PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 19 JUN 2020 6:31PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 10,386; 2 లక్షలు దాటిన కోలుకునేవారి సంఖ్య; కోలుకునేవారి శాతం 53.8కి పెరుగుదల.
 • ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో కోవిడ్‌-19 నియంత్రణపై ఉమ్మడి వ్యూహానికి ప్రాధాన్యం ఇవ్వాలని దేశీయాంగ శాఖ మంత్రి స్పష్టీకరణ
 • రైళ్లలో 5,231 మామూలు బోగీలను ఏకాంత చికిత్స పెట్టెలుగా మార్చిన రైల్వేశాఖ, ఏసీ బోగీలవల్ల వ్యాధి వ్యాపించే ముప్పు ఉండటమే ఇందుకు కారణం.
 • దేశంలో సమృద్ధిగా ఆహారధాన్యాల నిల్వలు; ప్రస్తుత కష్టకాలంలో ఏ ఒక్కరూ ఆకలి బాధకు లోనయ్యే పరిస్థితే ఉండదు: రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ భరోసా.
 • కోవిడ్‌-19 నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర సంబంధాన్వేషణ, ప్రత్యక్ష/ఫోన్‌ ఆధారిత ఇంటింటి సర్వే వ్యూహం అనుసరణను పరిశీలించాలని ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: భారత్‌లో 2 లక్షలు దాటిన వ్యాధి నయమైన వారి సంఖ్య; కోలుకునేవారి శాతం మెరుగుపడి 53.79కి చేరిక

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి 10,386 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,04,710కి చేరి, కోలుకునేవారి శాతం 53.79కి పెరిగింది. ప్రస్తుతం 1,63,248 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

రోజువారీ గణాంకాలలో ప్రస్తుతం కోలుకునే ధోరణి పెరుగుతోంది. అలాగే యాక్టివ్‌, కోలుకునే

కేసుల మధ్య వ్యత్యాసం కూడా భారీగా పెరుగుతోంది. నిర్ధారిత/కోలుకునే కేసుల మధ్య పెరుగుతున్న ఈ అంతరం భారతదేశం అనుసరిస్తున్న సకాల కోవిడ్‌-19 నిర్వహణకు అద్దం పడుతోంది.

http://164.100.117.97/WriteReadData/userfiles/image/image001TJU2.jpg

ఇక రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వ రంగంలో 703, ప్రైవేటు రంగంలో 257 (మొత్తం 960) ప్రయోగశాలలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632750

కర్ణాటకలో ఐటీ ఆధారిత సంపర్క జాడ అన్వేషణ-ఇంటింటి సర్వే నమూనాపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస

కోవిడ్‌-19 నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ విధానంలో భాగంగా కోవిడ్‌-19 సోకినవారికిగల సంబంధాల అన్వేషణ, ప్రత్యక్ష, ఫోన్‌ ఆధారిత ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఇప్పటికే 1.5 కోట్లకుపైగా కుటుంబాలపై అధ్యయనం పూర్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ‘సంపూర్ణ విధానం’ కింద ఈ రెండు వినూత్న పద్ధతులను రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలు, చర్యల మద్దతుతో వివిధ రంగాల్లోని సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యాయి. ఈ సాంకేతికత తోడ్పాటుతో ప్రతి రోగికీ సంబంధం ఉన్నవారిని సకాలంలో పసిగట్టడం, ఇంటింటి సర్వేద్వారా ప్రతి కేసునూ సమర్థంగా గుర్తించడం వీలవుతోంది. తద్వారా మహమ్మారి వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోవడం సాధ్యమవుతోంది. కోవిడ్‌-19 నియంత్రణ కోసం ఈ ఉత్తమ పద్ధతులను మిగిలిన రాష్ట్రాలు కూడా స్థానిక పరిస్థితులకు తగినట్లు అనుసరిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632756

ఆరోగ్య సర్వేల నుంచి రోగ నిర్ధారణసహా ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స రుసుంపై గరిష్ఠ పరిమితి; దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ఆదేశాల మేరకు ఢిల్లీలో కోవిడ్‌-19 నిర్వహణ చర్యల క్రమబద్ధీకరణ

ఢిల్లీలో కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ ప్రజలకు ఉపశమనం కల్పించడంపై మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచనమేరకు సాక్షాత్తూ దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా వ్యక్తిగతంగా అన్ని వ్యవహారాలనూ పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రకారం శ్రీ అమిత్‌ షా ఉత్తర్వు ప్రకారం... కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న వరుస సమీక్షలకు ఆయనే స్వయంగా అధ్యక్షత వహిస్తున్నారు. తదనుగుణంగా ఢిల్లీలోని 242 నియంత్రణ జోన్లలో ఇంటింటి ఆరోగ్య సర్వే కార్యక్రమం నిన్నటితో పూర్తయింది. ఈ సందర్భంగా మొత్తం 2.3 లక్షల మంది ప్రజలపై అధ్యయనం నిర్వహించారు. అంతేకాకుండా శ్రీ షా ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీలో పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు ఫలితాల సత్వర వెల్లడికి నిన్నటినుంచి రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష పద్ధతిని ప్రారంభించారు. దీంతో రానున్న రోజుల్లో పరీక్షల సంఖ్య పెరగనుంది. శ్రీ అమిత్‌ షా తీసుకున్న నిర్ణయాల మేరకు నమూనాల పరీక్ష రెట్టింపు స్థాయికి చేరింది. ఇందులో భాగంగా 2020 జూన్‌ 15 నుంచి 17 తేదీల మధ్య 27,263 నమూనాలను సేకరించారు. ఇంతకుముందు ఇది రోజుకు 4000 నుంచి 5000 మధ్య మాత్రమే ఉండేది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632761

జాతీయ రాజధాని ప్రాంతంలో కోవిడ్‌-19 నిర్వహణ సన్నద్ధతపై సీనియర్అధికారులతో దేశీయాంగ శాఖ మంత్రి సమీక్ష

ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో కోవిడ్‌-19 మహమ్మారి నియంత్రణకు ఉమ్మడి వ్యూహం అవసరాన్ని దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా నొక్కిచెప్పారు. ఈ మేరకు కోవిడ్‌-19పై పోరు సన్నద్ధత సన్నాహాలను సమీక్షించేందుకు సీనియర్‌ అధికారులతో తన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో పట్టణ సమీప సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వైరస్‌ నిర్వహణ కోసం ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ అధికారవర్గాలు కలసికట్టుగా కృషి చేయడం అవసరమని ఆయన శ్రీ అమిత్‌ షా సూచించారు. వైరస్‌ నిరోధం దిశగా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని, నిర్ధారిత రోగులను గుర్తించి, సకాలంలో చికిత్స చేయడం అవశ్యమని, తదనుగుణంగా ఉద్యమ తరహాలో పనిచేయాల్సి ఉందని దేశీయాంగ శాఖ మంత్రి అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632471

ఏసీ బోగీలలో వాయుమార్గంవల్ల కోవిడ్‌-19 వ్యాప్తి ముప్పు; తాత్కాలిక చికిత్సకు అవి పనికిరావు: రైల్వేశాఖ

కోవిడ్‌-19పై పోరులో సామర్థ్య వికాసానికి భారత రైల్వేశాఖ తనవంతు చేయూతనిస్తోంది. ఈ మేరకు ఇప్పటిదాకా 5,231 సాధారణ బోగీలను తాత్కాలిక కోవిడ్‌ సంరక్షణ కేంద్రాల (CCC) స్థాయిలో ఏకాంత చికిత్స బోగీలుగా మార్పు చేసింది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (MoHFW) , నీతి ఆయోగ్‌ రూపొందించిన సమీకృత ప్రణాళికలో భాగంగా రైల్వేశాఖ ఈ సదుపాయం కల్పించింది. సాధారణంగా రాష్ట్రాల్లో వైద్య కేంద్రాలన్నీ నిండిపోయినప్పుడు ఈ బోగీలు తాత్కాలిక సంరక్షణ కేంద్రాలుగా ఉపయోగపడతాయి. ఇలాంటివాటిలో చక్కటి గాలి ప్రసరణ, తగినంత సహజ వెలుతురు, వాయుమార్గరహిత ఏసీ సదుపాయం ఉండాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రిత్వశాఖ, నీతిగా ఆయోగ్‌ లోతుగా చర్చించిన తర్వాత, ఏసీ బోగీలలో వాయుమార్గం ఉంటుంది గనుక సాధారణ బోగీలనే మార్పు చేయాలని నిర్ణయించాయి. ఏసీ బోగీలలోని వాయుమార్గంద్వారా వైరస్‌ సంక్రమించే ముప్పు ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాయి. అదీగాక వైరస్‌ పోరులో తగినంత ఉష్ణోగ్రత నిర్వహించడం కూడా అవసరం. ఆ మేరకు అటూఇటూగల కిటికీల ద్వారా గాలి సహజ ప్రసరణ రోగులు త్వరగా కోలుకోవడంలో తోడ్పడుతుంది.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632563

స్వయం సమృద్ధ భారతం దిశగా కృషి; వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక సూక్ష్మ-రుణ సౌకర్య పథకం ప్రారంభం

స్వయం సమృద్ధ భారతం దిశగా కృషిలో భాగంగా వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక సూక్ష్మ-రుణ సౌకర్య పథకం ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ-పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoHUA), భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు-సిడ్బి (SIDBI)ల మధ్య ఇవాళ అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం.. “ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వయం సమృద్ధి నిధి” (PM SVANidhi) పథకం కింద ‘వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక సూక్ష్మ-రుణ సౌకర్యం’ కల్పన అమలు సంస్థగా సిడ్బి వ్యవహరిస్తుంది. ఆ మేరకు ‘పీఎం స్వానిధి’ పథకాన్ని గృహనిర్మాణ-పట్టణాభివృద్ధి మార్గనిర్దేశంలో సిడ్బి అమలు చేస్తుంది. వీధి వ్యాపారులకు రుణాలిచ్చే సంస్థలకు సూక్ష్మ-చిన్న పరిశ్రమల రుణహామీ నిధి ధర్మకర్తృత్వ సంస్థద్వారా సిడ్బి హామీదారుగా ఉంటుంది. ఇందుకోసం అన్నివైపులా సేవలందించే ప్రత్యేక-సమీకృత ఐటీ వేదికను రూపొందించి నిర్వహిస్తుంది. ఈ వేదికద్వారా అన్ని ప్రక్రియల సంబంధిత పత్రాల రూపకల్పన, కార్యక్రమ అమలు తీరు తదితరాలను ఒక పోర్టల్‌సహా మొబైల్‌ యాప్‌ సాయంతో నడిపిస్తుంది. వీటిద్వారా పట్టణ స్థానిక సంస్థలు, రుణ వితరణ సంస్థలు, డిజిటల్‌ చెల్లింపు సేవాప్రదాతలు, ఇతర భాగస్వాములకు సమాచార ప్రదానం సరళంగా సాగేవిధంగా పర్యవేక్షిస్తుంది.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632752

వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రధానమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం

వారణాసిలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో పనుల ప్రగతిని డ్రోన్‌ ద్వారా అధికారులు ప్రత్యక్షంగా ప్రదర్శించడం విశేషం. అదే సమయంలో కోవిడ్‌-19 సమర్థ నిర్వహణ దిశగా చేపట్టిన చర్యలపైనా సమావేశం చర్చించింది. ఆరోగ్య సేతు యాప్‌ విస్తృత వినియోగంపై దృష్టి సారించాలని ప్రధాని స్పష్టం చేశారు. ఈ యాప్‌ తోడ్పాటుతో రోగుల జాడ తీయడం, సకాలంలో నాణ్యమైన చికిత్స అందించడం సరళం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇక ఆహారం, ఆశ్రయం, నిర్బంధవైద్య సదుపాయాల కల్పనలో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని అభినందించారు. తిరిగి వచ్చిన వలస కార్మికులలో నైపుణ్యాలను గుర్తించి నమోదు చేయడానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. అంతేగాక వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి కల్పించే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పారు. ప్రజలు దుస్థితిలో ఉన్న ప్రస్తుత సమయంలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజనతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కోవిడ్‌-19 ఉపశమన పథకాల సానుకూల ప్రభావంపై సమాచారం స్వీకరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632755

అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY)పై ప్రధానమంత్రి సందేశం టీవీల్లో ప్రసారం

అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY)-2020 ప్రధాన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సందేశం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ మేరకు 2020 జూన్‌ 21న ఉదయం 6:30 గంటలకు ప్రధానమంత్రి వ్యాఖ్యానం టెలివిజన్లలో ప్రసారమవుతుంది. ఈసారి ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఐడీవైని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నప్పటికీ ఇది ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ వేదికలకు మాత్రమే పరిమితం అవుతోంది. ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వేలాదిగా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగాభ్యాసంద్వారా ఐడీవైని వేడుకగా నిర్వహించేవారు. కానీ, ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావిత అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి వల్ల వేడుకలకు ప్రాధాన్యం తగ్గి, ఇళ్లలో కుటుంబ సభ్యులంతా యోగా కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రాముఖ్యం ఇవ్వబడింది. కాగా, యోగాభ్యాసం ద్వారా భౌతిక, మానసిక శ్రేయస్తు ఒనగూడుతుంది గనుక నేటి మహమ్మారి పరిస్థితుల నడుమ ఇదెంతో సముచిత సందర్భం అవుతుంది. యోగావల్ల వ్యాధులతో పోరాటం దిశగా వ్యక్తుల సామర్థ్యం ఇనుమడిస్తుంది.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632469

దేశంలోని 14 రాష్ట్రాలు/యూటీల ఆహారశాఖ మంత్రులతో శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ భేటీ; ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు’పై చర్చ

కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహారం-ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ఆహార శాఖ మంత్రులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. జాతీయ ఆహారభద్రత చట్టం (NFSA) కిందగల రేషన్‌ కార్డుల ‘జాతీయ చెల్లబాటు’ (నేషనల్‌ పోర్టబిలిటీ) కార్యక్రమం ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు’ (ONOC) అమలు ప్రగతిపై ఈ సందర్భంగా వారితో చర్చించారు. దీనికి సంబంధించి 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాల సన్నద్ధత, కార్యాచరణ ప్రణాళిక, ‘ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డు’ సదుపాయం అమలుకు రమారమి వ్యవధి తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కాగా- అసోం, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాల ఆహారశాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనగా, మిగిలిన రాష్ట్రాలు/యూటీలకు ఆ శాఖ కార్యదర్శులు ప్రాతినిధ్యం వహించారు.

   కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి కారణంగా దేశాలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు, పేదలు ‘ఓఎన్‌ఓసీ’ కింద జాతీయ చెల్లుబాటుద్వారా ఎక్కడున్నవారు అక్కడ తమ కోటా ఆహారధాన్యాలు తీసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడిందని శ్రీ పాశ్వాన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తద్వారా ఈ పథకం ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చగలదని రుజువైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2020 ఆగస్టునాటికి ఉత్తరాఖండ్‌, నాగాలండ్‌, మణిపూర్‌ ఈ జాతీయ సమూహంలోకి చేరుతాయన్నారు. అలాగే మిగిలిన 14 రాష్ట్రాలను కూడా ఈ ఏడాది ఆఖరుకల్లా ‘ఓఎన్‌ఓసీ’ సమూహంలోకి తెచ్చేందుకు తమ శాఖ ఏర్పాట్లు చేస్తున్నదని వెల్లడించారు. దేశంలో ఆహారధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి కష్టకాలంలో ఏ ఒక్కరూ ఆకలి బాధకు లోనయ్యే పరిస్థితే ఉండదని శ్రీ పాశ్వాన్‌ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632472

సూక్ష్మ అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో గిరిజన ఆర్థిక వ్యవస్థలోకి రూ.2,000 కోట్లకుపైగా ధన ప్రవాహం

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో సూక్ష్మ అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు 2020 ఏప్రిల్‌ నెలలో ప్రారంభంకాగా, ఇప్పటివరకూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రూ.835 కోట్లు, ప్రైవేటు వ్యాపారుల ద్వారా దాదాపు రూ.1,200 కోట్ల మేర వ్యాపారం నమోదైంది. దీంతో ఈ ఏడాది రూ.2,000 కోట్లదాకా ప్రత్యక్ష లబ్ధి బదిలీద్వారా గిరిజనుల ఖాతాలలో జమ అయ్యాయి. మహమ్మారి కోవిడ్‌-19 అనూహ్యంగా పెనుసవాలు విసరడంతో గిరిజనంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. యువతలో నిరుద్యోగం, గిరిజనుల పురోగమన వలసలు వంటివి మొత్తం గిరిజన ఆర్థిక వ్యవస్థను కూలదోసే ముప్పు ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో సూక్ష్మ అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ద్వారా గిరిజనులకు తోడ్పాటు దిశగా అన్ని రాష్ట్రాలకూ ఒక అవకాశం లభించింది.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632493

కోవిడ్‌-19 నిర్ధారణకు చౌకధర పరికరాలు రూపొందించిన ఐఐటీ-గువహటి

నవ్య కరోనా వైరస్‌ కబంధ హస్తాలనుంచి బయటపడాలంటే కచ్చితమైన రోగ నిర్ధారణ పద్ధతిని అనుసరించడం అవశ్యం. దీనికి సంబంధించి గువహటిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) తనవంతు కృషిని ముమ్మరం చేసింది. ఇందుకు ఆర్‌ఆర్‌ యానిమల్‌ హెల్తకేర్‌ లిమిటెడ్‌ సంస్థ, గువహటి వైద్య కళాశాల-ఆస్పత్రి (GMCH) సహకరించాయి. ఈ సంయుక్త కృషితో పరిశోధకులు చౌకధరలో రోగ నిర్ధారణ సామగ్రిని అభివృద్ధి చేశారు. వీటిని ‘వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియా (VTM), ఆర్టీ-పీసీఆర్‌ (RT-PCR) ఆర్‌ఎన్‌ఏ (RNA) ఐసొలేషన్‌ కిట్లుగా వ్యవహరిస్తారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632753

దేశీయ అవసరాల మేరకు/మిగులు నిల్వలు సమకూరిన నేపథ్యంలో హెచ్‌సీక్యూ ఎగుమతిపై నిషేధం తొలగింపు

మలేరియా-నివారణ ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (HCQ) ముడి ఔషధం (API) ఎగుమతిపై నిషేధాన్ని ప్రభుత్వం తక్షణం అమలులోకి వచ్చేవిధంగా తొలగించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నిన్న అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, దేశంలో ఔషధ లభ్యతపై అంచనా నిమిత్తం అంతర-మంత్రిత్వ ఉన్నతస్థాయి సాధికార కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమవుతుంది. అలాగే ఇకపైనా పరిస్థితిపై  సమీక్ష కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ నిర్దేశించిన అవసరాల మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పూర్తిస్థాయిలో అందజేసింది. ఈ మేరకు కోవిడ్‌-19 నిర్వహణ దిశగా  హెచ్‌సీక్యూ-200 మిల్లీగ్రాముల మోతాదుగల 12.22 కోట్ల మాత్రలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌కు సరఫరా చేసింది. ప్రస్తుతం దేశీయ అవసరాలకు సరిపడా హెచ్‌సీక్యూ నిల్వలు ఆరోగ్య మంత్రిత్వశాఖ వద్ద సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. దీనితోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు, బీపీపీఐ/జనౌషధి కేంద్రాల అవసరాల మేరకు మరో 7.58 కోట్ల హెచ్‌సీక్యూ-200 మిల్లీగ్రాముల మాత్రలను అందజేసింది. అంతేకాకుండా స్థానిక డిమాండ్‌కు తగుమేర స్థానిక మందుల షాపులకు మరో 10.86 కోట్ల మాత్రలను సరఫరా చేసింది. దీంతో మొత్తం 30.66 కోట్ల మాత్రలు ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల దేశీయంగా హెచ్‌సీక్యూ డిమాండ్‌ పూర్తిగా తీరినట్లయింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632748

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్‌-19 నియంత్రణలో భాగంగా స్వీయ నిర్బంధానికి బదులు స్వీయ గృహ నిర్బంధ వైద్య పర్యవేక్షణ అమలు ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని నగర పాలనాధికారి ఆదేశించారు. తద్వారా నగరం వెలుపలినుంచి వచ్చిన సందర్శకులు అనవసరంగా ఎక్కడపడితే అక్కడ సంచరించకుండా చూడవచ్చునని పేర్కొన్నారు. అలాగే స్వీయ-నిర్బంధం నిబంధనలను ఉల్లంఘించేవారిని సంస్థాగత నిర్బంధ కేంద్రాలకు తరలించడంద్వారా శిక్షించే ప్రతిపాదనను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారుకు సూచించారు.
 • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ రోగులకు సరసమైన ధరలో చికిత్స అందేవిధంగా ప్రైవేటు ఆస్పత్రులలో ఫీజులను ప్రభుత్వం త్వరలో హేతుబద్ధం చేస్తుందని పంజాబ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు వ్యవహరించాలని, కోవిడ్-19 చికిత్సకు హేతుబద్ధ, సముచిత ఫీజులు వసూలు చేయాలని ఆయన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను కోరారు. ప్రైవేటు ఆస్పత్రులకు నష్టం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అదే సమయంలో నిస్సహాయ రోగులను దోపిడీ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆ మేరకు ఆస్పత్రిలో కొద్ది రోజుల చికిత్సక లక్షల రూపాయల బిల్లులు వేయడాన్ని అనుమతించబోమని పునరుద్ఘాటించారు.
 • కేరళ: ప్రవాసులు కేరళకు తిరిగి వచ్చేముందు కోవిడ్‌ పరీక్ష తప్పనిసరిగా చేయాల్సిందేనని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ ద్వారా దృఢ సంకల్పం ప్రకటించింది. సంస్థాగత నిర్బంధ సదుపాయాలుసహా అతిథి కార్మికులకు అందించే సేవలు రాష్ట్రానికి తిరిగివచ్చే ప్రవాసులకు విస్తరించే వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం హాజరు మాత్రమే ఉండాలని; మిగిలిన 50 శాతం ఉద్యోగులు ఇంటినుంచి పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నిన్న 97 కొత్త కేసులు నమోదవగా, 89మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,358 మంది చికిత్స పొందుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా 1,27,231 మంది పరిశీలనలో ఉన్నారు.
 • తమిళనాడు: రాష్ట్ర రాజధాని చెన్నైసహా పొరుగునగల మూడు జిల్లాల్లో ఇవాళ్టినుంచి ప్రారంభమైన  సంపూర్ణ దిగ్బంధం 12 రోజులపాటు కొనసాగుతుంది. కాగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి.అన్బళగన్‌కు కోవిడ్-19 వ్యాధి సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. కోవిడ్-19 సమస్య విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యుల పెన్షన్ తగ్గించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. కాగా, మహమ్మారి సమయంలో సకాలంలో జీతం చెల్లించాలని కళాశాలల తాత్కాలిక అధ్యాపకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో నిన్న 2,141 కొత్త కేసులు నమోదవగా, 1017మంది కోలుకున్నారు; 49 మరణాలు సంభవించాయి. కొత్త కేసులలో చెన్నైలో నమోదైనవి 1276 కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 52,334, యాక్టివ్ కేసులు: 23065, మరణాలు: 625, డిశ్చార్జ్: 28641, చెన్నైలో యాక్టివ్ కేసులు: 16067గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ చికిత్స ఖర్చును సవరిస్తూ  8మంది సభ్యుల కమిటీ చేసిన సిఫారసులను రాష్ట్ర కోవిడ్ కార్యాచరణ బృందం ఆమోదించింది. అనంతరం దీనిపై పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర మంత్రిమండలికి పంపింది. కోవిడ్-19 నిరోధం దిశగా బీబీఎంపీ పౌరతనిఖీ బృందాలను నియమించింది. నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నవారు నిబంధనలను కచ్చితంగా పాటించేలా ఈ బృందాలు నిఘా వేస్తాయి. మరోవైపు దిగ్బంధం నిఘా యాప్‌ నుంచి అనవసరమైన గణాంకాలను తొలగించే ప్రక్రియలో సాయం చేసేందుకు బీబీఎంపీ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో నిన్న 210 కొత్త కేసులు నమోదవగా 179మంది  డిశ్చార్జి అయ్యారు. అలాగే మరో 12 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 7944, యాక్టివ్‌ కేసులు: 2843, మరణాలు: 114, కోలుకున్నవారి సంఖ్య: 4983గా ఉంది.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో సురక్షిత బోటింగ్ దిశగా ఆంధ్రప్రదేశ్‌లో నదీ తీరాలు, బీచ్‌లున్న చోట్ల  పర్యాటక నియంత్రణ గదులను ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. పులివెందుల (కడప) వద్ద టీకా తయారీ యూనిట్ ఏర్పాటుకు ‘ఐజివై ఇమ్యునోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 17,609 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 376 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య: 6230కి చేరింది. మరోవైపు 82 మంది డిశ్చార్జ్ కాగా, నాలుగు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 3069, కోలుకున్నవారు: 3065, మరణాలు: 96గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ నియంత్రణ జోన్ల సంఖ్య తగ్గుతోంది. ఈ జోన్లలో పర్యవేక్షణపై ప్రభుత్వం వివరాలు వెల్లడించనప్పటకీ విధానంలో మార్పు కనిపిస్తోంది. ఈ మేరకు కేసులు పెరుగుతున్నా కొత్త నియంత్రణ జోన్లను ప్రకటించడం లేదు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 6,027; యాక్టివ్‌ కేసులు 2,531కాగా; 3301 మంది కోలుకున్నారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 3,752 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,20,504కు చేరింది. కొత్త కేసులలో ముంబైలో 1,298 నమోదవగా, నగరంలో పెరుగుతున్న వైరస్ కేసులవల్ల ఆస్పత్రులలో ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులోగల సదుపాయాలు సరిపోవడం లేదు. దీంతో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 20 ప్రదేశాలలో- కీలకమైన పౌర-ఆస్పత్రులు కెఇఎమ్, నాయర్, సియోన్ సహా భారీ సదుపాయాలున్న చోట్ల చేపట్టిన భారీ ద్రవ ఆక్సిజన్ ట్యాంకుల ఏర్పాటు పనులు తుదిదశలో ఉన్నాయి. సిలిండర్లను అమర్చేందుకు వేదికల నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, వచ్చే వారం ఈ ట్యాంకులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
 • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 510 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 25,660కి పెరిగింది. అలాగే 22 మంది మృతితో మొత్తం మరణాలు 1,592కు చేరాయి. గురువారం 389 మంది రోగులను ఇళ్లకు పంపిన నేపథ్యంలో కోలుకున్నవారి సంఖ్య 17,829కి పెరిగింది. ప్రస్తుతం గుజరాత్‌లో 6,239 యాక్టివ్‌ కేసులుండగా, వీరిలో 6,178 మంది పరిస్థితి  స్థిరంగా ఉంది. మరో 61 మంది వెంటిలేటర్‌ తోడ్పాటుతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కొత్త కేసులలో, గరిష్ఠంగా 317 ఒక్క అహ్మదాబాద్‌లో నమోదయ్యాయి. ఇక సూరత్‌లో 82, వడోదరలో 43 వంతున నమోదయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రంలో 2.06 లక్షల మందిని గృహనిర్బంధ పర్యవేక్షణలో ఉంచారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 182 కొత్త కేసులతో మొత్తం కేసులు 11,426కు చేరాయి. అయితే, ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 2308 మాత్రమే కావడం విశేషం. మధ్యప్రదేశ్‌లో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ఇండోర్‌ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 4.191కి పెరిగింది. మహమ్మారి సృష్టించిన సంక్షోభ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఈ మేరకు జాతీయంగా కోలుకునేవారి సగటు శాతం 53 కాగా, రాష్ట్రంలో 75.5 శాతానికి పెరగడం విశేషం. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల రెట్టింపు వ్యవధి ఇప్పుడు 43.2 రోజులకు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆరు జిల్లాలు కరోనా విముక్తం కాగా, మరో 24 జిల్లాల్లో 10కన్నా తక్కువగా మాత్రమే యాక్టివ్‌ కేసులుండటం గమనార్హం.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో గురువారం 82 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,946కు చేరింది. అలాగే 46 మందికి వ్యాధి నయం కాగా, కోలుకున్నవారి సంఖ్య 1202కు పెరిగింది. ప్రస్తుతం 735 మంది చికిత్స పొందుతున్నారు.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 84 కొత్త కేసులతో మొత్తం కరోనావైరస్ కేసులు 13,626కు పెరిగాయి. ఇక కోలుకుంటున్నవారి శాతం 77కుపైగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,582 మంది రోగులు కోలుకోగా, 323 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు.
 • గోవా: గోవాలో గడచిన 24 గంటల్లో 49 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 705కు చేరాయి. వీటిలో 596 యాక్టివ్‌ కేసులున్నాయి.

FACTCHECK

 

*****

 

 

 

 

 

 (Release ID: 1632777) Visitor Counter : 68


Read this release in: English , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam