ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియన్ రెడ్ క్రాస్ వారి ఈ-బ్లడ్ సర్వీస్ మొబైల్ యాప్ ఆవిష్కరించిన డాక్టర్ హర్షవర్ధన్


కోవిడ్ సంక్షోభంలో లక్షకు పైగా యూనిట్లు సేకరించిన రెడ్ క్రాస్ కు అభినందనలు

ప్రాణరక్షణలో కీలకంగా మారిన ప్రధాని డిజిటల్ ఇండియా పథకానికి మంత్రి ప్రశంస


Posted On: 25 JUN 2020 3:36PM by PIB Hyderabad

ఇండియన్ రెడ్ కార్స్ సొసైటీ రూపొందించిన ఈ-బ్లడ్ సర్వీసెస్ మొబైల్ యాప్ ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మంత్రి హోదాలో ఆయనే చైర్మన్ గా వ్యవహరిస్తారు.

 

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2015 లో ఆవిషక్రించిన డిజిటల్ ఇండియా పథకం కింద ఏర్పాటైన సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సి-డాక్) సంస్థకు చెందిన ఈ-రక్తోష్ బృందం ఈ యాప్ ను రూపొందించింది. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే ప్రధాని మానస పుత్రికగా పుట్టిన డిజిటల్ ఇండియా ఇప్పుడు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైందని మంత్రి అభివర్ణించారు. రక్త సేవలు వాడుకోవటానికి రక్త దాన యాప్ ఎలా అందుబాటులోకి వచ్చిందో గమనిస్తే డిజిటల్ ఇండియా ఫలితం అర్థమవుతుందన్నారు. వైద్య సంబంధ మైన అవసరాల రీత్యా చాలామందికి రక్తానికి సంబంధించిన సేవలు చాలా కుటుంబాలకు అనివార్యమవుతాయని గుర్తు చేశారు. ఈ యాప్ ద్వారా ఒక్కో విడత నాలుగు యూనిట్ల రక్తం కోరవచ్చునని, ఆ వ్యక్తి వచ్చి రక్తం తీసుకువెళ్ళటానికి బ్లడ్ బాంక్ 12 గంటల వరకు వేచి చూస్తుందని చెప్పారు. దీనివలన రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందుతుందని చెప్పారు. దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న సంక్షోభ సమయంలో ఇలాంటి యాప్ ద్వారా రక్తం అవసరమున్నవాళ్లకు సాయపడటం హర్షించదగిన విషయమన్నారు.

 

రక్తం కావాలని యాప్ లో నమోదు చేసిన వెంటనే ెడ్ క్రాస్ వారికి ఈ-రక్తోష్ డాష్ బోర్డ్ లో కనబడుతుంది. దీంతో నిర్దిష్ట సమయంలోగా రక్తాన్ని అందుబాటులోకి తీసుకురావటం సాధ్యమవుతుంది. దీనివలన రక్తం కావాల్సిన వారు పారదర్శక విధానంలో రక్తం పొందటానికి ఒక సింగిల్ విండో విధానం అమలు చేసినట్టవుతుంది.

 

ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో స్వచ్ఛందంగా రక్తం ఇచ్చిన దాతలను డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా అభినందించారు. అలాంటి వారందరికీ ఒక వేదిక కల్పించటంలోను, వారికి రవాణా సౌకర్యం కల్పించటం, చాలా చోట్లకు మొబైల్ వాహనాలను పంపించి అక్కడి కక్కడే సేకరించే ఏర్పాట్లు చేయటం రెడ్ క్రాస్ ఘనతేనన్నారు.

 

ప్రజలు స్వచ్ఛంద రక్త దాతలుగా మారాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 65ఏళ్ల లోపు వాళ్లు ఏడాదికి నాలుగుసార్లు దాకా రక్త దానం చేయవచ్చునన్నారు. " క్రమం తప్పకుందా రక్త దానం చేయటం వలన ఊబకాయం, గుండెజబ్బులలాంటివి నిరోధించవచ్చు. ఆధ్యాత్మికంగా ఆలోచించినా, మానవాళిని కాపాడటానికి తనవంతు సేవ చేసిన తృప్తి మిగులుతుంది" అన్నారు.

 

ఈ యాప్ ను అవిష్కరించిన అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహక మండలి సమావేశానికి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత వహించారు. సొసైటీ కృషిని అభినందిస్తూ, కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి తోడుగా కీలకపాత్ర పోషించిందన్నారు. తగినంత సురక్షిత రక్తాన్ని అందుబాటులొ ఉంచుతూ, అందుకోసం రక్తదాతలకు పాస్ లు జారీ చేయటం, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న1100 రెడ్ క్రాస్ సొసైటీ శాఖలు దాదాపు లక్ష యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించగలిగాయని, అందులో 2000 యూనిట్లు సొంత సిబ్బంది నుంచే కావటం కూడా గమనార్హమని అన్నారు. ఈ బ్లడ్ బాంకులలో స్వచ్ఛంద రక్తదాతలుగా నమోదు చేసుకున్న 38,000 మంది దాతలుండటాన్ని కూడా అభినందించారు.

 

55 రక్త దాన శిబిరాల ద్వారా 2896 యూనిట్ల రక్తం సేకరించిన ఎన్ హెచ్ క్యూ బ్లడ్ బాంకు గురించి చెప్పారు. లాక్ డౌన్ సమయంలో 5221 యూనిట్లు సేకరించటాన్ని ప్రస్తావించారు. మొత్తం 7113 మంది రోగులకు రక్తం అందించగా వారిలో 2923 మంది తలసీమియా బాధితులు. ఢిల్లీలోని ఎయిమ్స్  వైద్య సంస్థకు 378 యూనిట్లు. లేదీ హార్డింగ్ కు 624 యూనిట్లు అందించారు.

 

రెడ్ క్రాస్ సంస్థ మూడు కోట్లకు పైగా భోజనాలతోబాటు 11 లక్షలకు పైగా కుటుంబాలకు రేషన్ పంపిణీ చేసింది.



(Release ID: 1634355) Visitor Counter : 323