రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

దేశీయ మార్కెట్ అవసరాలకు సరిపడినన్ని నిల్వలు సమకూర్చిన తరువాత హైడ్రాక్సి క్లోరోక్విన్ (హెచ్ సి క్యు) ఎగుమతిపై నిషేధం ఎత్తివేత

హెచ్ సి క్యు టాబ్లెట్స్ దేశీయ ఉత్పత్తి సామర్ధ్యం మూడు రేట్లు పెరిగింది. మునుపు నెలకు 10 కోట్ల టాబ్లెట్స్ ఉత్పత్తి చేస్తుండగా ఇప్పుడు నెలకు 30 కోట్ల టాబ్లెట్స్ కు పెరిగింది.

దేశంలో ఔషధాల పరిస్థితిని అంతర్ మంత్రివర్గ ఉన్నత స్థాయి సాధికార కమిటీ పక్షం రోజులకు ఒకసారి సమీక్షిస్తుంది

మలేరియా వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించే హైడ్రాక్సి క్లోరోక్విన్ ఔషధం ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుంది. హైడ్రాక్సి క్లోరోక్విన్ ఏపీఐతో పాటు సూత్రీకరణలకు కూడా ఇది వర్తిస్తుంది.

Posted On: 19 JUN 2020 4:26PM by PIB Hyderabad

వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఉన్న   అంతర్  మంత్రివర్గ ఉన్నత స్థాయి సాధికార కమిటీ  03.06.2020న జరిపిన సంప్రదింపుల తరువాత  ఔషధీయ శాఖ హైడ్రాక్సి క్లోరోక్విన్ పై నిషేధాన్ని ఎత్తివేయాలని సిఫార్సు చేసింది.   సాధికార కమిటీలో  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ,   ఔషధీయ శాఖ,  విదేశాంగ మంత్రిత్వ శాఖ,   వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ మరియు ఇతరులు  పాల్గొన్నారు.  ఆనవాయితీ ప్రకారం ఈ మేరకు  విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ గురువారం ప్రకటన  జారీ చేశారు.  

దేశంలో ఔషధాల లభ్యతను అంచనా వేయడానికి అంతర్ మంత్రివర్గ  ఉన్నత స్థాయి సాధికార కమిటీ ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమావేశమవుతుంది.   పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటుంది.  

కోవిడ్-19  వ్యాప్తి కాలం (2020 మార్చి నుంచి  మే వరకు)  హైడ్రాక్సి క్లోరోక్విన్ ఉత్పత్తి చేసే యూనిట్ల సంఖ్య2 నుంచి 12కు పెరిగింది.   దరిమిలా హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్స్ నెలవారీ ఉత్పత్తి  సుమారుగా 10 కోట్ల నుంచి సుమారుగా  30 కోట్లకు పెరిగింది.  ప్రస్తుతం దేశంలో   హైడ్రాక్సి క్లోరోక్విన్  నిల్వలు దేశ అవసరాలకు మించి ఉన్నాయి.  

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా కోవిడ్ -19 రోగుల అవసరాలను తీర్చడానికి  కేంద్ర ప్రభుత్వ రంగంలోని హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థకు  12.22 కోట్ల  హెచ్ సి క్యు  టాబ్లెట్స్ ను  ఇవ్వడం జరిగింది.   ప్రస్తుతం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద దేశీయ డిమాండ్ తీర్చడానికి  సరిపడినన్ని హెచ్ సి క్యు  200 మిల్లీగ్రాముల  టాబ్లెట్స్ బఫర్ నిల్వలు ఉన్నాయి.  ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ,  ఇతర సంస్థలకు మరియు జన ఔషధీ కేంద్రాలకు వారి అవసరాలకు   7.58 కోట్ల  హెచ్ సి క్యు 200 మిల్లీగ్రాముల  టాబ్లెట్స్ సరఫరా చేయడం జరిగింది.   అంతేకాక దేశీయ అవసరాలు తీర్చేందుకు స్థానిక ఫార్మసీలకు  10.86 కోట్ల  హెచ్ సి క్యు 200 మిల్లీగ్రాముల  టాబ్లెట్స్ సరఫరా చేశారు.  మొత్తం మీద దేశీయ మార్కెట్ లో  30.66 కోట్ల  హెచ్ సి క్యు 200 మిల్లీగ్రాముల  టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి.   అందువల్ల దేశీయ మార్కెట్ లో  ఈ టాబ్లెట్స్ కు  కొరత లేదు. 2020 జూన్ నెలలో దేశీయ మార్కెట్ కోసం  ప్రధాన ఉత్పత్తిదారులు కనీసం 5 కోట్ల హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్స్ సరఫరా చేస్తాయి.  

కోవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేకించిన ఆసుపత్రుల దగ్గరి ఫార్మసీలలో  హైడ్రాక్సి క్లోరోక్విన్ మరియు ఇతర ఔషధాల లభ్యత 93.10% ఉన్నట్లు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్  (డి జి సి ఐ)  నిర్వహించిన సర్వేలో తేలింది.   దేశీయ మార్కెట్ లో ఔషధాల లభ్యత గురించి  డి జి సి ఐ తరచుగా సర్వేలు జరుపుతుంటారు.  

ఆ విధంగా హైడ్రాక్సి క్లోరోక్విన్ (ఏ పి ఐ మరియు  సూత్రీకరణల) ఎగుమతిపై  నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు.   అయితే హెచ్ ఎల్ ఎల్,  రాష్ట్ర ప్రభుత్వాలు,  ప్రభుత్వ సంస్థలు హైడ్రాక్సి క్లోరోక్విన్ కోసం ఆర్డర్ చేసినట్లయితే దానిని ప్రాధాన్యతతో తీర్చడానికి   ఉత్పత్తిదారులు అందరూ  సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ షరతులు తప్పనిసరిగా అమలయ్యేలా  చర్యలు తీసుకోవాలని డి జి సి ఐని ఆదేశించారు.  
 

*****(Release ID: 1632748) Visitor Counter : 219