ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్ 26 శుక్రవారం రోజున "ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్ గార్ అభియాన్" ను ప్రారంభించనున్న - ప్రధానమంత్రి

Posted On: 25 JUN 2020 2:49PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి సాధారణంగా శ్రామిక శక్తిపై, మరీ ముఖ్యంగా వలస కార్మికులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది.  పెద్ద సంఖ్యలో వలస కార్మికులు అనేక రాష్ట్రాలకు తిరిగి వచ్చారు.  కోవిడ్ -19 ని కట్టడి చేయాలనే సవాలు, వలసదారులకు మరియు గ్రామీణ కార్మికులకు ప్రాథమిక సౌకర్యాలు మరియు జీవనోపాధిని అందించాల్సిన అవసరంతో మరింత జఠిలమయ్యింది.  వివిధ రంగాలను ఉత్తేజపరిచేందుకు భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది.  దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఉపాధి కల్పించడానికి గరిబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన 2020 జూన్ 20 వ తేదీన ప్రారంభించబడింది.

ఉత్తర ప్రదేశ్‌ లో దాదాపు 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి వచ్చారు.  ఉత్తరప్రదేశ్ ‌లోని 31 జిల్లాల్లో 25 వేల మందికి పైగా తిరిగి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు.  వీటిలో 5 ఆకాంక్ష జిల్లాలు ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం "ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్" అనే ఒక ప్రత్యేకమైనకార్యక్రమాన్ని చేపట్టింది. ఇది పరిశ్రమలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని సృష్టించేటప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతుంది. ఉపాధి కల్పించడం, స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించడానికి పారిశ్రామిక సంఘాలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని సృష్టించడంపై ఈ అభియాన్ తీవ్రంగా దృష్టి సారించింది.

ప్రధానమంత్రి ఈ అభియాన్ ‌ను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో 2020 జూన్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.  ఉత్తర ప్రదేశ్ కు చెందిన సంబంధిత మంత్రిత్వ శాఖల మంత్రులు కూడా ఆన్ లైన్ లో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆరు జిల్లాలకు చెందిన  గ్రామస్తులతో కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా సంభాషించనున్నారు.  కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ, కామన్ సర్వీస్ సెంటర్లు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

******



(Release ID: 1634290) Visitor Counter : 303