గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన దిశగా భారత్ వీధి వ్యాపారులకోసం ప్రత్యేక సూక్ష్మ రుణ సదుపాయం ప్రారంభం

Posted On: 19 JUN 2020 1:07PM by PIB Hyderabad

   వీధి వ్యాపారులకు ప్రత్యేక సూక్ష్మ రుణ సదుపాయంకోసం ప్రధానమంత్రి పేరిట చేపట్టిన వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పి.ఎం. స్వాన్ నిధి-PM SVANidhi) అమలు ప్రక్రియలో ఏజెన్సీగా భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ-SIDBI)ను వినియోగించుకునేందుకు ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయమంత్రిగా స్వతంత్ర బాధ్యతలు నిర్వహిస్తున్న హర్ దీప్ ఎస్. పూరి సమక్షంలో, ఆ మంత్రిత్వశాఖ  సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్, సిడ్బీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి. సత్య వెంకట రావు అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు.

  అవగాహనా ఒప్పందంలో సూచించిన నిబంధనల ప్రకారం,..కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో  పి.ఎం. స్వాన్ నిధి పథకాన్ని సిడ్బీ అమలు చేస్తుంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకోసం క్రెడిట్ గ్యారంటీ వ్యవహారాలను క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా సిడ్బీనే అజమాయిషీ చేస్తుంది. అన్ని రకాల డాక్యుమెంటేషన్ ప్రక్రియతో సహా లబ్ధిదారులకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్  ద్వారా రుణసదుపాయం సాఫీగా అందేలా చూసేందుకు సమగ్రమైన ఐ.టి. ఆధారిత వేదికను కూడా సిడ్బీ రూపొందించి, అమలు చేస్తుంది. వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలకు, రుణాలిచ్చే సంస్థలకు, డిజిటల్ చెల్లింపు సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు మధ్య ఎలాంటి సమాచారం లోపం లేకుండా సిడ్బీ చూసుకుంటుంది.

  షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, సహకార బ్యాంకులు, చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వంటి వాటి ద్వారా కూడా పథకం అమలయ్యేలా సిడ్బీ చర్యలు తీసుకుంటుంది.

      వీధి వ్యాపారులకోసం రుణ పథకం పటిష్టంగా అమలయ్యేలా చూసేందుకు డొమైన్ నిపుణులు,  తదితర సామర్థ్యాలతో  ప్రాజెక్టు నిర్వహణా సంస్థను కూడా సిడ్బీ ఏర్పాటు చేస్తుంది. బ్యాంకింగ్, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థల సహాయం తీసుకుంటుంది. 2022వ సంవత్సరం మార్చి వరకూ సిడ్బీ వ్యవహారాలను చూస్తుంది.

          పి.ఎం.స్వాన్ నిధి పథకాన్ని 2020వ సంవత్సరం జూన్ 1వ తేదీన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రారంభించింది. కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిని జీవనోపాధిని కోల్పోయిన వీధి వ్యాపారాలకు రుణ సదుపాయం అందించేందుకు పథకానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా 50లక్షలకు పైగా వీధి వ్యాపారులకు సహాయం అందించడమే లక్ష్యంగా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులు 10వేల రూపాయల రుణం పొందవచ్చు.  రుణాన్ని ఏడాది కాలంలో నెలవారీ వాయిదాల రూపంలో తిరిగి చెల్లించవచ్చు. సకాలంలో, త్వరగా రుణం చెల్లించగలిగితే, సంవత్సరానికి 7శాతం వడ్డీ సబ్సిడీని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సదుపాయం ద్వారా త్రైమాసికం ప్రాతిపదికన సబ్సిడీని అందిస్తారు. త్వరగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే పెనాల్టీ ఉండదు.  నెలకు వందరూపాయల వరకూ క్యాష్ బ్యాక్ ప్రోత్సహకం చెల్లింపు ద్వారా  డిజిటల్ లావాదేవీలను కూడా ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. సకాలంలో లేదా, గడువుకంటే ముందే రుణాన్ని తిరిగి చెల్లించే లబ్ధిదారులకు రుణ పరిమితి హెచ్చింపు సదుపాయం కూడా ఉంటుంది.

  పథకానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని భాగస్వామ్య వర్గాలకూ,... అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు, బ్యాంకులకు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు, బ్యాంకేంతర ఆర్థిక సంస్థలకు, సిడ్బీకి, వీధి వ్యాపారాల సంఘాలకు పంపించింది. రుణ పథకం అమలులో వారి వారి బాధ్యతలను తెలియజేస్తూ   మార్గదర్శక సూత్రాలను రూపొందించారు. ఈ పథకానికి సంబంధించిన ఐ.టి వేదిక 2020వ సంవత్సరం జూన్ నెల 4వ వారంలో ప్రారంభమవుతుంది. 2020 సెప్టెంబర్ నాటికి పథకాన్ని సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా సంప్రదించి,  పథకం అమలుకు  108 నగరాలను ఎంపిక చేశారు. రుణ పంపిణీని 2020 జూలై నెలలో ప్రారంభించాలని నిర్ణయించారు.



(Release ID: 1632752) Visitor Counter : 259