గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో గిరిజన ఆర్థిక వ్యవస్థ చేతిలోకి రూ.2 వేల కోట్లు
Posted On:
18 JUN 2020 7:42PM by PIB Hyderabad
17 రాష్ర్టాల్లో రూ.835 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రూ.1200 కోట్లతో ప్రైవేటు వ్యాపారుల (మండిలు/ హాత్ బజార్లలో విక్రయానికి) 2020 ఏప్రిల్ నుంచి మైనర్ అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రారంభమయింది. దీని వల్ల గిరిజనులు ఉత్పత్తి చేసిన మైనర్ అటవీ ఉత్పత్తుల సమీకరణ మొత్తం రూ.2000 కోట్ల మేరకు జరిగింది. ఈ సొమ్మును ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
ట్రైఫెడ్ న్యూఢిల్లీలో నిర్వహించిన వెబినార్ లో ఈ విషయం పత్రికలకు తెలియచేశారు. “గిరిజన భారతంలో వేళ్లూనుకున్న మైనర్ అటవీ ఉత్పత్తులకు ఎంఎస్ పి” పేరిట నిర్వహించిన ఈ వెబినార్ కు ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీర్ కృష్ణ అధ్యక్షత వహించారు.
ఏడాది కాలంగా అమలు జరుగుతున్న గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహణలోని వన్ ధన్ యోజన (స్టార్టప్ పథకం) కింద 1205 గిరిజన్ పరిశ్రమలు ఏర్పడడంతో 3.6 లక్షల మంది గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు 22 రాష్ర్టాల్లో 18 వేల స్వయం సహాయక బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ పథకం విజయవంతం కావడంతో గిరిజన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రారంభించేందుకు మూలాలు ఏర్పడ్డాయి.
తొలుత రెండు రాష్ర్టాలకే పరిమితమైన ఈ పథకం ఇప్పుడు 17 రాష్ర్టాలకు విస్తరించిందని శ్రీ ప్రవీర్ కృష్ణ తెలిపారు. (ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలు).
ఈ పథకం ప్రాధాన్యాన్ని, అది ఏ విధంగా గిరిజనుల మైనర్ అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్ పి) వ్యాపారానికి మద్దతు ధర ఇవ్వగల స్థాయికి చేరింది ఆయన వివరించారు.
కోవిడ్-19 కారణంగా ఉత్పన్నమైన అసాధారణ పరిస్థితుల వల్ల ఏర్పడిన సవాళ్లు గిరిజన జనాభాలో తీవ్ర సంక్షోభానికి కారణమయ్యాయి. యువతలో నిరుద్యోగిత, పట్టణ ప్రాంతాల నుంచి గిరిజనుల వలస వంటి పరిణామాల వల్ల మొత్తం గిరిజన ఆర్థిక వ్యవస్థ ఛిద్రం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ఎంఎఫ్ పికి ఎంఎస్ పి రాష్ర్టాలకు చక్కని అవకాశంగా మారింది.
గిరిజనుల మైనర్ అటవీ ఉత్పత్తుల సేకరణ అధికంగా ఉండే ఏప్రిల్-జూన్ నెలలు అత్యంత కీలకమైనవి కావడం వల్ల ప్రభుత్వం జోక్యం చేసుకుని అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఉండకపోతే కోవిడ్-19 విజృంభించిన సమయంలో గిరిజనులు మరింత సంక్షోభంలో పడిపోయే వారు. ఇలాంటి నిరాశాపూరిత వాతావరణంలో గిరిజనుల జీవనోపాధికి అవసరమైన మద్దతు ఇచ్చేందుకు, వారి రక్షణకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ర్టాల భాగస్వామ్యంలో ఉమ్మడి వ్యూహ పత్రం ముసాయిదా రూపకల్పనకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పలు సమావేశాలు జరిగాయి. కుంచించుకుపోతున్న గిరిజన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పించే లక్ష్యంతో ఎంఎఫ్ పికి సవరించిన మద్దతు ధరల మార్గదర్శకాలు 2020 మే ఒకటో తేదీన జారీ చేశారు. ఎంఎఫ్ పికి ఎంఎస్ పిని 90 శాతం పెంచడం వల్ల వాటి సేకరణపై ఆధారపడే గిరిజనులకు అధికాదాయం అందించే వీలు కలిగింది.
ఎంఎఫ్ పి జాబితాలోకి కొత్తగా 23 వస్తువులు చేర్చాలని కూడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. వాటిలో గిరిజనులు సేకరించే వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులున్నాయి.
గిరిజన ఉత్పత్తుల సమీకరణ సందర్భంగా సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత వంటి అంశాలపై గిరిజనుల్లో చైతన్యం కల్పించేందుకు ఏప్రిల్ నెలలో గిరిజన మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ ఉమ్మడిగా రాష్ట్ర, జాతీయ స్థాయి వెబినార్లు ఎలా నిర్వహించింది శ్రీ కృష్ణ వివరించారు. పనికి వెళ్లకండి, కోవిడ్ ను నిలువరించండి అనే సందేశంతో ఈ వెబినార్లు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ప్రకటనలు, రాష్ట్ర స్థాయిలో ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం రూపంలో ఈ సందేశం వ్యాపింపచేశామని ఆయన అన్నారు.
సంక్షోభ సమయంలో చేసిన అద్భుతమైన చర్యలను వివరించిన అనంతరం ఏక కాల చర్యగా ఈ స్కీమ్ ఏ విధంగా కీలకంగా నిలిచింది తెలియచేశారు. ఎంఎఫ్ పి సేకరణ, సమీకరణ, పెంపకం, ప్రాసెసింగ్ కార్యకలాపాలు విస్తరించేందుకు రాజ్యాంగంలోని 275 (1) అధికరణం కింద రాష్ర్టాలకు కోవిడ్-19 సహాయ ప్రణాళికలో భాగంగా సహాయం అందించడం; వన్ ధన్ కేంద్రాలు ఏర్పాటు చేసి గిరిజనుల్లో పారిశ్రామిక ధోరణులు ప్రోత్సహించడం; గిరిజన ఉత్పత్తి కంపెనీలు, ఉమ్మడి సౌకర్య కేంద్రాల (సిఎఫ్ సి) ఏర్పాటు; అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు గిరిజన ఆహార, పోషకాహార భద్రత, ఆహార, ఆహారేతర సహాయం; నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, గిరిజన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల పటిష్ఠత; రూ.1300 కోట్లతో ఎంఎఫ్ పికి ఎంఎస్ పి వంటి చర్యలు గిరిజన ప్రాంతాలకు సహాయకారిగా ఉంటాయని ఆయన అన్నారు.
ఈ వివరాలు అందించిన అనంతరం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాంలలో ఈ సేకరణ ఎంత పటిష్ఠంగా జరుగుతున్నది కొన్ని సజీవ ఉదాహరణలు శ్రీ కృష్ణ నివేదించారు. ఈ సమీకరణ తాత్కాలిక చర్య కాదంటూ ప్రాసెస్ కూడా దీనికి అనుబంధంగా ఉన్నదన్నారు. ప్రతీ ఒక్క కేంద్రంలోనూ ఒక బోర్డు, ఎలక్ర్టానిక్ తూనిక యంత్రం ఉన్నదని చెప్పారు. సవరించిన ధరలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు, సందేశాలు పంపేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సజీవ ఉదాహరణలుగా చూపిన ఈ కేసులన్నింటిలోనూ సేకరణ విలువ ఎంత, ఏయే ఉత్పత్తులు సేకరించారు, ఎన్ని సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు వంటి వివరాలు కూడా అందించారు.
అద్భుతమైన కృషితో చత్తీస్ గఢ్ ఈ కార్యక్రమంలో అగ్రస్థానంలో నిలిచిందని శ్రీ ప్రవీర్ కృష్ణ వెల్లడించారు. ఆ రాష్ట్రంలో 866 సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయని, 130 వన్ ధన్ కేంద్రాల్లో విస్తృతంగా గల వన్ ధన్ ఎస్ హెచ్ జిల బలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నదని ఆయన తెలిపారు.
ఈ కార్యకలాపాల్లో ఆ రాష్ట్రం అనుసరించిన నవ్యధోరణి సర్వత్రా ప్రశంసలు అందుకుంది. రామానుజ్ గంజ్ జిల్లాలో ఇంటింటికీ వెళ్లి అటవీ ఉత్పత్తులు సమీకరించారు. అటవీ శాఖ, రెవిన్యూ శాఖ, వన్ ధన్ వికాస్ కేంద్రాల అధికారులతో ఏర్పాటు చేసిన మొబైల్ యూనిట్లు ప్రతీ ఇంటికీ వెళ్లి ఉత్పత్తులు సమీకరించాయి. చత్తీస్ గఢ్ నిర్వహణ తీరుతో అది ఒక క మోడల్ రాష్ట్రంగా నిలిచింది. అక్కడ అనుసరించిన అత్యుత్తమ విధానాలు అధ్యయనం చేసి అమలు పరిచేందుకు పలు రాష్ర్టాలు అక్కడకు తమ బృందాలను పంపుతున్నాయి.
భవిష్యత్తులో అనుసరించాలనుకుంటున్న ఆకాంక్షాపూరితమైన, ఆచరణీయమైన ప్రణాళికలు వివరిస్తూ శ్రీ ప్రవీర్ కృష్ణ తన ప్రసంగం ముగించారు. అన్ని రకాల బలాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఎంఎఫ్ పికి ఎంఎస్ పి పథకం గిరిజన ప్రాంతాల పరివర్తనలో కీలకంగా మారుతుందని, గిరిజనులను సాధికారం చేస్తుదన్న నమ్మకం ఆయన ప్రకటించారు. ప్రస్తుత కాలానికి, భవిష్యత్తుకి కూడా మేరా వన్ మేరా ధన్ మేరా ఉద్యమ్ నినాదమే కీలకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1632493)
Visitor Counter : 343