హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 సన్నాహాలపై ఎన్.సి.ఆర్. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంమంత్రి

· కరోనా మహమ్మారిపై పోరాటానికి ఢిల్లీ – ఎన్.సి.ఆర్.లో ఏకీకృత వ్యూహాత్మక చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ అమిత్ షా

· కోవిడ్ -19 నియంత్రణ కోసం ఈ వ్యాధి సోకిన వారిని గుర్తించేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించటంతో పాటు, పాజిటివ్ వచ్చిన వారికి మంచి వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది – కేంద్ర హోం మంత్రి

Posted On: 18 JUN 2020 6:48PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారిని నివారించేందుకు ఢిల్లీ – ఎన్.సి.ఆర్. ప్రాంతంలో ఏకీకృత వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా నొక్కి చెప్పారు. కోవిడ్ -19 నిర్వహణ విషయంలో చేస్తున్న సన్నాహాలను సమీక్షించేందుకు శ్రీ అమిత్ షా అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఎన్.సి.ఆర్. ప్రాంతానికి చేరువలో ఉన్న పట్టణ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మరియు ఎన్.సి.ఆర్. ప్రాంతానికి సంబంధించిన అధికారులంతా వైరస్ నియంత్రణ కోసం కలిసి కట్టుగా వ్యూహాత్మక చర్యలతో ముందుకు రావడం అవసరం అని తెలిపారు. ఈ వైరస్ నియంత్రణ కోసం మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన ఆయన, పాజిటివ్ అయిన వారిని శీఘ్రమే గుర్తించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో మిషన్ మోడ్ లో వేగవంతమైన పని తీరు కనబరచాల్సిన అవసరం ఉందని దిశా నిర్దేశం చేశారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె.పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కోవిడ్ -19 పరీక్షల ధరను 2,400 రూపాయలుగా నిర్ణయించిందని తెలిపిన శ్రీ అమిత్ షా, ఉత్తర ప్రదేశ్, హర్యానాల్లో ఈ ధర ఎక్కువగా ఉందని, అంతర్గత సంప్రదింపులు చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని తగ్గించే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ -19 పడకలు మరియు చికిత్స కోసం రేట్లను కూడా కమిటీ నిర్ణయించిందన్న ఆయన, ఈ రేట్లు ఎన్.సి.ఆర్. ప్రాంతంలోని ఆసుపత్రులకు కూడా సంప్రదింపుల తర్వాత వర్తించవచ్చని శ్రీ అమిత్ షా తెలిపారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) ఆమోదించిన కొత్త రాపిడ్ యాంటిజెన్ పద్ధతి ద్వారా కోవిడ్ -19 పరీక్షను నిర్వహించటం మంచిదన్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, ఇది పరీక్ష సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని, ప్రారంభ వ్యాధి నిర్ధారణ, మరియు చికిత్స విషయంలో సహాయపడుతుందని తెలిపారు.

కోవిడ్ -19 పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఐ.సి.యూ. మరియు వాటితో అందుబాటులో ఉన్న ఆంబులెన్స్ ల గురించి సమాచారం సమర్పించాలని, వీటి విషయంలో వారి ప్రణాళిక గురించి వనరులను 2020 జులై 15 లోగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాల అధికారులను శ్రీ షా ఆదేశించారు. ఈ చొరవ వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం లో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్.సి.ఆర్.) సమగ్ర వ్యూహాన్ని రూపొందించేందుకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

వైరస్ కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్.సి.ఆర్. ప్రాంతంలోని అధికారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తుందని శ్రీ అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఢిల్లీ – ఎన్.సి.ఆర్. కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1632471) Visitor Counter : 236