేంద్రాల్లో సరకు అందుబాటులో ఉండటమే దీనికి కారణం. బయటి వ్యాపారస్తులకు కూడా రైల్వేలో రవాణా సదుపాయం కల్పించారు. ఈ దిశగా క్షేత్రస్థాయి యూనిట్లకు కూడా ఆదేశాలు వెళ్లాయి.

 

******


(Release ID: 1634362) Visitor Counter : 267