PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 16 JUN 2020 6:22PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 10,215; మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,80,012కి చేరగా- కోలుకునేవారి శాతం 52.47కు పెరిగింది.
 • దేశంలో ప్రయోగశాలలు 907కు పెంపు; రోజుకు 3 లక్షల నమూనాలు పరీక్షించే సామర్థ్యం.
 • కోవిడ్‌-19పై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి చర్చ; సకాల చర్యలతో ప్రపంచ మహమ్మారి వ్యాప్తిని నిరోధించగలిగామని ఉద్ఘాటన.
 • ఆరోగ్య సంరక్షణ సదుపాయాల పెంపు, సముచిత రేట్లతో కీలక వైద్యసేవల దిశగా ప్రైవేటు రంగంతో చర్చించాలని రాష్ట్రాలకు సూచన
 • కోవిడ్‌-19 ఏర్పాట్లపై సమీక్ష కోసం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి దేశీయాంగ శాఖ మంత్రి ఆకస్మిక రాక; కరోనా వార్డులతో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం

No photo description available.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునే వారి శాతం మెరుగుపడి 52.47కి చేరిక; కోవిడ్‌-19 సంబంధిత

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి 10,215 మంది కోలుకోగా, వ్యాధి నయమైన వారి సంఖ్య 1,80,012కు చేరి, కోలుకునేవారి శాతం 52.47కు పెరిగింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కోవిడ్‌-19 రోగులలో సగానికిపైగా కోలుకున్నట్లయింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,53,178కాగా, వీరందరూ చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.

మరోవైపు కోవిడ్‌-19 సోకిన-కోలుకున్నవారు, ముందువరుస ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వారి కుటుంబాల్లో వ్యాధి సంబంధిత అపరాధ భావన తొలగింపు దిశగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక సచిత్ర కరదీపికను విడుదల చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631918

వ్యాధి నిర్ధారణ సామర్థ్యం పెంపు: రోజుకు 3 లక్షల నమూనాల పరీక్ష

దేశంలో నవ్య కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు అవసరమైన సదుపాయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం రోజుకు 3 లక్షల నమూనాలను పరీక్షించవచ్చు. తదనుగుణంగా గడచిన 24 గంటల్లో 1,54,935సహా ఇప్పటిదాకా మొత్తం 59,21,069 నమూనాలను పరీక్షించారు. దేశంలో ఇప్పుడు మొత్తం 907 ప్రయోగశాలలు అందుబాటులో ఉండగా వీటిలో ప్రభుత్వ రంగంలో 659, ప్రైవేటు రంగంలో 248 ఉన్నాయి. వీటిలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

రియల్‌-టైమ్‌ ఆర్టీ పీసీఆర్‌ ఆధారిత ప్రయోగశాలలు : 534 (ప్రభుత్వ 347+ప్రైవేటు:187)

ట్రూనాట్‌ ఆధారిత ప్రయోగశాలలు : 302 (ప్రభుత్వ 287+ప్రైవేటు:15)

సీబీనాట్‌ ఆధారిత ప్రయోగశాలలు : 71 (ప్రభుత్వ 25+ప్రైవేటు:46)

ఢిల్లీలో పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంచడంలో భాగంగా 11 జిల్లాల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ నమూనాల పరీక్ష కోసం ఒక్కొక్కటి వంతున ప్రయోగశాలలను కేటాయించారు. ఆయా జిల్లాల నుంచి నమూనాలను సంబంధిత ప్రయోగశాలకు పంపడంద్వారా సకాలంలో పరీక్షలు ముగించి ఫలితాలు వెల్లడించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో 42 ప్రయోగశాలలు ఉండగా రోజుకు సుమారు 17,000 నమూనాలను పరీక్షిస్తున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631919

దిగ్బంధ విముక్తి తొలిదశ అనంతర పరిస్థితిపై సీఎంలతో ప్రధానమంత్రి చర్చ

దేశవ్యాప్తంగా దిగ్బంధ విముక్తి తొలిదశ అనంతర పరిస్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ముఖ్యమంత్రులతో సమావేశమై కోవిడ్‌-19 మహమ్మారి నియంత్రణ ప్రణాళికపై వారితో చర్చించారు. ఈ మహమ్మారితో పోరులో భాగంగా సకాలంలో చర్యలు తీసుకున్నందువల్ల దేశంలో వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలిగామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు. ఇప్పుడు మనం ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే సహకార సమాఖ్య స్ఫూర్తికి సజీవ ఉదాహరణను ప్రపంచం ముందుంచామని ప్రజలు గుర్తుచేసుకుంటారని పేర్కొన్నారు. గత కొన్నివారాలుగా సాగిన కృషివల్ల ఆర్థిక వ్యవస్థ చిగుళ్లు తొడగటం కనిపిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. భాగస్వామ్య రాష్ట్రాల్లో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఎంఎస్‌ఎంఇ రంగాలకు గణనీయ ప్రాముఖ్యత ఉందని, తదనుగుణంగా స్వయం సమృద్ధ భారతం కింద నిబంధనలు రూపొందించామని ప్రధానమంత్రి చెప్పారు.

   ముఖ్యమంత్రులతో రెండు విడతలుగా నిర్వహించ తలపెట్టిన చర్చలో భాగంగా ఇవాళ తొలిరోజున వివిధ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, పాలనాధికారులతో చర్చించారు. ఈ మేరకు పంజాబ్‌, అసోం, కేరళ, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్‌, చండీగఢ్‌, గోవా, మణిపూర్‌, నాగాలాండ్‌, లద్దాఖ్‌, పుదుచ్చేరి, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, అండమాన్‌-నికోబార్‌ దీవులు, దాద్రానాగర్‌హవేలీ-దమన్‌దయ్యూ, సిక్కిం, లక్షద్వీప్‌ పాలకులు ఇందులో పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631978

కోవిడ్‌-19పై ముఖ్యమంత్రులతో చర్చలో భాగంగా ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631905

ఆరోగ్య సంరక్షణ సదుపాయాల పెంపు, సముచిత రేట్లతో కీలక వైద్యసేవల దిశగా ప్రైవేటు రంగంతో చర్చించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన

ప్రైవేటు ఆస్పత్రులలో పడకలు, కీలక వైద్య సదుపాయాలు మరింతగా అందుబాటులో ఉంచేవిధంగా ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో చర్చించాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అదే సమయంలో వారందించే సేవలకు సముచిత, పారదర్శక రీతిలో చార్జీలు వసూలు చేసేలా చూడాలని కోరింది. రోగులకు సకాలంలో మంచి నాణ్యమైన సేవలు సముచిత ధరల్లో లభించేలా చూసేదిశగానూ స్థానిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో సంప్రదింపులు సాగించాలని సూచించింది. ముఖ్యంగా వ్యక్తిగత రక్షణ సామగ్రి ధరల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. చర్చల్లో అంగీకారం మేరకు ధరల నిర్ణయం తర్వాత అటు రోగులకు, ఇటు సేవా ప్రదాతలకు స్పష్టంగా తెలిసేవిధంగా బహిరంగ ప్రకటన చేయాలని, ఆయా ధరలకు ప్రైవేటు యాజమాన్యాలు కట్టుబడేలా పర్యవేక్షించాలని కోరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631847

కోవిడ్‌-19 ఏర్పాట్లపై లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో దేశీయాంగ శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ

కోవిడ్‌-19 ఏర్పాట్లపై సమీక్షలో భాగంగా దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా సోమవారం లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఢిల్లీలోని ప్రతి ఆస్పత్రిలోగల కరోనా వార్డులలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. తద్వారా చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను సాకల్యంగా పర్యవేక్షిస్తూ పరిష్కరించే వీలుంటుందని పేర్కొన్నారు. అలాగే ఆహార పదార్థాలు సరఫరా చేసే క్యాంటీన్లకు ప్రత్యామ్నాయం కూడా సిద్ధంగా ఉంచాలని, దీనివల్ల ఏదైనా క్యాంటీన్‌లో వ్యాధి వ్యాప్తివల్ల సరఫరాలు నిలిచిపోతే, ఆటంకం లేకుండా ఆహారం అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. కరోనా రోగులకు చికిత్స అందించడంద్వారా మానవాళి సేవలో నిమగ్నమైన డాక్టర్లు, నర్సులకు మానసిక-సామాజిక కౌన్సెలింగ్‌ ఇవ్వాలని శ్రీ అమిత్‌ షా ఆదేశించారు. 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631796

ప్రస్తుత 18వేల ఎస్‌హెచ్‌జిల నుంచి 50వేల వన్‌ధన్‌ ఎస్‌హెచ్‌జిలకు పీఎం వన్‌ధన్‌ యోజన విస్తరణ; గిరిజన సేకరణదారుల సంఖ్యను 3 రెట్లు పెంచి 10 లక్షలకు చేర్చాలని నిర్ణయం

అనూహ్య ప్రకృతి విపత్తు నిర్వహణ, అది విసిరిన సవాళ్లపై పోరాటానికి విభిన్న వినూత్న పద్ధతులు అవసరం. ప్రస్తుత సంక్షోభంవల్ల తీవ్రంగా ప్రభావితమైన గిరిజనుల కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎంతో చొరవ తీసుకుంది. ఈ మేరకు శాఖ పరిధిలోని  ట్రైఫెడ్‌ ప్రారంభించిన పథకంకింద ఏర్పాటైన వన్‌ధన్‌ అంకుర సంస్థలు గిరిజన సేకరణదారులకు, అడవుల్లో నివసించేవారికి, ఇళ్లలోనే పనిచేసుకునే కూలీలకు, చేతివృత్తుల వారికి ఉపాధి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. మొత్తంమీద ఈ పథకం కింద 22 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 1025 గిరిజన సంస్థలద్వారా 3.6 లక్షల మంది గిరిజన సేకరణదారులకు, 18,000 స్వయం సహాయ సంఘాలకు ఉపాధి లభిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631848

“ఇంట్లో యోగా-కుటుంబంతో యోగా” నినాదంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2020కి సిద్ధ‌మ‌వుతున్న ఆయుష్

కోవిడ్-19 పరిస్థితుల న‌డుమ దైనందిన కార్యకలాపాల మందగమనం, జ‌న సంచారంపై ఆంక్షల దృష్ట్యా ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఏర్ప‌డింది. ఈ మేర‌కు జనారోగ్య వికాసం, ఒత్తిడి ఉపశమన అంశాలు లక్ష్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా శిక్షకుల నేతృత్వంలో యోగాభ్యాసాలు చేయించనుంది. వారిని అనుసరిస్తూ ప్రజలు కూడా యోగాభ్యాసం చేయడానికి వీలుగా జూన్ 21న ఉదయం 6:30 గంటల నుంచి దూరదర్శన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631917

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చేవారిపై నిశితంగా దృష్టి సారించాలని, సహ-అనారోగ్య కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చండీగఢ్‌ నగర పాలనాధికారి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే భౌతిక దూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు.
 • పంజాబ్: కోవిడ్-19 మహమ్మారివల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లడంతోపాటు ప్రజలు దుస్థితిలో పడ్డారని, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రికి పంజాబ్‌ ముఖ్యమంత్రి వినతిపత్రం పంపారు. ఈ మేరకు వివిధ ఆర్థిక సంవత్సరేతర సహాయం కింద కేటయించే నిధులతోపాటు రూ.80,845 కోట్లతో ప్రత్యేక సహాయం అందించాలని అందులో కోరారు. కోవిడ్‌-19 ఫలితంగా కొత్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల ప్రాణరక్షణతోపాటు జీవనోపాధి కల్పన కోసం సహకరించాలని పేర్కొన్నారు.
 • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19పై సమీక్ష సమావేశం సందర్భంగా- మానవాళికి సేవాభావన స్ఫూర్తితో పనిచేయాలని, వ్యాధివ్యాప్తి నుంచి స్వీయ రక్షణ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు పిలుపునిచ్చారు. కోవిడ్-19 నుంచి రక్షణకు వీలుగా ప్రజలకు ఫేస్ మాస్కుల పంపిణీపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. మాస్కులు ధరించని వారినుంచి వసూలు చేసిన జరిమానా సొమ్మును మాస్కుల తయారీకి వినియోగించి, ప్రజలకు తిరిగి మాస్కులు పంపిణీ చేయాలని చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రజలలో చైతన్యం కల్పించాలన్నారు. ఆయుర్వేద, హోమియోపతి మందులకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ప్రజలు సాధారణంగా వీటిని వాడుకుంటే ఎటువంటి హాని ఉండదని ఆయన సూచించారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో 2,786 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,744కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసులు 50,554కాగా, హాట్‌స్పాట్ ముంబైలో 1,066 కొత్త కేసులు నమోదయ్యాయి.
 • గుజరాత్: రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,886 కాగా, మొత్తం కేసుల సంఖ్య 24,055గా ఉంది.
 • రాజస్థాన్: రాష్ట్రంలోని భరత్‌పూర్‌ జిల్లానుంచి ఇవాళ 115 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,096కు పెరిగింది, వీరిలో 9,794 మంది కోలుకోగా, 302మంది మరణించారు. రాష్ట్రంలో రోగులు కోలుకునేవారు 75 శాతానికి పెరిగారు. ఇది దేశంలోనే అత్యధికం కాగా, కోవిడ్‌-19పై అవగాహన కల్పనలో భాగంగా జూన్ 21నుంచి రాజస్థాన్‌లో 10 రోజులపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ బృందాలు ఇంటింటికీ వెళ్లి, పర్యవేక్షణ చేపడతాయి. దీంతోపాటు వ్యాధి నివారణ, నియంత్రణ దిశగా జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 133 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 10,935కు చేరింది. మరోవైపు ఆరుగురు రోగుల మృతితో మరణాల సంఖ్య 465కు పెరిగింది. రాష్ట్రంలో కేసుల రెట్టింపు వ్యవధి 34.1 రోజులకు పెరగ్గా, కోలుకునేవారు 71.1 శాతానికి పెరిగింది. తదనుగుణగా కోలుకునేవారి రీత్యా రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 44 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,715కు చేరగా, వీటిలో 875 యాక్టివ్‌ కేసులున్నాయి.
 • గోవా: సోమవారం 28 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 592కు చేరింది. వీటిలో 507 యాక్టివ్‌ కేసులున్నాయి. గోవాలో ప్రధానంగా మాంగోర్ హిల్, న్యూ వాడ్డెం, మోర్లెం, బైనా, చింబెల్, సదా ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.
 • అరుణాచల్ ప్రదేశ్: అసోంలోని థెమాజీనుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ తదితర జిల్లాలకు  నిత్యావసరాలతో ట్రక్కుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా, ప్రామాణిక ప్రక్రియ విధివిధానాల అమలులో వ్యత్యాసం కారణంగా వారం కిందట ట్రక్కుల రాకపోకలు నిలిపివేశారు.
 • అసోం: రాష్ట్రంలో 10 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 4319కు చేరగా, వీటిలో యాక్టివ్ కేసులు 2103, కోలుకున్నవారు 2205మంది, మరణాలు 8గా ఉన్నాయి.
 • మణిపూర్: స్వయం సమృద్ధ భారతం కింద ఇమా కీథెల్‌లోని వందలాది వీధి వ్యాపారులు, తదితరులకు రుణ సదుపాయాల కల్పనపై మణిపూర్ ముఖ్యమంత్రి ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారులతో సమావేశమయ్యారు.
 • మిజోరం: మిజోరంలో ప్రస్తుతం 8884 మంది నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉండగా, పరీక్షల నిష్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు.
 • నాగాలాండ్: దిమాపూర్‌ యంత్రాంగం సవరించిన దిగ్బంధం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రయాణికుల వాహనాలు రాకపోకలను జూన్ 30వరకు నిలిపివేస్తారు. అలాగే సెలూన్లు మూతపడనుండగా, మార్కెట్లు/మాల్స్‌ను దశలవారీగా తిరిగి తెరుస్తారు. నాగాలాండ్‌లోని పెరెన్‌లోగల జిల్లా కార్యాచరణ బృందం బేసిన్-స్టాండ్‌తో కూడిన నీటినిల్వ ట్యాంకులను సిహెచ్‌సి జలుకీ-జిల్లా కోవిడ్‌-19 ఆస్పత్రికి విరాళంగా ఇచ్చింది.
 • కేరళ: వందే భారత్ మిషన్ కింద రాష్ట్రానికి వచ్చేవారికి కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కోవిడ్-19 కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక విమానంలో తీసుకురావాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఇ.పి.జయరాజన్‌ అన్నారు. కాగా, సౌదీ అరేబియానుంచి కేరళకు ప్రత్యేక విమానాల్లో వెళ్లేవారు జూన్ 20 నుంచి కోవిడ్ ద్రువీకరణ పత్రాలను సమర్పించాలని అక్కడి భారత రాయబార కార్యాలయం ఆదేశించింది. కోవిడ్ ప్రాథమిక పరీక్షా కేంద్రాల కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ప్రారంభ దశలో ఈ ప్రాథమిక కేంద్రాలలో తేలికపాటి లక్షణాలుగల, లక్షణాలేవీ లేనివారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక కేరళకు చెందిన మెక్సికోలోని  సన్యాసినిసహా మరో నలుగురు కోవిడ్-19తో మరణించారు. కాగా, రాష్ట్రంలో ఒక మరణం, 82 నిర్ధారిత కేసులు నమోదవగా, 73 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,348 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,20,727 మంది నిఘాలో ఉన్నారు.
 • తమిళనాడు: రాష్ట్రంలోని 13 లక్షల మంది దివ్యాంగులకు ఊరట దిశగా దిగ్బంధం సమయంలో రూ.1,000 వంతున ఆర్థిక సహాయం లభించనుంది. ఇంతకుముందు బియ్యం రేషన్ కార్డుదారులు, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం ఇదే మొత్తంలో ఉపశమన సాయం ప్రకటించింది. ఇక పుదుచ్చేరిలో 14 కొత్త కేసులు నమోదవగా, వీరిలో జిప్మెర్ మైక్రోబయాలజిస్ట్ కూడా ఉన్నారు; దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 216కు పెరిగింది. కాగా, తమిళనాడులో నిన్న 1843 కొత్త కేసులు నమోదవగా, 797మంది కోలుకున్నారు; 44మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో చెన్నైలోనే 1,257 నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసులు: 46,504, యాక్టివ్ కేసులు: 20,678, మరణాలు: 479, డిశ్చార్జ్: 24547, చెన్నైలో యాక్టివ్ కేసులు: 15385గా ఉన్నాయి.
 • కర్ణాటక: కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు రూ.2,000 వంతున సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి ఇవాళ బెంగళూరులో ప్రకటించారు. కేఎస్‌ఆర్టీసీ నడిపే అంతర్రాష్ట్ర బస్సులు రేపటినుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు నడపాలని నిర్ణయించారు. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడాన్ని సవాలుచేస్తూ- దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. కాగా, బెంగళూరులోని సంస్థల్లోగల పని ప్రదేశాల్లో ఆన్‌లైన్ స్వీయ-అంచనాలద్వారా విధానాల రూపకల్పన నిమిత్తం IISc ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో నిన్న 213 కొత్త కేసులు నమోదవగా 180 మంది డిశ్చార్జి అయ్యారు; రెండు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 7213, యాక్టివ్‌ కేసులు: 2987, మరణాలు: 88, డిశ్చార్జి అయినవారు: 4135 మంది.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి ఇవాళ రూ.2,24,789.18 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రూ.1,80,392.65 కోట్లను రాబడి వ్యయం కింద చూపారు. అలాగే రుణ చెల్లింపులు, ఇతర మూలధన పంపిణీలుసహా మూలధన వ్యయం సుమారు రూ.44,396.54 కోట్లుగా అంచనావేశారు. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో తీవ్ర ఆర్థిక మందగమనంవల్ల 2020-21 బడ్జెట్ అంచనాలు 2019-20 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే మొత్తం 1.4శాతం తగ్గాయి. కాగా, గత 24 గంటల్లో 15,911 నమూనాలను పరీక్షించగా 193 కొత్త కేసులు నమోదయ్యాయి; అలాగే రెండు మరణాలు నమోదవగా, 81మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 5280, యాక్టివ్: 2341, రికవరీ: 2851, మరణాలు: 88గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19 ప్రణాళికపై ప్రభుత్వం పునరాలోచించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు; తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్త వ్యూహాల రూపకల్పనకు ప్రజారోగ్య నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక జూన్ 16 నాటికి రాష్ట్రంలో 5,193 కేసులు నమోదవగా 2766 మంది కోలుకున్నారు; ప్రస్తుతం 2240 యాక్టివ్ కేసులుండగా 187 మరణాలు నమోదయ్యాయి.

 

FACT CHECK

 

******(Release ID: 1632003) Visitor Counter : 42