ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాశిలో వివిధ అభివృద్ది పథకాలకు సంబంధించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
19 JUN 2020 3:51PM by PIB Hyderabad
వారణాశిలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల సమీక్షా సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్పరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా జరిగిన ప్రెజెంటేషన్‌లో కాశీవిశ్వనాథ్ మందిర్ కాంప్లెక్స్ లో చేపట్టిన అభివృద్ధి పనులను , మందిర్ కాంప్లెక్స్ లేఔట్ డ్రోన్ వీడియోను ఉపయోగించి ప్రముఖంగా ప్రస్తావించారు.అలాగే కోవిడ్ నియంత్రణకు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి వారణాశి ప్రజాప్రతినిధులు శ్రీ నీలకంఠ తివారి, గౌరవ ఎం.ఒ.ఎస్ (ఐసి), గవర్నమెంట్ ఆఫ్ యుపి, ఎమ్మెల్యే, వారణాశి దక్షిణం, అలాగే శ్రీ రవీంద్ర జైశ్వాల్ , గౌరవ ఎం.ఒ.ఎస్ (ఐసి), గవర్నమెంట్ ఆఫ్ యుపి, ఎమ్మెల్యే, వారణాశి (నార్త్), శ్రీ సురేంద్ర నారాయణ్ సింగ్ , ఎమ్మెల్యే, రోహ్నియా, శ్రీ సౌరభ్ శ్రీవాత్సవ, ఎమ్మెల్యే, వారణాశి కంటోన్మెంట్, శ్రీ నీల్ రతన్ నీలు, ఎమ్మెల్యే, సేవాపురి, శ్రీ అశోక్ ధావన్, ఎమ్మెల్సీ, శ్రీ లక్ష్మణ్ ఆచార్య, ఎమ్మెల్సీ, అధికారులు శ్రీ దీపక్ అగర్వాల్ , వారణాశి డివిజన్ మున్సిపల్ కమిషనర్, శ్రీ కౌశల్ రాజ్ శర్మ , జిల్లా మేజిస్ట్రేట్, వారణాశి, శ్రీ గౌరంగ్ రాథి ,వారణాశి మునిసిపల్ కమిషనర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
కాశీవిశ్వనాథ్ థామ్ ప్రాజెక్టు ప్రగతి ని సమీక్షిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , కాశీవిశ్వనాథ్ పరిసర్ అభివృద్ధి సందర్భంగా బయల్పడిన పాత ఆలయాలను సంరక్షించాలని, భద్రంగా ఉండేట్టు చూడాలని ప్రధానమంత్రి సూచించారు. వాటి చారిత్రక, నిర్మాణ వారసత్వ వైభవాన్ని కాపాడేందుకు నిపుణుల సహాయం తీసుకోవల్సిందిగా ప్రధానమంత్రి సూచించారు. వీటి ప్రాచీనతను తెలియజెప్పే కార్బన్ డేటింగ్ నిర్వహించి ఈ ఆలయాల ప్రాధాన్యతను పర్యాటకులకు, యాత్రికులకు తెలియజేయాల్సిందిగా ప్రధానమంత్రి సూచించారు. కాశీవిశ్వనాథ్ ట్రస్ట్, కాశీవిశ్వనాథ్ మందిర కాంప్లెక్స్‌ను సందర్శించే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు తగిన మార్గదర్శకాలు, టూరిస్ట్ గైడ్స్ తో రూట్ మ్యాప్ రూపొందించాలని ప్రధాని సూచించారు.
వారణాశిలో చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రధానమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. సుమారు 8000 కోట్ల రూపాయల నిధులతో 100కు పైగా ప్రధాన ప్రాజెక్టులు వారణాశిలో చేపడుతున్న విషయాన్ని ఈ సమావేశంలో తెలియజేశారు. ఆస్పత్రి భవనాల నిర్మాణం, జాతీయ జలవనరులు, రింగ్ రోడ్ల నిర్మాణం, బై పాస్ రోడ్ల నిర్మాణం, ఇండో- జపాన్ కొలాబరేషన్‌తో నిర్మిస్తున్న అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష్ వంటివి ఇందులో ఉన్నాయి.
వారణాశిలో అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేయాల్సిందిగా ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఉన్నత ప్రమాణాలు పాటించాలన్నారు. తదుపరి తరం మౌలిక సదుపాయాల కల్పనలో సంప్రదాయేతర ఇంధన వనరులను గరిష్ఠంగా వాడాలన్నారు. వారణాశిజిల్లా మొత్తం మీద ఇళ్లలోను , వీధులలోనూ ఎల్ ఇడి బల్బుల వినియోగాన్ని మిషన్‌మోడ్ లో చేపట్టాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు.
కాశీలో టూరిజం , పర్యాటకుల రాకను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. క్రూయిజ్ టూరిజం, లైట్ అండ్ సౌండ్ షో, అక్కడ గల వివిధ ద్వారాలు, దశాశ్వమేథ్ ఘాట్ పునరుద్దరణ, ఆడియో ,వీడియో స్క్రీన్‌ల ద్వారా గంగా హారతి ప్రదర్శన వంటి వాటిని సత్వరం పూర్తిచేయాలన్నారు. ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదలలో కీలకమైనదిగా కాశీగురించి తెలియజెప్పేందుకు , దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలోని వారు, తమ సాంస్కృతిక వారసత్వం, కళలను తెలియజెప్పేందుకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టుగా, వారోత్సవాలను నిర్వహించాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు.
కాశీ వారసత్వం ప్రతిబింబించేట్టు తగిన థీమ్‌తో కాశీని గౌరవ్ పథ్‌గా అభివృద్ది చేసేందుకు స్థానికుల సహకారంతో ఒక నమూనా పథాన్ని రూపొందించాల్సిందిగా ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు.
కాశీ పవిత్ర పర్యాటక క్షేత్రంగా పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో అత్యుత్తమంగా ఉండాలని ప్రధాని ఆదేశించారు. ఒడిఎప్ ప్లస్ నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. యంత్రాలతో వీధులు ఊడ్వడం, శుభ్రపరచడం వంటివి చేపట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి నూరు శాతం వ్యర్థాలను సేకరించే ఏర్పాటు చేయాలని,మొత్తం పరిసరాలు, వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
ఈ సమీక్షా సమావేశం సందర్బంగా అధికారులు ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో వారణాశిలో అభివృద్ధి చేస్తున్న ప్రపంచస్థాయి కమ్యూనికేషన్, కనెక్టివిటీ మౌలికసదుపాయాల పై చర్చించారు. వారణాశి- హాల్దియాను కలుపుతూ జాతీయ జలమార్గానికి వారణాశి కేంద్రం కావాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. మొత్తం పర్యావరణాన్ని, కార్గో షిప్పింగ్ ను, సరకు రవాణాను (ప్రధాన పోర్టు నగరాలల ఉన్నట్టు) దృష్టిలో పెట్టుకుని అభివృద్దికి ప్రణాళిక రూపొందించాలన్నారు. లాల్‌బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులను ,ఆధునీకరణను ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనివల్ల కాశీ ప్రముఖ నగరాలలో ఒకటిగా అత్యధునాతన రైలు, రోడ్డు, వాయు, జలమార్గ అనుసంధానతను కలిగిఉంటుందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్రగతిపై కూడా ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ఫలితాలు త్వరగా ప్రజలకు అందాలన్నారు. పిఎం ఎస్ వి ఎ నిధి పథకం కింద వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే పథకం పురోగతిని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. వీధివ్యాపారులు నగదు రహిత లావాదేవీలవైపు మారేందుకు వారికి సహాయ పడాలని, వారికి తగిన సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు కల్పించాలని అందుకు వారిని సిద్ధం చేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు.వారి బ్యాంకు ఖాతాలు ప్రారంభించి, వారి రుణ వివరాలను డిజిటల్‌గా అనుసంధానం చేయాలని, దీనివల్ల వీరు కొల్లేటరల్ ఫ్రీ రుణాలకు సంబంధించి పిఎం ఎస్‌విఎ నిధి కింద గరిష్ఠ ప్రయోజనం పొందడానికి వీలు కలుగుతుందన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలలో వ్యవసాయదారులు ఒకరని ప్రధాని స్పష్టం చేశారు. రైతుల రాబడిని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి కొనసాగిస్తున్నట్టు చెప్పారు. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని, రైతుల ఆదాయం పెంచడంలో తేనెటీగల మైనానికి ఉన్న సామర్ధ్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన వారణాశిలో పేకేజింగ్ పరిశ్రమను నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఆదేశించారు. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులకు మంచి కొనుగోళ్లు ఉండేలా చూసుకోవడానికి , వారణాశిలోనే రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్ధం చేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. కూరగాయలు, మామిడిపండ్లను ఎపిఇడిఎ (వాణిజ్య మంత్రిత్వశాఖ)సహకారంతో ఎగుమతులు చేసేలా ప్రోత్సహించేందుకు అధికార యంత్రాంగం చేపడుతున్న కృషిని ప్రధాని ప్రశంసించారు.
వ్యర్థాలనుంచి సంపదను సృష్టించడంపై దృష్టిపెట్టాలని , వ్యర్థాలనుంచి ఇంధనం లేదా వ్యర్థాలనుంచి రైతులకు ఉపయోగపడే విధంగా కంపోస్ట్ తయారు చేయాలని, వీటికి విస్తృత ప్రచారం కల్పించి ప్రోత్సహించాలని ప్రధాని ఆదేశించారు. ఈ దిశగా జీరో బడ్జెట్ ఫార్మింగ్ ను ప్రోత్సహించాలని , ఈ విషయంలో రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని ,వీటివల్ల కలిగే అన్నిరకాల ప్రయోజనాలను వారికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు.
ప్రస్తుత కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్జత గురించి కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా విస్తృతంగా సమీక్షించారు. ఆరోగ్య సేతు యాప్‌ను విస్తృతంగా , సమర్ధంగా వినియోగించాల్సిన ఆవశ్యకతను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. కోవిడ్ పరీక్షలు , కాంటాక్టుల గుర్తింపు, పేషెంట్లకు నాణ్యమైన చికిత్సకు ఈ యాప్ వీలు కల్పిస్తుందన్నారు.జిల్లా పాలనాయంత్రాంగం కల్పిస్తున్న ఆహారసదుపాయం , వసతి, క్వారంటైన్ సేవల పై కూడా ఆయన సమీక్షించారు.
తమ తమ స్వస్థలాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు గల నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రాధాన్యతా ప్రాతిపదికన సేకరించి ,వారి నైపుణ్యాలకు అనుగుణంగా వారికి లాభదాయక ఉపాధి కల్సించాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం సానుకూల ప్రభావంపైన, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలో చేపట్టిన సహాయ పథకాలపైన ప్రధానమంత్రి , అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
నీతి ఆయోగ్ రూపొందించిన గ్రామపంచాయతి డవలప్‌మెంట్ ప్రోగ్రాం పై కూడా ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి 9 రంగాలలో వారణాశి గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు ప్రధానమంత్రి దార్శనికతను ఇది ప్రతిబింబిస్తుంది. పంచాయతిరాజ్, పారిశుద్యం, ఆరొగ్యం, పౌష్టికాహారం, విద్య, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు, జీవనోపాధి, నైపుణ్యాలకు సంబంధించిన రంగాలు ఇందులో ఉన్నాయి.
అంగన్ వాడి సెంటర్ల కమ్యూనిటీ ఉద్యమంగా పౌష్టికాహారాన్ని ప్రోత్సహించాలని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. పిల్లలకు ఆహారం అందించేందుకు, వారి పౌష్టికాహార స్థాయి పెంచేందుకు వీలైనంత వరకు మహిళలను , స్వయం సహాయక బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. అంగన్‌వాడి కేంద్రాలను వివిధ సంస్థలు, కమ్యూనిటీ సభ్యులు దత్తత తీసుకోవడం, ఆరోగ్యకరమైన శిశువుల పోటీలు నిర్వహించడం, పిల్లలకు అనువైన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడం వంటి వాటి గురించి కూడా ప్రధానమంత్రి సూచించారు.
వారణాశి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి , తద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచడానికి, అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతపై ప్రధానమంత్రి ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా దృష్టిపెట్టారు.
***
(Release ID: 1632755)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam