ప్రధాన మంత్రి కార్యాలయం

వివిధ రంగాలలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మంత్రి మండలి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు




15,000 కోట్ల రూపాయలతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు.





కుషినగర్ విమానాశ్రయం 'అంతర్జాతీయ విమానాశ్రయం' గా ప్రకటన - ఇది పర్యాటక రంగాన్ని పెంపొందిస్తుంది, ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి ప్రేరణనిస్తుంది.





మయన్మార్ లోని ష్వే ఆయిల్ & గ్యాస్ ప్రాజెక్ట్ అభివృద్ధికి అదనపు పెట్టుబడి ఆమోదించబడింది - పొరుగువారితో ఇంధన సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది.

Posted On: 24 JUN 2020 4:00PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి 2020 జూన్ 24వ తేదీన సమావేశమై పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది, ఇవి కోవిడ్ మహమ్మారి సమయంలో కీలకమైన రంగాలలోని మౌలిక సదుపాయాలకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

 

1. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు :

 

నేపధ్యం :

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీ యొక్క ప్రోత్సాహంతో, కేంద్ర మంత్రి మండలి ఈ రోజు 15,000 కోట్ల రూపాయలతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎ.హెచ్.ఐ.డి.ఎఫ్) ఏర్పాటును ఆమోదించింది. 

పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సహకార రంగం నుండి పెట్టుబడులను ప్రోత్సహించడానికి 10,000 కోట్ల రూపాయలతో పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (డి.ఐ.డి.ఎఫ్) ను ప్రభుత్వం గతంలో ఆమోదించింది.  అదేవిధంగా, పశుసంవర్ధక రంగంలో ప్రాసెసింగ్ మరియు విలువను పెంచే మౌలిక సదుపాయాలలో పాల్గొనడానికి ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లతో పాటు ప్రైవేట్ సంస్థలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

పాడి పరిశ్రమ, మాంసం ప్రాసెసింగ్ మరియు పశుగ్రాసం ప్లాంట్లలో మౌలిక సదుపాయాల పెట్టుబడులను ఈ రోజు ఆమోదం పొందిన ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ప్రోత్సహిస్తుంది.  వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలు (ఎఫ్.‌పి.ఓ.లు), ఎం.ఎస్.‌ఎం.ఈ. లు, సెక్షన్ 8 కింద నమోదైన కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు మరియు వ్యక్తిగత పారిశ్రామికవేత్తలు ఈ పథకం కింద లబ్ధిపొందానికి అర్హులు. వీరు 10 శాతం మార్జిన్ మనీ మాత్రమే కట్టవలసి ఉంటుంది.  మిగిలిన 90 శాతం నిధులు షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు.

ఆశాజనక జిల్లాల నుండి అర్హత కలిగిన లబ్ధిదారులకు 4 శాతం మరియు ఇతర జిల్లాల నుండి లబ్ధిదారులకు 3 శాతం చొప్పున వడ్డీ ఉపసంహరణను భారత ప్రభుత్వం అందిస్తుంది.  రుణాన్ని తిరిగి చెల్లించడానికి ముందుగా 2 సంవత్సరాలు తాత్కాలిక నిషేధం ఉంటుంది, ఆతర్వాత 6 సంవత్సరాలలో మొత్తం ఋణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది.  భారత ప్రభుత్వం ఏర్పాటుచేసే 750 కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌ను నాబార్డ్ నిర్వహిస్తుంది. ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ల కోసం నిర్వచించిన సీలింగు పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు ఈ నిధి క్రెడిట్ హామీని అందిస్తుంది.  రుణగ్రహీత యొక్క క్రెడిట్ సదుపాయంలో 25 శాతం వరకు హామీ కవరేజ్ ఉంటుంది.

 

ప్రయోజనాలు  :

పశుసంవర్ధక రంగంలో ప్రైవేటు రంగ పెట్టుబడుల ద్వారా పరిస్థితిని మెరుగు పరచడానికి అవకాశాలు భారీగా  ఉన్నాయి.  ప్రైవేట్ పెట్టుబడిదారులకు వడ్డీ ఉపసంహరణ పథకంతో ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ముందస్తు పెట్టుబడులను తీర్చడానికి మూలధన లభ్యతను నిర్ధారిస్తుంది. అదేవిధంగా మొత్తం రాబడిని పెంచడానికి / పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి ఇది సహాయపడుతుంది. అర్హత కలిగిన లబ్ధిదారుల ప్రాసెసింగ్ మరియు విలువను పెంచే మౌలిక సదుపాయాలలో పెట్టే ఇటువంటి పెట్టుబడులు ఎగుమతులను ప్రోత్సహిస్తాయి.

భారతదేశంలో పాడి పరిశ్రమ ఉత్పత్తి యొక్క తుది విలువలో దాదాపు 50 - 60 శాతం తిరిగి రైతుల వైపుకు ప్రవహిస్తున్నందున, ఈ రంగంలో పెరుగుదల రైతు ఆదాయంపై గణనీయమైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.  పాల మార్కెట్ పరిమాణం మరియు పాల అమ్మకాల నుండి రైతులకు లభించే ఆదాయం సహకార మరియు ప్రైవేట్ డెయిరీలచే వ్యవస్థీకృత ఆఫ్ టేక్ అభివృద్ధితో ముడిపడి ఉంది.  ఈ విధంగా, ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ద్వారా 15,000 కోట్ల రూపాయల మేర అందించే పెట్టుబడి, ప్రయివేటు పెట్టుబడుల పరపతిని అనేక రేట్లు పెంచడంతో పాటు, రైతులు కూడా మరింతగా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. తద్వారా లభించే అధిక ఉత్పాదకత రైతుల ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది.  ఈ రోజు ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ను ఆమోదిస్తూ తీసుకున్న చర్య, సుమారు 35 లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష జీవనోపాధి కల్పనకు సహాయపడుతుంది.

2. ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటన :

 

నేపధ్యం :

కుషీనగర్ ఒక ముఖ్యమైన బౌద్ధ తీర్థయాత్రా స్థలం. ఇక్కడ గౌతమ బుద్ధుడు మహాపరినిర్వణాన్ని పొందాడు.  ఇది చాలా పవిత్రమైన బౌద్ధ తీర్థయాత్రగా స్థలంగా పరిగణించబడుతోంది. ఇక్కడకు  ప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ యాత్రీకులు తరలి వస్తారు.  కుషినగర్ సమీప పరిసరాలలోని, శ్రావస్తి (238 కి.మీ), కపిలవస్తు (190 కి.మీ) మరియు లుంబిని (195 కి.మీ) వంటి అనేక ఇతర బౌద్ధ ప్రదేశాలు అనుచరులు మరియు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి.   కుషినగర్ ఇప్పటికే భారతదేశం మరియు నేపాల్ అంతటా విస్తరించి ఉన్న బౌద్ధ సర్క్యూట్ తీర్థయాత్రలకు ప్రధాన కేంద్రంగా ఉంది.  ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ విమానాశ్రయాన్ని, అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

ప్రయోజనాలు  :

ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ విధానాలను అభ్యసిస్తున్న 530 మిలియన్ల మందికి  బౌద్ధ సర్క్యూట్ ఒక ముఖ్యమైన తీర్థయాత్ర.  కుషినగర్ విమానాశ్రయాన్ని 'అంతర్జాతీయ విమానాశ్రయం' గా ప్రకటించినందు వల్ల, వివిధ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం లభిస్తుంది,  వైమానిక ప్రయాణికులకు సరసమైన ధరలతో సేవలను విస్తృతంగా ఎంపిక చేసుకోడానికి అవకాశం కలుగుతుంది, తద్వారా, దేశీయ / అంతర్జాతీయ పర్యాటక రంగంతో పాటు ఈ ప్రాంతం కూడా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంది.

ఏ రోజున చూసినా,  థాయిలాండ్, కంబోడియా, జపాన్, బర్మా తదితర ప్రాంతాల నుండి కనీసం 200 నుండి 300 మంది భక్తులు వచ్చి కుషినగర్ వద్ద తమ ప్రార్థనలు చేస్తూ కనబడతారు.  అయినప్పటికీ, ఈ అంతర్జాతీయ పర్యాటక కేంద్రానికి ఇంతవరకు ప్రత్యక్ష కనెక్టివిటీ లేదు, ఇందుకోసం సందర్శకులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

కుషినగర్ కు ప్రత్యక్ష అంతర్జాతీయ అనుసంధానం కల్పించడం వల్ల,  కుషినగర్ సందర్శించే దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.  ఈ ప్రాంతం ఆర్ధికంగా  అభివృద్ధి చెందుతుంది.  దేశంలో ఇప్పటికే పెరుగుతున్న పర్యాటక మరియు ఆతిథ్య పర్యావరణ వ్యవస్థను ఈ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

 

3. మయన్మార్ లో ష్వే ఆయిల్ & గ్యాస్ ప్రాజెక్ట్ యొక్క మరింత అభివృద్ధికి ఓ.వి.ఎల్. అదనపు పెట్టుబడికి ఆమోదం  :

 

నేపధ్యం :

దక్షిణ కొరియా, భారతదేశం మరియు మయన్మార్ సంస్థల కన్సార్టియంలో భాగంగా ఒ.ఎన్.‌జి.సి. విదేశ్ (ఓ.వి.ఎల్) 2002 నుండి మయన్మార్ ‌లో ష్వే గ్యాస్ ప్రాజెక్టు అన్వేషణ మరియు అభివృద్ధితో సంబంధం కలిగి ఉంది.  భారత ప్రభుత్వ రంగ సంస్థ, గెయిల్ కూడా ఈ ప్రాజెక్టులో సహ పెట్టుబడిదారుగా వ్యవహరిస్తోంది.  ఈ ప్రాజెక్టులో 2019 మార్చి 31వ తేదీ వరకు ఓ.వి.ఎల్. 722 మిలియన్ల అమెరికా డాలర్ల మేర (సగటు వార్షిక మారకపు రేటు ప్రకారం సుమారు 3949 కోట్ల రూపాయలు)  పెట్టుబడి పెట్టింది.  ష్వే ప్రాజెక్ట్ నుండి మొదటి గ్యాస్ ఉత్పత్తి జూలై 2013 లో ప్రారంభం కాగా, డిసెంబర్ 2014 లో గరిష్ట ఉత్పత్తి స్థాయి కి  చేరుకుంది.  ఈ ప్రాజెక్ట్ 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి సానుకూల నగదు రాబడిని ప్రారంభించింది.  మయన్మార్‌ లో ష్వే ఆయిల్ & గ్యాస్ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయడానికి ఒ.ఎన్.‌జి.సి. విదేశ్ లిమిటెడ్ (ఓ.వి.ఎల్) ద్వారా 121.27 మిలియన్ అమెరికా డాలర్లు ( ఒక అమెరికా డాలరు 75 రూపాయల చొప్పున సుమారు 909 కోట్ల రూపాయలు) అదనపు పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది.

 

ప్రయోజనాలు  :

పొరుగు దేశాలలో చమురు మరియు గ్యాస్ అన్వేషణ మరియు అభివృద్ధి ప్రాజెక్టులలో భారత ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం భారతదేశం యొక్క "యాక్ట్ ఈస్ట్ పాలసీ" తో అనుసంధానించబడి ఉంది.  భారతదేశ ఇంధన భద్రతా అవసరాలను మరింత బలోపేతం చేయడంతో పాటు,   పొరుగువారితో ఇంధన సంబంధాలను పెంపొందించుకోవాలనే వ్యూహంలో ఇది ఒక భాగం.

 

 

*******



(Release ID: 1634089) Visitor Counter : 338