PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
24 JUN 2020 6:27PM by PIB Hyderabad
(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: ప్రపంచంలో ప్రతి లక్ష జనాభాకు మరణాలు అత్యల్పంగాగల దేశాల్లో భారత్ ఒకటి
దేశంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష సదుపాయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు గడచిన 24 గంటల వ్యవధిలో పరీక్షించిన నమూనాల సంఖ్య రోజుకు 2 లక్షల స్థాయిని అధిగమించి 2,15,195కు చేరింది. వీటిలో 1,71,587 నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలల్లోనూ, 43,608 నమూనాలను ప్రైవేటు ప్రయోగశాలల్లోనూ పరీక్షించారు. దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా పరీక్షించిన 73,52,911గా నమోదైంది. రోగ నిర్ధారణ ప్రయోగశాలల సదుపాయం కూడా విస్తరిస్తూ నేడు 1,000కి చేరగా, ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 730, ప్రైవేటు రంగంలో 270కి చేరాయి.
దేశంలో కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 10,495 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,58,684కు పెరిగి, కోలుకునేవారి శాతం 56.71కి చేరింది. ప్రస్తుతం 1,83,022 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634025
వివిధ రంగాలలో మౌలిక సదుపాయాల వృద్ధికి కేంద్ర మంత్రిమండలి చారిత్రక నిర్ణయాలు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి 2020 జూన్ 24న సమావేశమైన సందర్భంగా పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత ప్రపంచ మహమ్మారి పరిస్థితుల నడుమ కీలక రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిర్ణయాలు బహుముఖంగా తోడ్పడతాయి. ఇందులో భాగంగా దేశంలో పశు సంవర్ధ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.15,000 కోట్లతో “పశు సంవర్ధక మౌలిక వసతుల నిధి” ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. అలాగే కుషీనగర్ విమానాశ్రయాన్ని “అంతర్జాతీయ విమానాశ్రయం”గా ప్రకటించింది. మయన్మార్‌లో ష్వే ఆయిల్-గ్యాస్ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయడం కోసం ఓవీఎల్ ద్వారా అదనపు పెట్టుబడులకు అంగీకరించింది.
మరిన్ని వివరాలకు https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634089
పశుసంవర్ధక మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
దేశంలోని వివిధ రంగాల్లో వృద్ధికి భరోసా ఇచ్చేవిధంగా ఇటీవల ప్రకటించిన స్వయం సమృద్ధ భారతం ఉద్దీపన కార్యక్రమంలో భాగంగా రూ.15,000 కోట్లతో “పశు సంవర్ధక మౌలిక వసతుల అభివృద్ధి నిధి” (AHIDF) ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. కాగా, అర్హతగల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీరాయితీ ఇవ్వనుంది. అలాగే రుణంలో అసలు చెల్లింపుపై రెండేళ్ల తాత్కాలిక వాయిదా, అనంతరం ఆరేళ్ల గడువు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634098
ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ‘శిశు’ రుణాల సకాల చెల్లింపుపై 12 నెలలపాటు 2 శాతం వడ్డీ రాయితీకి ఆమోదం
ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) కింద అర్హులైన ‘శిశు’ రుణ గ్రహీతల సకాల రుణ చెల్లింపుపై 12 నెలలపాటు 2 శాతం వడ్డీ రాయితీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం కింద ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన చర్యల్లో భాగంగా ఈ పథకం అమలు చేయబడుతుంది. అనూహ్య పరిస్థితులపై నిర్దిష్ట ప్రతిస్పందనలో కింద రుణ వ్యయాన్ని తగ్గించడంద్వారా అట్టడుగునగల రుణగ్రహీతలపై ఆర్థిక ఒత్తిడిని తొలగించేందుకు ఉద్దేశించి రూపొందించిన పథకమిది. ఈ రంగానికి ఎంతో అవసరమైన ఊరట కల్పించగలదని, తద్వారా చిన్న వ్యాపారాలు నిధుల్లేక ఉద్యోగులను తొలగించకుండా పనిచేయడం సాధ్యంకాగలదని అంచనా. ప్రస్తుత సంక్షోభ సమయంలో చిన్న వ్యాపారాలు కొనసాగేలా మద్దతిచ్చే ఈ పథకం భవిష్యత్ ఉపాధి అవకాశాల సృష్టి దిశగా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడంతోపాటు పునరుజ్జీవనానికి అండగా నిలవగలదని అంచనా.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634037
ఒత్తిడిలోగల ఎంఎంస్‌ఎంఈ రంగానికి ఆర్థిక తోడ్పాటుకోసం సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా పథకం
కేంద్ర సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఇవాళ “అనుబంధ అప్పులకు రుణహామీ పథకం” ప్రారంభించారు. దీన్ని “డిస్ట్రెస్డ్ అసెట్స్ ఫండ్-సబార్డినేట్ డెట్ ఫర్ ఎంఎంస్‌ఎంఈ”గానూ వ్యవహరిస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే ఒత్తిడిలోగల ఎంఎస్‌ఎంఈల వ్యవస్థాపకులు వాటా మూలధనం కింద అదనపు పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి రుణం పొందడానికి ప్రభుత్వం రూ.20,000 కోట్ల హామీ సమకూరుస్తుంది. ఈ పథకంద్వారా సుమారు 2 లక్షల ఎంఎస్‌ఎంఈలకు ఎంతో అవసరమైన ఆర్థిక మద్దతు లభిస్తుందని అంచనా. దీంతోపాటు ఆయా పరిశ్రమలుసహా మొత్తంగా ఈ రంగంలో ఆర్థిక కార్యకలాపాల పునరుజ్జీవనం సాధ్యం కాగలదని భావిస్తున్నారు. తద్వారా తమపై ఆధారపడిన లక్షలాది ప్రజల ఉద్యోగ, జీవనోపాధికి రక్షణ లభిస్తుందని భావిస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ఎంఎస్‌ఎంఈల వ్యవస్థాపకులు ఏ షెడ్యూల్డ్/వాణిజ్య బ్యాంకునైనా సంప్రదించి లబ్ధిపొందవచ్చు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634059
జాతీయ రాజధానిలో కోవిడ్-19 రోగుల కోసం వచ్చేవారం 250 ఐసీయూసహా 20,000 అదనపు పడకల అందుబాటు: దేశీయాంగ మంత్రి శ్రీ అమిత్ షా
“ఢిల్లీలోని ‘రాధాస్వామి బియాస్’లో 10,000 పడకల కోవిడ్ సంరక్షణ కేంద్రం జూన్ 26నాటికి ప్రారంభమవుతుంది. ఈ మేరకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారానికల్లా ఇక్కడ చికిత్స మొదలవుతుంది” అని దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిన్న సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఛత్తర్‌పూర్‌లోని రాధాస్వామి సత్సంగ్ బియాస్ ప్రాంగణంలో ఈ కోవిడ్ సంరక్షణ కేంద్రం సందర్శనకు రావాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ తనకు లేఖ కూడా రాశారని ఆయన తెలిపారు. ఈ కేంద్రంలో విధులు నిర్వర్తించేందుకు ఐటీబీపీ, ఆర్మీకి చెందిన వైద్యులు, నర్సులను నియమించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. కాగా, “రాధాస్వామి సత్సంగ్ బియాస్ ప్రాంగణంలోని ఈ కోవిడ్ సంరక్షణ కేంద్రం ఐటీబీపీ వైద్య సిబ్బందితో పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని మూడు రోజుల కిందటి మా సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.. తదనుగుణంగా దేశీయాంగ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంది” అని శ్రీ అమిత్ షా చెప్పారు. ఇదేకాకుండా 250 ఐసీయూ పడకలుసహా మరో 1,000 పడకల కోవిడ్ ఆస్పత్రి కూడా వచ్చేవారం సిద్ధమవుతుందని వివరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633811
వలస కార్మికులు, ఇతరులకు 125 రోజులపాటు 8 లక్షల పనిదినాల మేరకు రూ.1,800 కోట్ల మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఉపాధి కల్పించనున్న రైల్వేశాఖ
దేశంలోని 6 రాష్ట్రాల పరిధిలోగల 116 జిల్లాల్లో ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పనుల ప్రగతిని కేంద్ర రైల్వేశాఖ సమీక్షించింది. రైల్వే జోన్లు, రైల్వే సంబంధిత ప్రభుత్వరంగ సంస్థలు ఈ సమావేశంలో పాల్గొని పనుల పురోగతిని సమీక్షించాయి. ఈ నేపథ్యంలో సదరు 116 జిల్లాలకు సంబంధించి రాష్ట్రానికి ఒకరు వంతున నోడల్ అధికారులను రైల్వేశాఖ నియమించనుంది. ఈ కార్యక్రమం 125 రోజులపాటు ఉద్యమ తరహాలో సాగనుండగా- బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోని 116 జిల్లాలకు తిరిగివచ్చిన వలస కార్మికులతోపాటు ఇతర కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వీరికోసం 160 మౌలిక సదుపాయాల పనులను గుర్తించి, వేగిరపరచనున్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634075
భారత-రష్యా రక్షణ సహకారంపై రష్యా ఉప ప్రధానితో రక్షణ మంత్రి సమీక్ష
భారత-రష్యా రక్షణ సహకారంపై రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నిన్న మాస్కోలో రష్యా ఉప ప్రధాని గౌరవనీయులైన యూరీ బొరిసోవ్‌తో సమీక్షించారు. భారత్‌తో వాణిజ్య-ఆర్థిక-శాస్త్రవిజ్ఞాన సహకారంపై అంతర ప్రభుత్వ కమిషన్‌కు బొరిసోవ్ సహాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ సమస్యలపై అత్యంత సానుకూల, నిర్మాణాత్మక రీతిలో వారిద్దరి మధ్య చర్చలు సాగాయి. ప్రపంచ మహమ్మారి కష్టకాలంలో సవాళ్ల నడుమ కూడా భారత-రష్యా ద్వైపాక్షిక సంబంధాలు వివిధ స్థాయులలో సజావుగా కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633801
స్పర్థాత్మక సానుకూలతను పెంచుకుంటూ నాణ్యత, సరికొత్త గమ్యాలు, సేవలపై దృష్టి సారించాలి: సేవల ఎగుమతిదారులకు వాణిజ్య-పరిశ్రమల శాఱ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ శ్రీ పీయూష్ గోయల్ నిన్న సేవా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (SPEC) కార్యవర్గ సభ్యులు, సేవారంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాగస్వాములతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేసిన సూచనలను శ్రీ పీయూష్ గోయల్ స్వీకరించారు. భారత సేవారంగానికి ఎంతో సామర్థ్యం ఉందని, అయినప్పటికీ దాన్ని ఇంకా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని ఆయన సూచించారు. సేవారంగంలో సమాచార సాంకేతికత-అనుబంధ విభాగాలు అత్యంత విజయవంతం అయ్యాయని చెప్పారు. అంతేకాకుండా ఆయా రంగాలు పలు సందర్భాల్లో అనేకానేక నియంత్రణలు-నిబంధనలతో కూడిన ప్రభుత్వ తోడ్పాటును అంతగా ఆశించకుండా స్వీయ సామర్థ్యంతో పరిపూర్ణ వికాసం సాధించాయని పేర్కొన్నారు. అదేకోవలో సేవల ఎగుమతిదారులు స్పర్థాత్మక సానుకూలతను పెంచుకుంటూ నాణ్యత, సరికొత్త గమ్యాలు, సేవలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633799
దేశంలోని ప్రముఖ ఆయుష్ నిపుణులతో వాస్తవిక సాదృశ సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగం
సమీకృత వైద్య నిర్వహణ ప్రాముఖ్యాన్ని కోవిడ్ మహమ్మారి మనకు మరోసారి గుర్తుచేసిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత వైద్య నిరోధకత, చికిత్సశాస్త్రాలపరంగా ఈ అంశంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. ఈ మేరకు దేశంలోని ప్రముఖ ఆయుష్ నిపుణులతో నిన్న వాస్తవిక సాదృశ సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. అసాంక్రమిక వ్యాధులు, మధుమేహం వంటివాటి విషయంలోనూ సమీకృత వైద్య విధానం సంపూర్ణ ఫలితాలిచ్చినా దీనికి తగినంత స్పందన, గుర్తింపు లభించడంలేదని చెప్పారు. వ్యక్తి రోగ నిరోధకతనుబట్టి సంక్రమించే కోవిడ్ లాంటి వైరల్ వ్యాధి విషయంలో ప్రధానంగా రోగనిరోధకశక్తి పెంచడానికే ప్రాధాన్యం ఇవ్వాలని నేడు స్పష్టమైందని చెప్పారు. ఆ మేరకు రోగనిరోధకత పెంచుకోవడానికి హోమియో తదితర వైద్య విధానాలను విస్తృతంగా అనుసరించిన నేపథ్యంలో సహజంగానే ప్రత్యామ్నయ వైద్య విధానాలపై ప్రజల్లో ఇప్పుడు ఆసక్తి పెరుగుతున్నదని వివరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633812
న్యూఢిల్లీలోని ఉన్నత విద్యా సంస్థల కోసం వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ‘యుక్తి 2.0’ వేదికను ప్రారంభించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ నిన్న ఉన్నత విద్యా సంస్థల కోసం ‘యుక్తి 2.0’ వేదికను ప్రారంభించారు. ఉన్నత విద్యా సంస్థలలో ఒదిగే అంకుర సంస్థల సంబంధిత వాణిజ్య సామర్థ్యం, సమాచారంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రమపద్ధతిన సమ్మిళతం చేయడంలో తోడ్పడుతుంది. ఈ సందర్భంగా శ్రీ పోఖ్రియాల్ ప్రసంగిస్తూ- ఇంతకుముందు తమ శాఖ రూపొందించిన వినూత్న ‘యుక్తి’ వేదికను రూపొందించిందని ఆయన గుర్తుచేశారు. అయితే, కోవిడ్-19 మహమ్మారి సంబంధిత వివిధ ఆలోచనలను గుర్తించడానికి ఉద్దేశించిన హేతుబద్ధ విస్తరణగా ప్రస్తుత ‘యుక్తి 2.0’ వేదికను ఆయన అభివర్ణించారు. మునుపటి ‘యుక్తి’ ఫలితాలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. భారతదేశాన్ని ‘స్వయం సమృద్ధం’ చేయాలన్న లక్ష్యాన్ని ప్రధానమంత్రి తమకు నిర్దేశించారని, ఆ దిశగా యుక్తి 2.0 వేదిక చాలా ముఖ్యమైన ముందడుగు కాగలదని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633793
ఆపరేషన్ సముద్ర సేతు- మాల్దీవ్స్ నుంచి 198 మంది భారతీయులను స్వదేశం తీసుకొచ్చిన ఐఎన్‌ఎస్ ఐరావత్
‘ఆపరేషన్ సముద్ర సేతు’లో భాగంగా భారత నావికాదళ నౌక ‘ఐఎన్‌ఎస్ ఐరావత్’ 198 మంది భారతీయులతో మాల్దీవ్స్ రాజధాని మాలె నుంచి బయల్దేరి నిన్న ఉదయం తమిళనాడులోని ట్యుటికోరిన్ ఓడరేవుకు చేరింది. దీంతో భారత నావికాదళం మాల్దీవ్స్ నుంచి మొత్తం 2,386 మంది భారత పౌరులను స్వదేశం చేర్చింది. ఈ మేరకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల నడుమ భారత నావికాదళం ఇప్పటిదాకా మాల్దీవ్స్, శ్రీలంక, ఇరాన్‌ల నుంచి మొత్తం 3,305 మందిని స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633860
కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ‘జీపీఆర్‌ఏ’ కేటాయింపుదారులకు ఏకకాల సడలింపు
ప్రభుత్వ గృహ సదుపాయాన్ని వినియోగించుకునేవారు ప్రస్తుత కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో 2020 జూలై 15 వరకు ఆ నివాసాల్లో కొనసాగవచ్చు. ఈ మేరకు గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘ప్రభుత్వ కోటానుంచి వసతికల్పన’ (GPRA) కింద కేటాయింపు పొందినవారికి అదనపు వ్యవధి ఇచ్చింది. కాగా, దీనిపై మునుపటి ఆదేశాల ప్రకారం ఈ గడువు జూన్ ఆఖరుతో ముగియనుండగా, ప్రత్యామ్నాయ వసతి చూసుకోవడంలో ఇబ్బందులను వివరిస్తూ కేటాయింపుదారులు పంపిన వినతుల పరిశీలనను మంత్రిత్వశాఖ పరిగణనలోకి తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వస్తువుల తరలింపునకు కార్మికులు అందుబాటులో ఉండరన్న వాస్తవాన్ని కూడా వారు వివరించారు. దీంతో వారు నివాసాలు ఖాళీ చేసేందుకు జూలై 15 వరకూ గడువు పొడిగిస్తూ ఆ తర్వాత కొనసాగితే జరిమానా/మార్కెట్ ధరల ప్రకారం అద్దె చెల్లించాల్సి ఉంటుందని హెచ్చించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633730
‘సీఎస్‌ఐఆర్-నీరి’లో 3,000కుపైగా కోవిడ్ నమూనాల పరీక్ష
“సీఎస్‌ఐఆర్-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్”(CSIR-NEERI) ఇప్పటిదాకా 3,000కుపైగా కోవిడ్-19 నమూనాలను పరీక్షించింది. ఇక్కడున్న కోవిడ్-19 నమూనాల ప్రయోగశాల 2020 ఏప్రిల్ నుంచి పనిచేస్తుండగా ఇక్కడ రోజుకు 50 నమూనాలను పరీక్షించగల సామర్థ్యం అందుబాటులో ఉంది. ఈ మేరకు తగిన మౌలిక సదుపాయాలన్నీ ఉండటంతోపాటు పరీక్షలకు ముందు జీవభద్రతపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. కాగా, నాగ్‌పూర్‌సహా విదర్భ పరిసర ప్రాంతాలకు చెందిన నమూనాలను ఇక్కడ పరీక్షిస్తున్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633877
కోవిడ్-19పై దృష్టితో అంటువ్యాధుల పరమాణు నిర్ధారణలో స్వల్పకాలిక కోర్సుకు జేఎన్‌సీఏఎస్‌ఆర్
కోవిడ్-19 మహమ్మారిపై జాతి పోరాటం కోసం తగు సామర్థ్య నిర్మాణం లక్ష్యంగా కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తిగల పరిశోధన సంస్థ జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధన కేంద్రం (JNCASR) జక్కూరులోని తమ ప్రాంగణంలో ఒక అత్యాధునిక కోవిడ్ వ్యాధి నిర్ధారణ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. కోవిడ్-19సహా అంటువ్యాధుల నిర్ధారణ-జాడ అన్వేషణలో ‘రియల్ టైమ్ పీసీఆర్ (RT-PCR)వంటి పరమాణు సంబంధ వ్యాధి నిర్ధారణ పద్ధతులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో దేశానికిగల కీలక, అపరిష్కృతమైన అవసరాలను గమనించిన జేఎన్‌సీఏఎస్‌ఆర్- కోవిడ్-19 కోసం ఆర్టీ-పీసీఆర్ సాంకేతిక పరిజ్ఞానంలో సిబ్బందికి శిక్షణ కోసం అత్యాధునిక రోగనిర్ధారణ శిక్షణ సదుపాయం ఏర్పాటు దిశగా బృహత్తర బాధ్యతను స్వీకరించింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634027
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
రాష్ట్రానికి తిరిగివచ్చే ప్రవాసులకు కోవిడ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం సడలించనుంది. కోవిడ్ పరీక్షలు నిర్వహించలేని దేశాలనుంచి వ్యక్తిగత రక్షణ సామగ్రి ధరించి వచ్చేందుకు అనుమతించనుంది. అలాగే ఈ సామగ్రిని విమానయాన సంస్థలు అందజేయాలని కోరింది. మిగిలిన దేశాలకు సంబంధించి కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ సమర్పణ పద్ధతి అమలుకు గడువు పొడిగించడంపై ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, పిల్లలకు టీకాలు వేసిన ఒక నర్సుకు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో సదరు పిల్లల్లో సుమారు 40 మందిని కొచ్చిలో నిర్బంధవైద్య కేంద్రానికి తరలించారు. ఇక రాష్ట్రానికి వెలుపలి ప్రాంతాల్లో మరో 8 మంది కేరళీయులు వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో నిన్న 141 కొత్త కేసులతోపాటు ఒక మరణం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,620 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
పుదుచ్చేరిలో గడచిన 24 గంటల్లో 59 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 461కి పెరిగింది. కాగా, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే 22 ఏళ్ల యువకుడి మృతితో తిరుప్పూరులో తొలి కోవిడ్ మరణం నమోదైంది. ఇక తమిళనాడులో నిన్న 2,516 కేసులతోపాటు 39 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 64603కు మరణాలు 833కు చేరాయి. చెన్నైలో కొత్త కేసులు 1380 కాగా, ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య: 28428గా ఉంది. ఇప్పటిదాకా డిశ్చార్జ్ అయినవారి సంఖ్య: 35339, చెన్నైలో యాక్టివ్ కేసులు: 18889గా ఉన్నాయి.
రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణ ప్రయత్నంలో భాగంగా ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో జ్వరం క్లినిక్కులు, నమూనాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, రాష్ట్రంలో మళ్లీ దిగ్బంధం విధించడంపై నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎస్‌ఎస్‌ఎల్‌సి (10వ తరగతి) పరీక్షకు సుమారు 8.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకున్నారు. మరోవైపు కేఎస్‌ఆర్టీసీ జూన్ 25 నుంచి దశలవారీగా ఏసీ బస్సులు నడపడం ప్రారంభించనుంది. రాష్ట్రంలో నిన్న 322 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 274 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 9,721, యాక్టివ్ కేసులు: 3,563, మరణాలు: 150గా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో దిగ్బంధం ప్రకటించి, గంటలోగానే సదరు ఆదేశాలను ఉపసంహరించడంతో గందరగోళం నెలకొంది. విజయవాడలో కరోనావైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో జూన్ 26 నుంచి 7 రోజుల దిగ్బంధం విధిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి సదరు ఉత్తర్వులు జారీచేశారు. కాగా, కర్నూలు జిల్లా 1483 కేసులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండగా, 1132 కేసులతో కృష్ణా, 1028 కేసులతో అనంతపురం జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 36,047 నమూనాలను పరీక్షించగా, 497 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 146మంది డిశ్చార్జ్ కాగా, 10 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 497 కేసుల్లో 37 అంతర్రాష్ట్ర కేసులు కాగా, 12 విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించినవి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు: 10,331, యాక్టివ్ కేసులు: 5423, డిశ్చార్జ్: 4779, మరణాలు: 129గా ఉన్నాయి.
పడకల కొరత నేపథ్యంలో కోవిడ్ వ్యాధి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు ఇళ్లలోనే చికిత్స తీసుకోవాలని రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. కాగా, ఇవాళ తెలంగాణలో మునుపెన్నడూ లేనంత అత్యధికంగా ఒక్కరోజే 879 కొత్త కేసులు నమోదవగా, మూడు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 9,553, యాక్టివ్ కేసులు: 5109, మరణాలు: 220, కోలుకున్నవి: 4224, పరీక్షించిన నమూనాలు: 63,249గా ఉన్నాయి.
రాష్ట్రంలో కేసుల పెరుగుదల బుధవారం స్వల్పంగా దిగివచ్చింది. గడచిన 24 గంటల్లో 3,214 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,39,010కి చేరింది. ఇక మంగళవారం 75 మంది మరణించగా మృతులశాతం 4.70కి చేరింది. అనేక వారాల తర్వాత ముంబైలో వెయ్యికన్నా తక్కువగా 824 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 68,481గా ఉంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సార్వత్రిక పరీక్షల నిర్వహణ కార్యక్రమం ప్రారంభించింది, దీనికింద ఐసిఎంఆర్ ఆమోదించిన యాంటిజెన్ టెస్టింగ్ కిట్ల సాయంతో 15 నుంచి 30 నిమిషాల్లో ఫలితాలు తెలుస్తాయి. ఆ మేరకు అనుమానిత రోగుల పరీక్ష ఫలితాలు వేగంగా నిర్ధారించడం కోసం లక్ష యాంటిజెన్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయాలని BMC నిర్ణయించింది. వీటిని అన్ని పౌర, ప్రభుత్వ-ఆసుపత్రులు, కోవిడ్-19 చికిత్స కేంద్రాల్లో వినియోగిస్తారు.
రాష్ట్రంలో మంగళవారం 549 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 28,429కి పెరిగింది. మరోవైపు 26 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,711కు చేరింది. మరోవైపు 604 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 20,521కి పెరిగింది. కొత్త కేసులలో అహ్మదాబాద్ నుంచి గరిష్ఠంగా 230 నమోదయ్యాయి. అలాగే సూరత్‌లో 152, వడోదరలో 38 వంతున కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ్టిదాకా 3.34 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు.
రాష్ట్రంలో ఈ ఉదయం 182 కొత్త కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,809కి చేరగా, మరణాలు 372కు పెరిగాయి. ఇక ఇప్పటిదాకా 12424 మంది కోలుకోగా, ప్రస్తుతం 3013 యాక్టివ్ కేసులున్నాయి. ధోల్పూర్‌లో గరిష్ఠంగా 63 కేసులు నమోదవగా, జైపూర్‌లో 53, భరత్‌పూర్‌లో 23వంతున నమోదయ్యాయి. కాగా- రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరవడంతోపాటు మద్యం అమ్మకాల నేపథ్యంలో రాజస్థాన్ ఎక్సైజ్ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు.
రాష్ట్రంలో 183 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 12,261కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 2401; మరోవైపు 9335 మంది కోలుకోగా ఇప్పటిదాకా 525మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో కళాశాల విద్యార్థులందరినీ పై తరగతులకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, హాట్‌స్పాట్ ఇండోర్‌లో 54 కొత్త కేసుల నమోదుతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 4427కు చేరింది. ఇక భోపాల్‌లో 29, మొరెనా జిల్లాలో 23వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2,556గా ఉంది.
రాష్ట్రంలో మంగళవారం 83 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2,385కు చేరింది. వీటిలో 846 యాక్టివ్ కేసులు కాగా, రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 40 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1527కు చేరింది. కోర్బా జిల్లాలో గరిష్ఠంగా కేసులు నమోదవగా రాయ్‌పూర్, బలొడాబజార్, జంజ్‌గిర్-చంపా జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రంలో మంగళవారం 45 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 909కి చేరింది. వీటిలో 702 యాక్టివ్ కేసులుకాగా మంగళవారం 53మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 205కు చేరింది.
రాష్ట్రంలోని నిర్బంధవైద్య కేంద్రాల్లోగల అందర్నీ జాగ్రత్తగా చూసుకోవాలని చండీగఢ్ కమిషనర్, మునిసిపల్ కార్పొరేషన్, డిప్యూటీ కమిషనర్లను నగర పాలనాధికారి ఆదేశించారు. సరైన పర్యవేక్షణతో సరైన ఆహారం, నీరు, శుభ్రమైన మరుగుదొడ్లు తదితర ప్రాథమిక సౌకర్యాలుండేలా చూడాలన్నారు.
రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా పంజాబ్ ప్రభుత్వం కఠిన నియంత్రణ వ్యూహాన్ని అమలు చేసింది. ఈ మేరకు 8 జిల్లాల్లో 19 నియంత్రణ జోన్లను ప్రకటించి, 25000 జనాభాపై పరిశీలన ఏర్పాటు చేసింది. నిర్దేశిత ప్రాంతంలో నమోదయ్యే మొత్తం కేసుల సంఖ్య ఆధారంగా నియంత్రణ, సూక్ష్మ నియంత్రణ జోన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. తద్వారా అధిక ముప్పుగల సంపర్క జాడ అన్వేషణసహా తనిఖీ, పరీక్ష, జాడ తీయడం, కౌన్సెలింగ్ ఇవ్వడం కార్యకలాపాల నిర్వహణకు మానవశక్తిని సవ్యంగా వినియోగించే ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించింది.
రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు హర్యానా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ దిశగా మరో ముందడుగు వేయడంలో భాగంగా రాష్ట్రంలోని 22 జిల్లా సివిల్ ఆస్పత్రులలో 110 మంది సాంకేతిక శిక్షణార్థి ఫార్మసిస్టుల నియామకానికి పాలనపరమైన అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఫార్మసీ అప్రెంటిస్ చట్టం-1961 కింద నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంద్వారా ప్రతి జిల్లా ఆసుపత్రికి ఐదుగురు టెక్నికల్ అప్రెంటిస్‌లను నియమిస్తారు.
రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలందరికీ జూన్, జూలై నెలలకుగాను నెలకు రూ.2,000 వంతున ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశం ప్రసంగిస్తూ- కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతిలో పడవేసి, వైద్యసమాజాన్ని నిశ్చేష్టులను చేసిందని ఆయన అన్నారు. ఈ మహమ్మారిపై హిమాచల్ ప్రదేశ్ సమర్థవంగా పోరాడిందని, వైరస్ నియంత్రణలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించార. ఐఎల్‌ఐ లక్షణాలున్న వ్యక్తులను గుర్తింపులో సహాయపడటమేగాక నిర్బంధవైద్య కేంద్రాల నిబంధనలు కచ్చితంగా పాటించేలా ప్రజలను చైతన్యం చేయడంలోనూ కర్తవ్యం నిర్వర్తించారని పేర్కొన్నారు.
******
(Release ID: 1634176)
Visitor Counter : 361
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam